లవింగ్‌ డాటర్స్‌ | Respect the childs wishes Guidance must be given | Sakshi
Sakshi News home page

లవింగ్‌ డాటర్స్‌

Published Mon, Jun 10 2019 2:14 AM | Last Updated on Mon, Jun 10 2019 5:04 AM

Respect the childs wishes Guidance must be given - Sakshi

అమ్మానాన్న తర్వాతే ఆడపిల్లలకు ఏదైనా! చిక్కేమిటంటే.. ప్రేమను కూడా వాళ్లు.. అమ్మలానో నాన్నలానో చూస్తారు. ప్రేమ అనే అమ్మ ఒడిలో సేద తీరుతారు. ప్రేమ అనే నాన్న భుజాలెక్కి ‘చల్‌ చల్‌ గుర్రం’ అంటారు. ప్రేమను అంతగా నమ్ముతుంది అమ్మాయి. అమ్మానాన్నే.. ప్రేమను అస్సలు నమ్మరు. కూతురిపై అంత ప్రాణం.

పరువునెక్కడ తోసేస్తుందోనని! పరువంటే అంత ప్రేమ.. ప్రాణాల్నెక్కడ తీసేస్తుందోనని! పెళ్లంటే.. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూస్తాం. తర్వాతేమౌతుందో మనం చూడబోయేది లేదు. ‘నీలాగే నన్ను చూసుకుంటాడు నాన్నా’ అని కూతురు నమ్మకంగా చెప్పినా కూడా.. పరువును పక్కన పెట్టి, కూతుర్ని దగ్గరకు తీసుకోలేమా?!

ఒక యేడాది కిందటో.. అంతకు ముందో స్టార్‌ గోల్డ్‌ సెలెక్ట్‌ అనే చానల్‌ ‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’ అనే పాట లైన్‌తో ఓ యాడ్‌ వీడియో తీసింది. టామ్మీ లమ్కిన్‌ అనే 41 ఏళ్ల విదేశీ మహిళను పెళ్లి చేసుకున్న 22 ఏళ్ల హితేశ్‌ చావ్డాను ‘క్రాస్‌ కాంటినెంటల్‌ కనెక్షన్‌’గా, మాధురి (ట్రాన్స్‌ జెండర్‌), జయ్‌ శర్మ జంటను ‘ట్రాన్స్‌ కన్వెన్షనల్‌ వాలంటెన్స్‌’గా సయ్యద్‌ అలీ, ఇందర్‌జిత్‌ నాగి (సేమ్‌ సెక్స్‌ లవ్‌) లను‘ పార్ట్‌నర్స్‌ ఇన్‌ ప్రైడ్‌’గా, అయిదుగురు మనమలు, మనమరాండ్ల తాత.. 76 ఏళ్ల మహేశ్‌ భై, తొమ్మిది మంది మనమలు, మనమరాండ్ల అమ్మమ్మ.. 65 ఏళ్ల రంజనా బెన్‌ల సహజీవననాన్ని ‘ఫుల్‌ టైమ్‌ లవ్‌ ఇన్‌ లవర్స్‌’గా, ఇద్దలు పిల్లల తల్లి అయిన జెన్ని ఫర్‌ బరూచా, ఓ బిడ్డ తండ్రి అయిన సందీప్‌ నైతానీని పెళ్లాడడం ‘సెకండ్‌ టైమ్‌ లక్కీ ఇన్‌ లవ్‌’గా, వరుణ్‌ షా, అలిషా అహ్మద్‌ అనే యువజంటను ‘ఇంటర్‌ ఫెయిత్‌ బ్యూస్‌’గా, యాసిడ్‌ అటాక్‌కు గురైన లలితా బన్స.

రవిశంకర్‌ అనే జంట ప్రేమను ‘సోల్‌ మేట్స్‌ బియాండ్‌ ఆర్డినరీ’ గా వర్ణించింది ఆ యాడ్‌! ఇప్పుడెందుకీ ప్రస్తావన? వాలంటైన్స్‌ డే ఎప్పుడో అయిపోయింది కదా! చిరాగ్గా ఐబ్రోస్‌ కలుసుకుంటాయని తెలుసు! కానీ సందర్భం ఉంది. మారుతీరావు దగ్గర్నుంచి నిన్నమొన్న హైదరాబాద్‌లో ఒక అన్న తన చెల్లెలు ఇష్టపడి పెళ్లిచేసుకున్న అబ్బాయిని నడి రోడ్డు మీద పొడిచి పొడిచి చంపడం వరకు.. యేడాది కాలంలో దాదాపు అరడజను ప్రేమ హత్యలు జరిగి ఉంటాయి. వాట్సాప్‌లో వైరల్‌ కాకుండా దాక్కున్న దారుణాలు ఇంకొన్ని ఉండొచ్చు! కులం, మతం, ప్రాంతానికి అతీతంగా జరిగినవే ఇవన్నీ! అంటే కులం, మతం కాదు ప్రాబ్లం.. ప్రేమ కదా సమస్య! కాదు... స్త్రీ! ఆమెకు మెదడు ఉండడం, ఆలోచించగలగడం, ఆమెకు అభిరుచి ఉండడం, ఆస్వాదించాలనుకోవడం! ఆమెకంటూ స్వంత వ్యక్తిత్వం ఉండాలనుకోవడం నచ్చని సమాజం చేసే ఘాతుకం అది.

