గీత మార్చుకున్న రేఖ | Her Parents Tried to Change Fate | Sakshi

గీత మార్చుకున్న రేఖ

Published Sun, Apr 28 2019 12:24 AM | Last Updated on Sun, Apr 28 2019 12:24 AM

Her Parents Tried to Change Fate - Sakshi

అమ్మానాన్న ఆమె తలరాత మార్చాలని ప్రయత్నించారు. నా రాత నేనే రాసుకుంటానని ఆమె ఇంట్లోంచి పారిపోయింది. తర్వాత ఏం జరిగింది?ఇప్పుడు ఏం జరగబోతోంది?

టెన్త్, ఇంటర్‌ ఫలితాలు వచ్చినప్పుడు సాధారణంగా ఎప్పుడూ సక్సెస్‌ స్టోరీలే వినిపించేవి. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల్లోని బాలికలు ‘టెన్‌కి టెన్‌’ గ్రేడ్‌ సాధించడం స్ఫూరిమంతంగా ఉండేది. చెరకుబండి నడుపుతూ పిల్లల్ని చదివించినవాళ్లు, టీ కొట్టులో పని చేస్తూ బతుకు బండి నడిపినవాళ్లు.. ఇలాంటి ఫ్యామిలీల్లోని ఆడపిల్లలు అసాధారణమైన ప్రతిభ చూపినప్పుడు ముచ్చటేస్తుంది. ఎలా సాధ్యం ఈ పిల్లలకు అనిపిస్తుంది! వేళకు తిండి ఉండదు. చదువుకోడానికి ఇంట్లో చోటు ఉండదు. ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు. కొత్త బట్టలన్నవే ఉండవు. ఇంట్లో ఒకరికి ఆరోగ్యంగా ఉండదు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని, కష్టపడి చదివి, మంచి ర్యాంకుతో పాస్‌ అవడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.

చదువుపై ఇష్టం, జీవితంలో చక్కగా స్థిరపడి అమ్మానాన్నను, అక్కచెల్లెళ్లను, అన్నదమ్ముల్ని బాగా చూసుకోవాలన్న తపన అమ్మాయిల చేత ఇలా గొప్ప విజయాలను అచీవ్‌ చేసేలా ప్రేరేపిస్తుందని వాళ్ల సక్సెస్‌ స్టోరీలు పేపర్‌లలో చదివినప్పుడు తెలుస్తుంది. ఈ ఏడాది కూడా ఇలాంటి స్టోరీలు తప్పకుండా ఉండే ఉంటాయి కానీ, మార్కుల జాబితాల్లోని పొరపాట్ల వల్ల ఫెయిలయిన, ప్రాణాలు కోల్పోయిన విద్యార్థినీ విద్యార్థుల దురదృష్టకర, విషాదాంత కథనాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఈ ఏడాది ఇంటర్‌లో 90 శాతం స్కోర్‌ చేసిన రేఖ అనే విద్యార్థిని సక్సెస్‌ స్టోరీ కాస్త ఊరటను, ఉత్సాహాన్ని ఇస్తోంది.

అయితే రేఖ సక్సెస్‌ కేవలం మార్కులకు మాత్రమే సంబంధించినది కాదు. జీవితంలోని పరిస్థితులతో పోరాడి గెలిచింది రేఖ.రేఖ వయసు ప్రస్తుతం 18 ఏళ్లు. నేలమంగళలోని ప్రీ–యూనివర్సిటీ ప్రభుత్వకళాశాలలో చదువుతోంది. ఈ ఇయర్‌ ఇంటర్‌ పూర్తి చేసింది. 600కి 542 మార్కులు వచ్చాయి. ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. (టెన్త్‌)లో కూడా ఆమె 74 శాతం స్కోర్‌ చేసింది. చిన్నప్పట్నుంచీ బ్రిలియంట్‌ స్టూడెంటే. టెన్త్‌ అయ్యాక ఇంటర్‌ అనుకుంది తను. కానీ టెన్త్‌ అయ్యాక పెళ్లి అనుకున్నారు తల్లిదండ్రులు. ‘‘పెళ్లి వద్దు. చదువుకుంటాను’’ అంది. తల్లిదండ్రులు వినలేదు. సంబంధాలు తేవడం మొదలుపెట్టారు. ఇంట్లోంచి పారిపోయి బెంగుళూరు వెళ్లిపోయింది. రేఖవాళ్లు ఉండడం మైసూర్‌లో. బెంగుళూరు వెళ్లిన పిల్ల మళ్లీ మైసూరు రాలేదు.

అక్కడ ఫ్రెండ్‌ ఇంట్లో తలదాచుకుంది. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1098కి ఫోన్‌ చేసి వారి సహాయం పొందింది. కంప్యూటర్‌ కోర్సులో చేరింది. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ వాళ్ల సహాయంతో ఇంటర్‌లో చేరింది. చక్కగా చదువుకుని  తనకు ఆశ్రయం ఇచ్చిన, సహకారం అందించిన వారందరి నమ్మకాలను నిలబెట్టింది. అమ్మానాన్న నిర్ణయం తప్పని నిరూపించింది. అయితే రేఖ ఇక్కడితో ఆగిపోవడం లేదు. ఆగే అమ్మాయే అయితే రెండేళ్ల క్రితం ఇంట్లోనే ఆగిపోయేది. ఇప్పుడు డిగ్రీలో చేరుతోంది. హిస్టరీ, ఎకనమిక్స్, పొలిటికల్‌ సైన్స్‌ రేఖకు ఇష్టమైన సబ్జెక్టులు. డిగ్రీలో వాటినే తీసుకుంటోంది. ‘లా’కూడా చదివి, ఆ తర్వాత సివిల్స్‌కి కూర్చోవాలని అనుకుంటోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement