Olympic Committee
-
జితేందర్‌రెడ్డి వర్సెస్ చాముండేశ్వరనాథ్
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం.. కోర్టు వివాదాలు ముగిసిన తర్వాత తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 21న ఒలింపిక్ భవన్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లోనే ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇచ్చినా, వేర్వేరు కారణాలతో ఈ ప్రక్రియ కోర్టుకు చేరింది. ఇప్పుడు అన్నీ చక్కబడటంతో రాష్ట్రంలోని వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు బరిలో నిలిచారు. మొత్తం 68 మంది ఓటర్లు ఉండగా, ముగ్గురికి ఓటింగ్ అర్హత లేదని రిటరి్నంగ్ అధికారి ప్రకటించారు. దీంతో 65 ఓట్ల నుంచే విజేత ఎవరో తేలనుంది. ప్రధానంగా అధ్యక్ష పదవిపైనే పోటీ నెలకొంది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో కేబినెట్ హోదాలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న ఏపీ జితేందర్‌రెడ్డి (రోయింగ్ సంఘం) అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘంలో కూడా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోపాటు క్రీడా సంఘాల్లో తనకున్న పరిచయాలు గెలిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు. అయితే మరోవర్గం నుంచి ఆంధ్ర మాజీ క్రికెటర్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరనాథ్ ప్రత్యర్థిగా ఉన్నారు.ఓటింగ్‌కంటే ముందే జితేందర్‌ను పోటీ నుంచి తప్పించి తాను గెలిచేందుకు చాముండి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి కీలకాంశాన్ని ఆయన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) దృష్టికి తీసుకెళ్లారు. 70 ఏళ్లు దాటిన జితేందర్‌రెడ్డి పోటీకి అనర్హుడన్నారు. పైగా ఓటర్ల జాబితాలో పలు తప్పులు జరిగినట్టు ఆయన చెబుతున్నారు. నిజానికి తెలంగాణ ఒలింపిక్ సంఘంలో కొంతకాలంగా వివాదాలు సాగుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులను సమీక్షించే ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా వీఏ షియాద్తో ఐఓఏ ఏకసభ్య కమిటీని నియమించింది. దీనికి 10 డిసెంబర్ వరకు గడువు ఇచ్చింది.కాబట్టి ఈ నివేదిక వచ్చే వరకు ఎన్నికలను నిలిపి వేయాల్సిందిగా చాముండి కోరుతున్నారు. అయితే తాను నామినేషన్ వేసిన సమయంలో 70 ఏళ్లలోపే ఉన్నానని, కోర్టుల కారణంగా ఆలస్యమైతే అది తనకు వర్తించదని జితేందర్ స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం పి.మల్లారెడ్డి (సైక్లింగ్ సంఘం), సి.బాబూరావు (బాక్సింగ్), కోశాధికారి పదవికి సతీశ్ గౌడ్ (తైక్వాండో), ప్రదీప్‌కుమార్ (కయాకింగ్ అండ్ కనోయింగ్) పోటీ పడుతున్నారు. అధ్యక్ష, కార్యదర్శి పదవులకు మినహా మిగతా అన్ని పదవులకు ఏకగ్రీవ ఎంపిక జరగడం ఖాయమైంది. -
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంపై భారత్ దృష్టి
ముంబై: విశ్వక్రీడల ఆతిథ్యంపై భారత్ దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్స్ ప్రారం¿ోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మోదీ మాట్లాడుతూ ‘ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారతీయులంతా ఎదురుచూస్తున్నారు. 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే ప్రణాళికల్లో ఉన్నాం. ఇది 140 కోట్ల భారతీయుల కల. దీన్ని ఐఓసీ సహకారంతో సాకారం చేస్తాం. దీనికంటే ముందు 2029లో యూత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు మేం రెడీగా ఉన్నాం’ అని మోదీ అన్నారు. క్రీడాస్ఫూర్తి అనేది విశ్వవ్యాప్తమని, ఇందులో పరాజితులెవరూ ఉండరని... కేవలం విజేతలు, నేర్చుకునేవారే ఉంటారని మోదీ చెప్పారు. 141వ ఐఓసీ సెషన్స్ శనివారం నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయి. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కొత్త క్రీడాంశాలకు చోటు కలి్పంచడం, ఓటింగ్, ఆమోదం తదితర నిర్ణయాలను ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు తీసుకుంటుంది. -
రష్యా ఒలింపిక్ కమిటీపై నిషేధం
ఒలింపిక్ నియమావళిని ఉల్లంఘించినందుకు రష్యా ఒలింపిక్ కమిటీపై అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ (ఐఓసీ) నిషేధం విధించింది. ముంబైలో గురువారం జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని... తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుంది. అయితే ఈ నిర్ణయంవల్ల రష్యా క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఐఓసీ తెలిపింది. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో, వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో రష్యా క్రీడాకారులు స్వతంత్ర క్రీడాకారులుగా పోటీపడవచ్చని ఐఓసీ వివరణ ఇచ్చింది. -
అసలు ఈ మగాళ్లకు ఏమైంది!
టోక్యో ఒలింపిక్స్ కమిటీ నుంచి మళ్లీ ఇంకొకాయన దిగిపోయారు! పేరు హిరోషి ససాకి. తీరు బాయిష్ టాక్. వయసు 66. బుద్ధి వికసించని మగపిల్లలు.. ఎదుగుతున్న వయసులోని ఆడపిల్లల్ని బాడీ షేమింగ్ చేస్తుంటారు. అలా ఈయన నవోమి వతనబి అనే 33 ఏళ్ల ‘చబ్బీ అండ్ క్యూట్’ మూవ్మెంట్ సెలబ్రిటీని ‘ఒలిం–పిగ్’ అనేశాడు! అన్నది ఎప్పుడో. ఇప్పుడు బయట పడింది. ‘లైవ్’ అనే చాట్ గ్రూప్ లో.. ‘ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి ఆ ఒలిం–పిగ్ ని ఆహ్వానిద్దాం‘ అన్నారట హిరోషి. ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు ఉత్సవాల నిర్వహణ కమిటీకి క్రియేటివిటీ హెడ్ ఆయన. క్రియేటివిటీ కాస్త మితి, మతి తప్పినట్లుంది... అంత మాట అనేసి, అపాలజీ చెబుతూ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితమే యెషిరో అనే 83 ఏళ్ల పెద్ద మనిషి.. ‘ఈ మహిళలున్నారే మీటింగ్స్‌లో అధిక ప్రసంగం చేస్తారు’ అని కామెంట్ చేసి, ‘స్టెప్ డౌన్’ అయ్యారు. ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆయన! అసలు ఈ మగాళ్లకు ఏమైంది! ఎందుకిలా ‘బాయ్స్’ లా మాట్లాడతారు? ఇందుకు వాళ్లేం (పురుషులు) చెబుతున్నారు? వీళ్లేం (మహిళలు) అంటున్నారు. నవోమి వతనబి ప్లస్–సైజ్ కమెడియన్. వసపిట్ట. మాటలతో పొట్టల్ని చెక్కలు చేస్తారు. ఆమెను చూడగానే నవ్వు గుర్తుకు రావడానికి ఆమె మాటలతో పాటు ఆమె రూపం కూడా కొంత కారణం. లావుగా ఉంటారు నవోమి. ప్లస్–సైజ్‌లో! ఆమె నవ్వింపులు, కవ్వింపుల టాపిక్ కూడా అదే.. ప్లస్ సైజ్. లావుగా ఉండటాన్ని తను సీరియస్‌గా తీసుకోరు, ఎవర్నీ తీసుకోనివ్వరు కూడా. బాడీ షేమింగ్ చేసేవాళ్లని తన మృదువైన చిరునవ్వు పలుకులతో బాది పడేస్తారు. జపాన్ రాజధాని టోక్యోలో ఏ పెద్ద ఈవెంట్ జరిగినా ఉల్లాసభరితమైన ఆమె స్వాగత వచనాలతో అది ప్రారంభం కావడం కానీ, ముగింపునకు రావడం కానీ జరుగుతుంది. అంతగా ఆమె పావులర్ అవడానికి ఇంకొక కారణం ‘పొచాకవాయి’! ఈ మాటను ఇంగ్లిష్‌లోకి అనువదిస్తే ‘చబ్బీ అండ్ క్యూట్’ అనే అర్థం వస్తుంది. బొద్దుగా, ముద్దుగా అని. లావుగా ఉన్నవాళ్లలో సాధారణంగా ఉండే చిన్నబుచ్చుకునే స్వభావాన్ని పోగొట్టి, లావుగా ఉన్నవాళ్లను చిన్నబుచ్చే వాళ్లను ‘కాస్త విశాలంగా ఆలోంచించండి’ అని చెప్పడానికి నవోమి చేపట్టిన ఉద్యమం పేరే.. పొచాకవాయి. అలా ఉద్యమకారిణిగా కూడా జపాన్‌లో నవోమికి పేరుంది, గౌరవం ఉంది. అంతటి మనిషిని పట్టుకుని హిరోషి ససాకి (66) అనే పెద్ద మనిషి పిగ్ అనేశాడు! సరిగ్గా ఆయన అన్న మాటైతే.. ‘ఒలిం–పిగ్’ అని! పెద్దమనుషులు ఎక్కడైనా అలా అంటారా? ‘‘నోరు జారాను సారీ’’ అన్నారు కనుక హిరోషిని పెద్దమనిషి అనే అనుకోవాలి. అంతేకాదు తన పదవికి బుధవారం రాత్రి రాజీనామా చేశారు. చిన్న పదవి కాదు ఆయనది. టోక్యోలో ఈ ఏడాది జరగబోతున్న ఒలింపిక్స్‌కి ప్రారంభ, ముగింపు ఉత్సవాలను నిర్వహించే కమిటికీ క్రియేటివ్ హెడ్! సికొ హషిమొటో, ఒలింపిక్స్ కమిటీ కొత్త అధ్యక్షురాలు ఆయన అలా అన్నందుకు నవోమీ ఏమీ బాధపడలేదు. పురుషుల గుణగణాలు ఆమెకు తెలియనివేవీ కాదు. హిరోషి మాత్రం పశ్చాత్తాపంతో కుమిలిపోయినంత పని చేశాడు. ‘నేను ఆమెను అవమానపరిచాను. అలా అని ఉండాల్సింది కాదు’ అంటూ.. రాజీనామా సమర్పణకు ముందు ఆమెకు సారీ చెబుతూ ఒక ప్రకటన చేశారు. ‘ఒలిం–పిగ్’ అని హిరోషి ఇప్పుడు అన్నమాట కాదు. గత ఏడాది ఆఖరులో.. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవాలకు ఎవరెవర్ని పిలవాలో టీమ్ అంతా కలిసి, మెసేజింగ్ యామ్ ‘లైన్’లో గ్రూప్ చాటింగ్ చేస్తున్నప్పుడు.. ‘ఆమె ఉంది కదా నవోమీ.. ఆమెకు ఒలింపిగ్ రోల్ ఇద్దాం. సరిగ్గా సరిపోతుంది’ అన్నారు హిరోషి. ఆమె లావుగా ఉంటుంది కనుక, తను క్రియేటివ్ హెడ్డు కనుక ఆమె లావును, తన క్రియేటివిటీని కలిపి ఒలిం–పిగ్ అనే మాటను వాడేశారు హిరోషి. దాన్నిప్పుడు ఒక పత్రిక బయట్టేసింది! ఆ మాట చివరికి అతడికే తలవంపులు తెచ్చిపెట్టింది. తల దించుకుని మెట్లు దిగి వెళ్లిపోయాడు. నవోమి కమెడియన్ మాత్రమే కాదు, నటి, ఫ్యాషన్ డిజైనర్ కూడా. తనని పిగ్ అన్నందుకు ఆమె రాద్ధాంతం ఏమీ చెయ్యలేదు. ‘‘పురుషులు ఎందుకనో ఇలాగే ఉంటారు. సంస్కారవంతులు అనుకున్నవాళ్లు కూడా తమ సమూహంలో ఉన్నప్పుడు ఆడవాళ్లను తేలిగ్గా మాట్లాడతారు. అది గొప్ప అనుకుంటారు’’ అని ఈ చేదు సందర్భంలోనూ తియ్యగా నవ్వించారు నవోమి. హిరోషి కూడా.. ‘‘ఆరోజు నాకేమయిందో తెలియదు. నా ఆలోచనలు సరిగా లేవు. ఒక స్త్రీని నేను అలా అనగలనని ఇప్పటికీ అనుకోలేకపోతున్నాను. మాట జారాను. నేను ఇక ఈ సీట్లో ఉండేందుకు తగినవాడిని కాదు’’ అని ఏమాత్రం సంకోచించకుండా తన గురించి చెప్పుకున్నారు. ‘పురుషజాతి ప్రక్షాళనకు ఆ ఒప్పుకోలు మాట ఒక్కటి చాలు’ అనిపించేటంతగా ఆయన తనని మన్నించమని మహిళా లోకాన్ని వేడుకున్నారు. ఐ యామ్ వెరీ సారీ యొషిరొ మొరి: తన విపరీత వ్యాఖ్యలతో కొత్త అధ్యక్షురాలు రావడానికి కారణమైన పాత అధ్యక్షుడు. టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కమిటీలో ఇది రెండో అతిపెద్ద రాజీనామా. అది కూడా ఒక నెల వ్యవధిలో జరిగిన మహాభినిష్క్రమణ. ఫిబ్రవరి రెండో వారంలో కమిటీ ముఖ్యాధ్యక్షుడు యొషిరొ మొరి (83).. మహిళల మీద తగని వ్యాఖ్యాలు చేసినందుకు గద్దె దిగి వెళ్లిపోవలసి వచ్చింది. ఒలింపిక్స్ నిర్వహణకు అనేక కమిటీలు ఉంటాయి. వాటన్నిటిపైన ఉండే అత్యున్నత కమిటీకి యొషిరో అధ్యక్షులు. ఆ రోజు ఏదో కీలకమైన సమావేశం ఉంది. అది పూర్తయ్యాక ఆ వివరాలు ఇవ్వడం కోసం యొషిరో మీడియా ముందుకు వచ్చారు. మీడియా వాళ్లు సహజంగానే వెయ్యవలసిన ప్రశ్నే వేశారు. ‘‘మీ కమిటీలో నామమాత్రంగా కూడా మహిళలు ఉన్నట్లు లేరు. కారణం ఏమిటి?’’ అని అడిగారు. యోషిరో వెంటనే.. ‘‘ఆడవాళ్లు మీటింగులలో అధిక ప్రసంగం చేస్తారు. సమయం వృధా అవుతుంది. అందుకే వాళ్లను కమిటీలోకి తీసుకునే ఉద్దేశం లేదు’’ అనేశారు! అది దెబ్బకొట్టేసింది ఆయన ప్రతిష్టని. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, యూనివర్సిటీ విద్యార్థులు, విద్యావంతులు నిరసన ప్రదర్శనలు జరిపారు. తక్షణం ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో పెద్దవాళ్ల నుంచి కూడా ఒత్తిడి రావడంతో చివరికి ఆయన తన పదవిని త్యజించవలసి వచ్చింది. ఆయన స్థానంలోకి సికో హషిమొటొ అనే మహిళ వచ్చారు. వచ్చీ రావడంతోనే కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డులోకి పన్నెండు మంది మహిళల్ని తీసుకున్నారు. ‘‘నేను అన్న ఉద్దేశం వేరు. మహిళలు కమిటీలో ఉంటే వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ఒకే అంశంపై వాళ్లను ఉంచలేము. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అలా అన్నాను తప్ప మహిళల్ని కించపరచాలని కాదు. నాకసలు అలాంటి ఆలోచనే లేదు’’ అని యొషిరో అననైతే అన్నారు కానీ మూల్యమైతే చెల్లించుకోవలసి వచ్చింది. పురుషులు అనే ఇటువంటి మాటల్ని ‘సెక్సిస్టు కామెంట్స్’ అంటారు. తెలుగులో ఈ మాటకు సులువైన అర్థం.. ‘నేను మగాణ్ణి. ఏమైనా అంటాను’ అనే ధోరణితో కూడిన వ్యాఖ్యలు. నిజానికి అది ధోరణి కాదు. తరాలుగా జీర్ణించుకుపోయిన పురుషాధిక్య భావన. ఏమైనా పురుషులు ఇప్పుడిప్పుడు మహిళల మనోభాలు దెబ్బతినకుండా మాట్లాడ్డం నేర్చుకుంటున్నారు. ఆ ప్రయత్నంలోనే.. మాట అన్నాక ఏ మాత్రం రోషానికి పోకుండా మాటను వెనక్కు తీసుకుంటున్నారు. క్షమాపణ చెబుతున్నారు. ‘మారేందుకు సమయం పట్టడం సహజమే’ అని మహిళలూ సహనంగా వేచి చూస్తున్నారు. -
మళ్లీ టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయం
టోక్యో: కరోనా కారణంగా ఇప్పటికే వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి వాయిదా వేసే ప్రసక్తే లేదని ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జూలై 23వ తేదీనే ఒలింపిక్స్ ప్రారంభమవుతాయని ఆయన పునరుద్ఘాటించారు. ‘2021లో అనుకున్న సమయానికే క్రీడలు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి వాయిదా అనేది ఉండదు. ఇప్పటికే ఒక ఏడాది పొడిగించాం. ఇంకో ఏడాది పొడిగించడమనేది అసంభవం. గతంలోనే మేం ప్రధానితో రెండేళ్ల వాయిదా గురించి చర్చించాం. కానీ ఇందులో ఎదురయ్యే లెక్కకు మిక్కిలి ఇబ్బందుల గురించి చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని మోరీ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 వ్యాప్తి ఇప్పటికీ నియంత్రణలోకి రాకపోవడంతో 2021లోనూ ఈ మెగా ఈవెంట్ నిర్వహణ సాధ్యం కాదంటూ పలువురు నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
డోలాయమానంలో టోక్యో ఒలింపిక్స్!
టోక్యో: అసలే విశ్వక్రీడలు అనుకున్న సమయంలో జరగకపోవడంతో నిరుత్సాహానికి గురైన క్రీడా లోకంపై టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) తోషిరో ముటో మరో బాంబు పేల్చే వ్యాఖ్యనొకటి వదిలారు. వచ్చే ఏడాది జూలై 23కి వాయిదా పడిన ఒలింపిక్స్ అప్పుడైనా సరైన సమయంలో జరుగుతాయనే హామీ ఇవ్వలేమని చావుకబురు చల్లగా చెప్పారు. దీంతో 2021 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు ఈ మెగా ఈవెంట్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘వచ్చే ఏడాది జూలై నాటికి కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి అదుపులోకి వస్తుందని నమ్మకంగా ఎవరూ చెప్పలేరు. ఈ పరిస్థితుల్లో క్రీడల నిర్వహణ అనుకున్న సమయానికే జరుగుతుందనే కచ్చితమైన హామీ ఇవ్వలేం. ప్రస్తుతం క్రీడలకు ప్రత్యామ్నాయాలు వెతకడం కన్నా మనముందున్న సవాలుపై సమష్టిగా పోరాటం చేయాలి. మానవజాతి అంతా ఏకమై తమ మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ కరోనా మహమ్మారికి చికిత్స, వ్యాక్సిన్, మందులు కనిపెట్టేందుకు శ్రమించాలి’ అని ముటో పేర్కొన్నాడు. -
అనుకున్నట్లుగానే జరగాలనుకుంటున్నాం
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) టోక్యో ఒలింపిక్స్ షెడ్యూలు ప్రకారమే జరగాలని ఆశిస్తోంది. ప్రాణాంతక వైరస్ కోవిడ్–19 ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ మెగా ఈవెంట్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉండటంతో అప్పటివరకు వైరస్ నియంత్రణలోకి రావొచ్చని ఐఓఏ భావిస్తోంది. జరిపి తీరాలనే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయానికి ఒకరకంగా ఐఓఏ మద్దతు పలుకుతోంది. ఐఓసీ, టోక్యో గేమ్స్ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన అత్యవసర సమావేశంలో ఒలింపిక్స్ నిర్వహణ దిశగానే అడుగులు వేస్తామని ఐఓసీ స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు అసాధారణ నిర్ణయాలేవీ (రద్దు, వాయిదా) తీసుకోలేమని కూడా చెప్పింది. దీంతో కొందరు చాంపియన్ అథ్లెట్లు తీవ్రంగా స్పందించారు. అథ్లెట్లు, ప్రజారోగ్యం పట్టదా అని ఐఓసీపై మండిపడ్డారు. అయితే ఐఓఏ మాత్రం నిర్వహణ నిర్ణయానికి మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. ‘కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించడం నిజమే... కానీ ఒకట్రెండు నెలల్లో ఈ వైరస్ అదుపులోకి రాగలదని విశ్వసిస్తున్నాం. ఎందుకంటే కరోనా పుట్టిన చైనాలోనే నియంత్రణలోకి వచ్చేసింది. దీంతో మిగతా దేశాల్లోనూ అప్పటిలోగా తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నాం. అలాగే ఒలింపిక్స్ కూడా ఎలాంటి అడ్డంకుల్లేకుండా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని భావిస్తున్నాం’ అని సీనియర్ ఐఓఏ అధికారి ఒకరు వివరించారు. ఐఓసీ తమకు మాతృ సంస్థ అని, తప్పకుండా ఐఓసీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి వల్ల భారత అథ్లెట్ల సన్నాహకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని... అయినప్పటికీ మెగాఈవెంట్లో రెండంకెల పతకాలు సాకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఒలింపిక్ సంఘం సంబంధిత సమాఖ్యలతో, అథ్లెట్లతో టచ్‌లో ఉందని, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తుందని చెప్పారు. భారత ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తాము నడుచుకుంటున్నట్లు తెలిపారు. -
2032 ఒలింపిక్స్ రేసులో ఉభయ కొరియాలు
సియోల్: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ను ఉమ్మడిగా నిర్వహించేందుకు తాము సిద్ధం అంటున్నాయి దాయాది దేశాలైన ఉత్తర, దక్షిణ కొరియా. తమ రాజధానులు ప్యాంగ్యాంగ్, సియోల్‌లలో 2032 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే యోచనలో ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం స్విట్జర్లాండ్‌లో సమావేశం కానున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి సమాచారం ఇవ్వనున్నాయి. 2018లోదక్షిణ కొరియాలోని పియాంగ్‌చాంగ్‌లో జరిగిన శీతాకాల ఒలింపిక్స్‌కు ఉత్తర కొరియా తమ జట్లను పంపడంతో రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలు మెరుగుపడ్డాయి. మరోవైపు తమ ద్వీపకల్పంలో ఉద్రిక్తతల నివారణ, శాంతి స్థాపనకు దోహదపడుతుందని భావించి ఉమ్మడి ఆతిథ్యం పట్ల దక్షిణ కొరియా చొరవ చూపింది. గతేడాది రెండు దేశాల అంతర్గత చర్చల్లో ఆ ప్రస్తావన తెచ్చింది. గతంలో దక్షిణ కొరియా 1988లో సియో ల్లో ఒలింపిక్స్ నిర్వహించింది. ఉత్తర కొరియా వాటిని బహిష్కరించింది. అయితే, ఉత్తర కొరియా రాజకీయ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి బిడ్ నెగ్గడం కష్టమే. -
బీడబ్ల్యూఎఫ్‌లో ఒలింపిక్ కమిటీ ప్రతినిధిగా సైనా
హైదరాబాద్: భారత బ్యా డ్మింటన్ స్టార్ సైనా నెహ్వా ల్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్)లో ఒలింపిక్ కమిటీ ప్రతినిధిగా వ్యవహరించనుంది. గతేడాది రియో ఒలింపిక్స్ ఈవెంట్ ముగిసిన వెంటనే ఆమె అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లోని అథ్లెట్స్ కమిషన్ (ఏసీ) సభ్యురాలిగా నియమితులైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెను బీడబ్ల్యూఎఫ్ ప్యానెల్ సభ్యురాలిగా కూడా నియమించారు. ఈ విషయాన్ని ప్యానెల్‌లోని ఇతర సభ్యులకు తెలియజేసినట్లు బీడబ్ల్యూఎఫ్ ఏసీ తెలిపింది. రియో ఒలింపిక్స్‌లో గాయపడిన ఆమె శస్త్రచికిత్సతో కొన్నాళ్లు ఆటకు దూరమైంది. ఇటీవల మళ్లీ రాకెట్ పట్టిన ఆమె మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో టైటిల్ సాధిం చింది. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న సైనా... వచ్చే నెలలో జరిగే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌పై కన్నేసింది. -
వివాదాస్పద లోగో రద్దు
జపాన్ ఒలింపిక్ లోగో వివాదాల్లోచిక్కుకుంది. 2020లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కోసం ప్రముఖ డిజైనర్ కెన్జిరో సోనో రూపొందించిన లోగో వివాదాస్పదమైంది. దీంతో టోక్యో ఒలింపిక్ కమిటీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. లోగోను వాడద్దంటూ నిర్ణయం తీసుకుంది. అయితే అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ జపాన్ నేషనల్ మీడియా ఈ విషయాలను దృవీకరించింది. జూన్ లో లాంఛ్ చేసిన ఈ డిజైన్.. తన ధియేటర్ కంపెనీ లోగోను కాపీకొట్టి రూపొందించారని బెల్జియన్ డిజైనర్ ఒలివర్ డెబి ఆరోపించాడు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ముందుకు తీసుకెళ్లాడు. టోక్యో లోగో టీ ఫర్ టోక్యో, టుమారో, టీమ్ అని తెలిపేలా రూపొందించారు. వీటిపైన హార్ట్ బీట్ కు గుర్తుగా ఎర్ర బిందువు ఏర్పాటు చేశారు. మరో వైపు నలుపు బ్యాగ్రౌండ్ పైన తెలుపు అక్షరాలతో రూపొందించిన బెల్జియన్ ధియేటర్ లోగో దాదాపు ఇలాంటి ఆకారంలోనే ఉంది. ఐఓసీ అధికారులు మాత్రం దీనిపై పెదవి విప్పటం లేదు. -
2019 ఆసియా క్రీడలను నిర్వహించలేం
తేల్చి చెప్పిన వియత్నాం హనోయి: ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రతీ దేశం ఎదురుచూస్తుంటుంది. ఆ అవకాశం దక్కాలే కానీ తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతుంటాయి. కానీ వియత్నాం పరిస్థితి అలా లేదు. 2019లో జరిగే 18వ ఆసియా గేమ్స్‌ను నిర్వహించేందుకు ఈ దేశం అర్హత సాధించింది. కానీ అందివచ్చిన ఈ అవకాశాన్ని ఇప్పుడు కాదనుకుంటోంది. ఇలాంటి పెద్ద ఈవెంట్స్‌ను గతంలో నిర్వహించిన అనుభవం లేకపోవడంతో పాటు, దేశంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వియత్నాం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ విషయమై ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఆసియా (ఓసీఏ)తో చర్చిస్తామని ప్రభుత్వ వెబ్సైట్లో పేర్కొంది. ఈ గేమ్స్ నిర్వహణకు కొత్త స్టేడియాలు, అథ్లెటిక్స్ విలేజి నిర్మాణాలకు 150 మిలియన్ల డాలర్లు ఖర్చు కాగలవని అధికారులు అంచనా వేశారు. కానీ వాస్తవంగా అంతకు మించే అవుతుందని నిపుణులు తేల్చిచెప్పారు. అంతులేని అవినీతితోపాటు బ్యాంకింగ్ రంగాల్లో నష్టాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో వెంటనే ఈ గేమ్స్ నిర్వహణ నుంచి తప్పుకుని ఆ వ్యయాన్ని ఇతర ముఖ్య అవసరాలకు వినియోగించాలని కొద్దికాలంగా దినపత్రికలు, ఇంటర్నెట్ బ్లాగ్స్లో వ్యాసాలు, కథనాలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో వియత్నాం ఆసియా గేమ్స్ నుంచి తప్పుకునేందుకే నిర్ణయం తీసుకుంది. -
వింటర్ ఒలింపిక్స్ సందడి ప్రారంభం