తల్లిదండ్రులకు పిల్లలే ప్రపంచం.. అదే ప్రాబ్లం!ప్రపంచాన్ని చూడరు.. ప్రపంచం ఎలా మారుతుందో చూడరు!పిల్లల్నే చూస్తారు.. పిల్లల్లో మార్పుని అర్థంచేసుకోరు!మార్కులు రాకపోతే పిల్లాడు ఫెయిల్ అయిపోతాడని భయం..నమ్మకం లేకపోతే పిల్లాడు ఫెయిల్ అవుతాడని అర్థం కాదు! పిల్లల సామర్థ్యానికి.. పేరెంట్స్ ఆకాంక్షలకు మధ్య నలిగిన నమ్మకం కథ ఇది...
‘‘ఏమండీ.. భోజనం చల్లారి పోతోంది త్వరగా రండి’’ మూడోసారి పిలిచింది సరళ.‘‘వస్తున్నా..’’ అంటూ బెడ్‌రూమ్‌లోంచి హాల్లోకి వచ్చాడు వసంత్. భర్త రావడం చూసి కంచంలో వడ్డంచ సాగింది సరళ. డైనింగ్ టేబుల్ కుర్చీని వెనక్కి జరుపుకొని కూర్చుంటూ ‘‘వాడేడీ?’’ అడిగాడు వసంత్.అబ్బాయి గది వైపు చూపిస్తూ సైగ చేసింది సరళ.. అక్కడున్నాడు అన్నట్టు.‘‘పిలువు’’ అన్నాడు అన్నంలోకి పచ్చడి కలుపుతూ.‘‘మీరే పిలవండి’’ భర్త కలుపుతున్న పచ్చడి అన్నంలోకి నెయ్యి వేస్తూ!‘‘ఏంటది చిన్నపిల్లలా? వెళ్లి పిలుచుకురా..‘‘ ఆజ్ఞాపించాడు భర్త. భయంగా, ఇబ్బందిగానే కొడుకు గదివైపు కదిలింది. పదహారేళ్ల అభయ్.. కంప్యూటర్‌లో మొహంపెట్టాడు సీరియస్‌గా. ‘‘భోజనానికి రా నాన్నా.. డాడీ వెయిట్ చేస్తున్నాడు’’గది గుమ్మంలోంచే పిలిచింది సరళ. లెక్కచేయలేదు వాడు.లోపలికి వస్తూ మంచమ్మీద పడున్న బట్టలు సర్దుతూ ‘‘అభయ్ నిన్నే.. భోజనానికి లే’’ అంది కాస్త గట్టిగానే. విసురుగా ఆమెను చూసి మళ్లీ కంప్యూటర్‌కేసి మొహం తిప్పుకున్నాడు. కింద అడ్డదిడ్డంగా పడి ఉన్న షూస్, సాక్స్, స్లిప్ప్లర్స్, బెల్ట్స్ తీసి ఎక్కడివక్కడ సర్దిపెడుతూ ‘‘అభయ్’’ అని కేకేసింది వాడు నిర్లక్ష్యం చేస్తున్నాడన్న అవమానంతో. వాడు స్పందించలేదు. ‘‘అభయ్ నిన్నే’’ అంటూ దగ్గరకు వెళ్లింది. ఆ స్వరంలో వినిపించిన కోపానికి డైనింగ్ హాల్ నుంచి గబగబా అభయ్ గదిలోకి వచ్చాడు వసంత్. తల్లి కళ్లల్లోకి అంతకన్నా కోపంగా చూస్తూన్న కొడుకు దగ్గరకు వచ్చి ‘‘రా నాన్నా.. భోంచేద్దాం..’’అనునయంగా అడిగాడు వసంత్. అసహనంతో చూశాడు కొడుకు. ‘‘హూ..’’ అంటూ చిరాగ్గా కుర్చీలోంచి లేచి తల్లినీ, తండ్రినీ తోసుకుంటూ హాల్లోకి వెళ్లాడు. మొహమొహాలు చూసుకొని వెనకాలే నడిచారు వీళ్లు.
డైనింగ్ టేబుల్ కుర్చీని బర్రున వెనక్కి లాగి కుర్చీలో కూలబడ్డాడు అభయ్. కంచంలో అన్నం వడ్డించుకోసాగాడు. ‘‘నేను వడ్డిస్తా ఉండు నాన్నా... ఈలోపు నువ్వు చేతులు కడుక్కొని రా..’’ అంటూ వడివడిగా కొడుకు దగ్గరకు వచ్చింది సరళ.వసంత్ కూడా వచ్చి.. అభయ్‌కి ఎదురుగా కూర్చున్నాడు తన కంచం ముందు. ‘‘నా చేతులకేం? బాగానే ఉన్నాయి.. మీ మొహాల కన్నా’’ అన్నంలో చేయి మొత్తం పెడుతూ అభయ్. భర్తను చూసింది సరళ. ‘‘ఆవేశపడకు’’ అన్నట్టుగా కళ్లతో వారించాడు వసంత్. కూర వడ్డించింది సరళ. ఆ కూర మొత్తం అన్నంలోకి కసాపిసా కలుపుకొని నోట్లో కుక్కుకున్నాడు. నమిలి మింగనైనా లేదు ‘‘ఛీ.. ఇదేం కూర?’’ అంటూ ఊసేసాడు. ఆ మెతుకులు తండ్రి కంచంలో పడ్తున్నాయన్న స్పృహ కూడా లేకుండా. ‘‘ఏమైందిరా? నీకిష్టమైన బెండకాయవేపుడే కదా?’’ అంది సరళ బిత్తరపోతూ.‘‘దీన్ని తిండి అంటారా? ఇది పెట్టడానికేనా.. ఇందాకటి నుంచి ఒకటే న్యాగింగ్’’ అంటూ కంచాన్ని గిరాటేశాడు. అది టేబుల్ మీద నుంచి గోడకి తగిలి కిందపడింది. అన్నమంతా చెల్లాచెదురైంది. కొడుకు ఆవేశానికి చేష్టలుడిగి పోయారిద్దరూ. ‘‘భోజనానికి రమ్మని పిలవడానిక్కాదు.. నా మీద డౌట్‌తో వచ్చారు గదిలోకి’’ అంటూ వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లాడు. చేతులు కడుక్కుంటూ ‘‘భోజనానికి రా అని పిలిచే వంకతో నా సిస్టమ్‌ని చెక్ చేయడం..’’, తడి చేత్తోనే తల్లివంక చూపిస్తూ ‘‘ఆవిడేమో.. బట్టలు, పుస్తకాలు సర్దుతున్నట్టు యాక్ట్ చేస్తూ నా ఫోన్ చెక్ చేస్తారు, నా వార్డ్ రోబ్ చూస్తారు..’’ అరుస్తున్నాడు. షూస్టాండ్ దగ్గరకెళ్లి షూ తీసుకొని సోఫా హ్యాండ్ రెస్ట్ మీద కాలు పెట్టి షూ వేసుకుంటూ ‘‘మీ డ్రామా నాకు తెలీదనుకుంటున్నారేమో.. తెలుసు.. నౌ ఐయామ్ సిక్స్‌టీన్ ఇయర్స్ ఓల్డ్’’ అన్నాడు పరిస్థితి అర్థమైన సరళ.. ‘‘ఒరేయ్.. సారీరా.. కూర నచ్చకపోతే ఆమ్లెట్ వేసి పెడ్తా.. ఉండు’’ అని వాడి దగ్గరకు వెళ్లింది. అదేం పట్టనట్టుగా ‘‘మీకు నామీద నమ్మకమే లేదసలు’’ అంటూ బయటకు వెళ్లిపోయాడు విసురుగా. సోఫాలో కూలబడిపోయింది సరళ. చేతులు కడుక్కుని వచ్చి పక్కన కూర్చుకున్నాడు వసంత్. ‘‘ఏం పాపం చేశానండీ..’’ అంటూ బోరుమంది.
సరళ, వసంత్ దంపతుల ఒక్కగానొక్క కొడుకు అభయ్. వాడే వీళ్ల లోకం. వాడు బాగా చదివి, గొప్పవాడు కావాలనే కల వాళ్లది అందరి తల్లిదండ్రుల్లాగే. అలా అనుకోవడం సహజమే కావచ్చు కాని అభయ్ ప్రవర్తన అసహజంగా ఉన్నప్పుడు వీళ్ల కోరిక సమంజసమైంది కాదు అంటారు సైకియాట్రిస్ట్. ఎందుకు?అభయ్‌కి ఏడీహెచ్‌డీ అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్)ప్రాబ్లం చిన్నప్పటి నుంచి. ఏకాగ్రత నిలపలేడు. తల్లిదండ్రులు ఇద్దరూ చదువుకున్న వాళ్లే. చిన్నప్పుడే వాడి ప్రాబ్లమ్‌ని గుర్తించినా సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లడాన్ని అనవసరంగా భావించారు. డిసిప్లిన్‌తో చక్కదిద్దొచ్చు అనుకున్నారు. ఆచరణలోనూ పెట్టారు. పర్యవసానమే ఆ రాత్రి వాడి ప్రవర్తన. నాలుగైదేళ్లు వచ్చేవరకు ముద్దుగానే అనిపించింది. ఏడెనిమిదేళ్ల వరకూ చదువు విషయంలోనూ సమస్యలు రాలేదు. ఆ తర్వాత నుంచే ప్ల్రాబ్లమ్ మొదలైంది. తండ్రిది ఊళ్లు తిరిగే ఉద్యోగం కాబట్టి అభయ్ ప్రవర్తన వసంత్ మీద కన్నా సరళ మీదే ఎక్కువ ప్రభావం చూపింది. వాడిని హద్దుల్లో పెట్టే బాధ్యతను సరళే ఎక్కువ తీసుకుంది కాబట్టి వాడి కోపానికీ ఆమే ఎక్కువ బలైంది. వాడు ఆమె మీద చేయి చేసుకునేదాకా వెళ్లాడు. ఇంట్లో ఉంటే ‘‘చదువు.. చదువు’’ అని తల్లి షంటుతూంటుందని ఇంటికి రాకుండా ఫ్రెండ్స్‌తో బలాదూర్‌గా తిరిగేవాడు. మొండిగా తయారయ్యాడు. ఎంతలా అంటే తల్లిదండ్రులు ఏది చెప్పినా దానికి వ్యతిరేకం చేయడం.. నెగటివ్‌గా ఆలోచించడం. స్కూల్ నుంచీ కంప్లయింట్ల పరంపరా మొదలైంది. తోటి పిల్లలను ఏడిపించడం, టీచర్ చెప్పింది వినకపోవడం, చదువంటే ఏవగింపు.. ఇంకాస్త పెద్దయ్యాక స్కూల్‌కి డుమ్మా కొట్టడం, ఫ్రెండ్స్‌తో తిరగడం, తాగడం కూడా నేర్చుకున్నాడు. దానితో కొన్నిసార్లు ఇంట్లో డబ్బులనూ దొంగతనం చేశాడు. వీటన్నిటితో బెంబేలెత్తి పోయారు తల్లిదండ్రులు. వాడి పట్ల మరింత స్ట్రిక్ట్‌గా ఉండసాగారు. అది వీళ్లను శత్రువులుగా మార్చింది అభయ్‌కు. సైకియాట్రిస్ట్‌ను సంప్రదించేనాటికి. ఆ ఇంట్లో తల్లిదండ్రులకు పిల్లాడికీ మధ్య అనుబంధమేమీ లేదు. శత్రుత్వం తప్ప.
‘‘మా పిల్లాడి తీరు ఇలాగే ఉంటే ఆత్మహత్యే శరణ్యం’’ వెక్కి వెక్కి ఏడ్చింది సరళ డాక్టర్ దగ్గర. అభయ్‌తో విడిగా మాట్లాడితే.. ‘‘నన్ను అసలు కొడుకులాగే చూడరు. ఓ ఎనిమీలా చూస్తారు. నేనేం చేసినా తప్పే.. ఏం చేయకున్నా తప్పే! చదువు... చదువూ.. చదువు.. ఇది తప్ప ఇంకో మాట ఉండదు. అది నాకు చేతకాదు’’ తెగేసి చెప్పాడు వాడు. సమస్య అర్థమైంది డాక్టర్‌కు. ఏడీహెచ్‌డీని మందులతో నయం చేయొచ్చు. కాని ఈ పిల్లోడికి, ఆ పేరెంట్స్‌కు మధ్య బ్రేక్ అయిన రిలేషన్‌ను, నమ్మకాన్ని తిరిగి ఎలా బిల్డ్ చేయాలి? అందుకే ముగ్గురినీ కూర్చోబెట్టారు కౌన్సెలింగ్‌కు.‘‘మీ అబ్బాయిలోని పాజిటివ్ విషయాలు చెప్పండి?’’ అడిగారు డాక్టర్.. ఆ తల్లిదండ్రులను. ‘‘వాడి మొహం! అదే ఉంటే మీదాకా రావాల్సిన అవసరమే ఉండేదికాదు’’ సరళ. ‘‘తొందరేం లేదు.. బాబు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అతని అలవాట్లు, హాబీస్ అన్నీ గుర్తుచేసుకొని చెప్పండి’’ డాక్టర్.ఆలోచనల్లో పడ్డారు పేరెంట్స్ ఇద్దరూ. రెండు క్షణాల తర్వాత ‘‘ఆ.. పెయింటింగ్ ఏదో వేస్తాడు’’ తల్లి. ‘‘క్రికెట్ కూడా ఆడ్తాడండీ’’ తండ్రీ. ‘‘మరింకేం? ఈ రెండూ పాజిటివ్ లక్షణాలే కదా! సోషల్ మూవింగ్ ఎక్కువని, కొత్తవాళ్లనెవరినైనా ఇట్టే ఫ్రెండ్ షిప్ చేసుకుంటాడని, .. ఏ ఫ్రెండ్‌కి ఏ హెల్ప్ కావాలన్నీ పరిగెత్తుతాడనీ చెప్పారు కదా అంతకుముందు. అవన్నీ పాజిటివ్ విషయాలే కదండీ! అలాంటి హెల్పింగ్ నేచర్ ఉన్న మదర్ థెరిసాను, కైలాష్‌సత్యార్థిని నోబెల్ ప్రైజ్‌తో సత్కరించుకున్నాం. కాని మార్కులతో కొలవలేదు కదండీ..’’ అని చెప్తుంటే పక్కనున్న అభయ్ ఏడ్వసాగాడు.
‘‘ఎందుకు ఏడుస్తున్నావ్ రా?’’ అని అడిగితే.. ‘‘నాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలియదు. అమ్మానాన్న అన్నట్టు నేనెందుకూ పనికిరాననే అనుకున్నా’’ అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. వాడిని ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. కాస్త కుదుట పడ్డాక అడిగారు డాక్టర్.. ‘‘ఇప్పుడు నువ్వు చెప్పు మీ పేరెంట్స్ పాజిటివ్ సైడ్’’ అని. వాడూ ఏమీ చెప్పలేకపోయాడు. ‘‘మీ అమ్మకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉందా? మీ ఫ్రెండ్స్ మదర్స్‌లాగా జ్యుయలరీ పెట్టుకుంటుందా? మీ నాన్న వేరే ఊళ్లో.. మీరు ఇక్కడ ఎందుకున్నారు? ఎవరికోసం? నీ కోసం కాదా? నువ్వు బాగా చదువుకొని బాగుండాలనే ఆశతోనే కాదా? ఇంట్లో రోజూ నీకు ఇష్టమైన వంటచేస్తోందా? లేక వాళ్లకిష్టమైనవే వండుకుంటున్నారా? నువ్వు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని, నీకు ఇబ్బందవుతుందని మీ పేరెంట్స్ ఎన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్‌ను వదులుకోలేదు? వాళ్ల ప్రతి ఆలోచనలో నువ్వే.. నీ క్షేమమే’’ అని చెప్తుంటే వాడు తల దించుకున్నాడు.పేరెంట్స్ వైపు చూస్తూ చెప్పారు డాక్టర్.. ‘‘సమస్యను బాబు చిన్నప్పుడే సాల్వ్‌చేసుకోకుండా.. ఇక్కడిదాకా తెచ్చుకున్నారు.పిల్లాడిమీద అవసరం ఉన్న దానికంటే ఎక్కువ దృష్టిపెట్టి వాడు బిగుసుకుపోయేలా చేశారు. ఇప్పుడు పాజిటివ్స్ తెలిశాయి కదా..’’ ఇక ఆ దిశలో ప్రయత్నం మొదలుపెట్టండి అన్నట్టుగా అన్యాపదేశం చేశారు. బరువు దించుకున్న మనసుతో ఇంటికి వెళ్లారు ముగ్గరూ!మరునాడు సాయంకాలం అభయ్ కాలేజ్ నుంచి వచ్చేసరికి వాడి గదిలో క్రికెట్ బ్యాట్ ఉంది. అది చూసి వెళ్లి వాళ్ల నాన్నను హత్తుకున్నాడు. ఇప్పుడు అభయ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సక్సెస్‌ఫుల్ బిజినెస్ మన్‌గా స్థిరపడ్డాడు. అమ్మ, నాన్న, అభయ్.. ముగ్గురిదీ ఒకటే మాట. సంతోషం ఆ ఇంటి చిరునామా!
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్: పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్
Comments
Please login to add a commentAdd a comment