Raw material price
-
కార్ల రేట్లకు రెక్కలు
న్యూఢిల్లీ: ప్రారంభ స్థాయి కార్ల నుంచి లగ్జరీ వాహనాల వరకు జనవరి నుంచి వివిధ కార్ల రేట్లకు రెక్కలు రానున్నాయి. ముడి వస్తువుల ధరలు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోయిన కారణంగా వివిధ మోడల్స్ ధరలను పెంచబోతున్నట్లు పలు కార్ల కంపెనీలు ప్రకటించాయి. మారుతీ సుజుకీ ఇండియా తమ వాహనాల రేట్లను 4 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఎంట్రీ లెవెల్ ఆల్టో కే10 నుంచి మల్టీ యుటిలిటీ వాహనం ఇన్విక్టో వరకు వివిధ మోడల్స్‌ను మారుతీ విక్రయిస్తోంది. ముడి వస్తువుల ధరలు, నిర్వహణ వ్యయాలను రేట్ల పెంపునకు కారణంగా పేర్కొంది. కస్టమర్లపై భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్నించినప్పటికీ కొంత బదలాయించక తప్పని పరిస్థితి ఉంటోందని వివరించింది. మరోవైపు హ్యుందాయ్ మోటర్ ఇండియా కూడా తమ కార్ల రేట్లను రూ. 25,000 వరకు పెంచడంపై దృష్టి పెట్టింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీలు, వాణిజ్య వాహనాలు 3 శాతం వరకు పెరగనున్నాయి. ద్రవ్యోల్బణం, కమోడిటీల ధరల పెరుగుదల ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. అటు, టాటా మోటర్స్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు సహా అన్ని ప్యాసింజర్ వాహనాలపై 3 శాతం మేర, కియా ఇండియా 2 శాతం స్థాయిలో రేట్లను పెంచనున్నట్లు వెల్లడించాయి. వచ్చే నెల నుంచి తమ మొత్తం వాహనాల శ్రేణి రేట్లను 3 శాతం వరకు పెంచనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా వెల్లడించింది. అటు లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ కూడా 3 శాతం పెంచనుంది. కమోడిటీల రేట్లు, లాజిస్టిక్స్ వ్యయాల భారం మొదలైనవి నిర్వహణ వ్యయాలపై ప్రభావం చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. జీఎల్సీ మోడల్ ధర రూ. 2 లక్షల వరకు, టాప్ ఎండ్ మెర్సిడెస్–మేబాక్ ఎస్ 680 లగ్జరీ లిమోజిన్ రేటు రూ. 9 లక్షల వరకు పెరగనుంది. ముడి వస్తువులు, రవాణా వ్యయాలు పెరగడంతో ఆడి ఇండియా కూడా తమ వాహనాల శ్రేణి ధరను 3 శాతం వరకు పెంచుతోంది. ఇక బీఎండబ్ల్యూ ఇండియా కూడా 3 శాతం స్థాయిలో పెంచే అవకాశాలను పరిశీలిస్తోంది. హోండా కార్స్ సైతం ఇదే యోచనలో ఉన్నప్పటికీ, పెంపు పరిమాణంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏటా డిసెంబర్లో జరిగేదే.. ముడివస్తువుల ధరల ఒత్తిడి మొదలైన అంశాల కారణంగా రేట్లను పెంచుతున్నామని కార్ల కంపెనీలు చెబుతున్నప్పటికీ, ఇది ఏటా డిసెంబర్లో జరిగే వ్యవహారమేనని పరిశ్రమ నిపుణులు తెలిపారు. సాధారణంగా కొత్త ఏడాదిలో కొత్త మోడల్‌ను కొనుక్కోవచ్చనే ఉద్దేశంతో డిసెంబర్లో కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకునే కస్టమర్లను కాస్త తొందరపెట్టేందుకు వాహన కంపెనీలు ఇలాంటి ప్రక్రియ చేపడుతుంటాయని పేర్కొన్నారు. తద్వారా ఏడాది చివర్లో అమ్మకాలను పెంచుకునేందుకు సంస్థలు ప్రయతి్నస్తాయని వివరించారు. సాధారణంగా క్యాలెండర్ సంవత్సరం, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇలా ధరలను పెంచడం కనిపిస్తుంటుందని, కొన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేటప్పుడు కూడా ఇలా చేస్తుంటాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రజత్ మహాజన్ తెలిపారు. పండుగ సీజన్ సందర్భంగా రేట్లను సవరించలేదు కాబట్టి నాలుగో త్రైమాసికం ప్రారంభంలో పెంచే అవకాశాలు ఉన్నాయని వివరించారు. రెండో త్రైమాసికంలో కొన్ని బడా కంపెనీల లాభదాయకత తగ్గడం కూడా రేట్ల పెంపునకు కారణమని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా కంపెనీలు సాధారణంగానే క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలో రేట్లను పెంచుతుంటాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వర్ గుప్తా తెలిపారు. దానికి అనుగుణంగానే వివిధ కార్ల కంపెనీలు రేట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయని పేర్కొన్నారు. -
ఔషధాల ధరల పెంపు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వివిధ రకాల ఔషధాల ధరలను కేంద్రం పెంచింది. ఈ మేరకు 872 రకాల మందుల ధరలను సవరిస్తూ గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో కోట్లాది మందిపై భారం పడనుంది. గతంలో ఈ మందులన్నీ నిర్ణయించిన ధరకే అమ్మాలని (ప్రైస్ సీలింగ్) ఎన్పీపీఏ (నేషనల్ ఫార్మ ప్రైజింగ్ అథారిటీ) నిర్ణయించింది. తాజాగా.. ఎన్పీపీఏ ఈ 872 రకాల మందులకు 10 శాతం మేర రేట్లు పెంచుకోవచ్చని అనుమతిచ్చింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ధరలు పెరగనున్నాయి.. ఇక తాజాగా రేట్లు పెంచిన ఔషధాల్లో నిత్యం కోట్లాది మంది వాడే పారాసిటమాల్ (జ్వరం), మెట్ఫార్మిన్ (షుగర్) ఇన్సులిన్ (షుగర్)కు వాడేవి ఉన్నాయి. ధరల పెంపుదలవల్ల కోట్లాది మంది నెలసరి ఖర్చు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. ఖరీదైన యాంటిబయోటిక్స్ మందులపైనా భారం పడనుంది. ముడిసరుకు పెరిగిందని.. కరోనా మహమ్మారి దెబ్బకు మందుల్లో వాడే ముడిసరుకు ధరలు అమాంతం పెరిగాయని, దీనివల్ల రేట్లు పెంచక తప్పలేదని ఎన్పీపీఏ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎన్పీపీఏ పరిధిలోని 872 మందుల ధరలు పెంచామని, అంతకంటే ఎక్కువ వసూలు చేసినట్లయితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో హెచ్చరించింది. మరోవైపు.. ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఏటా 10 కోట్ల పారాసిటమాల్ మాత్రలు వినియోగమవుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేస్తోంది. పారాసిటమాల్ ధరలు పెరగడంతో ప్రభుత్వంపైనా భారం పడనుంది. -
కొండెక్కనున్న గణేశుడు..
- ముడిసరుకు ధరల పెరుగుదలతో - తగ్గనున్న విగ్రహాల తయారీ - గిట్టుబాటు లేకపోవడంతో - మూతపడిన పలు తయారీ కేంద్రాలు - కూలీల కొరత కూడా కారణమే.. సాక్షి, ముంబై: ఈ ఏడాది గణేశ్ విగ్రహాల ధరలు సుమారు 20-25 శాతం పెరిగే అవకాశాలున్నాయి. విగ్రహాల తయారీకి వినియోగించే ముడిసరుకులు, రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇనుప చువ్వలు తదితర సామగ్రి ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ధరలు పెరిగిన దృష్ట్యా ఈ ఏడాది విగ్ర హాల ఉత్పత్తి కూడా తగ్గించినట్లు తయారీదారులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లో సరుకు కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు. గత ఏడాది గణపతి విగ్రహాల తయారీకి ఉపయోగించే 35 కే జీల బంకమట్టి సంచి రూ.170 లభించింది. ప్రస్తుతం 20 కేజీల బంకమట్టికి రూ.200 వెచ్చించాల్సి వస్తోందని అంబర్నాథ్కు చెందిన నానా కడు అనే విగ్రహాల తయారీదారుడు తెలిపారు. విగ్రహాలకు తయారుచేసిన త ర్వాత వాడే రంగులు 20 శాతం మేర ధరలు పెరిగాయి. భారీ విగ్రహాలకు ఉపయోగించే నాణ్యమైన ఇనుప చువ్వల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. గిట్టుబాటు కాకపోవడంతో ఇప్పటికే అనేక విగ్రహాలు తయారుచేసే ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి. కార్మికులు దొరకడం కూడా కష్టతరంగా మారింది. వారికి చెల్లించే కూలిని రెట్టింపు చేసినా కూలీలు దొరకడం లేదు. వారు డిమాండ్ చేసిన ంత కూలి చెల్లించడంతోపాటు భోజనం, బస ఏర్పాటు చేస్తే తప్ప కార్మికులు దొరకడం లేదు. ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తే విగ్రహాల తయారీ ఫ్యాక్టరీ యజమానులకు ఏమీ మిగలడం లేదు. ఏటా రాయ్‌గడ్ జిల్లాలోని పేన్, రోహ తాలూకాల నుంచి భారీ ఎత్తున విగ్రహాలు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈసారి ధరలు మండిపోవడంతో అనేక మంది ఫ్యాక్టరీ యజమానులు ముందుగా ఆర్డర్లు స్వీకరించడం మానుకున్నారు. ముఖ్యంగా విగ్రహాల తయారీకి ఉపయోగించే బంక మట్టి గుజరాత్లో లభిస్తుంది. అక్కడి నుంచి ట్రక్కులో తీసుకురావడం యజమానులకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో కొందరు విగ్రహాలను తయారుచేయడం నిలిపివేశారు.