Talents
-
చిట్టి రచయితలు.. అందమైన కథలతో అలరిస్తున్నారు..
పెద్దల కోసం పిల్లలు రచయితలుగా మారి కథలు రాస్తున్నారు. ‘ఆహా’ అనిపించేలా వినసొంపుగా వినిపిస్తున్నారు. పేదింట్లో పుట్టిన చెన్నై శివారులోని కన్నగినగర్ విద్యార్థులు రచయితలుగా, వెంట్రిలాక్విస్ట్లుగా మారి పెద్దలకు కథలు చెబుతున్నారు. వినోదాన్ని పంచుతున్నారు. యూట్యూబ్ నుంచి ఎఫ్ఎం రేడియో వరకు రకరకాల వేదికలపై తమ ప్రతిభను చాటుకుంటున్నారు...‘ఈ ఘనతకు కారణం ఎవరు?’ అనే ప్రశ్నకు జవాబు....చెన్నైకి చెందిన వెంట్రిలాక్విస్ట్ ఎల్ థామస్. ‘క్యారీ విత్ లవ్’ ట్రస్ట్ నిర్వాహకుడైన థామస్ వన్నత్తు పూచ్చిగల్ (సీతాకోక చిలుకలు) పేరుతో పిల్లలలోని సృజనాత్మక ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నాడు. కన్నగిరినగర్లో ఉండే శ్రీ అనే బాలుడు లాస్ట్ బెంచ్ స్టూడెంట్. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. ఇక చదవడం తన వల్ల కాదు అనుకుంటున్న సమయంలో ‘వన్నత్తు పూచ్చిగల్’ వాట్సాప్ గ్రూప్ తన నిర్ణయాన్ని మార్చేలా చేయడమేకాదు రచయితగా మార్చింది. జంతువులు ప్రధాన పాత్రలుగా ‘బొమ్మలాటం’ అనే నాటకం రాశాడు. స్వీయ ఆలోచన అవసరం గురించి ఈ కథలో చెప్పాడు.ఇదే ప్రాంతానికి చెందిన సంజన స్టోరీ క్రియేటర్‌గా ప్రశంసలు అందుకుంటుంది. పొట్టలం(గంజాయి) అనర్థాలను కళ్లకు కడుతూ రాసిన కథ అందరినీ ఆకట్టుకుంది. జ్యోతిశ్రీ అనే అమ్మాయి రాస్తే... ఎన్నో అక్షర దోషాలు కనిపించేవి. ఇప్పుడు అలా కాదు. చక్కని భాషలో రాస్తుంది. కథలతో మెప్పిస్తోంది. జ్యోతిశ్రీ చిన్న అక్క దివ్యదర్శిని కూడా రచనలు చేస్తోంది. ఆటో డ్రైవర్‌గా తండ్రి పడుతున్న కష్టాలు, గృహిణిగా తల్లి వేదనకు కథా రూపం ఇచ్చింది. ఈ కథలకు జ్యోతిశ్రీ పెద్ద అక్క నర్మద బొమ్మలు వేసింది. వీరు మచ్చుకు కొద్దిమంది మాత్రమే. ఇంకా ఎంతోమంది ఉన్నారు.కథలు రాయడమే కాదు తమ వాక్చాతుర్యంతో ‘వన్నత్తు పూచ్చిగల్’ పేరుతో డిజిటల్ వేదికలపై కూడా సందడి చేస్తున్పారు. తమ అనుభవాలు, స్నేహితుల అనుభవాలు, ఎక్కడెక్కడో విన్న కథలను వినసొంపుగా చెబుతున్నారు. వారి మాటల్లో వినోదమే కాదు విజ్ఞానం, సామాజిక స్పృహ కూడా ఉంటాయి.కళల వెలుగులో..కళ అనేది కేవలం వినోదం కాదని భవిష్యత్ తరాలకు దిక్సూచి అని నిరూపిస్తున్నాడు ఎల్ థామస్. ‘వన్నత్తు పూచ్చిగల్’ ప్రభావంతో చదువులో వెనకబడిన పిల్లల్లో ‘బాగా చదువుకోవాలి’ అనే పట్టుదల పెరిగింది. తమకు ఇష్టమైన కళలో అక్షరాభ్యాసం చేసి ప్రతిభ చాటుకుంటున్నారు. – అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై(చదవండి: మేకప్ వేసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చెయ్యకండి..) -
ప్రభుత్వ ప్రోత్సాహం తోడై.. ఆత్మ విశ్వాసం నీడై
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడైంది. దానిని అందిపుచ్చుకుంటూ వారంతా ఆత్మ విశ్వాసంతో నిలబడుతున్నారు. నాలుగున్నరేళ్లలో విభిన్న ప్రతిభావంతుల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్ర జనాభాలో 2.23 శాతం (సుమారు 11.04లక్షలు) మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. వివిధ వైకల్యాలతో బాధపడుతున్న 21 రకాల వారిని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారంతా సమాజంలో నిలదొక్కుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వీరంతా స్వయం ప్రతిపత్తి, సాధికారత సాధించేలా.. ప్రతిభావంతులుగా నిలబెట్టేందుకు కృషి చేస్తోంది. ప్రత్యేకంగా విద్య, ఉద్యోగం, ఉపాధి కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టింది. వారి సమస్యలు గుర్తించి పరిష్కరించే దిశగా రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, వయో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి సలహా మండలిని నియమించింది. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలను సైతం ఏర్పాటు చేసింది. విభిన్న ప్రతిభావంతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా ప్రతి శాఖలోను ప్రత్యేక అధికారిని నియమించింది. ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో వారికి 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ స్టేట్, సబార్డినేట్ రూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. వైకల్యం ఉందన్న కారణంతో వారికి పదోన్నతి నిరాకరించడం, ఉన్న పోస్టు నుంచి తగ్గించడం, తొలగించడం చేయకూడదని ప్రభుత్వం అన్ని శాఖలకూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సదరం ద్వారా వైకల్యం ధ్రువీకరణ పత్రాలు అందించడాన్ని సైతం సులభతరం చేసింది. ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో వారికి 5 శాతం రిజర్వేషన్ కల్పించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సైతం గరిష్టంగా ఐదేళ్ల వయోపరిమితిని సడలించింది. దీంతోపాటు విద్యాలయాలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలకు విభిన్న ప్రతిభావంతులు వెళ్లి వచ్చేందుకు ఎటువంటి అవాంతరాలు (అడ్డంకులు) లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. పెద్ద మనసుతో ఎన్నో చర్యలు రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద మనసుతో అనేక చర్యలు చేపట్టారు. ఈ ఏడాది 1,750 మూడు చక్రాల మోటార్ సైకిళ్లు, అనేక సహాయక పరికరాలు అందించాం. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో వారికి సీట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు, బడికి వెళ్లేలా సౌకర్యాలు కల్పించాం. చెవిటి, మూగ వారికి, అంధ విద్యార్థులకు 640 మందికి ప్రత్యేకంగా ఆరు ప్రత్యేక విద్యాసంస్థల్ని నిర్వహిస్తున్నాం. జగనన్న వసతి దీవెన, స్కాలర్షిప్లు అందిస్తున్నాం. ప్రత్యేక భర్తీతో 691 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. – కేవీ ఉషశ్రీ చరణ్, మహిళా, శిశు, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల శాఖ మంత్రి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది విభిన్న ప్రతిభావంతులను అన్నివిధాల ఆదుకోవడంలో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమంలో వారి పట్ల వైఎస్ జగన్ అభిమానం చాటుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవులు 15 రోజులు ఉంటే.. విభిన్న ప్రతిభావంతులకు మరో 7 రోజులు అదనంగా స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సామాజిక భద్రత పెన్షన్లు అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.4,201.26 కోట్లు కేటాయించింది. – బి.రవిప్రకాశ్‌రెడ్డి, సంచాలకుడు, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ -
విభిన్న ప్రతిభావంతులపై ఏపీ ప్రభుత్వం మరింత శ్రద్ధ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల పట్ల ప్రభుత్వం మరింత శ్రద్ధ వహిస్తోంది. వారి ప్రత్యేక హాస్టళ్లు, పాఠశాలలకు తాజా బడ్జెట్‌లోను తగినంత నిధులు కేటాయించింది. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రభుత్వం 20 వసతి గృహాలు నిర్వహిస్తోంది. వాటిలో 1,675 మంది విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తోంది. బధిరుల కోసం బాపట్లలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహిస్తోంది. వాటిలో విజయనగరం, బాపట్ల, ఒంగోలులో బధిరులకు, విజయనగరం, విశాఖపట్నం, హిందూపురంలో అంధుల కోసం పాఠశాలలు నిర్వహిస్తున్నారు. వీటిని విభిన్న ప్రతిభావంతులకు అనుకూలంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంలోను వారి కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. బడ్జెట్లో ప్రాధాన్యం.. ►రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా వారికి అవసరమైన ఆసరా కల్పించేందుకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 4,201.26 లక్షలు కేటాయించారు. వారికి సబ్సిడీపై పరికరాలు, కృత్రిమ అవయవాలు, పునరావాసం, వైఎస్సార్ కళ్యాణమస్తు తదితర వాటి కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ►రాష్ట్రంలో అంధ, బధిర విద్యార్థుల కోసం నిర్వహించే పాఠశాలలకు రూ. 973.02 లక్షలు, బాపట్లలోని బధిరుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు రూ. 45.67 లక్షలు కేటాయించారు. ►విభిన్న ప్రతిభావంతుల క్రీడా ఉత్సవాలను నిర్వహించేందుకు రూ. 25 లక్షలు కేటాయించారు. ►నిపుణులతో 300 మందికి కోచింగ్ ఇచ్చి పోటీ పరీక్షలకు విభిన్న ప్రతిభావంతులను సన్నద్ధం చేసేలా విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్న స్టడీ సర్కిల్‌కు రూ. 20 లక్షలు కేటాయించారు. ►అనంతపురం, కాకినాడలలో అంధులకు హోమ్‌లు ఏర్పాటు చేసేందుకు రూ. 66.86 లక్షలు ప్రతిపాదించారు. చదవండి: సంతోష సూచీలో మనమెక్కడ.. మనకంటే మెరుగైన స్థానాల్లో పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ప్రభుత్వ పాఠశాలల్లోను సౌకర్యాలు రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కాలేజీలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ వారికి సౌకర్యాలు కలి్పంచేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దూర ప్రాంతాల్లో ఉండే ప్రత్యేక పాఠశాలలకు వెళ్లలేని వారికి స్థానిక బడుల్లోనే అడ్మిషన్ ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ పాఠశాల్లోని తరగతి గదుల్లో విభిన్న ప్రతిభావంతులకు సౌకర్యంగా ఉండేలా.. వీల్చైర్లు, నడిచి వెళ్లేందుకు వీలుగా ర్యాంపు వంటి నిర్మాణాలు చేపట్టారు. –బి.రవిప్రకాశ్‌రెడ్డి, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు -
అవకాశాల అవసరశాల
లాక్డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన పిల్లలను బిజీగా ఉంచడానికి నానా తంటాలు పడ్డారు తల్లిదండ్రులు. అశ్వతీ వేణుగోపాల్ మాత్రం పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా, సమయాన్ని సద్వినియోగం చేసే ‘అవసర శాల’నే ప్రారంభించింది. ‘‘పిల్లలు ఎక్కువగా ఆసక్తి కనబరిచే అంశాలు, వారిలో దాగున్న ప్రతిభను వెలికితీసే పోటీలు నిర్వహిస్తూ వారిని బిజీగా ఉంచడమేగాక, ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. అవసర శాల ఏర్పాటుకు ప్రేరణ ఇచ్చిన కెటిల్ సంస్థకే ఇండియా తరపున సభ్యురాలిగా ఎంపికైంది. లాక్డౌన్ కాలంలో ప్రారంభించిన చిన్న స్టార్టప్‌తో అతికొద్దికాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అశ్వతి గురించి ఆమె మాటల్లోనే... ‘‘కేరళలోని మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని నేను. అందరిలాగే కష్టపడి ఇంజినీరింగ్ తరువాత ఎంబీఏ చేశాను. క్యాంపస్ సెలక్షన్స్ లో అమెజాన్‌లో ఉద్యోగం వచ్చింది. అయినా సంతృప్తిగా అనిపించలేదు. ఏదైనా ఫెలోషిప్ చేయాలనుకున్నాను. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ఫెలోషిప్స్ గురించి తెగ వెతికాను. అప్పుడు నాకు చాలా ఫెలోషిప్స్ కనిపించాయి. నూటపది దేశాల్లోని 17 నుంచి 26 ఏళ్ల యువతీ యువకుల ప్రతిభను ప్రోత్సహించే స్వచ్ఛంద సంస్థ... ‘నోవెల్స్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లీడర్షిప్(కేఈసీటీఐఎల్– కెటిల్)’లో యూత్ప్రోగ్రామ్ ఫెలోషిప్ చేయడానికి అవకాశం లభించింది. ఏడాదిపాటు ఆన్లైన్ ప్రోగ్రామ్ జరిగింది. 2019 జూన్‌లో అట్లాంటాలో వారం రోజుల పాటు జరిగే లీడర్షిప్ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 27 మందిలో నేను కూడా ఉన్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో చాలా మంది చేంజ్ మేకర్లు, ఎంట్రప్రెన్యూర్లు, సామాజిక సేవాకార్యకర్తలు ఉన్నారు. వీళ్లంతా ఏదో ఒకటి సాధించి వచ్చినవారే. 17–20లోపు వాళ్లు వచ్చి వారు ఏమేం చేస్తున్నారో, సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నారో చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను నేను కూడా ఏదో ఒకటి చేయాలని. అవసరశాల అట్లాంటా నుంచి ఇండియా వచ్చిన తరువాత చాలా ఆలోచించాను. అతి చిన్న వయసులో అనేక దేశాల్లోని పిల్లలు వివిధ రంగాల్లో ఎదిగి చూపిస్తున్నారు. కెటిల్ వేదికగా అవన్నీ ప్రత్యక్షంగా చూశాను. ఇండియాలో ఎంతోమంది ఉన్నారు. వారినెందుకు ఆ విధంగా తయారు చేయకూడదు అనిపించింది. అనుకున్న వెంటనే అమెజాన్‌లో ఉద్యోగం వదిలేశాను. నా భర్త సందీప్‌తో కలసి పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తేసేందుకు అనేక మార్గాలను అన్వేషించి 2020లో ‘అవసరశాల’ను ప్రారంభించాం. ఒకటోతరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్థానికంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పోటీల లిస్టు తయారు చేశాం. నవ్వుల పోటీ, ఫ్యాన్సీడ్రెస్, స్టోరీ టెల్లింగ్, గూగుల్ జూనియర్ కోడింగ్, నాసా స్పేస్ కాంటెస్ట్, జాతీయ, అంతర్జాతీయ స్కాలర్షిప్పులు, స్టూడెంట్ లీడర్ షిప్, అంతర్జాతీయ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్, అంతర్జాతీయ ఎస్సే కాంపిటీషన్స్, జాతీయ స్థాయి మ్యూజిక్ కాంపిటీషన్, డ్యాన్స్ ఫెలోషిప్స్, జూనియర్ ఫుట్‌బాల్ లీగ్, క్విజ్లు, ఒలింపియాడ్స్, అంతర్జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ వంటివన్నీ చేపడుతున్నాను. వీటిద్వారా పిల్లల్లో ప్రతిభను వెలికి తీస్తున్నాము. ‘విజ్‌కిడ్స్ చాలెంజ్’ పేరిట మరో కార్యక్రమాన్ని ప్రారంభించి ఆర్ట్, సైన్స్, లైఫ్ స్కిల్స్, కుకింగ్, ఫైనాన్స్, ఇన్నోవేషన్స్‌లో శిక్షణ ఇస్తూ లాక్డౌన్లో పిల్లల్ని బిజీగా ఉంచాం. దేశవ్యాప్తంగా వేలమంది విద్యార్థులకు వివిధ అంశాలు, ఫెలోషిప్స్‌పై అవగాహన కల్పించి వారిలోని ప్రతిభను వెలికి తీస్తున్నాము. దీంతో వాళ్లు భవిష్యత్‌లో ఏ రంగంలోనైనా రాణించగలరు. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే జీవితంలో ఎదుగుతామనడానికి నేనే ఉదాహరణ. లాక్డౌన్ మొదట్లో ప్రారంభించిన అవసరశాల బాగా క్లిక్ అవ్వడంతో మంచి ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగాను. కెటిల్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మార్టిన్ లూథర్ కింగ్–3 ‘‘వచ్చే ఐదేళ్లలో నువ్వు ఏం చేస్తావు?’’ అని నన్ను అడిగారు. అప్పుడు నేను ‘‘ఆరుగురి కంటె ఎక్కువమందికి ప్రేరణగా నిలుస్తాను’’ అని చెప్పాను ‘అవసరశాల’తో ఆరుగురు కాదు వేలమందిని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ నిరూపించే స్థాయిలో ప్రేరణ కలిగించాను. నా పనికి గుర్తింపుగా ఐకానిక్ ఉమెన్ ఆఫ్ 2020 అవార్డు, టాప్‌టెన్ సోషల్ ఇన్నోవేటర్, యూత్ కోలాబ్ నుంచి పీపుల్స్ చాయిస్ అవార్డులు వంటివెన్నో వరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికైన సభ్యుల్లో ఇండియా నుంచి నేను ఉండటం ఎంతో గర్వంగా ఉంది’’ అని చెబుతోంది అశ్వతి. -
సరిలేరు మీకెవ్వరూ..!
శ్రీకాకుళం న్యూకాలనీ: దివ్యాంగులు సకలాంగులకు ఏమాత్రం తీసిపోరని, ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తా రని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల మైదానంలో బుధవారం విభిన్న ప్రతిభావంతుల జిల్లాస్థాయి క్రీడా పోటీలు జరిగాయి. జిల్లా విభిన్నప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో సత్తాకలిగిన దివ్యాంగ క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పారా ఒలింపిక్స్ పోటీ ల్లో పాల్గొని పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఏడీ కె.జీవన్‌బాబు మాట్లాడుతూ ఇక్క డ రాణించిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అక్కడ రాణించి విజేతలగా నిలిస్తే జాతీయ పోటీలకు వెళ్లే అవకాశముందన్నారు.కార్యక్రమంలో జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.సుందరరావు, పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.రమణ, కార్య దర్శి ఎం.సాంబమూర్తి, కార్యనిర్వహణ కార్య దర్శి ఎస్.సూరిబాబు, వై.పోలినాయుడు, దివ్యాంగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఎంకే మిశ్రా, జిల్లా దివ్యాంగ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు, విభిన్న సంస్థల నిర్వాహకులు, పీఈటీలు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్.. అంతకుముందు కలెక్టర్ నివాస్ జాతీయ పతాకాన్ని ఎగురువేసి గౌరవ వందనం సమర్పించారు. ఏడీ జీవన్‌బాబు క్రీడల పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు బెలూన్లను నింగికి విడిచిపెట్టారు. 100 మీటర్ల ట్రైసైకిల్ రేస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి సుమారు 250 మంది విభిన్నప్రతిభావంతులు హాజరయ్యారు. ఎన్సీసీ క్యాడెట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు విభిన్న ప్రతిభావంతులకు అమూల్యమైన సేవలు అందించారు. కోలాహలంగా సాగిన పోటీలు.. 6 నుంచి 15 ఏళ్లలోపు జూనియర్స్ విభాగం, 15 ఏళ్లు పైబడినవారిని సీనియర్స్ విభాగంగా బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. టోటల్లీ బ్లైండ్, హియరింగ్, ఆర్థోపిడికల్లీ, మెంటల్లీ రిటార్డెడ్ కేటగిరీల్లో పోటీలు జరిగాయి. అథ్లెటిక్స్ ఈవెంట్స్‌లో రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్‌జంప్, జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రో, సాఫ్ట్బాల్త్రోలో పోటీలు నిర్వహించారు. ట్రైసైకిల్ రేస్తోపాటు చెస్, క్యారమ్స్, క్రికెట్, వాలీబాల్, సింగింగ్, నృత్యం తదితర అంశాలలో హుషారుగా పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ఒక వ్యక్తి రెండు ఈవెంట్స్లలోనే పాల్గొనాలని అధికారులు షరతు పెట్టడంతో కొంతమంది నిరాశ చెందారు. -
గీత మార్చుకున్న రేఖ
అమ్మానాన్న ఆమె తలరాత మార్చాలని ప్రయత్నించారు. నా రాత నేనే రాసుకుంటానని ఆమె ఇంట్లోంచి పారిపోయింది. తర్వాత ఏం జరిగింది?ఇప్పుడు ఏం జరగబోతోంది? టెన్త్, ఇంటర్ ఫలితాలు వచ్చినప్పుడు సాధారణంగా ఎప్పుడూ సక్సెస్ స్టోరీలే వినిపించేవి. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల్లోని బాలికలు ‘టెన్‌కి టెన్’ గ్రేడ్ సాధించడం స్ఫూరిమంతంగా ఉండేది. చెరకుబండి నడుపుతూ పిల్లల్ని చదివించినవాళ్లు, టీ కొట్టులో పని చేస్తూ బతుకు బండి నడిపినవాళ్లు.. ఇలాంటి ఫ్యామిలీల్లోని ఆడపిల్లలు అసాధారణమైన ప్రతిభ చూపినప్పుడు ముచ్చటేస్తుంది. ఎలా సాధ్యం ఈ పిల్లలకు అనిపిస్తుంది! వేళకు తిండి ఉండదు. చదువుకోడానికి ఇంట్లో చోటు ఉండదు. ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు. కొత్త బట్టలన్నవే ఉండవు. ఇంట్లో ఒకరికి ఆరోగ్యంగా ఉండదు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని, కష్టపడి చదివి, మంచి ర్యాంకుతో పాస్ అవడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చదువుపై ఇష్టం, జీవితంలో చక్కగా స్థిరపడి అమ్మానాన్నను, అక్కచెల్లెళ్లను, అన్నదమ్ముల్ని బాగా చూసుకోవాలన్న తపన అమ్మాయిల చేత ఇలా గొప్ప విజయాలను అచీవ్ చేసేలా ప్రేరేపిస్తుందని వాళ్ల సక్సెస్ స్టోరీలు పేపర్లలో చదివినప్పుడు తెలుస్తుంది. ఈ ఏడాది కూడా ఇలాంటి స్టోరీలు తప్పకుండా ఉండే ఉంటాయి కానీ, మార్కుల జాబితాల్లోని పొరపాట్ల వల్ల ఫెయిలయిన, ప్రాణాలు కోల్పోయిన విద్యార్థినీ విద్యార్థుల దురదృష్టకర, విషాదాంత కథనాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఈ ఏడాది ఇంటర్లో 90 శాతం స్కోర్ చేసిన రేఖ అనే విద్యార్థిని సక్సెస్ స్టోరీ కాస్త ఊరటను, ఉత్సాహాన్ని ఇస్తోంది. అయితే రేఖ సక్సెస్ కేవలం మార్కులకు మాత్రమే సంబంధించినది కాదు. జీవితంలోని పరిస్థితులతో పోరాడి గెలిచింది రేఖ.రేఖ వయసు ప్రస్తుతం 18 ఏళ్లు. నేలమంగళలోని ప్రీ–యూనివర్సిటీ ప్రభుత్వకళాశాలలో చదువుతోంది. ఈ ఇయర్ ఇంటర్ పూర్తి చేసింది. 600కి 542 మార్కులు వచ్చాయి. ఎస్.ఎస్.ఎల్.సి. (టెన్త్)లో కూడా ఆమె 74 శాతం స్కోర్ చేసింది. చిన్నప్పట్నుంచీ బ్రిలియంట్ స్టూడెంటే. టెన్త్ అయ్యాక ఇంటర్ అనుకుంది తను. కానీ టెన్త్ అయ్యాక పెళ్లి అనుకున్నారు తల్లిదండ్రులు. ‘‘పెళ్లి వద్దు. చదువుకుంటాను’’ అంది. తల్లిదండ్రులు వినలేదు. సంబంధాలు తేవడం మొదలుపెట్టారు. ఇంట్లోంచి పారిపోయి బెంగుళూరు వెళ్లిపోయింది. రేఖవాళ్లు ఉండడం మైసూర్లో. బెంగుళూరు వెళ్లిన పిల్ల మళ్లీ మైసూరు రాలేదు. అక్కడ ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకుంది. చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1098కి ఫోన్ చేసి వారి సహాయం పొందింది. కంప్యూటర్ కోర్సులో చేరింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ల సహాయంతో ఇంటర్లో చేరింది. చక్కగా చదువుకుని తనకు ఆశ్రయం ఇచ్చిన, సహకారం అందించిన వారందరి నమ్మకాలను నిలబెట్టింది. అమ్మానాన్న నిర్ణయం తప్పని నిరూపించింది. అయితే రేఖ ఇక్కడితో ఆగిపోవడం లేదు. ఆగే అమ్మాయే అయితే రెండేళ్ల క్రితం ఇంట్లోనే ఆగిపోయేది. ఇప్పుడు డిగ్రీలో చేరుతోంది. హిస్టరీ, ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్ రేఖకు ఇష్టమైన సబ్జెక్టులు. డిగ్రీలో వాటినే తీసుకుంటోంది. ‘లా’కూడా చదివి, ఆ తర్వాత సివిల్స్‌కి కూర్చోవాలని అనుకుంటోంది. -
గుళు గుగ్గుళు
ఒకనాడు భోజరాజు వేటకు అడవికి వెళ్లాడు. చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. బాగా దాహంగా అనిపించడంతో సమీపంలోని కొలను వద్దకు వెళ్లి నీళ్లు తాగాడు. కొలను గట్టునే ఉన్న నేరేడు చెట్టు కింద నీడలో విశ్రమించాడు. ఆ చెట్టు కొమ్మలు కొన్ని కోనేటి మీదకు వంగి ఉన్నాయి. కొమ్మల నిండా పండిన నేరేడు పండ్లున్నాయి. కొన్ని కోతులు ఆ కొమ్మల పైకెక్కి వాటిని వినోదంగా ఊపుతుంటే పండిన నేరేడు పండ్లు ఉన్నాయి. కొన్ని కోతులు ఆ కొమ్మల మీదకు చేరి ఆటలు ప్రారంభించాయి. కొమ్మలను ఊపి వినోదించసాగాయి. అవి కొమ్మలను ఊపినప్పుడు కొమ్మలకు వేలాడుతూ ఉన్న పండ్లు రాలి నీట్లో పడుతుంటే ‘గుళు గుగ్గుళు’ అంటూ శబ్దం వస్తుండటాన్ని చెట్టు నీడనే విశ్రమించిన భోజరాజు విన్నాడు. కాసేపు చెట్టు నీడనే విశ్రమించిన తర్వాత తిరిగి రాజధానికి చేరుకున్నాడు.మరునాడు సభ కొలువుదీరినప్పుడు భోజరాజుకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ముందురోజు తాను అడవిలో చెట్టునీడన విశ్రమిస్తున్నప్పుడు కోతుల అల్లరి కారణంగా నేరేడు పండ్లు నీళ్లలో పడగా వినిపించిన శబ్దాన్ని సమస్యగా ఇస్తే తన ఆస్థానంలోని కాళిదాసాది కవుల్లో ఎవరు ఎలా పూరిస్తారో చూడాలనుకున్నాడు. వెంటనే ఆస్థాన కవులను ఉద్దేశించి ‘గుళు గుగ్గుళు గుగ్గుళు’ అని పలికి, ‘ఈ సమస్యను పూరించండి’ అని అడిగాడు. ఆస్థాన కవుల్లో చాలామంది ఇదేదో అర్థంలేని సమస్య ఇచ్చి రాజుగారు తమను ఆటపట్టించాలని అనుకుంటున్నట్లు తలచారు. సమస్య పూరణకు వారు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. కొందరికి విషయం అర్థంకాకపోయినా, ఏదో ప్రయత్నించి తమకు తోచిన విధంగా పూరించారు. వారి పూరణలేవీ భోజరాజుకు నచ్చలేదు. అప్పుడాయన కాళిదాసును చూసి ‘మహాకవీ! ఈ సమస్యను మీరు పూరిస్తే వినాలని ఉంది’ అని అడిగాడు. వెంటనే కాళిదాసు.. ‘జంబూ ఫలాని పక్వాని/ పతంతి సరసీజలే/కపి కంపిత శాఖాభ్యో/గుళు గుగ్గుళు గుగ్గుళు/’ అని పూరించాడు. నేరేడు కొమ్మలను కోతులు కదిలిస్తే, కొమ్మల నుంచి పండ్లు రాలి కొలనులో పడ్డప్పుడు వచ్చే శబ్దమే ‘గుళు గుగ్గుళు’ అని అర్థం. అడవిలో తాను చూసిన దృశ్యాన్ని అంత కచ్చితంగా కళ్లకు కట్టినట్టు వర్ణించిన కాళిదాసు ప్రతిభకు భోజరాజు ఆనందభరితుడై, మహాకవిని కానుకలతో సత్కరించాడు. - ఈదుపల్లి వెంకటేశ్వరరావు -
చిన్నప్పటి నుంచే ఆ అలవాటుంది
సామాజిక సేవ సంతోషాన్నిస్తుందని చెన్నై చంద్రం సమంత పేర్కొన్నారు. త్వరలో ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడబోతున్న ఈ లక్కీబ్యూటీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంటూ తనకు సామాజిక సేవాదృక్పథం అధికం అన్నారు. చిన్నతనం నుంచే ఇతరులకు సాయం చేసే అలవాటు ఉందన్నారు. ఇప్పుడు నటిగా చాలా సంపాదిస్తున్నానని.. నిజానికి తాను నటిగా ఈ స్థాయికి ఎదుగుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. తన బుద్ధిశాలితనమో, ప్రతిభనో డబ్బు సంపాదించపెట్టలేదన్నారు. తనకంటే ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారని అన్నారు. అదృష్టమే తననీ స్థాయిలో కూర్చోబెట్టిందని అన్నారు. తననీ స్థాయిలో నిలబెట్టిన సమాజానికి ఏమైనా చేయాలన్న సేవాభావంతోనే ప్రత్యూష ఫౌండేషన్‌ను నెలకొల్పానన్నారు. దీని ద్వారా నిరుపేదలకు సాయాన్ని, విద్యాదానాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దానిలో ఒక భాగాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగించాలన్నారు. నటిగా తనను పలువురు అభినందిస్తున్నారని.. అది ఆ సమయంలో సంతోషాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. ఇ తరులకు సాయం చేయడం, పేదల కోసం పాటుపడడం వల్ల కలిగే సంతోషం జీవితాంతం ఉంటుందని సమంత పేర్కొన్నారు. అందుకే తన జీవితంలో సామాజిక సేవాకార్యక్రమాలను ఒక భాగంగా ఆచరిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు ఈ బ్యూటీ. -
ఎస్బీఐకి తగిన ప్రతిభావంతులున్నారు!
వారసులపై అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్య ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్‌గా సెప్టెంబర్‌లో తన పదవీ బాధ్యతల కాలం పూర్తయిన తరువాత , ఆ పగ్గాలు చేపట్టేందుకు తగిన ప్రతిభావంతులు బ్యాంకు అధికార క్రమంలో ఉన్నారని చైర్మన్ అరుంధతీ భట్టాచార్య గురువారం పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో పదవీ కాలం పూర్తవుతుండడం, మరో సంవత్సరం పాటు ఆమె పదవీకాలాన్ని పొడిగించే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అరుంధతీ భట్టాచార్య ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎస్బీఐలో చైర్మన్ స్థాయిలో సమర్థంగా పనిచేయగలిగినవారు ఎందరో ఉన్నారు. ఈ విషయంలో కొందరు ఎందుకు సందేహాలతో ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. -
ఫలితాల్లో ‘ప్రభుత్వ’ జోరు
నిజామాబాద్ అర్బన్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. 68 శాతం మంది ఉత్తీర్ణులయ్యూరు. గతేడాదికంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది 62.64 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో 4,283 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,921 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇం దులో బాలురు 1,997 మంది పరీక్షలు రాయగా 1,220 పాసయ్యూరు. ఉత్తీర్ణత శాతం 61.09గా నమోదయ్యింది. బాలికలు 2,286 మంది పరీక్షలు రాయగా 1,701 ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 74.41. మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల 93.18 శాతం తో మొదటి స్థానంలో నిలిచింది. మద్నూరు జూనియర్ కళాశాల 91.29 శాతంతో రెండో స్థానం పొందింది. జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 91.13 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో మూడో స్థానంలో నిలిచింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదయ్యూంది. ఇక్కడ 6.58 శాతం విద్యార్థులే పాసయ్యూరు. ఒకేషనల్ విభాగం జిల్లాలో ఒకేషనల్ విద్యార్థులు 73.02 శాతం ఉత్తీర్ణులయ్యూరు. గతేడాది ఉత్తీర్ణత శాతం 52గా నమోదయ్యింది. జిల్లా వ్యాప్తంగా 341 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 249 మంది ఉత్తీర్ణులయ్యారు. కోటగిరి కళాశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. బాల్కొండ 94.44 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో ఉంది. ఆ ర్మూర్ బాలుర ఒకేషనల్ కళాశాలలో ఒక్క వి ద్యార్థి మాత్రమే ఉండగా.. జీరో శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. నిజామాబాద్ బాలుర కళాశాలలో 72 మందికిగాను 29 మంది పాసయ్యా రు. 40.28 శాతం ఉత్తీర్ణత నమోదయ్యిం ది. ఎయిడెడ్ కళాశాలల్లో.. ఈ ఏడాది ఎయిడెడ్ కళాశాలల్లో జిల్లావ్యాప్తంగా 142 మంది పరీక్షలకు హాజరు కాగా 21 మంది విద్యార్థులే ఉత్తీర్ణులయ్యూరు. 15 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలురు 100 మంది పరీక్షకు హాజరు కాగా 11 మంది, బాలికలు 42 మంది పరీక్ష రాయగా 10 మంది పాసయ్యారు. గతేడాది 18 శాతం ఉత్తీర్ణులయ్యూరు. కామారెడ్డి ఎరుుడెడ్ కళాశాలలో 31.48 శాతం, ఆదర్శ హిందీ మహావిద్యాలయంలో 13.73 శాతం, సీఎస్ఐ జూనియర్ కళాశాలలో 5.3 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. సీఎస్ఐ జూనియర్ కళాశాలలో 56 మంది విద్యార్థులకుగాను ముగ్గురు మాత్రమే పాసయ్యూరు. గురుకులాల్లో.. జిల్లాలోని గురుకుల కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాలో 666 మంది గురుకుల విద్యార్థులు పరీక్షలు రాయగా 593 మంది ఉత్తీర్ణులయ్యారు. 89.04 ఉత్తీర్ణత శాతం నమోదయ్యింది. పోచారంపాడ్, ధర్మారం, బ్రాహ్మణపల్లిలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదరుు్యంది. సుద్దపల్లిలో 98.61 శాతం, భిక్కనూరులో 98. 68 శాతం, ఉప్పల్వాయిలో 98.28 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాన్సువాడ గురుకుల పాఠశాలలో అతి తక్కువగా 43.24 శాతమే ఉత్తీర్ణులయ్యూరు. జిల్లాలో గల ఏకైక ట్రైబల్ కళాశాల (గాంధారి)లో 31 మందికిగాను 31 మంది ఉత్తీర్ణులయ్యారు. ‘ఆదర్శ’లో.. ఆదర్శ కళాశాలల్లో 68.31 శాతం ఉత్తీర్ణత నమోదరుు్యంది. జిల్లాలో 16 పాఠశాలలు ఉండగా 506 మంది పరీక్షలకు హాజరయ్యూరు. ఇందు లో 346 మంది పాసయ్యూరు. డిచ్పల్లి ఆదర్శ పాఠశాలలో 44 మంది పరీక్షలు రాయగా 42 మంది(95.45 శాతం) ఉత్తీర్ణులయ్యూరు. సదాశివనగర్ ఆదర్శ పాఠశాలలో 38 మం దికాగాను 35 మంది(92.11శాతం), మేనూ రు ఆదర్శ పాఠశాలలో 27 మందికిగాను 24 మంది(88.89 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అతి తక్కువగా జక్రాన్‌పల్లి ఆదర్శ పాఠశాల లో 39 మందికిగాను 8 మంది విద్యార్థులే పాసయ్యూరు. ఇక్కడ ఉత్తీర్ణత 20.51 శాతం గా నమోదరుు్యంది. -
ప్రతిభకు తగిన గుర్తింపు... ఆశలు ఫలిస్తాయి... ప్రయత్నాలు కలిసి వస్తాయి
మేషం: ఈ రాశివారికి ప్రథమార్ధంలో కన్నా ద్వితీయార్థంలో బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగులకు ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో అసంతృప్తి ఉండి, కొత్త కంపెనీలో మారాలనుకునేవారి ప్రయత్నాలు జూన్ 19 తర్వాత సఫలమవుతాయి. ఈ లోగా ఉన్న ఉద్యోగంలోనే ఉండటం మంచిది. పోటీ పరీక్షలు రాసేవారికి ఇది మంచి సమయం. పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నవారికి దిగువ స్థాయి వారి నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు. జూన్ వరకు షేర్‌మార్కెట్ లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం. శుభకార్యాలకు, ధార్మిక కార్యాలకు ధనం ఖర్చు చేయవలసి రావడం వల్ల డబ్బుకు కటకటలాడాల్సిన పరిస్థితి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం ఉత్తమం. స్త్రీలకు తమ జీవిత భాగస్వామి నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొనవలసి రావచ్చు. లవర్స్ మధ్య గొడవలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. పాతస్నేహితుల స్థానంలో కొత్త స్నేహితులు వచ్చే అవకాశం. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశివారు నిత్యం దక్షిణామూర్తిని ధ్యానించడం వల్ల వ్యతిరేక ఫలితాలు తొలగి, శుభ ం జరుగుతుంది. వృషభం: వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూల సమయం. ఈ రాశిలో జన్మించిన వారి తండ్రికి ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, జీతభత్యాలలో పెరుగుద ల. పిల్లల కోసం ఎదురు చూసేవారి ఆశలు ఫలించి, సంతానవంతులవుతారు. ఉద్యోగులు జులై నుంచి విధులల అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రభుత్వోద్యోగులకు అప్రధానమైన శాఖకు మార్చడం లేదా దూరప్రాంతానికి బదిలీ అయే అవకాశం ఉంది. అంవలన పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనంతో వ్యవహరించడం మంచిది. విద్యార్థులకు ఇది మంచి సమయం. వారిలో అంతర్గతంగా ఉన్న ప్రతిభ వెలికి వ స్తుంది. వారి ప్రజ్ఞకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పోటీపరీక్షలు రాసేవారు విజయం సాధిస్తారు. ఈ రాశి వారి తలిదండ్రులకు కూడా బాగా కలిసి వస్తుంది. ఆస్తి సంబంధమైన వ్యవహారాలు లాభిస్తాయి. మరిన్ని అనుకూల ఫలితాల కోసం వీరు శుక్రజపం లేదా నవగ్రహ హోమం చేయించుకోవాలి. అనాథ కన్యలకి వివాహ ఖర్చులు భరించటం మరింత శుభఫలితాలనిస్తుంది.11 మంది కన్నెపిల్లలకు గాజులు, దుస్తులు దానం చేయడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. మిథునం: వీరికి ఈ సంవత్సరం ధనాభివృద్ధి జరుగుతుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు, స్టాక్మార్కెట్లో లాభాలు, ఆస్తుల విలువ అనూహ్యంగా పెరగటం వల్ల అధిక ధనాదాయం వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. కాంపిటీటివ్ పరీక్షలు రాసేవారికి, కొత్త వ్యాపారాలు చేసేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బదిలీ కోసం ప్రయత్నిస్తున్న వారికి కోరుకున్న చోటకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు పనిలో ఒత్తిడి, పై అధికారులతో చిక్కులు. పలురకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఆరోగ్యం చక్కబడుతుంది. జులై తర్వాత ఈ రాశివారి తలిదండ్రుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరిన్ని మెరుగయిన, అనుకూల ఫలితాల కోసం వీరు గణేశునిపూజించటం, అనాథాశ్రమాలకు, పేదలకు అన్నదానం చేయడం మంచిది. శ్రీ సూక్త పారాయణ చేయడం వల్ల ధనాదాయం కలుగుతుంది. కర్కాటకం: వీరికి జూన్ 19 వరకు పనుల ఒత్తిడి ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. పిల్లలు నిరుద్యోగులుగా ఉంటే కచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పిల్లలకు చేసే పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. అవివాహితులకు వివాహ ప్రాప్తి. సాంకేతిక రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. విదేశీ విద్య, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. జులై నుంచి ధనాదాయం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి, అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. జులై నుంచి రాహువు వక్రదృష్టి వలన ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. సంవత్సరం ద్వితీయార్ధం నుంచి ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. నవగ్రహ ఆరాధన, దుర్గామాతను పూజించటం, అనాథలకు బెల్లం పాయసం పంచిపెట్టడం, దేవాలయాల కొలనులోని చేపలకు గోధుమపిండితో చేసిన ఉండలు ఆహారంగా పెట్టడం వల్ల మరిన్ని సత్ఫలితాలను పొందవచ్చు. సింహం: ఈ రాశివారికి ఈ సంవత్సరం కుటుంబ కలతలు, బంధువులతో విభేదాలు, అనవసర వ్యయం అయ్యేందుకు అవకాశం ఉంది. అలాగే మానసిక వ్యధ, మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటాయి. పనుల ఒత్తిడికితోడు తమ పనిని ఎవరూ గుర్తించడం లేదన్న మనస్తాపం, ఆత్మన్యూనతాభావం కలుగుతాయి. జులై నుంచి కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. అంతవరకు ఇతరులతో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి. మీడియా రంగంలో ఉన్నవారి ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది.పొగడ్తలకు పొంగిపోవటం ఈ రాశివారి సహజ స్వభావం కావడం వల్ల ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్య విషయాలలో అప్రమత్తత అవసరం. స్త్రీలకు పని చేసే చోట ఒత్తిళ్లు ఎదురవుతాయి. దీనికి అతిగా స్పందించకుండా చాకచక్యంగా, సంయమనంగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులకు కొంచెం కష్టకాలమనే చెప్పాల్సి ఉంటుంది. మరిన్ని అనుకూల ఫలితాల కోసం ఈ రాశివారు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మన్యసూక్త పారాయణం చేయించుకోవడం మంచిది. కన్య: ఈ రాశివారు సహజంగానే జాగ్రత్తపరులు, మంచి తెలివితేటలు కలిగి సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. జూన్ 19 వరకు ఆదాయంలో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఊహించినదానికన్నా అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.స్పెక్యులేషన్లు, స్టాక్‌మార్కెట్లు, లాటరీలలో లాభిస్తారు. సంతానవృద్ధి జరుగుతుంది. పిల్లల ఉద్యోగ, వివాహాలకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది.ఆరోగ్యపరంగా, కెరీర్‌పరంగా బాగుంటుంది. బంధువులతో, కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది.విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. పోటీపరీక్షలలో కష్టంతో విజయం సాధిస్తారు. ఈ రాశివారు రాహుజపం, సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయడం, దక్షిణామూర్తిని ఆరాధించటం వల్ల కలిసిస్తుంది. పేదవిద్యార్థులకు పుస్తకాలు కొనిపెట్టడం, ఫీజులు కట్టడం, పేదలకు అన్నదానం చేయడం వల్ల మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి. తుల: నవంబర్ 2014 నుంచి ఈ రాశివారికి మంచికాలంగా భావించవచ్చు. అధికశ్రమ, తక్కువలాభం, అవమానాలు, అనారోగ్య బాధలు వంటి వాటి నుంచి వీరు బయటకు వచ్చారు. అయితే కుటుంబ సౌఖ్యానికి దూరంగా ఉండటం, పని ఒత్తిడి, పని మీద ఆసక్తి లేకపోవటం, పని చేసే చోట అవమానాలు సంభవం. ధనవృద్ధి, ఉద్యోగులకు బోనస్, భార్యతరఫున ధనాదాయం లభిస్తాయి. జులై నుండి పిల్లల విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆస్తులు పెంపొదించుకుంటారు. పాత ఆస్తులు లేదా షేర్స్, స్టాక్స్ విలువ పెరగటం, ఉద్యోగులు తాము కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయే అవకాశం ఉంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రథమార్ధంలో కష్టంగా ఉన్నా, ద్వితీయార్ధంలో సెటిలవుతారు. నవగ్రహారాధన, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, శని జపం చేయించుకోవటం, కాకులకు తీపిపదార్థాలు తినిపించటం మంచిది. వృశ్చికం: ఈ రాశివారికి మానసిక సంఘర్షణ, అపవాదులు, అవమానాలు ఎదురయే అవకాశం ఉంది. అయితే బృహస్పతి వీరికి అనుకూలించటం వల్ల కష్టాలు వీరిని అంతగా బాధించవు. రాబడి పెరుగుతుంది. కీర్తి, సంఘంలో గౌరవం లభిస్తాయి. వీరు గతంలో కొన్న షేర్ల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. 2015 జూన్ వరకు ఈ రాశివారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆ తర్వాత బృహస్పతి స్థానం మార్చుకోవటం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు, ప్రభుత్వోద్యోగులకు అంతగా ప్రాముఖ్యంలేని శాఖకు లేదా దూరప్రాంతాలకు బదిలీ కావటం, షేర్ల ధరలు పడిపోవటం, ఆర్థికంగా దెబ్బతినటం వంటి పరిణామాలు సంభవిస్తాయి. స్త్రీలకు జీవిత భాగస్వామి నుంచి, పిల్లల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. పని ఒత్తిడి తప్పదు. విద్యార్థులకు కూడా కష్టకాలంగా చెప్పవచ్చు. విదేశాలలో చదువుకోవాలనుకునేవారి కోరిక జులై నుంచి నెరవేరుతుంది. ఏలినాటి శని దుష్ర్పభావం నుంచి తప్పించుకోవడానికి వీరు శనికి జపం చేయించాలి. అనాథలకు, వృద్ధులకు సాయం చేయాలి. నల్లకుక్కకు ఆహారం తినిపించాలి. ధనుస్సు: ఏలిననాటి శని ప్రభావం, అష్టమంలో బృహస్పతి సంచారం, రాహువు 10వ ఇంట సంచారం వల్ల ఈ రాశివారికి మనోవ్యాకులత, అనవసర విషయాలలో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటు, స్వంత వారినుంచి వ్యతిరేకత ఎదుర్కొనడం సంభవం. జూన్ వరకు ఖర్చులు ఎక్కువ అవడం వల్ల అప్పులు చేయవలసి రావచ్చు. ఆ తర్వాత బృహస్పతి సంచారం వలన ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగులకు ఇది మంచికాలం. ఉద్యోగంలో సౌకర్యాలు, వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తొందరపడి నోరు జారకుండా చూసుకోవటం అవసరం.విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దక్షిణామూర్తిని ఆరాధించటం, నవగ్రహ హోమం, శివాభిషేకం చేయించుకోవటం, గురువులను గౌరవించటం, సన్మానించటం, ఆవులకు సెనగలు తినిపించటం వల్ల చిక్కులు తొలగి, మంచి జరుగుతుంది. మకరం: వీరికి ఈ సంవత్సరం చాలా కలిసి వస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ధనసంపాదనకు అవకాశాలు సంభవం. అవివాహితులకు వివాహ యోగం, ఆస్తుల విలువ పెరుగుతుంది. జులై వరకు స్పెక్యులేషన్ వలన లాభపడతారు. ఆ తర్వాత ఆర్థిక విషయాలలో అప్రమత్తత అవసరం. సేవింగ్స్ పెరుగుతాయి. జీవిత భాగస్వామి వలన ధనం కలిసి వస్తుంది. మొత్తం మీద వీరికి ఈ సంవత్సరం ధనానికి లోటు ఉండదు. ఆస్తులు కొనే అవకాశంతోబాటు ఇతరులు వీరిని చూసి అసూయపడేటంతగా వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి చెందుతారు. ఉద్యోగులు ప్రమోషన్లు లభిస్తాయి. విద్యార్థులకు ఇది మంచి కాలం. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. మరిన్ని మంచి ఫలితాలు పొందాలంటే శనికి తైలాభిషేకం, దక్షిణామూర్తికి అభిషేకం, వృద్ధులకు అన్నదానం చేయడం మంచిది. కుంభం: ఈ రాశివారికి 6వ ఇంట బృహస్పతది, 10వ ఇంట శని సంచారం వలన తోటివారినుంచి, స్వంతవారినుంచే వ్యతిరేకత సంభవం.అనవసర విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల ఆరోగ్య భంగం కలగవచ్చు. అసంతృప్తికి గురి కావలసి వస్తుంది. వివాహితులు భర్తతోనూ, పిల్లలతోనూ ఓర్పుగా మెలగాలి. ఎప్పటినుంచో దాచుకున్న డబ్బు అంతా ఖర్చు అవుతుంది. షేర్లు, స్టాక్‌మార్కెట్ జోలికి వెళ్లకుండా ఉండటం ఉత్తమం. జులై నుంచి జీవిత భాగస్వామి ఆదాయం పెరుగుతుంది. పిల్లల వివాహ, ఉద్యోగ విషయాలలో చేసే ప్రయత్నాలు పురోగమిస్తాయి. విద్యార్థులు విదే శాలలో ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు జులై తర్వాత ఫలిస్తాయి. మెరుగైన ఫలితాల కోసం శనికి తైలాభిషేకం, ఈశ్వరారాధన, మన్యుసూక్త పారాయణం చేయించుకోవటం మంచిది. మీనం: వీరికి ఈ సంవత్సరం చాలా యోగదాయకమైనది. అన్నింటా అభివృద్ధి పథంలో నడుస్తారు. ఆర్థికంగా, కుటుంబపరంగా చాలా బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీపరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. ఊహించినదానికన్నా ఉన్నతమైన ఉద్యోగాలలో సెటిలవుతారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగం చేసే చోట గౌరవం లభిస్తుంది. అవివాహిత యువతులకు కల్యాణం సంభవం. సంతానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. యోగవంతమైన సంతానం లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలన్న వారి కోరిక ఫలిస్తుంది. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలంటే దక్షిణామూర్తిని ఆరాధించటం, గోవులకు సెనగలు తినిపించటం, పండితులు, గురువులను తగువిధంగా సత్కరించటం మంచిది.