ఆదర్శాలు మారకూడదు. ఆదర్శాలు‘మారడం’ అంటే మునుపు ఏర్పరచిన అభిప్రాయాలకు భంగం కలిగించేలా ప్రవర్తించడం.
ఒక ఆదర్శ పురుషుడిపై పదేళ్ల క్రితం ఉన్న అభిప్రాయాలు ఈ పదేళ్లలో మారకూడదనేం లేదు. అయితే ఏ కారణం చేతనైతే అతడు ఆదర్శప్రాయుడిగా ఉన్నారో అదే ఆదర్శం నిన్నటికి, నేటికీ, రేపటికీ మారిపోకూడదనే ఆశిస్తాం. అభిప్రాయాలు మారొచ్చు. ఆదర్శాలు మారకూడదు. ఆదర్శాలు ‘మారడం’ అంటే మునుపు ఏర్పడిన అభిప్రాయాలకు భంగం కలగడం. ఆదర్శం మారినప్పుడు ఆ ఆదర్శం నుంచి రూపుదాల్చిన అభిప్రాయాలు మారిపోవడం సహజమే అయినా ఆసారాం బాపూజీపై ఇప్పటికీ ఆయన అనుచరుల అభిప్రాయాలు మారలేదు! నిన్న జోథ్‌పూర్ కోర్టు ఆసారాంపై తుది తీర్పుకు సిద్ధమవుతూ, అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందనుకున్న నాలుగు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించడాన్ని బట్టి ఆయనకు నేటికీ బలమైన అనుచరులు, ఆ అనుచరులకు బలమైన అభిప్రాయాలు ఉన్నాయని అర్థమవుతోంది. పదేళ్ల క్రితం అటల్ బిహారీ వాజపేయి, మరో మాజీ ప్రధాని చంద్రశేఖర్, కె.ఆర్.నారాయణన్, కమల్‌నాథ్, కపిల్ సిబాల్, అశోక్ సింఘాల్, ఉద్ధవ్ ఠాక్రే, పవన్ గుప్తా వంటి వాళ్లకు సైతం ఆసారాం తనపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచగలిగారు.
అది ఆయన నేరుగా వాళ్లను కూర్చోబెట్టి ఏర్పరచినది కాకపోవచ్చు. ప్రాపంచిక అజ్ఞానపు పొరల్ని తొలగించారని, ఆయనకు యావత్ భారత జాతీ రుణపడి ఉందని, ఆయనొక శాంతి దూత అని, దేవజ్ఞాన జ్యోతి అని, నేటి తరానికి ఆధ్యాత్మిక విలువల్ని ప్రసాదించారని, సత్ప్రవర్తనను ప్రబోధించారనీ ఆయనపై ఒక గొప్ప భక్తిభావంతో కూడిన అభిప్రాయం విశ్వవ్యాప్తం అయిందంటే ఆసారాం ఆదర్శాలే కారణం. ఆయనకు రెండు కోట్ల మంది అనుచరులు ఉన్నారు. ఇప్పటికీ వారు (కోర్టు తీర్పు తర్వాత కూడా) తమ అభిప్రాయాలపై తాము నిలబడే ఉన్నారు! ఆసారాం కూడా తన ఆదర్శంపై నిలబడి ఉంటే బాగుండేది. ఆదర్శపురుషుడు ఇప్పుడు పురుషుడిగా మాత్రమే మిగిలిపోయారు.
– మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment