ambitions
-
అమ్మకు అర్థం కావట్లేదు
తల్లిదండ్రులకు పిల్లలే ప్రపంచం.. అదే ప్రాబ్లం!ప్రపంచాన్ని చూడరు.. ప్రపంచం ఎలా మారుతుందో చూడరు!పిల్లల్నే చూస్తారు.. పిల్లల్లో మార్పుని అర్థంచేసుకోరు!మార్కులు రాకపోతే పిల్లాడు ఫెయిల్ అయిపోతాడని భయం..నమ్మకం లేకపోతే పిల్లాడు ఫెయిల్ అవుతాడని అర్థం కాదు! పిల్లల సామర్థ్యానికి.. పేరెంట్స్ ఆకాంక్షలకు మధ్య నలిగిన నమ్మకం కథ ఇది... ‘‘ఏమండీ.. భోజనం చల్లారి పోతోంది త్వరగా రండి’’ మూడోసారి పిలిచింది సరళ.‘‘వస్తున్నా..’’ అంటూ బెడ్రూమ్లోంచి హాల్లోకి వచ్చాడు వసంత్. భర్త రావడం చూసి కంచంలో వడ్డంచ సాగింది సరళ. డైనింగ్ టేబుల్ కుర్చీని వెనక్కి జరుపుకొని కూర్చుంటూ ‘‘వాడేడీ?’’ అడిగాడు వసంత్.అబ్బాయి గది వైపు చూపిస్తూ సైగ చేసింది సరళ.. అక్కడున్నాడు అన్నట్టు.‘‘పిలువు’’ అన్నాడు అన్నంలోకి పచ్చడి కలుపుతూ.‘‘మీరే పిలవండి’’ భర్త కలుపుతున్న పచ్చడి అన్నంలోకి నెయ్యి వేస్తూ!‘‘ఏంటది చిన్నపిల్లలా? వెళ్లి పిలుచుకురా..‘‘ ఆజ్ఞాపించాడు భర్త. భయంగా, ఇబ్బందిగానే కొడుకు గదివైపు కదిలింది. పదహారేళ్ల అభయ్.. కంప్యూటర్లో మొహంపెట్టాడు సీరియస్‌గా. ‘‘భోజనానికి రా నాన్నా.. డాడీ వెయిట్ చేస్తున్నాడు’’గది గుమ్మంలోంచే పిలిచింది సరళ. లెక్కచేయలేదు వాడు.లోపలికి వస్తూ మంచమ్మీద పడున్న బట్టలు సర్దుతూ ‘‘అభయ్ నిన్నే.. భోజనానికి లే’’ అంది కాస్త గట్టిగానే. విసురుగా ఆమెను చూసి మళ్లీ కంప్యూటర్కేసి మొహం తిప్పుకున్నాడు. కింద అడ్డదిడ్డంగా పడి ఉన్న షూస్, సాక్స్, స్లిప్ప్లర్స్, బెల్ట్స్ తీసి ఎక్కడివక్కడ సర్దిపెడుతూ ‘‘అభయ్’’ అని కేకేసింది వాడు నిర్లక్ష్యం చేస్తున్నాడన్న అవమానంతో. వాడు స్పందించలేదు. ‘‘అభయ్ నిన్నే’’ అంటూ దగ్గరకు వెళ్లింది. ఆ స్వరంలో వినిపించిన కోపానికి డైనింగ్ హాల్ నుంచి గబగబా అభయ్ గదిలోకి వచ్చాడు వసంత్. తల్లి కళ్లల్లోకి అంతకన్నా కోపంగా చూస్తూన్న కొడుకు దగ్గరకు వచ్చి ‘‘రా నాన్నా.. భోంచేద్దాం..’’అనునయంగా అడిగాడు వసంత్. అసహనంతో చూశాడు కొడుకు. ‘‘హూ..’’ అంటూ చిరాగ్గా కుర్చీలోంచి లేచి తల్లినీ, తండ్రినీ తోసుకుంటూ హాల్లోకి వెళ్లాడు. మొహమొహాలు చూసుకొని వెనకాలే నడిచారు వీళ్లు. డైనింగ్ టేబుల్ కుర్చీని బర్రున వెనక్కి లాగి కుర్చీలో కూలబడ్డాడు అభయ్. కంచంలో అన్నం వడ్డించుకోసాగాడు. ‘‘నేను వడ్డిస్తా ఉండు నాన్నా... ఈలోపు నువ్వు చేతులు కడుక్కొని రా..’’ అంటూ వడివడిగా కొడుకు దగ్గరకు వచ్చింది సరళ.వసంత్ కూడా వచ్చి.. అభయ్‌కి ఎదురుగా కూర్చున్నాడు తన కంచం ముందు. ‘‘నా చేతులకేం? బాగానే ఉన్నాయి.. మీ మొహాల కన్నా’’ అన్నంలో చేయి మొత్తం పెడుతూ అభయ్. భర్తను చూసింది సరళ. ‘‘ఆవేశపడకు’’ అన్నట్టుగా కళ్లతో వారించాడు వసంత్. కూర వడ్డించింది సరళ. ఆ కూర మొత్తం అన్నంలోకి కసాపిసా కలుపుకొని నోట్లో కుక్కుకున్నాడు. నమిలి మింగనైనా లేదు ‘‘ఛీ.. ఇదేం కూర?’’ అంటూ ఊసేసాడు. ఆ మెతుకులు తండ్రి కంచంలో పడ్తున్నాయన్న స్పృహ కూడా లేకుండా. ‘‘ఏమైందిరా? నీకిష్టమైన బెండకాయవేపుడే కదా?’’ అంది సరళ బిత్తరపోతూ.‘‘దీన్ని తిండి అంటారా? ఇది పెట్టడానికేనా.. ఇందాకటి నుంచి ఒకటే న్యాగింగ్’’ అంటూ కంచాన్ని గిరాటేశాడు. అది టేబుల్ మీద నుంచి గోడకి తగిలి కిందపడింది. అన్నమంతా చెల్లాచెదురైంది. కొడుకు ఆవేశానికి చేష్టలుడిగి పోయారిద్దరూ. ‘‘భోజనానికి రమ్మని పిలవడానిక్కాదు.. నా మీద డౌట్‌తో వచ్చారు గదిలోకి’’ అంటూ వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లాడు. చేతులు కడుక్కుంటూ ‘‘భోజనానికి రా అని పిలిచే వంకతో నా సిస్టమ్‌ని చెక్ చేయడం..’’, తడి చేత్తోనే తల్లివంక చూపిస్తూ ‘‘ఆవిడేమో.. బట్టలు, పుస్తకాలు సర్దుతున్నట్టు యాక్ట్ చేస్తూ నా ఫోన్ చెక్ చేస్తారు, నా వార్డ్ రోబ్ చూస్తారు..’’ అరుస్తున్నాడు. షూస్టాండ్ దగ్గరకెళ్లి షూ తీసుకొని సోఫా హ్యాండ్ రెస్ట్ మీద కాలు పెట్టి షూ వేసుకుంటూ ‘‘మీ డ్రామా నాకు తెలీదనుకుంటున్నారేమో.. తెలుసు.. నౌ ఐయామ్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్’’ అన్నాడు పరిస్థితి అర్థమైన సరళ.. ‘‘ఒరేయ్.. సారీరా.. కూర నచ్చకపోతే ఆమ్లెట్ వేసి పెడ్తా.. ఉండు’’ అని వాడి దగ్గరకు వెళ్లింది. అదేం పట్టనట్టుగా ‘‘మీకు నామీద నమ్మకమే లేదసలు’’ అంటూ బయటకు వెళ్లిపోయాడు విసురుగా. సోఫాలో కూలబడిపోయింది సరళ. చేతులు కడుక్కుని వచ్చి పక్కన కూర్చుకున్నాడు వసంత్. ‘‘ఏం పాపం చేశానండీ..’’ అంటూ బోరుమంది. సరళ, వసంత్ దంపతుల ఒక్కగానొక్క కొడుకు అభయ్. వాడే వీళ్ల లోకం. వాడు బాగా చదివి, గొప్పవాడు కావాలనే కల వాళ్లది అందరి తల్లిదండ్రుల్లాగే. అలా అనుకోవడం సహజమే కావచ్చు కాని అభయ్ ప్రవర్తన అసహజంగా ఉన్నప్పుడు వీళ్ల కోరిక సమంజసమైంది కాదు అంటారు సైకియాట్రిస్ట్. ఎందుకు?అభయ్‌కి ఏడీహెచ్‌డీ అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్)ప్రాబ్లం చిన్నప్పటి నుంచి. ఏకాగ్రత నిలపలేడు. తల్లిదండ్రులు ఇద్దరూ చదువుకున్న వాళ్లే. చిన్నప్పుడే వాడి ప్రాబ్లమ్‌ని గుర్తించినా సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లడాన్ని అనవసరంగా భావించారు. డిసిప్లిన్‌తో చక్కదిద్దొచ్చు అనుకున్నారు. ఆచరణలోనూ పెట్టారు. పర్యవసానమే ఆ రాత్రి వాడి ప్రవర్తన. నాలుగైదేళ్లు వచ్చేవరకు ముద్దుగానే అనిపించింది. ఏడెనిమిదేళ్ల వరకూ చదువు విషయంలోనూ సమస్యలు రాలేదు. ఆ తర్వాత నుంచే ప్ల్రాబ్లమ్ మొదలైంది. తండ్రిది ఊళ్లు తిరిగే ఉద్యోగం కాబట్టి అభయ్ ప్రవర్తన వసంత్ మీద కన్నా సరళ మీదే ఎక్కువ ప్రభావం చూపింది. వాడిని హద్దుల్లో పెట్టే బాధ్యతను సరళే ఎక్కువ తీసుకుంది కాబట్టి వాడి కోపానికీ ఆమే ఎక్కువ బలైంది. వాడు ఆమె మీద చేయి చేసుకునేదాకా వెళ్లాడు. ఇంట్లో ఉంటే ‘‘చదువు.. చదువు’’ అని తల్లి షంటుతూంటుందని ఇంటికి రాకుండా ఫ్రెండ్స్‌తో బలాదూర్‌గా తిరిగేవాడు. మొండిగా తయారయ్యాడు. ఎంతలా అంటే తల్లిదండ్రులు ఏది చెప్పినా దానికి వ్యతిరేకం చేయడం.. నెగటివ్‌గా ఆలోచించడం. స్కూల్ నుంచీ కంప్లయింట్ల పరంపరా మొదలైంది. తోటి పిల్లలను ఏడిపించడం, టీచర్ చెప్పింది వినకపోవడం, చదువంటే ఏవగింపు.. ఇంకాస్త పెద్దయ్యాక స్కూల్‌కి డుమ్మా కొట్టడం, ఫ్రెండ్స్‌తో తిరగడం, తాగడం కూడా నేర్చుకున్నాడు. దానితో కొన్నిసార్లు ఇంట్లో డబ్బులనూ దొంగతనం చేశాడు. వీటన్నిటితో బెంబేలెత్తి పోయారు తల్లిదండ్రులు. వాడి పట్ల మరింత స్ట్రిక్ట్‌గా ఉండసాగారు. అది వీళ్లను శత్రువులుగా మార్చింది అభయ్కు. సైకియాట్రిస్ట్‌ను సంప్రదించేనాటికి. ఆ ఇంట్లో తల్లిదండ్రులకు పిల్లాడికీ మధ్య అనుబంధమేమీ లేదు. శత్రుత్వం తప్ప. ‘‘మా పిల్లాడి తీరు ఇలాగే ఉంటే ఆత్మహత్యే శరణ్యం’’ వెక్కి వెక్కి ఏడ్చింది సరళ డాక్టర్ దగ్గర. అభయ్‌తో విడిగా మాట్లాడితే.. ‘‘నన్ను అసలు కొడుకులాగే చూడరు. ఓ ఎనిమీలా చూస్తారు. నేనేం చేసినా తప్పే.. ఏం చేయకున్నా తప్పే! చదువు... చదువూ.. చదువు.. ఇది తప్ప ఇంకో మాట ఉండదు. అది నాకు చేతకాదు’’ తెగేసి చెప్పాడు వాడు. సమస్య అర్థమైంది డాక్టర్‌కు. ఏడీహెచ్‌డీని మందులతో నయం చేయొచ్చు. కాని ఈ పిల్లోడికి, ఆ పేరెంట్స్‌కు మధ్య బ్రేక్ అయిన రిలేషన్‌ను, నమ్మకాన్ని తిరిగి ఎలా బిల్డ్ చేయాలి? అందుకే ముగ్గురినీ కూర్చోబెట్టారు కౌన్సెలింగ్‌కు.‘‘మీ అబ్బాయిలోని పాజిటివ్ విషయాలు చెప్పండి?’’ అడిగారు డాక్టర్.. ఆ తల్లిదండ్రులను. ‘‘వాడి మొహం! అదే ఉంటే మీదాకా రావాల్సిన అవసరమే ఉండేదికాదు’’ సరళ. ‘‘తొందరేం లేదు.. బాబు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అతని అలవాట్లు, హాబీస్ అన్నీ గుర్తుచేసుకొని చెప్పండి’’ డాక్టర్.ఆలోచనల్లో పడ్డారు పేరెంట్స్ ఇద్దరూ. రెండు క్షణాల తర్వాత ‘‘ఆ.. పెయింటింగ్ ఏదో వేస్తాడు’’ తల్లి. ‘‘క్రికెట్ కూడా ఆడ్తాడండీ’’ తండ్రీ. ‘‘మరింకేం? ఈ రెండూ పాజిటివ్ లక్షణాలే కదా! సోషల్ మూవింగ్ ఎక్కువని, కొత్తవాళ్లనెవరినైనా ఇట్టే ఫ్రెండ్ షిప్ చేసుకుంటాడని, .. ఏ ఫ్రెండ్‌కి ఏ హెల్ప్ కావాలన్నీ పరిగెత్తుతాడనీ చెప్పారు కదా అంతకుముందు. అవన్నీ పాజిటివ్ విషయాలే కదండీ! అలాంటి హెల్పింగ్ నేచర్ ఉన్న మదర్ థెరిసాను, కైలాష్సత్యార్థిని నోబెల్ ప్రైజ్‌తో సత్కరించుకున్నాం. కాని మార్కులతో కొలవలేదు కదండీ..’’ అని చెప్తుంటే పక్కనున్న అభయ్ ఏడ్వసాగాడు. ‘‘ఎందుకు ఏడుస్తున్నావ్ రా?’’ అని అడిగితే.. ‘‘నాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలియదు. అమ్మానాన్న అన్నట్టు నేనెందుకూ పనికిరాననే అనుకున్నా’’ అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. వాడిని ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. కాస్త కుదుట పడ్డాక అడిగారు డాక్టర్.. ‘‘ఇప్పుడు నువ్వు చెప్పు మీ పేరెంట్స్ పాజిటివ్ సైడ్’’ అని. వాడూ ఏమీ చెప్పలేకపోయాడు. ‘‘మీ అమ్మకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉందా? మీ ఫ్రెండ్స్ మదర్స్లాగా జ్యుయలరీ పెట్టుకుంటుందా? మీ నాన్న వేరే ఊళ్లో.. మీరు ఇక్కడ ఎందుకున్నారు? ఎవరికోసం? నీ కోసం కాదా? నువ్వు బాగా చదువుకొని బాగుండాలనే ఆశతోనే కాదా? ఇంట్లో రోజూ నీకు ఇష్టమైన వంటచేస్తోందా? లేక వాళ్లకిష్టమైనవే వండుకుంటున్నారా? నువ్వు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని, నీకు ఇబ్బందవుతుందని మీ పేరెంట్స్ ఎన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్‌ను వదులుకోలేదు? వాళ్ల ప్రతి ఆలోచనలో నువ్వే.. నీ క్షేమమే’’ అని చెప్తుంటే వాడు తల దించుకున్నాడు.పేరెంట్స్ వైపు చూస్తూ చెప్పారు డాక్టర్.. ‘‘సమస్యను బాబు చిన్నప్పుడే సాల్వ్చేసుకోకుండా.. ఇక్కడిదాకా తెచ్చుకున్నారు.పిల్లాడిమీద అవసరం ఉన్న దానికంటే ఎక్కువ దృష్టిపెట్టి వాడు బిగుసుకుపోయేలా చేశారు. ఇప్పుడు పాజిటివ్స్ తెలిశాయి కదా..’’ ఇక ఆ దిశలో ప్రయత్నం మొదలుపెట్టండి అన్నట్టుగా అన్యాపదేశం చేశారు. బరువు దించుకున్న మనసుతో ఇంటికి వెళ్లారు ముగ్గరూ!మరునాడు సాయంకాలం అభయ్ కాలేజ్ నుంచి వచ్చేసరికి వాడి గదిలో క్రికెట్ బ్యాట్ ఉంది. అది చూసి వెళ్లి వాళ్ల నాన్నను హత్తుకున్నాడు. ఇప్పుడు అభయ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సక్సెస్ఫుల్ బిజినెస్ మన్‌గా స్థిరపడ్డాడు. అమ్మ, నాన్న, అభయ్.. ముగ్గురిదీ ఒకటే మాట. సంతోషం ఆ ఇంటి చిరునామా! – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ -
గడపగడపకూ వైఎస్సార్సీపీ.
- జిల్లాలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ - త్వరలో మండల కమిటీల ఏర్పాటు - ఈ నెల 25న జిల్లా కార్యవర్గం ఎన్నిక - నిజామాబాద్‌లో జిల్లాస్థాయి సమావేశం - వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.సిద్ధార్థరెడ్డి నిజామాబాద్ అర్భన్ : పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధమైందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి తెలిపారు. త్వరలోనే గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం ముందుగా ఈనెల 25న నిజామాబాద్‌లో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ఆదివారం ఆయన నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే పేద, బడుగు, బలహీన, గిరిజన ప్రజల తరఫున అనేక ఉద్యమాలు నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సిద్ధమైందని, ‘గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ నినాదంతో ప్రజలతో మమేకం అయ్యేందుకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నామని గడపగడపకూ వైఎస్సార్సీపీతెలిపారు. అధిష్టానం నిర్ణయాల మేరకు జిల్లాలో కిందిస్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేపట్టడం ద్వారా మరింత బలోపేతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా పర్యటించనున్నామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ప్రజల్లో ఉన్న సానుకూల వాతావరణాన్ని పార్టీ పటిష్టతకు అన్ని స్థాయిల్లోనూ ఉపయోగించుకుంటామని అన్నారు. అకాలవర్షం, వడగండ్ల కారణంగా నష్టపోయిన రైతులను కలిసి తమ పార్టీ తరపున భరోసా ఇచ్చామన్నారు. నష్టాల ఊబిలో ఉన్న రైతులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఆయన పాలనలో వ్యవసాయం పండుగలా మారిందని, ఆ తర్వాత రైతులను పట్టించుకునేవారే లేకుం డా పోయారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయిందని, నష్టపరిహారం, పంట అంచనాలో ఇప్పటికీ స్పష్టత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 25న నిజామాబాద్‌లో నిర్వహించే సమావేశానికి వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించామని చెప్పారు. -
వైఎస్ ఆశయాలు నెరవేర్చుదాం
లక్సెట్టిపేట : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చుదామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం వై ఎస్సార్ అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నా రు. తెలంగాణ ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పా ర్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, వారి అభివృద్ధి కోసం పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నె ల 22, 23 తేదీల్లో కమిటీలను ఏర్పాటు చేస్తామ ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన పాత సీసాలో కొత్త సారా అన్న విధంగా నడుస్తోందని విమర్శించారు. రాష్ట్ర సభ్యులు మెస్రం శంకర్, యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు తిలక్‌రావు, సభ్యుడు మేదరి పాల్సన్, ఉట్నూరు మండల అధ్యక్షుడు కాంపెల్లి గంగాధర్, నాయకులు బోడ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
అమరజీవి ఆశయాలను కొనసాగిద్దాం
అధ్యక్షుడు ద్వారకానాథ్ నెల్లూరు (సెంట్రల్) : రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగిద్దామని అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ అన్నారు. పొట్టి శ్రీరాములు 115వ జయంతిని పురస్కరించుకుని సోమవారం నగరంలోని ఆత్మకూ రు బస్టాండు సమీపంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తెలుగుప్రజలందరూ ఒకే దగ్గర ఉండాలనే ఆకాంక్షతో పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేసి తెలుగు రాష్ట్రాన్ని సాధించారన్నారు. అమరజీవి జయంతిని అధికారులు పట్టించుకోకపోవడంతో సొంత ఖర్చు తో పూల అలంకరణ చేయించానన్నారు. అర్బన్ ఆర్యవైశ్య సంఘం నాయకులు శ్రీనివాసులు, సుబ్రమణ్యం, సురేష్, ప్రసాద్, భాస్కర్, కామేశ్వరరావు, డి.సురేష్, భాస్కర్, కామేశ్వరరావు, సురేష్, ప్రకాశ్‌రావు, కేవీ చలమయ్య, గోపాల్, చరణ్, మురళి, బాలాజీ, రవి పాల్గొన్నారు. అమరిజీవి బాటలో పయనిద్దాం తెలుగు ప్రజల కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని వైఎస్సార్సీపీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ పి.రూప్‌కుమార్‌యాదవ అన్నారు. పొట్టిశ్రీరాములు ఆశయాలను గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేటర్లు గోగుల నాగరాజు, ఓబిలి రవిచంద్ర, దేవరకొండ అశోక్, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ పాల్గొన్నారు. జేసీఐ ఆధ్వర్యంలో జేసీఐ, ఆర్యవైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండు వద్ద ఉన్న పొట్టి శ్రీ రాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శరణ్‌కుమార్, మురళి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌లో నెల్లూరు(రెవెన్యూ): అమరజీవి జయంతి వేడుకలను సోమవారం జిల్లా పరిషత్ నూతన భవనంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జెడ్పీ సీఈఓ ఎం.జితేంద్ర పొట్టిశ్రీరాములు చిత్ర పటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి తెలుగుజాతికి గౌరవాన్ని తీసుకువచ్చారన్నారు. కలెక్టరేట్లో.. కలెక్టరేట్లో డీఆర్ఓ సుదర్శన్‌రెడ్డి అమరజీవి చిత్రపటానికి నివాళులర్పించారు. కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
సరైన నిర్ణయాలు తీసుకోవాలి
విద్యార్థులకు సత్యవాణి ఉద్బోధ చాపాడు: విద్యార్థులు 18-22 ఏళ్ల వయస్సులో తీసుకునే ఆశయాలు, ఆదర్శాల మీదనే వారి 75 ఏళ్ల జీవితం ఆధారపడి ఉంటుందని , ప్రతి విద్యార్థి సరైన నిర్ణయాలు తీసుకుని మంచిమార్గంలో వెళ్లాలని సమైక్యాంధ్ర ఉద్యమంలో బాణీ విన్పించిన భారతీయం సత్యవాణి అన్నారు. చాపాడు సమీపంలోని శ్రీచైతన్యభారతీ, విజ్ఞానభారతీ ఇంజినీరింగ్ కాలేజీలో బుధవారం విద్యార్థులకు ‘యువతకు దిశ, దశా నిర్ధేశ సదస్సు’ నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యతిధిగా హాజరైన సత్యవాణి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రపంచానికి గణితం నేర్పించిన భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరులు తలెత్తుకునే గొప్పవారవుతారన్నారు. పటేల్, లాల్‌బహదూర్‌శాస్త్రి, ఝాన్సీ, నెహ్రూ వంటి వారందరూ విద్యార్థి దశ నుంచే దేశనాయకులయ్యారన్నారు. ప్రతి విద్యార్థిలో ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని, చదువు ద్వారానే అది బయటికి వస్తుందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు దేశభక్తి, ధైవభక్తి ఉండాలన్నారు. తమ పిల్లలు మంచి మార్గాలలో నడవాలనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులు దేశనాయకులు, దేవుళ్ల పేర్లను వారికి పెడతారన్నారు. విద్యార్థికి ప్రతి క్షణం విలువైనదని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటే చదువులో ఏదైనా సాధిస్తారని కరస్పాండెంటు వి.జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదర్శరైతు గుడివాడ నాగరత్నంనాయుడు, సంఘ సేవకులు లక్ష్మీనరసయ్య, ప్రిన్సిపాళ్లు డాక్టర్ పాండురంగన్వ్రి, డాక్టర్ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపార సేవకులు
ఆ న లుగురు కాలేజీలో కలిశారు... వాళ్లతో పాటు అభిప్రాయాలు, ఆశలు, ఆశయాలు కూడా కలిశాయి. ఒకే బెంచ్‌లో కూర్చోసాగారు, ఒకే బ్యాచ్‌గా మారారు. చదువు అయిపోగానే నలుగురు కలిసి మొదట ఈ ప్రపంచాన్ని మొత్తం చుట్టేయాలనుకొన్నారు. ఈ ప్రయాణంలో జీవిత సత్యాన్ని న్వేషిద్దామనుకొన్నారు. అయితే దాని వల్ల తమకు ప్రపంచంతో పరిచయం ఏర్పడుతుందేమో కానీ, ప్రపంచానికి తాము పరిచయం కామన్న విషయాన్ని అర్థం చేసుకొన్నారు. ఈ ప్రపంచంలో తాము ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవాలంటే ఏదైనా సాధించాలనుకొన్నారు. అలా ఆలోచించిన ఆ మిత్రబృందం మొదలు పెట్టినదే ‘వార్బీ పార్కర్’. దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా సాగుతూ అందరి కళ్లకూ కనిపిస్తున్న కళ్ల జోడు కంపెనీ ఇది. దీని వ్యవస్థాపకులైన నలుగురు స్నేహితులే నీల్, ఆండ్రూ, జెఫ్రీ, డేవిడ్. ఒక కళ్ల జోడు సెట్‌ను అమ్మితే... మరో కళ్ల జోడు సెట్‌ను అవసరార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం అనేది ఈ కంపెనీ సిద్ధాంతం! ఇదే సిద్ధాంతంతో నాలుగేళ్లలోనే దృష్టిలోపంతో బాధపడుతున్న అవసరార్థులకు ఏకంగా 50 లక్షల కళ్ల జోళ్లను ఉచితంగా పంపిణీ చేసింది ఈ సంస్థ. మెదడు, మనసు ఉన్న నలుగురు యువకుల ఆలోచన ఫలితంగా ఆవిష్కృతమైన కంపెనీ ఇది. ఒకవైపు నాణ్యతతోనూ, నవ్యతతోనూ వినియోగదారులను ఆకట్టుకొంటూనే.. స్వచ్ఛంద సేవలోనూ ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకొంది. సేవకు వ్యాపారమే ఊతం!: దృష్టి దోషం ఉన్న వాళ్లకు అవసరమయ్యే కళ్ల జోళ్లను, సన్ గ్లాసెస్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ సంస్థ. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిధిలోని వార్తన్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డేవిడ్ గిల్ బో, నీల్ మెంథ్నల్, ఆండ్రూ హంట్, జెఫ్రీ రైడర్ లు తమకు తల్లిదండ్రులు ప్యాకెట్ మనీ కింద ఇచ్చిన 2,500 డాలర్ల పెట్టుబడితో ఈ కంపెనీని ప్రారంభించారు. ఒకవైపు వ్యాపారం చేస్తూనే తద్వారా వచ్చిన లాభంతో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనేది ఆ నలుగురు యువకుల ప్రణాళిక. మరి వీళ్ల లక్ష్యం మంచిది, వీళ్ల శ్రమ చిత్తశుద్ధితో కూడుకొన్నది.. దీంతో కళ్ల జోళ్లవాడకంపై మంచి క్రేజ్ ఉన్న అమెరికా దేశంలో ఆ కంపెనీకి కూడా మంచి ఆదరణ లభించింది. పెట్టుబడి తక్కువ కావడంతో.. తాము ఉత్పత్తి చేసిన కళ్లజోళ్లను ఎలా అమ్మాలో కూడా ఈ యువకులకు మొదట అర్థం కాలేదు. ఆ సమయంలో వీళ్లకు వోగ్డాట్కామ్ సహాయకారిగా నిలిచింది. ఈ నలుగురు యువకుల ప్రణాళికను, తపనను అందరికీ తెలియజెప్పింది. వీళ్ల వెబ్సైట్ అడ్రస్‌ను ఇచ్చి అమ్మకాలకు ఊపుతెచ్చింది. మీరు ఒక కళ్ల జోడును కొంటే, మేము అవసరార్థులకు ఉచితంగా ఒక కళ్ల జోడును పంపిణీ చేస్తాం(బయ్ వన్, గివ్ వన్) అనే విధానం నచ్చి చాలా మంది వీళ్ల ద గ్గరే కళ్ల జోళ్లను కొనసాగారు. ఇండియాపైన దృష్టి...: దృష్టి లోపాలతో బాధపడుతూ కూడా కళ్లజోడును కొనుక్కోలేనంత పేదరికం ఉండేది పేద ఆఫ్రికా, ఆసియాదేశాల ప్రజల్లోనే. ఈ విషయం గ్రహించి వీళ్లు ముందుగా భారతదేశం, బంగ్లాదేశ్‌లపై దృష్టి సారించారు ఈ స్నేహితులు. విజన్ స్ప్రింగ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కళ్ల జోళ్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నాలుగేళ్లు గడిచే సరికి ఐదు మిలియన్ల కళ్ల జోళ్లను పంపిణీ చేయించి ఈ కంపెనీ బాసులుగా ఉన్న ఆ నలుగురు యువకులు తమ సత్తాను రెండు విధాలుగా చాటుకొన్నారు. సాధారణ నేపథ్యం...: వీళ్ల ఆలోచన తీరు వైవిధ్యమైనది కానీ ఈ నలుగురూ చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. స్పష్టమైన విధానంతో చిన్న పెట్టుబడితో వీళ్లు వార్బీ పార్కర్‌ను మొదలు పెట్టగా.. తర్వాత అనేకమంది వీళ్లకు తోడయ్యారు. విరాళంగా డబ్బు ఇచ్చి ఆ కంపెనీని పెద్ద సంస్థగా రూపు దిద్దుకోవడానికి సహకారం అందించారు. అయితే ఇప్పటికీ ఈ సంస్థకు ఉన్న దుకాణాల సంఖ్య తక్కువే. ప్రధానంగా వెబ్సైట్ ఆధారంగానే అమ్మకాలు కొనసాగుతున్నాయి. ‘బయ్ వన్ -గివ్ వన్’అనే నినాదాన్ని అమలు పెట్టడం అనేది మాటల్లో చెప్పినంతటి సులభమైన వ్యవహారం కాదు. దానకర్ణులుగా పేరు పొందిన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా విరాళం విషయంలో ఇలాంటి విధానాన్ని అమల్లో పెట్టే సాహసం చేయలేదు. కానీ తాము అనుకొన్న విధానాన్ని అమలులో పెట్టి ఈ నలుగురు యువకులు తమ శక్తి యుక్తులు ఏ స్థాయివో నిరూపించారు. ఈ నలుగురూ చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. స్పష్టమైన విధానంతో చిన్న పెట్టుబడితో వీళ్లు వార్బీ పార్కర్‌ను మొదలు పెట్టగా.. తర్వాత అనేక మంది వీళ్లకు తోడయ్యారు. విరాళంగా డబ్బు ఇచ్చి ఆ కంపెనీని పెద్ద సంస్థగా రూపు దిద్దుకోవడానికి సహకారం అందించారు. -
మా మంచి నాన్న
ఫాదర్స్‌డే సందర్భంగా ప్రత్యేక కథనాలు పెద్ద కొడుకుగా నా ఆశయం నెరవేర్చింది డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తండ్రి భూంరెడ్డి ముస్తాబాద్ : నాన్నంటే వేలు పట్టి నడిపించేవాడే కాదు.. కదిలే దైవం. వారి ఆశలు, ఆశయాలు నెరవేర్చే బాధత్య వారి కడుపులో పుట్టిన బిడ్డలది. తెలంగాణ తొలి ఉద్యమంలో కళ్లు తెరిచి, మలిదశ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పద్మాదేవేందర్‌రెడ్డి పోరుబాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభలో డెప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కొండం భూంరెడ్డి, విజయ దంపతుల పెద్ద కూతురు పద్మ. ఆమె గురించి తండ్రి భూంరెడ్డి మాటల్లోనే.. దూరభారం తగ్గించుకునేందుకు లేఖలతో దగ్గరయ్యేది పద్మ నా పెద్ద కూతురు. తెలంగాణ తొలి ఉద్యమం జరుగుతున్న సమయంలోనే 6.01.1969లో పద్మ జన్మించింది. ఆమె తర్వాత అనిత, కొడుకు వంశీధర్‌రెడ్డి. చదువులో ఎప్పుడు ముందుండే పద్మ పట్ల నాకు కొద్దిగా ప్రేమ ఎక్కువే. ఏడు వరకు నామాపూర్‌లోనే చదివింది. ఎంతో చలాకీగా ఉండేది. స్కూల్లో భరతమాత వేషాలు వేసేది. అల్లూరిసీతారామరాజు ఏకపాత్రభినయంతో ఆకట్టుకునేది. క్లాస్‌లో ఇతరుల కంటే ఒక్క మార్కు తక్కువ వచ్చినా పట్టుదలతో చదివి ఫస్ట్ వచ్చేది. నేను చెన్నూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పుడు తరచూ నాకు పద్మ లేఖలు రాసేది. ఉత్తరాలతో కుటుంబ క్షేమ సమాచారాలు అందించేది. నా కొడుకు జబ్బుపడ్డప్పుడు పెద్ద కొడుకుగా వెన్నంటి నిలిచి మాకు ఓదార్పునిచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. అనుకున్న లక్ష్యం కోసం మొండిగా పనిచేసేది. తెలంగాణ తొలి శాసనసభకు డెప్యూటీ స్పీకర్ అయింది. తండ్రిగా ఇంతకంటే ఏం కావాలి. ఆడపిల్లను అనే భయం ఆమెలో ఏనాడు నేను చూడలేదు. - కొండం భూంరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి తండ్రి నాన్న లేఖలే పాఠాలయ్యాయి.. ఏడో తరగతి వరకు నామాపూర్‌లో చదివా. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వివిధ ప్రాంతాల్లో పనిచేసేవాడు. నాకేమో నాన్న దగ్గర ఉండాలని కోరిక. ఐదో తరగతిలో ఉన్నప్పుడే నాన్నకు లేఖలు రాసేదాన్ని. అమ్మ విజయ చెబుతుంటే నేను ఉత్తరాలు రాస్తూ, క్షేమ సమాచారాలు తెలుసుకునేదాన్ని. నాన్న రాసే లేఖల్లో ఎన్నో మంచి విషయాలు ఉండేవి. అమ్మ, చెల్లి, తమ్ముడిని బాగా చూసుకోవాలని, పట్టుదలతో చదవాలని చెప్పేవారు. అలా నాన్న ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తి చేశా. డిగ్రీ కాగానే దేవేందర్‌రెడ్డితో నిశ్చితార్థం చేశారు. చదువుకోవాలన్న నా కోరికను నాన్న దేవేందర్‌రెడ్డితో చెప్పారు. పెళ్లైన అనంతరం న్యాయ శాస్త్రం చదివించారు. అప్పుడే మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా. ఎమ్మెల్యేగా తెలంగాణ బాధలను అసెంబ్లీలో వినిపించే అవకాశం వచ్చేది కాదు. ఇప్పుడు అదే అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర తొలిశాసనసభకు ఉపసభాపతిగా ఎన్నిక కావడం వెనుక తెలంగాణ ఉద్యమ నేపథ్యం, నాన్న పెంపకం, దేవేందర్‌రెడ్డి ప్రోత్సాహం ఉన్నాయి. బంగారు తెలంగాణ నిర్మాణంలో పాల్గొనడం నా ముందు ఉన్న సవాల్. -పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనసభ డెప్యూటీ స్పీకర్ నాన్న నుంచి నేర్చుకున్నా.. నాన్నది అరుదైన వ్యక్తిత్వం. అంతకుమించి మాటకు కట్టుబడే వ్యక్తి. నాన్న గురించి చెప్పాలంటే నిజంగానే మాటలు రావడం లేదు. తండ్రిగా తను చేయాల్సిందంతా చేశారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంత మొండిగా వ్యవహరించారో అందరికి తెలిసిందే. తెలంగాణ రావడంతో ఎంతో ఆన ందంగా ఉంది. కేసీఆర్ తనయుడిగా ఈ జీవితానికి నాకిది చాలు. తండ్రి పేరు చెడగొట్టకుండా ఉండాలన్నదే నా లక్ష్యం. ప్రజాజీవితంలో ఎప్పుడూ బిజీగా ఉండే నాన్న మాకు తక్కువ సమయం కేటాయించారు. నిజంగానే ఇప్పుడు నేను అదే అనుభవిస్తున్నా. బిజీగా ఉండడమే దానికి కారణం. ప్రజల కోసం పని చేయాలన్న తత్వం నాన్నది. నాన్న ప్రభావం నాపై చాలానే ఉంది. అమ్మతో మేం ఎక్కువ గడిపేవాళ్లం. తండ్రిగా అన్ని బాధ్యతలు నెరవేర్చారు. నేనెంతో నేర్చుకున్నా. ఇంతకంటే ఏం చెప్పాలో మాటలు రావడం లేదు. - సిరిసిల్ల -
ఉజ్వల భవిష్యత్ కోసం ఓటేయండి
ఓటరు అవగాహన ర్యాలీలో కలెక్టర్ కిషన్ వరంగల్ చౌరస్తా, న్యూస్‌లైన్ : ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి.. ఉజ్వల భవిష్యత్ కోసం సరైన నాయకుడిని ఎన్నుకోవడం అవసరం.. అందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్ పిలుపునిచ్చారు. వరంగల్ చౌరస్తాలో సోమవారం రోటరీ, ఇన్నర్‌వీల్, వాసవీ, వాసవీ వనితా క్లబ్‌ల ప్రతినిధులు, గోల్డెన్ త్రిశూల్, రిషి స్పోకెన్, శారదా పబ్లిక్ స్కూ ల్ అధ్యాపకులు, విద్యార్థులు చేపట్టిన ఓటరు అవగాహన ర్యాలీ ని ఆయన ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో కేవలం 53 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఈ సారి ఓటింగ్ 80 శాతానికి పెంచడానికి ఓటరు చైతన్య ర్యాలీలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో అక్షరాస్యులు అధికంగా ఉన్నా ఓటుకు దూరంగా ఉండటం సరి కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడంతోపాటు సుపరిపాలన కోసం ప్రతి ఒక్కరూ ఓటు ఆయుధాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ వందశాతానికి పెంచేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపా రు. ర్యాలీ జేపీఎన్ రోడ్డు మీదుగా పోచమ్మమైదాన్ వరకు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన మానవహారం కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ ఓటు అనే అస్త్రం సంధించి నిస్వార్థమైన నేతలను ఎన్నుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. పీసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, కార్యక్రమ కో-ఆర్డినేటర్ ఆధ్వర్యం లో జరిగిన ఈ ర్యాలీలో వరంగల్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు కె.రాజగోపాల్, సెక్రటరీ తోట వైద్యనాథ్, వాసవీ క్లబ్ అధ్యక్షుడు సత్యనారయణ, కార్యదర్శి టి.వాసుదేవులు, కోశాధికారి గాదె వాసుదేవ్, వెలిశాల ఆనంద్, ఐత గోపీనాథ్, వాసవీ వనితా క్లబ్ ప్రతినిధులు కళావతి, విజలక్ష్మి, గోల్డెన్ త్రిశూల్ కరస్పాండెంట్ డాక్టర్ కె.చంద్రశేఖర్ ఆర్యా, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ హరి రమాదేవి పాల్గొన్నారు. ర్యాలీలో గోల్డెన్ త్రిశూల్ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మువ్వన్నెల రంగుల షర్టులు ధరించిన చిన్నారులు ‘ఫ్లీజ్ ప్రతి ఒక్కరూ ఓటేయండి’ అంటూ బుల్లిబుల్లి మాటలతో ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వారిని అభినందించారు.