ఒకనాడు భోజరాజు వేటకు అడవికి వెళ్లాడు. చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. బాగా దాహంగా అనిపించడంతో సమీపంలోని కొలను వద్దకు వెళ్లి నీళ్లు తాగాడు. కొలను గట్టునే ఉన్న నేరేడు చెట్టు కింద నీడలో విశ్రమించాడు. ఆ చెట్టు కొమ్మలు కొన్ని కోనేటి మీదకు వంగి ఉన్నాయి. కొమ్మల నిండా పండిన నేరేడు పండ్లున్నాయి. కొన్ని కోతులు ఆ కొమ్మల పైకెక్కి వాటిని వినోదంగా ఊపుతుంటే పండిన నేరేడు పండ్లు ఉన్నాయి. కొన్ని కోతులు ఆ కొమ్మల మీదకు చేరి ఆటలు ప్రారంభించాయి. కొమ్మలను ఊపి వినోదించసాగాయి. అవి కొమ్మలను ఊపినప్పుడు కొమ్మలకు వేలాడుతూ ఉన్న పండ్లు రాలి నీట్లో పడుతుంటే ‘గుళు గుగ్గుళు’ అంటూ శబ్దం వస్తుండటాన్ని చెట్టు నీడనే విశ్రమించిన భోజరాజు విన్నాడు. కాసేపు చెట్టు నీడనే విశ్రమించిన తర్వాత తిరిగి రాజధానికి చేరుకున్నాడు.మరునాడు సభ కొలువుదీరినప్పుడు భోజరాజుకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ముందురోజు తాను అడవిలో చెట్టునీడన విశ్రమిస్తున్నప్పుడు కోతుల అల్లరి కారణంగా నేరేడు పండ్లు నీళ్లలో పడగా వినిపించిన శబ్దాన్ని సమస్యగా ఇస్తే తన ఆస్థానంలోని కాళిదాసాది కవుల్లో ఎవరు ఎలా పూరిస్తారో చూడాలనుకున్నాడు. వెంటనే ఆస్థాన కవులను ఉద్దేశించి ‘గుళు గుగ్గుళు గుగ్గుళు’ అని పలికి, ‘ఈ సమస్యను పూరించండి’ అని అడిగాడు.
ఆస్థాన కవుల్లో చాలామంది ఇదేదో అర్థంలేని సమస్య ఇచ్చి రాజుగారు తమను ఆటపట్టించాలని అనుకుంటున్నట్లు తలచారు. సమస్య పూరణకు వారు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. కొందరికి విషయం అర్థంకాకపోయినా, ఏదో ప్రయత్నించి తమకు తోచిన విధంగా పూరించారు. వారి పూరణలేవీ భోజరాజుకు నచ్చలేదు. అప్పుడాయన కాళిదాసును చూసి ‘మహాకవీ! ఈ సమస్యను మీరు పూరిస్తే వినాలని ఉంది’ అని అడిగాడు. వెంటనే కాళిదాసు.. ‘జంబూ ఫలాని పక్వాని/ పతంతి సరసీజలే/కపి కంపిత శాఖాభ్యో/గుళు గుగ్గుళు గుగ్గుళు/’ అని పూరించాడు. నేరేడు కొమ్మలను కోతులు కదిలిస్తే, కొమ్మల నుంచి పండ్లు రాలి కొలనులో పడ్డప్పుడు వచ్చే శబ్దమే ‘గుళు గుగ్గుళు’ అని అర్థం. అడవిలో తాను చూసిన దృశ్యాన్ని అంత కచ్చితంగా కళ్లకు కట్టినట్టు వర్ణించిన కాళిదాసు ప్రతిభకు భోజరాజు ఆనందభరితుడై, మహాకవిని కానుకలతో సత్కరించాడు.
- ఈదుపల్లి వెంకటేశ్వరరావు
గుళు గుగ్గుళు
Published Sun, Nov 11 2018 1:52 AM | Last Updated on Sun, Nov 11 2018 1:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment