coffee farmer
-
కాఫీ రైతు హ్యాపీ.. అల్లూరి జిల్లాలో విరగ్గాసిన పండ్లు
అల్లూరి జిల్లాలో ఈ ఏడాది కాఫీ విరగ్గాసింది. ఎక్కడ చూసినా ఎర్రటి పండ్లతో తోటలు కళకళలాడుతున్నాయి. తోటలు మంచి కాపుకాయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు కూడా పండ్ల దశలోనే కొనుగోలు చేస్తుండడంతో వాటి సేకరణను రైతులు ప్రారంభించారు. తుఫాన్ కారణంగా ఇటీవల కురిసిన వర్షాలు అనుకూలంగా ఉండడంతో కాఫీ పంట విరగ్గాసిందని కాఫీ విభాగం అధికారులు అంటున్నారు.సాక్షి,పాడేరు: అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన అల్లూరి జిల్లాలో కాఫీకి ఈఏడాది కూడా మహర్దశ పట్టింది. కాయలు పక్వానికి వచ్చాయి. తోటల్లో విరగ్గాసిన ఎర్రని కాఫీ పండ్ల సేకరణను గిరిజన రైతులు ప్రారంభించారు. కాఫీ పంటను పండ్ల దశలోనే పాడేరు ఐటీడీఏతో పాటు గిరిజన రైతు ఉత్పత్తి సంఘాలు,పలు ఎన్జీవో సంస్థలు కొనుగోలు ప్రారంభించాయి. చింతపల్లి మాక్స్ సంస్థ ద్వారా పాడేరు ఐటీడీఏ రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. కాఫీ పండ్ల సేకరణలో కాఫీ రైతులు వారం రోజుల నుంచి బిజీగా ఉన్నారు. సేకరించిన పండ్లను ఐటీడీఏతో పాటు పలు సంస్థలు వెంటనే కొనుగోలు చేస్తూ పల్పింగ్ యూనిట్లకు తరలిస్తున్నాయి. జీసీసీ సిబ్బంది కూడా కాఫీ గింజలు కొనుగోలు చేస్తున్నారు.1.48 లక్షల ఎకరాల్లో ఫలసాయం పాడేరు డివిజన్లోని 11 మండలాల్లో 2.42 లక్షల ఎకరాల్లో కాఫీతోటలను గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వీటిలో 1.48 లక్షల ఎకరాల్లో ఫలసాయం ఇచ్చే కాఫీతోటలు ఉన్నాయి. ఆయా తోటల్లో కాఫీ పండ్లు విరగ్గాయడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గత ఏడాది 17వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజలను రైతులు విక్రయించారు. ఈ ఏడాది కూడా కాపు ఆశాజనకంగా ఉండడంతో 18వేల మెట్రిక్ టన్నుల వరకు కాఫీ గింజల ఉత్పత్తి ఉంటుందని కేంద్ర కాఫీబోర్డు,పాడేరు ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జీసీసీ,ఐటీడీఏలు గిట్టుబాటు ధరలు ప్రకటన ఈఏడాది కూడా గిరిజన రైతులు ఉత్పత్తి చేసే కాఫీ పంటకు ఎఫెక్స్ కమిటీ సిఫారసు మేరకు జీసీసీ,పాడేరు ఐటీడీఏలు గిట్టుబాటు ధరలను ప్రకటించాయి. చింతపల్లి మాక్స్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసే కాఫీ పండ్లకు కిలో రూ.44ధర చెల్లించేందుకు పాడేరు ఐటీడీఏ నిర్ణయించింది. పార్చ్మెంట్ కాఫీ గింజలను కిలో రూ.285 ధరతో, అరబికా చెర్రీ రకాన్ని కిలో రూ.150,రోబస్ట చెర్రీ రకాన్ని కిలో రూ.80కు కొనుగోలు చేయనున్నారు.డ్రైకాఫీ దిగుబడి ఎకరాకు 150 కిలోల వరకు ఉంటుంది. ఐటీడీఏ ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ఎకరాకు సుమారు రూ.40 వేల నుంచి 45 వేల వరకు రైతుకు ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది రూ. 8 కోట్లతో పండ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా ఐటీడీఏ నిర్ణయించుకోగా, రూ. 57 కోట్ల లావాదేవీలు నిర్వహించాలని జీసీసీ భావిస్తోంది. జిల్లా మొత్తం ఈ ఏడాది రూ.400 కోట్ల వరకూ కాఫీ లావాదేవీలు జరగవచ్చని భావిస్తున్నారు. పండ్ల సేకరణ ప్రారంభించాం నాకు ఉన్న రెండు ఎకరాల్లో కాఫీ తోటలు విరగ్గాసాయి. కాపు ఆశాజనకంగా ఉంది. రెండు రోజుల నుంచి పండ్ల సేకరణ జరుపుతున్నాం. గత ఏడాది కాఫీ పంట విక్రయం ద్వారా రూ.70వేల ఆదాయం వచ్చింది. ఈ సారి కాపు అధికంగా ఉండడంతో దిగుబడి పెరుగుతుందని ఆశిస్తున్నాను. సొంతంగా పల్పింగ్ చేసి పార్చ్మెంట్ కాఫీని తయారు చేసి జీసీసీకే విక్రయిస్తాను. – సుర్ర చిట్టిబాబు, కాఫీ రైతు, కరకపుట్టు,పాడేరు మండలంకాఫీ పంటకు గిట్టుబాటు ధర గిరిజన రైతులు సాగు చేస్తున్న కాఫీ పంట నాణ్యతలో నంబర్–1గా నిలుస్తుంది. కాఫీ ఉత్ప త్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. ఐటీడీఏ,జీసీసీ యంత్రాంగం ద్వారా కాఫీ రైతులకు మేలు చేసేలా గిట్టుబాటు ధరలను ప్రకటించాం. గిరిజనులు ఎలాంటి అపోహలకు గురికాకుండా కాఫీ పండ్లను ఐటీడీఏకు, పార్చ్మెంట్, అరబికా, రొబస్ట కాఫీ గింజలను జీసీసీకి విక్రయించి లాభాలు పొందాలి. దళారీలను ఆశ్రయించి మోసపోవద్దు. –ఎ.ఎస్.దినేష్ కుమార్, కలెక్టర్. -
‘కాఫీ’ నేలపాలు!
కోతదశలో హుదూద్ ధ్వంసం రూ. కోట్లలో గిరిజన రైతులకు నష్టం మొక్కల పెంపకానికి ఏళ్ల సమయం పాడేరు : ఏజెన్సీలోని కాఫీ రైతుకు పెద్ద కష్టమొచ్చింది. హుదూద్ దెబ్బతో కోత దశలో పంటంతా నేలపాలైంది. ప్రస్తుతం లక్షా 40 వేల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. వీటిలో సగానికి పైగా ధ్వంసమయ్యాయి. కాఫీ మొక్కలకు నీడనిచ్చే సిల్వర్‌ఓక్ చెట్లు పెద్ద ఎత్తున కూలడంతో అపార నష్టం సంభవించింది. కాఫీ రైతుకు ఇంతటి కష్టం రావడం ఇదే తొలిసారి. రూ.కోట్ల లో నష్టం వాటిల్లింది. వీటిలో అంతర పంటగా చేపట్టిన మిరియాల పాదులూ ధ్వంసమయ్యా యి. పరిస్థితి కుదుట పడాలంటే ఏళ్లు పడు తుందని అధికారులే అంటున్నారు. ఈ ఏడాది అనుకూల వాతావరణంతో 90 వేల ఎకరాల్లోని కాఫీ మొక్కలు విరగ్గాశాయి. ప్రస్తుతం ఈ తోటల్లోని కాయలన్నీ పక్వానికి వచ్చి కోతదశకు చేరుకున్నాయి. గతేడాదీ కాఫీ సాగు ఆశాజనకంగా ఉంది. ఆరు వేల టన్నుల క్లీన్ కాఫీ గింజల దిగుబడితోపాటు గిట్టుబాటు ధర కూడా దక్కింది. అప్పట్లో కిలో రూ.150-200ల వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. గిరిజన రైతులు నాలు గు డబ్బులు వెనకేసుకోగలిగారు. ఈ ఏడాది కూడా సుమారు 6,500 నుంచి ఏడు వేల టన్నుల వరకు దిగుబడులు ఉంటాయని కాఫీ బోర్డు అధికారులు భావించారు. ఆదా యం బాగుంటుందని ఆదివాసీ రైతులు ఆశపడ్డారు. ఇప్పుడు దిగుబడి సగం కూడా రాని పరిస్థితి. సాగుకాలాన్ని పరిగణలోకి తీసుకుని పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఐదేళ్లలోపు తోటలకు హెక్టారుకు రూ.10 వేలు, ఆరు నుంచి పదేళ్లలోపు తోటలకు రూ.15వేలు, పదేళ్లు దాటిన తోటలకు రూ.20 వేలు పరిహారం ఇస్తారట. గతేడాది తుపాను నష్టపరిహారం మన్యంలో ఎలా సాగిందో అందరికీ తెలిసిందే. కాఫీ పంట వ్యవసాయ, ఉద్యానవనశాఖల పరిధిలో లేదు. నష్టం అంచనాకు శాస్త్రవేత్తలు రావాల్సిందే. ఎత్తయిన కొండలు ఎక్కి వారు పరిశీలించాల్సి ఉంది. దీనికి ఎక్కువ సమయమే పడుతుంది. ఈ పరిస్థితుల్లో 2019 నాటికి కాఫీ సాగు విస్తీర్ణం 2.44 లక్షలకు ఏ మేరకు చేరుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
‘కాఫీ’... మళ్లీ హ్యాపీ!
ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం మళ్లీ ఆర్వీనగర్కు? మన్యానికి తెచ్చేందుకు అరకు ఎంపీ, పాడేరు ఎమ్మెల్యే చొరవ శాస్త్రవేత్తల అందుబాటుపై గిరిజన రైతుల్లో చిగురిస్తున్న ఆశ గూడెంకొత్తవీధి: విశాఖ మన్యంలోని కాఫీ రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా కొన్నేళ్ల క్రితం మైదాన ప్రాంతానికి తరలిపోయిన ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రాన్ని తిరిగి ఆర్వీ నగర్‌కు తెచ్చేం దుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ కేంద్రం ద్వారా శాస్త్రవేత్తల సేవలు అందుబాటులోకి వస్తే కాఫీ సాగులో మంచి ఫలితాలు తీసుకురావచ్చన్న గిరిజన రైతుల ఆకాంక్ష మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్పందించారు. కాఫీ పరిశోధన కేంద్రాన్ని గత స్థానమైన ఆర్వీనగర్కు ప్రభుత్వం తరలించేలా తమ వంతు కృషి చేస్తుండటంపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జీకే వీధి మండలం ఆర్వీనగర్లో 1970లో ఏర్పాటైన ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం... 1990 దశకంలో నక్సల్స్ మందుపాతరలు పెట్టి పేల్చేయడంతో భద్రతా కారణాల రీత్యా జిల్లాలోని నర్సీపట్నానికి తరలిపోయిన సంగతి విదితమే. దేశంలోనున్న ఆరు ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రాల్లో ఇదొకటి. అంతేకాదు మన రాష్ట్రంతో పాటు ఒరిశాలోని కాఫీ రైతులకు ఇదే సేవలు అందిస్తోంది. ఇప్పుడు మన్యంలో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఉండగా, వాటిపై సుమారు లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కాఫీసాగును ఉపాధి హామీ పథకం వర్తింపజేయడంతో గిరిజనులు మరింత మంది కాఫీ సాగుపై చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు సూచనలు, సలహాలివ్వడం, అధిక దిగుబడినిచ్చే మేలుజాతి వంగడాల రూపకల్పన, విత్తనోత్పత్తి వంటి సేవలందించే కాఫీ పరిశోధన కేంద్రం అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. ఎన్నో విన్నపాల మేరకు ఆర్వీ నగర్‌లోని పూర్వ పరిశోధన కేంద్రాన్ని కాఫీ బోర్డు పరిశోధన క్షేత్రంగా మార్పు చేసింది. ఈ క్షేత్రంలో ఫాం మేనేజర్‌తోపాటు తోటల పరిరక్షకులు, సాంకేతిక సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం అప్పుడప్పుడూ వచ్చి వెళ్తున్నారు. కాఫీ రైతులకు వారి సేవలు అంతగా అందుబాటులో ఉండట్లేదు. ఈ నేపథ్యంలో కాఫీ పరిశోధన కేంద్రాన్ని తిరిగి ఆర్వీ నగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.