‘కాఫీ’... మళ్లీ హ్యాపీ!
- ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం మళ్లీ ఆర్వీనగర్‌కు?
- మన్యానికి తెచ్చేందుకు అరకు ఎంపీ, పాడేరు ఎమ్మెల్యే చొరవ
- శాస్త్రవేత్తల అందుబాటుపై గిరిజన రైతుల్లో చిగురిస్తున్న ఆశ
గూడెంకొత్తవీధి: విశాఖ మన్యంలోని కాఫీ రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా కొన్నేళ్ల క్రితం మైదాన ప్రాంతానికి తరలిపోయిన ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రాన్ని తిరిగి ఆర్వీ నగర్‌కు తెచ్చేం దుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ కేంద్రం ద్వారా శాస్త్రవేత్తల సేవలు అందుబాటులోకి వస్తే కాఫీ సాగులో మంచి ఫలితాలు తీసుకురావచ్చన్న గిరిజన రైతుల ఆకాంక్ష మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పందించారు.
కాఫీ పరిశోధన కేంద్రాన్ని గత స్థానమైన ఆర్వీనగర్‌కు ప్రభుత్వం తరలించేలా తమ వంతు కృషి చేస్తుండటంపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జీకే వీధి మండలం ఆర్వీనగర్‌లో 1970లో ఏర్పాటైన ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం... 1990 దశకంలో నక్సల్స్ మందుపాతరలు పెట్టి పేల్చేయడంతో భద్రతా కారణాల రీత్యా జిల్లాలోని నర్సీపట్నానికి తరలిపోయిన సంగతి విదితమే.
దేశంలోనున్న ఆరు ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రాల్లో ఇదొకటి. అంతేకాదు మన రాష్ట్రంతో పాటు ఒరిశాలోని కాఫీ రైతులకు ఇదే సేవలు అందిస్తోంది. ఇప్పుడు మన్యంలో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఉండగా, వాటిపై సుమారు లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కాఫీసాగును ఉపాధి హామీ పథకం వర్తింపజేయడంతో గిరిజనులు మరింత మంది కాఫీ సాగుపై చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రైతులకు సూచనలు, సలహాలివ్వడం, అధిక దిగుబడినిచ్చే మేలుజాతి వంగడాల రూపకల్పన, విత్తనోత్పత్తి వంటి సేవలందించే కాఫీ పరిశోధన కేంద్రం అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. ఎన్నో విన్నపాల మేరకు ఆర్వీ నగర్‌లోని పూర్వ పరిశోధన కేంద్రాన్ని కాఫీ బోర్డు పరిశోధన క్షేత్రంగా మార్పు చేసింది.
ఈ క్షేత్రంలో ఫాం మేనేజర్‌తోపాటు తోటల పరిరక్షకులు, సాంకేతిక సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం అప్పుడప్పుడూ వచ్చి వెళ్తున్నారు. కాఫీ రైతులకు వారి సేవలు అంతగా అందుబాటులో ఉండట్లేదు. ఈ నేపథ్యంలో కాఫీ పరిశోధన కేంద్రాన్ని తిరిగి ఆర్వీ నగర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.