వ్యాపార సేవకులు
ఆ న లుగురు కాలేజీలో కలిశారు... వాళ్లతో పాటు అభిప్రాయాలు, ఆశలు, ఆశయాలు కూడా కలిశాయి. ఒకే బెంచ్‌లో కూర్చోసాగారు, ఒకే బ్యాచ్‌గా మారారు. చదువు అయిపోగానే నలుగురు కలిసి మొదట ఈ ప్రపంచాన్ని మొత్తం చుట్టేయాలనుకొన్నారు. ఈ ప్రయాణంలో జీవిత సత్యాన్ని న్వేషిద్దామనుకొన్నారు. అయితే దాని వల్ల తమకు ప్రపంచంతో పరిచయం ఏర్పడుతుందేమో కానీ, ప్రపంచానికి తాము పరిచయం కామన్న విషయాన్ని అర్థం చేసుకొన్నారు. ఈ ప్రపంచంలో తాము ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవాలంటే ఏదైనా సాధించాలనుకొన్నారు. అలా ఆలోచించిన ఆ మిత్రబృందం మొదలు పెట్టినదే ‘వార్బీ పార్కర్’. దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా సాగుతూ అందరి కళ్లకూ కనిపిస్తున్న కళ్ల జోడు కంపెనీ ఇది. దీని వ్యవస్థాపకులైన నలుగురు స్నేహితులే నీల్, ఆండ్రూ, జెఫ్రీ, డేవిడ్.
ఒక కళ్ల జోడు సెట్‌ను అమ్మితే... మరో కళ్ల జోడు సెట్‌ను అవసరార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం అనేది ఈ కంపెనీ సిద్ధాంతం! ఇదే సిద్ధాంతంతో నాలుగేళ్లలోనే దృష్టిలోపంతో బాధపడుతున్న అవసరార్థులకు ఏకంగా 50 లక్షల కళ్ల జోళ్లను ఉచితంగా పంపిణీ చేసింది ఈ సంస్థ. మెదడు, మనసు ఉన్న నలుగురు యువకుల ఆలోచన ఫలితంగా ఆవిష్కృతమైన కంపెనీ ఇది. ఒకవైపు నాణ్యతతోనూ, నవ్యతతోనూ వినియోగదారులను ఆకట్టుకొంటూనే.. స్వచ్ఛంద సేవలోనూ ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకొంది.
సేవకు వ్యాపారమే ఊతం!: దృష్టి దోషం ఉన్న వాళ్లకు అవసరమయ్యే కళ్ల జోళ్లను, సన్ గ్లాసెస్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ సంస్థ. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిధిలోని వార్తన్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డేవిడ్ గిల్ బో, నీల్ మెంథ్‌నల్, ఆండ్రూ హంట్, జెఫ్రీ రైడర్ లు తమకు తల్లిదండ్రులు ప్యాకెట్ మనీ కింద ఇచ్చిన 2,500 డాలర్ల పెట్టుబడితో ఈ కంపెనీని ప్రారంభించారు. ఒకవైపు వ్యాపారం చేస్తూనే తద్వారా వచ్చిన లాభంతో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనేది ఆ నలుగురు యువకుల ప్రణాళిక. మరి వీళ్ల లక్ష్యం మంచిది, వీళ్ల శ్రమ చిత్తశుద్ధితో కూడుకొన్నది.. దీంతో కళ్ల జోళ్లవాడకంపై మంచి క్రేజ్ ఉన్న అమెరికా దేశంలో ఆ కంపెనీకి కూడా మంచి ఆదరణ లభించింది. పెట్టుబడి తక్కువ కావడంతో.. తాము ఉత్పత్తి చేసిన కళ్లజోళ్లను ఎలా అమ్మాలో కూడా ఈ యువకులకు మొదట అర్థం కాలేదు. ఆ సమయంలో వీళ్లకు వోగ్‌డాట్‌కామ్ సహాయకారిగా నిలిచింది. ఈ నలుగురు యువకుల ప్రణాళికను, తపనను అందరికీ తెలియజెప్పింది. వీళ్ల వెబ్‌సైట్ అడ్రస్‌ను ఇచ్చి అమ్మకాలకు ఊపుతెచ్చింది. మీరు ఒక కళ్ల జోడును కొంటే, మేము అవసరార్థులకు ఉచితంగా ఒక కళ్ల జోడును పంపిణీ చేస్తాం(బయ్ వన్, గివ్ వన్) అనే విధానం నచ్చి చాలా మంది వీళ్ల ద గ్గరే కళ్ల జోళ్లను కొనసాగారు.
ఇండియాపైన దృష్టి...: దృష్టి లోపాలతో బాధపడుతూ కూడా కళ్లజోడును కొనుక్కోలేనంత పేదరికం ఉండేది పేద ఆఫ్రికా, ఆసియాదేశాల ప్రజల్లోనే. ఈ విషయం గ్రహించి వీళ్లు ముందుగా భారతదేశం, బంగ్లాదేశ్‌లపై దృష్టి సారించారు ఈ స్నేహితులు. విజన్ స్ప్రింగ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కళ్ల జోళ్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నాలుగేళ్లు గడిచే సరికి ఐదు మిలియన్ల కళ్ల జోళ్లను పంపిణీ చేయించి ఈ కంపెనీ బాసులుగా ఉన్న ఆ నలుగురు యువకులు తమ సత్తాను రెండు విధాలుగా చాటుకొన్నారు.
సాధారణ నేపథ్యం...: వీళ్ల ఆలోచన తీరు వైవిధ్యమైనది కానీ ఈ నలుగురూ చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. స్పష్టమైన విధానంతో చిన్న పెట్టుబడితో వీళ్లు వార్బీ పార్కర్‌ను మొదలు పెట్టగా.. తర్వాత అనేకమంది వీళ్లకు తోడయ్యారు. విరాళంగా డబ్బు ఇచ్చి ఆ కంపెనీని పెద్ద సంస్థగా రూపు దిద్దుకోవడానికి సహకారం అందించారు. అయితే ఇప్పటికీ ఈ సంస్థకు ఉన్న దుకాణాల సంఖ్య తక్కువే. ప్రధానంగా వెబ్‌సైట్ ఆధారంగానే అమ్మకాలు కొనసాగుతున్నాయి. ‘బయ్ వన్ -గివ్ వన్’అనే నినాదాన్ని అమలు పెట్టడం అనేది మాటల్లో చెప్పినంతటి సులభమైన వ్యవహారం కాదు. దానకర్ణులుగా పేరు పొందిన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా విరాళం విషయంలో ఇలాంటి విధానాన్ని అమల్లో పెట్టే సాహసం చేయలేదు. కానీ తాము అనుకొన్న విధానాన్ని అమలులో పెట్టి ఈ నలుగురు యువకులు తమ శక్తి యుక్తులు ఏ స్థాయివో నిరూపించారు.
ఈ నలుగురూ చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. స్పష్టమైన విధానంతో చిన్న పెట్టుబడితో వీళ్లు వార్బీ పార్కర్‌ను మొదలు పెట్టగా.. తర్వాత అనేక మంది వీళ్లకు తోడయ్యారు. విరాళంగా డబ్బు ఇచ్చి ఆ కంపెనీని పెద్ద సంస్థగా రూపు దిద్దుకోవడానికి సహకారం అందించారు.