ప్రతిభకు తగిన గుర్తింపు... ఆశలు ఫలిస్తాయి... ప్రయత్నాలు కలిసి వస్తాయి | astrology in 2015 | Sakshi
Sakshi News home page

ప్రతిభకు తగిన గుర్తింపు... ఆశలు ఫలిస్తాయి... ప్రయత్నాలు కలిసి వస్తాయి

Published Wed, Dec 31 2014 11:37 PM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM

ప్రతిభకు తగిన గుర్తింపు... ఆశలు ఫలిస్తాయి... ప్రయత్నాలు కలిసి వస్తాయి - Sakshi

ప్రతిభకు తగిన గుర్తింపు... ఆశలు ఫలిస్తాయి... ప్రయత్నాలు కలిసి వస్తాయి

మేషం: ఈ రాశివారికి ప్రథమార్ధంలో కన్నా ద్వితీయార్థంలో బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగులకు ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో అసంతృప్తి ఉండి, కొత్త కంపెనీలో మారాలనుకునేవారి ప్రయత్నాలు జూన్ 19 తర్వాత సఫలమవుతాయి. ఈ లోగా ఉన్న ఉద్యోగంలోనే ఉండటం మంచిది. పోటీ పరీక్షలు రాసేవారికి ఇది మంచి సమయం. పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నవారికి  దిగువ స్థాయి వారి నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు. జూన్ వరకు షేర్‌మార్కెట్ లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. శుభకార్యాలకు, ధార్మిక కార్యాలకు ధనం ఖర్చు చేయవలసి రావడం వల్ల డబ్బుకు కటకటలాడాల్సిన పరిస్థితి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం ఉత్తమం. స్త్రీలకు తమ జీవిత భాగస్వామి నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొనవలసి రావచ్చు. లవర్స్ మధ్య గొడవలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. పాతస్నేహితుల స్థానంలో కొత్త స్నేహితులు వచ్చే అవకాశం. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశివారు నిత్యం దక్షిణామూర్తిని ధ్యానించడం వల్ల వ్యతిరేక ఫలితాలు తొలగి, శుభ ం జరుగుతుంది.
 
వృషభం:  వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూల సమయం. ఈ రాశిలో జన్మించిన వారి తండ్రికి ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, జీతభత్యాలలో పెరుగుద ల. పిల్లల కోసం ఎదురు చూసేవారి ఆశలు ఫలించి, సంతానవంతులవుతారు. ఉద్యోగులు జులై నుంచి విధులల అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రభుత్వోద్యోగులకు అప్రధానమైన శాఖకు మార్చడం లేదా దూరప్రాంతానికి బదిలీ అయే అవకాశం ఉంది. అంవలన పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనంతో వ్యవహరించడం మంచిది. విద్యార్థులకు ఇది మంచి సమయం. వారిలో అంతర్గతంగా ఉన్న ప్రతిభ వెలికి వ స్తుంది. వారి ప్రజ్ఞకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పోటీపరీక్షలు రాసేవారు విజయం సాధిస్తారు. ఈ రాశి వారి తలిదండ్రులకు కూడా బాగా కలిసి వస్తుంది. ఆస్తి సంబంధమైన వ్యవహారాలు లాభిస్తాయి. మరిన్ని అనుకూల ఫలితాల కోసం వీరు శుక్రజపం లేదా నవగ్రహ హోమం చేయించుకోవాలి. అనాథ కన్యలకి వివాహ ఖర్చులు భరించటం మరింత శుభఫలితాలనిస్తుంది.11 మంది కన్నెపిల్లలకు గాజులు, దుస్తులు దానం చేయడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది.
 
మిథునం: వీరికి ఈ సంవత్సరం ధనాభివృద్ధి జరుగుతుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు, స్టాక్‌మార్కెట్‌లో లాభాలు, ఆస్తుల విలువ అనూహ్యంగా పెరగటం వల్ల అధిక ధనాదాయం వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. కాంపిటీటివ్ పరీక్షలు రాసేవారికి, కొత్త వ్యాపారాలు చేసేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బదిలీ కోసం ప్రయత్నిస్తున్న వారికి కోరుకున్న చోటకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు పనిలో ఒత్తిడి, పై అధికారులతో చిక్కులు. పలురకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఆరోగ్యం చక్కబడుతుంది. జులై తర్వాత ఈ రాశివారి తలిదండ్రుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరిన్ని మెరుగయిన, అనుకూల ఫలితాల కోసం వీరు గణేశునిపూజించటం, అనాథాశ్రమాలకు, పేదలకు అన్నదానం చేయడం మంచిది. శ్రీ సూక్త పారాయణ చేయడం వల్ల ధనాదాయం కలుగుతుంది.
 
కర్కాటకం: వీరికి జూన్ 19 వరకు పనుల ఒత్తిడి ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. పిల్లలు నిరుద్యోగులుగా ఉంటే కచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పిల్లలకు చేసే పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. అవివాహితులకు వివాహ ప్రాప్తి. సాంకేతిక రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేందుకు ఆస్కారం ఉంది.  విదేశీ విద్య, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. జులై నుంచి ధనాదాయం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి, అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. జులై నుంచి రాహువు వక్రదృష్టి వలన ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. సంవత్సరం ద్వితీయార్ధం నుంచి ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. నవగ్రహ ఆరాధన, దుర్గామాతను పూజించటం, అనాథలకు బెల్లం పాయసం పంచిపెట్టడం, దేవాలయాల కొలనులోని చేపలకు గోధుమపిండితో చేసిన ఉండలు ఆహారంగా పెట్టడం వల్ల మరిన్ని సత్ఫలితాలను పొందవచ్చు.
 
సింహం: ఈ రాశివారికి ఈ సంవత్సరం కుటుంబ కలతలు, బంధువులతో విభేదాలు, అనవసర వ్యయం అయ్యేందుకు అవకాశం ఉంది. అలాగే మానసిక వ్యధ, మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటాయి. పనుల ఒత్తిడికితోడు తమ పనిని ఎవరూ గుర్తించడం లేదన్న మనస్తాపం, ఆత్మన్యూనతాభావం కలుగుతాయి. జులై నుంచి కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. అంతవరకు ఇతరులతో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి. మీడియా రంగంలో ఉన్నవారి ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది.పొగడ్తలకు పొంగిపోవటం ఈ రాశివారి సహజ స్వభావం కావడం వల్ల ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్య విషయాలలో అప్రమత్తత అవసరం. స్త్రీలకు పని చేసే చోట ఒత్తిళ్లు ఎదురవుతాయి. దీనికి అతిగా స్పందించకుండా చాకచక్యంగా, సంయమనంగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులకు కొంచెం కష్టకాలమనే చెప్పాల్సి ఉంటుంది. మరిన్ని అనుకూల ఫలితాల కోసం ఈ రాశివారు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మన్యసూక్త పారాయణం చేయించుకోవడం మంచిది.
 
కన్య: ఈ రాశివారు సహజంగానే జాగ్రత్తపరులు, మంచి తెలివితేటలు కలిగి సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. జూన్ 19 వరకు ఆదాయంలో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఊహించినదానికన్నా అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.స్పెక్యులేషన్లు, స్టాక్‌మార్కెట్లు, లాటరీలలో లాభిస్తారు. సంతానవృద్ధి జరుగుతుంది. పిల్లల ఉద్యోగ, వివాహాలకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది.ఆరోగ్యపరంగా, కెరీర్‌పరంగా బాగుంటుంది. బంధువులతో, కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది.విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. పోటీపరీక్షలలో కష్టంతో విజయం సాధిస్తారు. ఈ రాశివారు రాహుజపం, సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయడం, దక్షిణామూర్తిని ఆరాధించటం వల్ల కలిసిస్తుంది. పేదవిద్యార్థులకు పుస్తకాలు కొనిపెట్టడం, ఫీజులు కట్టడం, పేదలకు అన్నదానం చేయడం వల్ల మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి.
 
తుల: నవంబర్ 2014 నుంచి ఈ రాశివారికి మంచికాలంగా భావించవచ్చు. అధికశ్రమ, తక్కువలాభం, అవమానాలు, అనారోగ్య బాధలు వంటి వాటి నుంచి వీరు బయటకు వచ్చారు. అయితే కుటుంబ సౌఖ్యానికి దూరంగా ఉండటం, పని ఒత్తిడి, పని మీద ఆసక్తి లేకపోవటం, పని చేసే చోట అవమానాలు సంభవం. ధనవృద్ధి, ఉద్యోగులకు బోనస్, భార్యతరఫున ధనాదాయం లభిస్తాయి. జులై నుండి పిల్లల విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆస్తులు పెంపొదించుకుంటారు. పాత ఆస్తులు లేదా షేర్స్, స్టాక్స్ విలువ పెరగటం, ఉద్యోగులు తాము కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయే అవకాశం ఉంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రథమార్ధంలో కష్టంగా ఉన్నా, ద్వితీయార్ధంలో సెటిలవుతారు. నవగ్రహారాధన, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, శని జపం చేయించుకోవటం, కాకులకు తీపిపదార్థాలు తినిపించటం మంచిది.
 
వృశ్చికం: ఈ రాశివారికి మానసిక సంఘర్షణ, అపవాదులు, అవమానాలు ఎదురయే అవకాశం ఉంది. అయితే బృహస్పతి వీరికి అనుకూలించటం వల్ల కష్టాలు వీరిని అంతగా బాధించవు. రాబడి పెరుగుతుంది. కీర్తి, సంఘంలో గౌరవం లభిస్తాయి. వీరు గతంలో కొన్న షేర్ల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. 2015 జూన్ వరకు ఈ రాశివారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆ తర్వాత బృహస్పతి స్థానం మార్చుకోవటం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు, ప్రభుత్వోద్యోగులకు అంతగా ప్రాముఖ్యంలేని శాఖకు లేదా దూరప్రాంతాలకు బదిలీ కావటం, షేర్ల ధరలు పడిపోవటం, ఆర్థికంగా దెబ్బతినటం వంటి పరిణామాలు సంభవిస్తాయి. స్త్రీలకు జీవిత భాగస్వామి నుంచి, పిల్లల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. పని ఒత్తిడి తప్పదు. విద్యార్థులకు కూడా కష్టకాలంగా చెప్పవచ్చు. విదేశాలలో చదువుకోవాలనుకునేవారి కోరిక జులై నుంచి నెరవేరుతుంది. ఏలినాటి శని దుష్ర్పభావం నుంచి తప్పించుకోవడానికి వీరు శనికి జపం చేయించాలి. అనాథలకు, వృద్ధులకు సాయం చేయాలి. నల్లకుక్కకు ఆహారం తినిపించాలి.
 
