కియా సోనెట్‌ ఆగయా.. | Kia Sonet Compact SUV Launched in India | Sakshi
Sakshi News home page

కియా సోనెట్‌ ఆగయా..

Published Sat, Sep 19 2020 5:20 AM | Last Updated on Sat, Sep 19 2020 5:20 AM

Kia Sonet Compact SUV Launched in India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  వాహన తయారీ సంస్థ కియా మోటార్స్‌ ‘సోనెట్‌’ కాంపాక్ట్‌ ఎస్‌యూవీని శుక్రవారం భారత్‌లో ప్రవేశపెట్టింది. పెట్రోల్‌ 1.0 టి–జీడీఐ, స్మార్ట్‌స్ట్రీమ్‌ పెట్రోల్‌ 1.2 లీటర్, డీజిల్‌ 1.5 లీటర్‌ సీఆర్‌డీఐ డబ్ల్యూజీటీ, డీజిల్‌ 1.5 లీటర్‌ సీఆర్‌డీఐ వీజీటీ ఇంజన్‌ ఆప్షన్స్‌తో మొత్తం 17 వేరియంట్లలో ఈ కారును రూపొందించింది. అయిదు ట్రాన్స్‌మిషన్‌ రకాలు ఉన్నాయి. ధర వేరియంట్‌నుబట్టి ఎక్స్‌షోరూంలో రూ.6.71 లక్షలు మొదలుకుని రూ.11.99 లక్షల వరకు ఉంది. నాలుగు మీటర్ల లోపు ఉండే సోనెట్‌.. హ్యూందాయ్‌ వెన్యూ, మారుతి సుజుకి వితారా బ్రెజ్జా, టాటా మోటార్స్, నెక్సన్, హోండా డబ్ల్యూఆర్‌–వి, ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ కార్లకు పోటీ ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో ఉన్న కియా అత్యాధునిక ప్లాంటులో సోనెట్‌ తయారు కావడం విశేషం. 70 దేశాలకు ఈ కారును ఎగుమతి చేయనున్నారు.

ఇవీ సోనెట్‌ విశిష్టతలు..
ఫైవ్, సిక్స్‌ స్పీడ్‌ మాన్యువల్స్, సెవెన్‌ స్పీడ్‌ డీసీటీ, సిక్స్‌ స్పీడ్‌ ఆటోమేటిక్, సిక్స్‌ స్పీడ్‌ స్మార్ట్‌స్ట్రీమ్‌ ఇంటెల్లిజెంట్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ రకాల్లో ఇది లభిస్తుంది. తొలిసారిగా సెగ్మెంట్లో 30కి పైగా కొత్త ఫీచర్లను జోడించినట్టు కంపెనీ ప్రకటించింది. నావిగేషన్, లైవ్‌ ట్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌తో 10.25 అంగుళాల హెచ్‌డీ టచ్‌ స్క్రీన్, వైరస్, బ్యాక్టీరియా నుంచి రక్షణకు స్మార్ట్‌ ప్యూర్‌ ఎయిర్‌ ప్యూరిఫయర్, సబ్‌ వూఫర్స్‌తో బోస్‌ ప్రీమియం సెవెన్‌ స్పీకర్‌ సౌండ్‌ సిస్టమ్, యువో కనెక్ట్, స్మార్ట్‌ కీతో రిమోట్‌ ఇంజన్‌ స్టార్ట్, ఆటోమేటిక్‌ మోడళ్లకు మల్టీ డ్రైవ్, ట్రాక్షన్‌ మోడ్స్, కూలింగ్‌ ఫంక్షన్‌తో వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ చార్జర్‌ ఏర్పాటు ఉంది. ఎనమిది మోనోటోన్, మూడు డ్యూయల్‌ టోన్‌ రంగుల్లో సోనెట్‌ లభిస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, పార్కింగ్‌ సెన్సార్స్‌ వంటివి పొందుపరిచారు. సెగ్మెంట్‌లో తొలిసారిగా డీజిల్‌ సిక్స్‌–స్పీడ్‌ ఆటోమేటిక్, ఇంటెల్లిజెంట్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రవేశపెట్టారు. మైలేజీ వేరియంట్‌నుబట్టి 18.4 నుంచి 24.1 కిలోమీటర్లని కంపెనీ తెలిపింది.

తొలి ఏడాది 1,50,000 యూనిట్లు..
కాంపాక్ట్‌ స్పోర్ట్‌ యుటిలిటీ వెహికిల్‌ విభాగంలో సోనెట్‌ సంచలనం సృష్టిస్తుందని కియా మోటార్స్‌ ఇండియా ఎండీ, సీఈవో కూఖ్యున్‌ షిమ్‌ ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ మార్కెట్‌ కోసం తయారు చేసిన మేడ్‌ ఇన్‌ ఇండియా కారు సోనెట్‌కు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోందని, 25,000 పైచిలుకు బుకింగ్స్‌ వచ్చాయని అన్నారు. తొలి రోజే 6,500 బుకింగ్స్‌ నమోదయ్యాయని, ప్రస్తుతం రోజుకు 1,000 వస్తున్నాయని గుర్తు చేశారు. సరఫరా సమస్యలేవీ ఉత్పన్నం కాలేదని, ఆంధ్రప్రదేశ్‌ ప్లాంటులో రెండవ షిప్ట్‌ ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు. కరోనా ఉన్నప్పటికీ ఈ కారు ప్రవేశపెట్టడం వెనుక ఉద్యోగుల కఠోర శ్రమ ఉందన్నారు. ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 3 లక్షల యూనిట్లు అని గుర్తుచేశారు.  భారత్‌ను తయారీ హబ్‌గా చేసుకున్నామన్నారు. దేశీయం గా తొలి ఏడాది ఒక లక్ష యూనిట్ల సోనెట్‌ కార్లు విక్రయించాలని లక్ష్యంగా చేసుకున్నట్టు కంపెనీ ఈడీ టే జిన్‌ పార్క్‌ పేర్కొన్నారు. అలాగే 50,000 యూనిట్లు ఎగుమతి చేయనున్నట్టు చెప్పారు. భారత్‌లో కనెక్టెడ్‌ కార్స్‌ విభాగంలో 60,000 పైచిలుకు యూనిట్ల మైలురాయిని అధిగమించిన తొలి కంపెనీగా నిలిచినట్టు కియా తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement