- ఓటరు అవగాహన ర్యాలీలో కలెక్టర్ కిషన్
వరంగల్ చౌరస్తా, న్యూస్‌లైన్ : ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి.. ఉజ్వల భవిష్యత్ కోసం సరైన నాయకుడిని ఎన్నుకోవడం అవసరం.. అందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్ పిలుపునిచ్చారు. వరంగల్ చౌరస్తాలో సోమవారం రోటరీ, ఇన్నర్‌వీల్, వాసవీ, వాసవీ వనితా క్లబ్‌ల ప్రతినిధులు, గోల్డెన్ త్రిశూల్, రిషి స్పోకెన్, శారదా పబ్లిక్ స్కూ ల్ అధ్యాపకులు, విద్యార్థులు చేపట్టిన ఓటరు అవగాహన ర్యాలీ ని ఆయన ప్రారంభించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో కేవలం 53 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఈ సారి ఓటింగ్ 80 శాతానికి పెంచడానికి ఓటరు చైతన్య ర్యాలీలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో అక్షరాస్యులు అధికంగా ఉన్నా ఓటుకు దూరంగా ఉండటం సరి కాదన్నారు.
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడంతోపాటు సుపరిపాలన కోసం ప్రతి ఒక్కరూ ఓటు ఆయుధాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ వందశాతానికి పెంచేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపా రు. ర్యాలీ జేపీఎన్ రోడ్డు మీదుగా పోచమ్మమైదాన్ వరకు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన మానవహారం కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ ఓటు అనే అస్త్రం సంధించి నిస్వార్థమైన నేతలను ఎన్నుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. పీసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, కార్యక్రమ కో-ఆర్డినేటర్ ఆధ్వర్యం లో జరిగిన ఈ ర్యాలీలో వరంగల్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు కె.రాజగోపాల్, సెక్రటరీ తోట వైద్యనాథ్, వాసవీ క్లబ్ అధ్యక్షుడు సత్యనారయణ, కార్యదర్శి టి.వాసుదేవులు, కోశాధికారి గాదె వాసుదేవ్, వెలిశాల ఆనంద్, ఐత గోపీనాథ్, వాసవీ వనితా క్లబ్ ప్రతినిధులు కళావతి, విజలక్ష్మి, గోల్డెన్ త్రిశూల్ కరస్పాండెంట్ డాక్టర్ కె.చంద్రశేఖర్ ఆర్యా, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ హరి రమాదేవి పాల్గొన్నారు.
ర్యాలీలో గోల్డెన్ త్రిశూల్ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మువ్వన్నెల రంగుల షర్టులు ధరించిన చిన్నారులు ‘ఫ్లీజ్ ప్రతి ఒక్కరూ ఓటేయండి’ అంటూ బుల్లిబుల్లి మాటలతో ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వారిని అభినందించారు.