
వార్తలు వినడం, చదవడం, చూడడం ద్వారా మనచుట్టూ ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిందే. సామాజిక, రాజకీయ, మానవీయ కథనాల ద్వారా ప్రపంచంతో సంబంధం కలిగి ఉండాలి కూడా. అయితే మానవీయ కథనాలకంటే మనసును గాయపరిచే కథనాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల మంచికంటే చెడు ఎక్కువగా ఉంటుంది. అలాంటి సంఘటనలను ఒక వార్తగా తెలుసుకోవడం వరకే పరిమితం చేయాలి. నేరకథనాలను చూసేటప్పుడు మనసు ఉద్వేగానికి లోనవుతుంది, ఆ మేరకు దేహంలో రక్తప్రసరణ వేగం పెరగడం, హార్మోన్‌లు ప్రభావితం కావడం వంటి మార్పులు చోటు చేసుకుంటాయి.
క్రైమ్ వార్తల ఆధారంగా అల్లుతున్న సుదీర్థ కథనాలకు మన రోజులో ఎక్కువగా చోటివ్వకూడదని చెప్తున్నారు యూఎస్ ఆధారిత మేయో క్లినిక్ హెల్త్ సిస్టమ్ ప్రతినిధులు. పిల్లలు, వయసు మీరినవాళ్లు ఇంట్లో ఉన్న సమయంలో క్రైమ్ థిల్లర్ సినిమాలను పెట్టకూడదు. వీటివల్ల పిల్లలు తరచూ మానసిక ఆందోళనలకు లోనవుతుంటారు. పెద్దవాళ్లలో గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది. ఇలా రోజూ జరుగుతుంటే ఈ పరిస్థితి గుండె సమస్యలకు దారి తీస్తుంది. అందుకే లైఫ్ వెల్‌బీయింగ్‌కి క్రైమ్ స్టోరీలకు దూరంగా ఉండడం కూడా ప్రధానమే.
ఇవి చదవండి: మీకు తెలుసా..! మీ ఆరోగ్యం మీ ఆలోచనలతోనేనని..