ధనుస్సు: ఏలిననాటి శని ప్రభావం, అష్టమంలో బృహస్పతి సంచారం, రాహువు 10వ ఇంట సంచారం వల్ల ఈ రాశివారికి మనోవ్యాకులత, అనవసర విషయాలలో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటు, స్వంత వారినుంచి వ్యతిరేకత ఎదుర్కొనడం సంభవం. జూన్ వరకు ఖర్చులు ఎక్కువ అవడం వల్ల అప్పులు చేయవలసి రావచ్చు. ఆ తర్వాత బృహస్పతి సంచారం వలన ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగులకు ఇది మంచికాలం. ఉద్యోగంలో సౌకర్యాలు, వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తొందరపడి నోరు జారకుండా చూసుకోవటం అవసరం.విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దక్షిణామూర్తిని ఆరాధించటం, నవగ్రహ హోమం, శివాభిషేకం చేయించుకోవటం, గురువులను గౌరవించటం, సన్మానించటం, ఆవులకు సెనగలు తినిపించటం వల్ల చిక్కులు తొలగి, మంచి జరుగుతుంది.
 
మకరం: వీరికి ఈ సంవత్సరం చాలా కలిసి వస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ధనసంపాదనకు అవకాశాలు సంభవం. అవివాహితులకు వివాహ యోగం, ఆస్తుల విలువ పెరుగుతుంది. జులై వరకు స్పెక్యులేషన్ వలన లాభపడతారు. ఆ తర్వాత ఆర్థిక విషయాలలో అప్రమత్తత అవసరం. సేవింగ్స్ పెరుగుతాయి. జీవిత భాగస్వామి వలన ధనం కలిసి వస్తుంది. మొత్తం మీద వీరికి ఈ సంవత్సరం ధనానికి లోటు ఉండదు. ఆస్తులు కొనే అవకాశంతోబాటు ఇతరులు వీరిని చూసి అసూయపడేటంతగా వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగులు ప్రమోషన్లు లభిస్తాయి. విద్యార్థులకు ఇది మంచి కాలం. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. మరిన్ని మంచి ఫలితాలు పొందాలంటే శనికి తైలాభిషేకం, దక్షిణామూర్తికి అభిషేకం, వృద్ధులకు అన్నదానం చేయడం మంచిది.
 
కుంభం: ఈ రాశివారికి 6వ ఇంట బృహస్పతది, 10వ ఇంట శని సంచారం వలన తోటివారినుంచి, స్వంతవారినుంచే వ్యతిరేకత సంభవం.అనవసర విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల ఆరోగ్య భంగం కలగవచ్చు. అసంతృప్తికి గురి కావలసి వస్తుంది. వివాహితులు భర్తతోనూ, పిల్లలతోనూ ఓర్పుగా మెలగాలి. ఎప్పటినుంచో దాచుకున్న డబ్బు అంతా ఖర్చు అవుతుంది. షేర్లు, స్టాక్‌మార్కెట్ జోలికి వెళ్లకుండా ఉండటం ఉత్తమం. జులై నుంచి జీవిత భాగస్వామి ఆదాయం పెరుగుతుంది. పిల్లల వివాహ, ఉద్యోగ విషయాలలో చేసే ప్రయత్నాలు పురోగమిస్తాయి. విద్యార్థులు విదే శాలలో ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు జులై తర్వాత ఫలిస్తాయి. మెరుగైన ఫలితాల కోసం శనికి తైలాభిషేకం, ఈశ్వరారాధన, మన్యుసూక్త పారాయణం చేయించుకోవటం మంచిది.
 
మీనం: వీరికి ఈ సంవత్సరం చాలా యోగదాయకమైనది. అన్నింటా అభివృద్ధి పథంలో నడుస్తారు. ఆర్థికంగా, కుటుంబపరంగా చాలా బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీపరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. ఊహించినదానికన్నా ఉన్నతమైన ఉద్యోగాలలో సెటిలవుతారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగం చేసే చోట గౌరవం లభిస్తుంది. అవివాహిత యువతులకు కల్యాణం సంభవం. సంతానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. యోగవంతమైన సంతానం లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలన్న వారి కోరిక ఫలిస్తుంది. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలంటే దక్షిణామూర్తిని ఆరాధించటం, గోవులకు సెనగలు తినిపించటం, పండితులు, గురువులను తగువిధంగా సత్కరించటం మంచిది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement