Indian automobile industry
-
2035 నాటికి ట్రిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ రంగం 2035 నాటికి ఎగుమతి ఆధారిత ట్రిలియన్ డాలర్ పరిశ్రమగా ఎదిగే అవకాశం ఉందని ఆర్థర్ డి లిటిల్ నివేదిక పేర్కొంది. తయారీ, ఆవిష్కరణలు, సాంకేతికత తోడుగా పరిశ్రమ ఈ స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ‘భారత వాహన పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లకు డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తికి ఆకర్షణీయ ప్రపంచ కేంద్రంగా మారవచ్చు. దీనిని సాధించడానికి ఈ రంగంలోని కంపెనీలు ప్రపంచ తయారీకి అనుగుణంగా తమ సామర్థ్యాలను విశ్వసనీయ, పోటీతత్వంగా మెరుగుపర్చుకోవాలి. జోనల్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి కొత్త సాంకేతికతలకు అనుగుణంగా పరిష్కారాలను అందించడం ద్వారా ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ పరిశోధన, అభివృద్ధిలో భారత శక్తి సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. నిధులతో కూడిన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థతో భారతదేశం వాహన రంగంలో నాయకత్వ స్థానంలో ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంది’ అని వివరించింది. నాయకత్వ స్థానంగా..: దేశీ వాహన రంగంలో పెరుగుతున్న ఆవిష్కరణల వేగాన్ని, మారుతున్న సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించినట్లయితే భారతదేశాన్ని ప్రపంచ ఆటోమోటివ్ రంగంలో నాయకత్వ స్థానంగా మార్చవచ్చని నివేదిక తెలిపింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ పరిశోధన, అభివృద్ధి, సాఫ్ట్వేర్ మార్కెట్ 2030 నాటికి మూడు రెట్లు వృద్ధి చెంది 400 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. భారతదేశం ప్రపంచ సాఫ్ట్వేర్ హబ్‌గా, ఆఫ్‌షోర్ గమ్యస్థానంగా తన స్థానాన్ని ఉపయోగించుకోవచ్చు. భారత వాహన పరిశ్రమ నిజమైన సామర్థ్యాన్ని సది్వనియోగం చేసుకోవడానికి ప్రభుత్వంతో సహా ముడిపడి ఉన్న భాగస్వాముల మధ్య బలమైన చర్చలు, సమిష్టి చర్యలు అవసరం’ అని నివేదిక వివరించింది. -
భారత్‌లో బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధర రూ.1.22 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ తాజాగా ఎక్స్7 ఎస్‌యూవీని భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర రూ.1.22 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. చెన్నై ప్లాంటులో ఈ కార్లను తయారు చేస్తున్నారు. 3 లీటర్ 6 సిలిండర్ ఇంజన్ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పెట్రోల్ వర్షన్ 5.8 సెకన్లలో, డీజిల్ వర్షన్ 5.9 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ ప్రకటన తెలిపింది. -
అదిరే లుక్.. సీఎన్జీలో బాలీనో, ఎక్స్ఎల్6 కార్లను విడుదల చేసిన మారుతీ సుజుకీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బలీనో, మల్టీపర్పస్ వెహికిల్ ఎక్స్ఎల్6 మోడళ్లను ఎస్–సీఎన్జీ వేరియంట్లో ప్రవేశపెట్టింది. ఈ వారం నుంచే విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎక్స్‌షోరూంలో ధర రూ.8.28 లక్షల నుంచి రూ.12.24 లక్షల మధ్య ఉంది. సీఎన్జీ వేరియంట్లో 2021–22లో కంపెనీ వివిధ మోడళ్లలో 2.3 లక్షల యూనిట్లను విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి 4 లక్షల యూనిట్లకు చేరుకుంటాయని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. తాజా నిర్ణయంతో 16కుగాను 12 మోడళ్లలో సీఎన్జీ వేరియంట్లు ఉన్నాయని గుర్తు చేశారు. 1.23 లక్షల యూనిట్ల సీఎన్జీ వెహికిల్స్ కోసం ఆర్డర్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ విభాగంలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 30–32 వేల యూనిట్లు. 2010 నుంచి ఇప్పటి వరకు భారత్‌లో కంపెనీకి చెందిన 11.4 లక్షల సీఎన్జీ వాహనాలు రోడ్డెక్కాయి. బలీనో, ఎక్స్ఎల్6 మోడళ్లను నెక్సా షోరూంల ద్వారా మారుతీ సుజుకీ విక్రయిస్తోంది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
ప్యాసింజర్ వెహికిల్స్ దూసుకెళ్తున్నాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం, సెమికండక్టర్ల సరఫరా తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం భారత వాహన పరిశ్రమకు కలిసి వచ్చింది. ప్యాసింజర్ వెహికిల్స్ తయారీ, విక్రయాలు వేగం పుంజుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2022 ఆగస్ట్‌లో కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డు నమోదైంది. ఎస్‌యూవీల జోరుతో టాప్–7 కంపెనీల మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ఏకంగా 30.2 శాతం వృద్ధితో 3,05,744 యూనిట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక వృద్ధి. ఆగస్ట్ నుంచి పండుగల సీజన్ ప్రారంభం అవుతుంది. జోరు మొదలైందని.. రాబోయే నెలల్లో ఇది కొనసాగుతుందని వాహన పరిశ్రమ ధీమాగా ఉంది. ఏడాది పొడవునా జరిగే మొత్తం విక్రయాల్లో పండుగల సీజన్ వాటా ఏకంగా 40 శాతం దాకా ఉంటోంది. 2018–19ని మించిన విక్రయాలు.. దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో 30,69,499 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2018–19లో అత్యధికంగా 33,77,389 యూనిట్లు రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2018–19ని మించిన విక్రయాలు నమోదు కానున్నాయని భారత్‌లో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చెబుతోంది. 37 లక్షల యూనిట్లతో పరిశ్రమ నూతన రికార్డు సాధిస్తుందన్న అంచనా ఉందని మారుతీ సుజుకీ సేల్స్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. 2021–22తో పోలిస్తే ఇది 21 శాతం అధికమని అన్నారు. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో మారుతీ సుజుకీ 30 శాతం, హ్యుండై 5.6, టాటా మోటార్స్ 68.3, మహీంద్రా అండ్ మహీంద్రా 87, కియా ఇండియా 33.3, టయోటా కిర్లోస్కర్ 17.12 శాతం వృద్ధి సాధించాయి. హోండా కార్స్ 30.5 శాతం తిరోగమన వృద్ధి చవిచూసింది. ద్విచక్ర వాహనాలు ఇలా.. : అంత క్రితం ఏడాది ఇదే కాలం, అలాగే ఈ ఏడాది జూలైతో పోలిస్తే ఆగస్ట్‌లో అన్ని ద్విచక్ర వాహన కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. సెమికండక్టర్ల సరఫరా మెరుగవడం డిమాండ్‌కు తగ్గట్టుగా కస్టమర్లకు వాహనాలను అందించేందుకు వీలైందని కంపెనీలు అంటున్నాయి. జీడీపీ వృద్ధి, రెండేళ్ల తర్వాత సాధారణ పండుగల సీజన్, మెరుగైన రుతుపవనాలతో అధిక దిగుబడి, కస్టమర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండడం.. వెరిశి రాబోయే నెలల్లో టూ వీలర్ల అమ్మకాలు మరింత జోరుగా ఉంటాయని హీరో మోటోకార్ప్ తెలిపింది. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో హీరో మోటోకార్ప్ 4.6 శాతం, హోండా 5.1, టీవీఎస్ 56.2, బజాజ్ 42.2, సుజుకీ 6.2, రాయల్ ఎన్ఫీల్డ్ 33.8 శాతం అధికంగా విక్రయాలను సాధించాయి. -
మిశ్రమంగా వాహన విక్రయాలు
వృద్ధి బాటలో మారుతీ, హ్యుందాయ్ తగ్గిన ఫోర్డ్, మహీంద్రా అమ్మకాలు... న్యూఢిల్లీ : వాహన విక్రయాలు మార్చి నెలలో మిశ్రమంగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా కార్స్ కంపెనీల దేశీయ విక్రయాలు వృద్ధిని సాధించగా, ఫోర్డ్, మహీంద్రా, జనరల్ మోటార్స్ కంపెనీల అమ్మకాలు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రికార్డ్ స్థాయి అమ్మకాలను మారుతీ సుజుకీ, హోండా కార్స్ ఇండియా, హోండా మోటొకార్ప్లు సాధించాయి. గత ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ కంపెనీ రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 11,55,041గా ఉన్న మారుతీ సుజుకీ కార్ల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం వృద్ధితో 12,92,415కు పెరిగాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయి అమ్మకాలు సాధించడం మారుతీకి ఇదే మొదటిసారి. భారత వాహన పరిశ్రమ 4 శాతం వృద్ధి సాధిస్తే తాము 11 శాతం వృద్ధి సాధించామని మారుతీ సుజుకీ ఇండియా ఈడీ(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. అమేజ్, సిటీ కార్లు మంచి అమ్మకాలు సాధిస్తుండటంతో హోండా కార్స్ ఇండియా 23 శాతం వృద్ధి సాధించింది. కంపెనీ చరిత్రలోనే రికార్డ్ స్థాయి నెలవారీ అమ్మకాలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయి వార్షిక అమ్మకాలు సాధించింది. 2014-15లో ఈ కంపెనీ వాహన విక్రయాలు 41% వృద్ధితో 1,89,062కు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో హీరో మోటొకార్ప్ రికార్డ్ స్థాయి అమ్మకాలను సాధించింది. 2014-15లో వాహన విక్రయాలు 6 శాతం వృద్ధితో 62,45,960కు చేరాయని వివరించింది. ఈ ఏడాదీ సవాళ్లే..: ఈ ఏడాది వాహన పరిశ్రమకు సవాళ్లు తప్పవని హ్యుందాయ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. మందకొడి ఆర్థిక రికవరీ, అధిక వడ్డీరేట్లు తదితర అంశాల కారణంగా వినియోగదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారని ఫోర్డ్ ఇండియా ఈడీ అనురాగ్ మెహోత్ర చెప్పారు. సమీప భవిష్యత్తులో అమ్మకాలు పుంజుకునే అవకాశాలూ అంతంత మాత్రంగానే ఉన్నాయని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ పేర్కొన్నారు.