సరైన నిర్ణయాలు తీసుకోవాలి
విద్యార్థులకు సత్యవాణి ఉద్బోధ
చాపాడు:
విద్యార్థులు 18-22 ఏళ్ల వయస్సులో తీసుకునే ఆశయాలు, ఆదర్శాల మీదనే వారి 75 ఏళ్ల జీవితం ఆధారపడి ఉంటుందని , ప్రతి విద్యార్థి సరైన నిర్ణయాలు తీసుకుని మంచిమార్గంలో వెళ్లాలని సమైక్యాంధ్ర ఉద్యమంలో బాణీ విన్పించిన భారతీయం సత్యవాణి అన్నారు. చాపాడు సమీపంలోని శ్రీచైతన్యభారతీ, విజ్ఞానభారతీ ఇంజినీరింగ్ కాలేజీలో బుధవారం విద్యార్థులకు ‘యువతకు దిశ, దశా నిర్ధేశ సదస్సు’ నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యతిధిగా హాజరైన సత్యవాణి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రపంచానికి గణితం నేర్పించిన భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరులు తలెత్తుకునే గొప్పవారవుతారన్నారు.
పటేల్, లాల్‌బహదూర్‌శాస్త్రి, ఝాన్సీ, నెహ్రూ వంటి వారందరూ విద్యార్థి దశ నుంచే దేశనాయకులయ్యారన్నారు. ప్రతి విద్యార్థిలో ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని, చదువు ద్వారానే అది బయటికి వస్తుందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు దేశభక్తి, ధైవభక్తి ఉండాలన్నారు.
తమ పిల్లలు మంచి మార్గాలలో నడవాలనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులు దేశనాయకులు, దేవుళ్ల పేర్లను వారికి పెడతారన్నారు. విద్యార్థికి ప్రతి క్షణం విలువైనదని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటే చదువులో ఏదైనా సాధిస్తారని కరస్పాండెంటు వి.జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆదర్శరైతు గుడివాడ నాగరత్నంనాయుడు, సంఘ సేవకులు లక్ష్మీనరసయ్య, ప్రిన్సిపాళ్లు డాక్టర్ పాండురంగన్వ్రి, డాక్టర్ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.