‘కాఫీ’ నేలపాలు!
- కోతదశలో హుదూద్ ధ్వంసం
- రూ. కోట్లలో గిరిజన రైతులకు నష్టం
- మొక్కల పెంపకానికి ఏళ్ల సమయం
పాడేరు : ఏజెన్సీలోని కాఫీ రైతుకు పెద్ద కష్టమొచ్చింది. హుదూద్ దెబ్బతో కోత దశలో పంటంతా నేలపాలైంది. ప్రస్తుతం లక్షా 40 వేల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి. వీటిలో సగానికి పైగా ధ్వంసమయ్యాయి. కాఫీ మొక్కలకు నీడనిచ్చే సిల్వర్‌ఓక్ చెట్లు పెద్ద ఎత్తున కూలడంతో అపార నష్టం సంభవించింది. కాఫీ రైతుకు ఇంతటి కష్టం రావడం ఇదే తొలిసారి. రూ.కోట్ల లో నష్టం వాటిల్లింది. వీటిలో అంతర పంటగా చేపట్టిన మిరియాల పాదులూ ధ్వంసమయ్యా యి. పరిస్థితి కుదుట పడాలంటే ఏళ్లు పడు తుందని అధికారులే అంటున్నారు.
ఈ ఏడాది అనుకూల వాతావరణంతో 90 వేల ఎకరాల్లోని కాఫీ మొక్కలు విరగ్గాశాయి. ప్రస్తుతం ఈ తోటల్లోని కాయలన్నీ పక్వానికి వచ్చి కోతదశకు చేరుకున్నాయి. గతేడాదీ కాఫీ సాగు ఆశాజనకంగా ఉంది. ఆరు వేల టన్నుల క్లీన్ కాఫీ గింజల దిగుబడితోపాటు గిట్టుబాటు ధర కూడా దక్కింది. అప్పట్లో కిలో రూ.150-200ల వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. గిరిజన రైతులు నాలు గు డబ్బులు వెనకేసుకోగలిగారు.
ఈ ఏడాది కూడా సుమారు 6,500 నుంచి ఏడు వేల టన్నుల వరకు దిగుబడులు ఉంటాయని కాఫీ బోర్డు అధికారులు భావించారు. ఆదా యం బాగుంటుందని ఆదివాసీ రైతులు ఆశపడ్డారు. ఇప్పుడు దిగుబడి సగం కూడా రాని పరిస్థితి. సాగుకాలాన్ని పరిగణలోకి తీసుకుని పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఐదేళ్లలోపు తోటలకు హెక్టారుకు రూ.10 వేలు, ఆరు నుంచి పదేళ్లలోపు తోటలకు రూ.15వేలు, పదేళ్లు దాటిన తోటలకు రూ.20 వేలు పరిహారం ఇస్తారట.
గతేడాది తుపాను నష్టపరిహారం మన్యంలో ఎలా సాగిందో అందరికీ తెలిసిందే. కాఫీ పంట వ్యవసాయ, ఉద్యానవనశాఖల పరిధిలో లేదు. నష్టం అంచనాకు శాస్త్రవేత్తలు రావాల్సిందే. ఎత్తయిన కొండలు ఎక్కి వారు పరిశీలించాల్సి ఉంది. దీనికి ఎక్కువ సమయమే పడుతుంది. ఈ పరిస్థితుల్లో 2019 నాటికి కాఫీ సాగు విస్తీర్ణం 2.44 లక్షలకు ఏ మేరకు చేరుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.