అనాగరికం అని నిర్థారించిన కాలం నుంచి నాగరికం అనుకుంటున్న నేటి దాకా మార్పు రానిది.. రాలేనిది మహిళల విషయంలోనే. మారనిది.. ఆమెను ప్రాపర్టీగా చూస్తున్న అభిప్రాయమే! స్త్రీని సొంత ఆస్తిగా భావించడం వల్లే ప్రేమ హత్యలైనా.. దాడులైనా! అవును కుల వ్యవస్థను కాపాడుకోవడానికి వివాహ వ్యవస్థ ఎలా ఉపయోగపడుతోందో.. స్త్రీని ప్రాపర్టీగా స్థిరపర్చడానికి వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అలాగే తోడ్పడుతున్నాయని నిపుణుల అభిప్రాయం. ఆ మాటకొస్తే మన దగ్గర పిల్లలను పెద్దవాళ్లందరూ తమ ప్రాపర్టీగానే చూస్తారు.. ఇందులో అమ్మాయి, అబ్బాయి అనే వ్యత్యాసం లేదు అంటున్నారు కొందరు.నిజమే.. కాని మేజర్‌ అయ్యాక అబ్బాయి స్వతంత్రుడయి తన ఈడు అమ్మాయిని తన ఆస్తిగా పరిగణించే కోవలోకి వచ్చేస్తాడు అని వాదన లేకుండా ఒప్పుకుంటున్న వాళ్లూ ఎక్కువే.

అందుకే కుల, మత, ప్రాంతాలకతీతంగా తండ్రి, సోదరుడి చేతుల్లో ప్రేమ హత్యకు గురవుతోంది. తండ్రి, సోదరుడు, భర్త, కొడుకు సంరక్షణలో ఉంటోంది స్త్రీ ఓ ఆస్తిగా! ‘‘అబద్ధం ఎందుకు చెప్పావ్‌?’’ మెడిసిన్‌ చదువుతున్న కూతురిని గద్దిస్తాడు తండ్రి. ‘‘కాలేజ్‌కే కాదు.. హాలిడేస్‌లో హ్యాంగవుట్‌కీ వెళ్లాలనుంటుంది.. ఆడ, మగ ఫ్రెండ్స్‌తో! వాళ్లను ఇంటికి పిలవాలనుంటుంది.. కాని మీరు ఒప్పుకోరు. అందుకే అబద్దం చెప్పా. మీరు ఒప్పుకుంటే నిజమే చెప్పేదాన్ని... చెప్తా కూడా’’ అంటుంది ఆ అమ్మాయి ఏడుస్తూ! ఇది గల్లీ బాయ్‌ సినిమాలో డైలాగ్‌. అంటే ఏంటీ? పిల్లలు.. మెయిన్‌గా ఆడపిల్లలు ఆడింది ఆట, పాడింది పాటగా చూడమంటారా? కన్నెర్ర చేయకండి. ఆడపిల్లలే కాదు.. ఏ పిల్లల విషయంలో గుడ్డిగా ఉండమని ఎవరూ చెప్పరు! కాని మన కఠిన నిబంధనల వల్ల పిల్లలు మన కళ్లుగప్పే ప్రమాదం ఉందని సూచించడానికే పైన సన్నివేశం.

వాళ్లు వేసుకునే బట్టల దగ్గర్నుంచి చదువు, కెరీర్‌.. అమ్మాయిలకైతే కట్టుకోబోయే మొగుడిని కూడా మనమే నిర్ణయిస్తున్నాం. వాళ్లను ఇండివిడ్యువల్స్‌గా కాక డిపెండెంట్స్‌గా పెంచుతున్నాం. ఫ్రెండ్స్‌లా కాక బానిసలుగానే చూస్తున్నాం (తప్పు పట్టుకోకండి.. ఆలోచించండి.. ఎక్కువ శాతంగా ఉన్న పరిస్థితి గురించే). ఆ సినిమాలోని ఆ అమ్మాయి నిజాయితీని గ్రహించినట్టే.. మన పిల్లల్లోని నిజాయితీని గుర్తిస్తే.. వాళ్లకు బెత్తం పట్టుకున్న మాస్టర్‌లా దర్శనమివ్వకుండా హగ్‌ చేసుకునే ఫ్రెండ్‌లా కనిపిస్తాం. చనువుగా దగ్గర కూర్చుంటారు. చర్చిస్తారు. విశ్లేషణ నేర్చుకుంటారు. చేయబోయేది చెప్తారు. తల్లీదండ్రిని గైడ్‌లా చూస్తారు. కాలం మారింది. కానుగ బడులు లేవు (ఉండాలని ఉద్దేశం కాదు). కార్పోరేట్‌ స్కూల్స్‌ వచ్చాయి.ఇంటర్నేషనల్‌ సిలబస్‌ కరిక్యులమ్‌తో. సెల్‌ ఫోన్స్, వీడియో గేమ్స్‌.. పిజ్జాలు, బర్గర్స్,.. ఇంకా ఇతరత్రా ఆధునిక అలవాట్లకు వాళ్లను ఎక్స్‌పోజ్‌ చేస్తున్నాం.

పెద్దయ్యాక మంచి కెరీర్‌తో రూపాయిల్లో కాకుండా డాలర్స్‌ అండ్‌ పౌండ్స్‌లలో వాళ్ల సంపాదన ఉండాలని బలంగా కోరుకుంటున్నాం, ఇంత చక్కటి ఫౌండేషన్‌ వేస్తే ఉండకుండా పోతుందా అనీ అంతే బలంగా విశ్వసిస్తున్నాం! ఈ మొత్తం ప్రయాణంలో వాళ్లు ఎక్స్‌ప్లోర్‌ చేసుకున్న థింగ్స్‌ కూడా కొన్ని ఉంటాయి. కుల, మత, ఆస్తి, అంతస్థుల (ఇప్పుడైతే జెండర్‌ కూడా)ను చూడని ప్రేమ కుడా వాటిల్లో ఒకటి. పేరెంట్స్‌ అన్నిటికీ బాధ్యత వహించాలి. వాళ్ల ప్రేమకు కూడా. పెద్దల అభిప్రాయాన్ని గౌరవిస్తే ఓకే.. తమ అభిప్రాయానికే కట్టుబడి ఉన్నా ఓకే. భరోసా ఇస్తే సమస్యలను పరిష్కరించుకునే తెగువ చూపిస్తారు. భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దుకుంటారు. బెదిరిస్తే పారిపోతారు. వెంటబడి ప్రాణాలు తీస్తే మనక్కాకుండా పోతారు. అర్థంలేని జీవితాన్ని మనకు మిగిలిస్తారు.

పిల్లలు.. అందునా అమ్మాయిలు మన పరువు ట్యాగ్‌ను మోసే బ్యాగేజ్‌ కారు. మనకు ప్రేమను పంచే వారసులు. కులం, మతం, ఆస్తి, అంతస్తు, ప్రాంతాల మధ్య సరిహద్దులు చెరిపేసే వారధులు! పైన యాడ్‌ చెప్పే విషయం కూడా అదే! ఇద్దరు మనుషులు కలిసి ఉండడానికి కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు కాదు.. ప్రేమ ఉండాలి.. భిన్న మనస్తత్వాలను గౌరవించుకుని ముందుకు సాగే స్నేహం కావాలి. అన్నీ చూసుకొని సమ ఉజ్జీలమని నిర్ధారించుకున్న తర్వాత రెండు కుటుంబాలు కలిసి చేసిన పెళ్లిళ్లెన్నో విచ్ఛిన్నమైన ఉదాహరణలు బోలెడు. లక్షల్లో కట్నాలు తీసుకొని మోసం చేసి పోయిన భర్తలు.. దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని బిడ్డకు ఇవ్వలేక అదే పరువు పేరుతో నోట్లో భాధను కుక్కుకొని బయటి ప్రపంచానికి మొహం చూపించకుండా బతుకీడుస్తున్న తల్లిదండ్రులూ కోకొల్లలు. మంచిచెడులు అన్నిట్లో ఉంటాయి. పరువు అనే పురుగును పక్కన పెడితే... అంతా మనవాళ్లే. ఈగోను ఈగలా తోలేస్తే అంతా ప్రేమమయమే!
– సరస్వతి రమ

ఇండివిడ్యువల్‌గా పెంచాలి
పిల్లలను ఇండివిడ్యువల్‌గా పెంచడం చాలా ఇంపార్టెంట్‌. అల్లరి చేస్తుంటే భరించమని కాదు. సరిచేయాలి. కాని వాళ్ల అభిరుచులను.. అంటే చదువు, కెరీర్, లైఫ్‌ పార్ట్‌నర్‌ దాకా అన్నీ పెద్దవాళ్లే నిర్ణయిస్తున్నారు. ఇక్కడ పెద్దవాళ్లు రియలైజ్‌ కావాల్సింది ఏదీ పర్మినెంట్‌ కాదు అని. పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలి. గైడెన్స్‌  ఇవ్వాలి.

– స్వేచ్ఛ, అడ్వకేట్, హైదరాబాద్‌

మా నాన్న పెంచినట్టే నేనూ..!
స్వేచ్ఛ నా కూతురు. తన చిన్నప్పటి ఫ్రెండ్‌ గౌతమ్‌తో సహజీవనం చేద్దామనుకుంటున్నాను అని నాతో చెప్పినప్పుడు నేనేమీ ఆశ్చర్యపోలేదు. అది నా కూతురి వ్యక్తిగత విషయం. మా నాన్న మమ్మల్ని ఇండివిడ్యువల్‌గానే పెంచాడు. నేనూ నా కూతురిని అలాగే పెంచాను. తను సంతోషంగా ఉండడమే నాకు కావల్సింది. ఉంటుంది అన్న నమ్మకమూ ఉండింది. గౌతమ్‌ కూడా అడ్వకేట్‌. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఈగో కాదు ఫ్రెండ్‌షిప్‌. స్వేచ్ఛ, గౌతమ్‌ల మధ్య ఉన్నది అదే. ఈ ఫ్రెండ్‌షిప్‌ ఒకరిపట్ల ఒకరికి గౌరవాన్ని పెంచుతుంది. పెళ్లికి ముందు పరిచయం, స్నేహం, ప్రేమ లేకపోతే ఇది సాధ్యపడదని నా అభిప్రాయం.
– బి. జ్యోతి, ‘మహిళామార్గం’ పత్రిక ఎడిటర్,
(మానవ హక్కుల న్యాయవాది దివంగత పురుషోత్తమ్‌ రెడ్డి సహచరి)

ప్రాపర్టీ అనే భావనతోనే..!
పరువు హత్యలకు కారణాలుగా కులం, మతం బయటకు కనపడుతున్నాయి. కాని  మహిళను ప్రాపర్టీగా భావించడం వల్ల జరుగుతున్న దారుణాలు అవి. నేను హిందూ అమ్మాయిని (యెదుళ్ల జ్యోతి) పెళ్లి చేసుకున్నాను. మాకు ఇద్దరు కూతుళ్లు. ఇన్నేళ్లలో మా మధ్య మతం ఇష్యూయే కాలేదు. మా పిల్లల స్కూల్, కాలేజ్‌ అప్లికేషన్స్‌లో కూడా నేనెక్కడా మతాన్ని మెన్షన్‌ చేయలేదు. ఇండియన్‌ అనే రాశా. ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా వెనక్కి పోలేదు. పోరాడాను. నిన్న మా పెద్దమ్మాయి రోషిణీ జబీన్‌ పెళ్లి అయింది. ఫ్రాన్స్‌లో ఎమ్మెస్‌ చేసింది.

అక్కడే క్లాస్‌మేట్‌ (కర్ణాటకకు చెందిన అబ్బాయి)ను ఇష్టపడింది. మాకు చెప్పింది. ముందు నుంచీ మా పిల్లలను ఇండివిడ్యువల్స్‌గానే పెంచాం. ఏదైనా మాతో షేర్‌ చేసుకునే చనువిచ్చాం. అందుకే తన ప్రేమ విషయమూ చెప్పింది. మంచి చెడులు చర్చించాం. అబ్బాయీ వాళ్ల తల్లిదండ్రులతో చెప్పాడు. మా మతాంతర వివాహం గురించి ప్రస్తావించాం. ఒప్పుకున్నారు. స్టేజ్‌ మ్యారేజే చేస్తామన్నాం. దానికీ ఒప్పుకున్నారు. నిన్ననే అందరి ఆశీస్సులతో మ్యారేజ్‌ అయింది.
– మహ్మద్‌ వహీద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement