కార్ల రేట్లకు రెక్కలు | Automakers announce January price hikes amid rising costs | Sakshi
Sakshi News home page

కార్ల రేట్లకు రెక్కలు

Published Sun, Dec 15 2024 5:14 AM | Last Updated on Sun, Dec 15 2024 7:11 AM

Automakers announce January price hikes amid rising costs

జనవరి నుంచి పెరగనున్న ధరలు 

మారుతీ సుజుకీ 4 శాతం వరకు, మరికొన్ని 3% దాకా పెంపు 

ముడి వస్తువుల రేట్లు, నిర్వహణ వ్యయాలు పెరగడమే కారణం 

న్యూఢిల్లీ: ప్రారంభ స్థాయి కార్ల నుంచి లగ్జరీ వాహనాల వరకు జనవరి నుంచి వివిధ కార్ల రేట్లకు రెక్కలు రానున్నాయి. ముడి వస్తువుల ధరలు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోయిన కారణంగా వివిధ మోడల్స్‌ ధరలను పెంచబోతున్నట్లు పలు కార్ల కంపెనీలు ప్రకటించాయి. మారుతీ సుజుకీ ఇండియా తమ వాహనాల రేట్లను 4 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఎంట్రీ లెవెల్‌ ఆల్టో కే10 నుంచి మల్టీ యుటిలిటీ వాహనం ఇన్విక్టో వరకు వివిధ మోడల్స్‌ను మారుతీ విక్రయిస్తోంది. 

ముడి వస్తువుల ధరలు, నిర్వహణ వ్యయాలను రేట్ల పెంపునకు కారణంగా పేర్కొంది. కస్టమర్లపై భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్నించినప్పటికీ కొంత బదలాయించక తప్పని పరిస్థితి ఉంటోందని వివరించింది. మరోవైపు హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా కూడా తమ కార్ల రేట్లను రూ. 25,000 వరకు పెంచడంపై దృష్టి పెట్టింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎస్‌యూవీలు, వాణిజ్య వాహనాలు 3 శాతం వరకు పెరగనున్నాయి. ద్రవ్యోల్బణం, కమోడిటీల ధరల పెరుగుదల ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. అటు, టాటా మోటర్స్‌ కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలు సహా అన్ని ప్యాసింజర్‌ వాహనాలపై 3 శాతం మేర, కియా ఇండియా 2 శాతం స్థాయిలో రేట్లను పెంచనున్నట్లు వెల్లడించాయి.  

వచ్చే నెల నుంచి తమ మొత్తం వాహనాల శ్రేణి రేట్లను 3 శాతం వరకు పెంచనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్‌ ఇండియా వెల్లడించింది. అటు లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ కూడా 3 శాతం పెంచనుంది. కమోడిటీల రేట్లు, లాజిస్టిక్స్‌ వ్యయాల భారం మొదలైనవి నిర్వహణ వ్యయాలపై ప్రభావం చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. జీఎల్‌సీ మోడల్‌ ధర రూ. 2 లక్షల వరకు, టాప్‌ ఎండ్‌ మెర్సిడెస్‌–మేబాక్‌ ఎస్‌ 680 లగ్జరీ లిమోజిన్‌ రేటు రూ. 9 లక్షల వరకు పెరగనుంది. ముడి వస్తువులు, రవాణా వ్యయాలు పెరగడంతో ఆడి ఇండియా కూడా తమ వాహనాల శ్రేణి ధరను 3 శాతం వరకు పెంచుతోంది. ఇక బీఎండబ్ల్యూ ఇండియా కూడా 3 శాతం స్థాయిలో పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. హోండా కార్స్‌ సైతం ఇదే యోచనలో ఉన్నప్పటికీ, పెంపు పరిమాణంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  

ఏటా డిసెంబర్‌లో జరిగేదే.. 
ముడివస్తువుల ధరల ఒత్తిడి మొదలైన అంశాల కారణంగా రేట్లను పెంచుతున్నామని కార్ల కంపెనీలు చెబుతున్నప్పటికీ, ఇది ఏటా డిసెంబర్‌లో జరిగే వ్యవహారమేనని పరిశ్రమ నిపుణులు తెలిపారు. సాధారణంగా కొత్త ఏడాదిలో కొత్త మోడల్‌ను కొనుక్కోవచ్చనే ఉద్దేశంతో డిసెంబర్‌లో కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకునే కస్టమర్లను కాస్త తొందరపెట్టేందుకు వాహన కంపెనీలు ఇలాంటి ప్రక్రియ చేపడుతుంటాయని పేర్కొన్నారు. తద్వారా ఏడాది చివర్లో అమ్మకాలను పెంచుకునేందుకు సంస్థలు ప్రయతి్నస్తాయని వివరించారు.  

సాధారణంగా క్యాలెండర్‌ సంవత్సరం, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇలా ధరలను పెంచడం కనిపిస్తుంటుందని, కొన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేటప్పుడు కూడా ఇలా చేస్తుంటాయని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ రజత్‌ మహాజన్‌ తెలిపారు. పండుగ సీజన్‌ సందర్భంగా రేట్లను సవరించలేదు కాబట్టి నాలుగో త్రైమాసికం ప్రారంభంలో పెంచే అవకాశాలు ఉన్నాయని వివరించారు. రెండో త్రైమాసికంలో కొన్ని బడా కంపెనీల లాభదాయకత తగ్గడం కూడా రేట్ల పెంపునకు కారణమని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా కంపెనీలు సాధారణంగానే క్యాలెండర్‌ ఇయర్‌ ప్రారంభంలో రేట్లను పెంచుతుంటాయని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ రోహన్‌ కన్వర్‌ గుప్తా తెలిపారు. దానికి అనుగుణంగానే వివిధ కార్ల కంపెనీలు రేట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement