వారి కోసమే అమ్మాయిలు ‘ప్రేమ త్యాగం’
► ఇది భారత్‌లో సహజంగా జరిగేదేనన్న సుప్రీం
న్యూఢిల్లీ: అమ్మాయిలు తల్లిదండ్రుల కోసం ప్రేమను త్యాగం చేయటం భారత్‌లో సహజంగా జరిగేదేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 1995 నాటి ఓ కేసులో సుప్రీం ఇటీవల తీర్పునిచ్చింది. కేసు వివరాలు... రాజస్తాన్‌కు చెందిన ఓ యువకుడు, 23 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావటంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. రహస్యంగా వివాహం చేసుకుని వెంటనే చనిపోవాలని ఆ జంట నిశ్చయించుకుంది.
పెళ్లి చేసుకున్న వెంటనే ఇద్దరూ విషం తాగారు. అమ్మాయి చనిపోయింది. అబ్బాయి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆమె చావుకు కారణం ప్రేమికుడేనంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రయల్ కోర్టు, రాజస్తాన్ హైకోర్టు కూడా అతణ్ని దోషిగా తేల్చాయి. నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కేసును జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం విచారించింది. సాక్ష్యాలను, నిందితుడు చెప్పినదాన్ని బట్టి చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా ఈ పని చేసినట్లు లేదనీ, అమ్మాయి ఇష్టంతోనే ఇద్దరూ కలిసి ఈ కార్యానికి పూనుకున్నారని నిర్ధారించింది. కేసులో ప్రేమికుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఇష్టం లేకపోయినా భారత్‌లోని చాలామంది అమ్మాయిలు తమ ప్రేమను త్యాగం చేసి తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటున్నారంది.