న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) టోక్యో ఒలింపిక్స్ షెడ్యూలు ప్రకారమే జరగాలని ఆశిస్తోంది. ప్రాణాంతక వైరస్ కోవిడ్–19 ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ మెగా ఈవెంట్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉండటంతో అప్పటివరకు వైరస్ నియంత్రణలోకి రావొచ్చని ఐఓఏ భావిస్తోంది. జరిపి తీరాలనే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయానికి ఒకరకంగా ఐఓఏ మద్దతు పలుకుతోంది. ఐఓసీ, టోక్యో గేమ్స్ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన అత్యవసర సమావేశంలో ఒలింపిక్స్ నిర్వహణ దిశగానే అడుగులు వేస్తామని ఐఓసీ స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు అసాధారణ నిర్ణయాలేవీ (రద్దు, వాయిదా) తీసుకోలేమని కూడా చెప్పింది. దీంతో కొందరు చాంపియన్ అథ్లెట్లు తీవ్రంగా స్పందించారు. అథ్లెట్లు, ప్రజారోగ్యం పట్టదా అని ఐఓసీపై మండిపడ్డారు. అయితే ఐఓఏ మాత్రం నిర్వహణ నిర్ణయానికి మద్దతుగా వ్యాఖ్యలు చేసింది.
‘కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించడం నిజమే... కానీ ఒకట్రెండు నెలల్లో ఈ వైరస్ అదుపులోకి రాగలదని విశ్వసిస్తున్నాం. ఎందుకంటే కరోనా పుట్టిన చైనాలోనే నియంత్రణలోకి వచ్చేసింది. దీంతో మిగతా దేశాల్లోనూ అప్పటిలోగా తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నాం. అలాగే ఒలింపిక్స్ కూడా ఎలాంటి అడ్డంకుల్లేకుండా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని భావిస్తున్నాం’ అని సీనియర్ ఐఓఏ అధికారి ఒకరు వివరించారు. ఐఓసీ తమకు మాతృ సంస్థ అని, తప్పకుండా ఐఓసీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి వల్ల భారత అథ్లెట్ల సన్నాహకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని... అయినప్పటికీ మెగాఈవెంట్లో రెండంకెల పతకాలు సాకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఒలింపిక్ సంఘం సంబంధిత సమాఖ్యలతో, అథ్లెట్లతో టచ్‌లో ఉందని, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తుందని చెప్పారు. భారత ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తాము నడుచుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment