మా మంచి నాన్న
ఫాదర్స్‌డే సందర్భంగా ప్రత్యేక కథనాలు
పెద్ద కొడుకుగా నా ఆశయం నెరవేర్చింది
డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తండ్రి భూంరెడ్డి
ముస్తాబాద్ : నాన్నంటే వేలు పట్టి నడిపించేవాడే కాదు.. కదిలే దైవం. వారి ఆశలు, ఆశయాలు నెరవేర్చే బాధత్య వారి కడుపులో పుట్టిన బిడ్డలది. తెలంగాణ తొలి ఉద్యమంలో కళ్లు తెరిచి, మలిదశ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పద్మాదేవేందర్‌రెడ్డి పోరుబాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభలో డెప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కొండం భూంరెడ్డి, విజయ దంపతుల పెద్ద కూతురు పద్మ. ఆమె గురించి తండ్రి భూంరెడ్డి మాటల్లోనే..
దూరభారం తగ్గించుకునేందుకు లేఖలతో దగ్గరయ్యేది
పద్మ నా పెద్ద కూతురు. తెలంగాణ తొలి ఉద్యమం జరుగుతున్న సమయంలోనే 6.01.1969లో పద్మ జన్మించింది. ఆమె తర్వాత అనిత, కొడుకు వంశీధర్‌రెడ్డి. చదువులో ఎప్పుడు ముందుండే పద్మ పట్ల నాకు కొద్దిగా ప్రేమ ఎక్కువే. ఏడు వరకు నామాపూర్‌లోనే చదివింది. ఎంతో చలాకీగా ఉండేది. స్కూల్లో భరతమాత వేషాలు వేసేది. అల్లూరిసీతారామరాజు ఏకపాత్రభినయంతో ఆకట్టుకునేది.
క్లాస్‌లో ఇతరుల కంటే ఒక్క మార్కు తక్కువ వచ్చినా పట్టుదలతో చదివి ఫస్ట్ వచ్చేది. నేను చెన్నూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు తరచూ నాకు పద్మ లేఖలు రాసేది. ఉత్తరాలతో కుటుంబ క్షేమ సమాచారాలు అందించేది. నా కొడుకు జబ్బుపడ్డప్పుడు పెద్ద కొడుకుగా వెన్నంటి నిలిచి మాకు ఓదార్పునిచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. అనుకున్న లక్ష్యం కోసం మొండిగా పనిచేసేది. తెలంగాణ తొలి శాసనసభకు డెప్యూటీ స్పీకర్ అయింది. తండ్రిగా ఇంతకంటే ఏం కావాలి. ఆడపిల్లను అనే భయం ఆమెలో ఏనాడు నేను చూడలేదు.
- కొండం భూంరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి తండ్రి
నాన్న లేఖలే పాఠాలయ్యాయి..
ఏడో తరగతి వరకు నామాపూర్‌లో చదివా. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వివిధ ప్రాంతాల్లో పనిచేసేవాడు. నాకేమో నాన్న దగ్గర ఉండాలని కోరిక. ఐదో తరగతిలో ఉన్నప్పుడే నాన్నకు లేఖలు రాసేదాన్ని. అమ్మ విజయ చెబుతుంటే నేను ఉత్తరాలు రాస్తూ, క్షేమ సమాచారాలు తెలుసుకునేదాన్ని. నాన్న రాసే లేఖల్లో ఎన్నో మంచి విషయాలు ఉండేవి. అమ్మ, చెల్లి, తమ్ముడిని బాగా చూసుకోవాలని, పట్టుదలతో చదవాలని చెప్పేవారు. అలా నాన్న ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తి చేశా. డిగ్రీ కాగానే దేవేందర్‌రెడ్డితో నిశ్చితార్థం చేశారు.
చదువుకోవాలన్న నా కోరికను నాన్న దేవేందర్‌రెడ్డితో చెప్పారు. పెళ్లైన అనంతరం న్యాయ శాస్త్రం చదివించారు. అప్పుడే మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా. ఎమ్మెల్యేగా తెలంగాణ బాధలను అసెంబ్లీలో వినిపించే అవకాశం వచ్చేది కాదు. ఇప్పుడు అదే అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర తొలిశాసనసభకు ఉపసభాపతిగా ఎన్నిక కావడం వెనుక తెలంగాణ ఉద్యమ నేపథ్యం, నాన్న పెంపకం, దేవేందర్‌రెడ్డి ప్రోత్సాహం ఉన్నాయి. బంగారు తెలంగాణ నిర్మాణంలో పాల్గొనడం నా ముందు ఉన్న సవాల్.
-పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనసభ డెప్యూటీ స్పీకర్
నాన్న నుంచి నేర్చుకున్నా..
నాన్నది అరుదైన వ్యక్తిత్వం. అంతకుమించి మాటకు కట్టుబడే వ్యక్తి. నాన్న గురించి చెప్పాలంటే నిజంగానే మాటలు రావడం లేదు. తండ్రిగా తను చేయాల్సిందంతా చేశారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంత మొండిగా వ్యవహరించారో అందరికి తెలిసిందే. తెలంగాణ రావడంతో ఎంతో ఆన ందంగా ఉంది. కేసీఆర్ తనయుడిగా ఈ జీవితానికి నాకిది చాలు. తండ్రి పేరు చెడగొట్టకుండా ఉండాలన్నదే నా లక్ష్యం. ప్రజాజీవితంలో ఎప్పుడూ బిజీగా ఉండే నాన్న మాకు తక్కువ సమయం కేటాయించారు. నిజంగానే ఇప్పుడు నేను అదే అనుభవిస్తున్నా. బిజీగా ఉండడమే దానికి కారణం. ప్రజల కోసం పని చేయాలన్న తత్వం నాన్నది. నాన్న ప్రభావం నాపై చాలానే ఉంది. అమ్మతో మేం ఎక్కువ గడిపేవాళ్లం. తండ్రిగా అన్ని బాధ్యతలు నెరవేర్చారు. నేనెంతో నేర్చుకున్నా. ఇంతకంటే ఏం చెప్పాలో మాటలు రావడం లేదు.
- సిరిసిల్ల