న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధమైందని భారత్ ప్రకటించింది. ‘ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం వస్తుందని ఆశిస్తున్నాం. ఈ దిశగా సంప్రదింపులు ముమ్మరంగా జరుగుతున్నాయి’ అని భారత్ ప్రకటించింది. సదస్సుకు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటి అంశాల్లో సమ్మతి సాధ్యమయ్యేనా అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఆయన చెప్పలేదు.
‘ ఆఫ్రికా యూనియన్‌కు జీ20 కూటమిలో సభ్యత్వం ఇవ్వాలా వద్దా అనే అంశంపై శనివారం జరిగే సదస్సులో నిర్ణయం తీసుకోవచ్చు’ అని క్వాత్రా తెలిపారు. ‘ప్రధాని మోదీకి గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రగాఢ విశ్వాసముంది. అందుకే ఆఫ్రికా యూనియన్‌ను కలుపుకుందామని జీ20 సభ్యదేశాలకు రాతపూర్వకంగా మోదీ విన్నవించుకున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ అనేది గ్లోబల్ సౌత్‌కు, అభివృద్ధి దేశాలకు గొంతుకగా ఉంటుంది.
జీ20కి భారత సారథ్యం సమ్మిళితంగా, లక్ష్య సాధకంగా, క్రియాశీలకంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని మోదీ ధీమా వ్యక్తంచేశారు ’ అని జీ20 షెర్పా అయిన అమితాబ్ కాంత్ చెప్పారు. ‘ భారత వైవిధ్య, సమాఖ్య నిర్మాణానికి గుర్తుగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 60 నగరాలు, పట్టణాల్లో 220కిపైగా జీ20 సంబంధ సమావేశాలు జరిగాయని అమితాబ్‌కాంత్ పేర్కొన్నారు. అగ్ర నేతలు పాల్గొనే సెషన్స్‌లు మూడు విడిగా జరుగుతాయి. వీటికి ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అని నామకరణం చేశారు.
శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అగ్రనేతల గౌరవార్ధం విందు ఇవ్వనున్నారు. జీ20 నేతలంతా రాజ్‌ఘాట్‌కు చేరుకుని గాంధీజీకి ఘన నివాళులు అర్పించనున్నారు. ప్రపంచ రాజకీయ భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి, సమ్మిళిత వృద్ధి, ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణంలో పెను మార్పులు, గ్లోబల్ సౌత్ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు తదితర కీలక అంశాలు నేతల మధ్య భేటీలో చర్చకు రానున్నాయి. మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్, జర్మనీ చాన్స్‌లర్ స్కోల్జ్, ఫ్రెంచ్ అధ్యక్షుడు మేక్రాన్ సహా ఇతర దేశాల నేతలు, ఈయూ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఓఈసీడీ, ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల చీఫ్‌లు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment