రేపు తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం.. కోర్టు వివాదాలు ముగిసిన తర్వాత తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 21న ఒలింపిక్ భవన్‌లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లోనే ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇచ్చినా, వేర్వేరు కారణాలతో ఈ ప్రక్రియ కోర్టుకు చేరింది. ఇప్పుడు అన్నీ చక్కబడటంతో రాష్ట్రంలోని వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు బరిలో నిలిచారు. మొత్తం 68 మంది ఓటర్లు ఉండగా, ముగ్గురికి ఓటింగ్ అర్హత లేదని రిటరి్నంగ్ అధికారి ప్రకటించారు. దీంతో 65 ఓట్ల నుంచే విజేత ఎవరో తేలనుంది. ప్రధానంగా అధ్యక్ష పదవిపైనే పోటీ నెలకొంది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో కేబినెట్ హోదాలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న ఏపీ జితేందర్‌రెడ్డి (రోయింగ్ సంఘం) అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘంలో కూడా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోపాటు క్రీడా సంఘాల్లో తనకున్న పరిచయాలు గెలిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు. అయితే మరోవర్గం నుంచి ఆంధ్ర మాజీ క్రికెటర్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరనాథ్ ప్రత్యర్థిగా ఉన్నారు.
ఓటింగ్‌కంటే ముందే జితేందర్‌ను పోటీ నుంచి తప్పించి తాను గెలిచేందుకు చాముండి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి కీలకాంశాన్ని ఆయన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) దృష్టికి తీసుకెళ్లారు. 70 ఏళ్లు దాటిన జితేందర్‌రెడ్డి పోటీకి అనర్హుడన్నారు. పైగా ఓటర్ల జాబితాలో పలు తప్పులు జరిగినట్టు ఆయన చెబుతున్నారు. నిజానికి తెలంగాణ ఒలింపిక్ సంఘంలో కొంతకాలంగా వివాదాలు సాగుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులను సమీక్షించే ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా వీఏ షియాద్‌తో ఐఓఏ ఏకసభ్య కమిటీని నియమించింది. దీనికి 10 డిసెంబర్ వరకు గడువు ఇచ్చింది.
కాబట్టి ఈ నివేదిక వచ్చే వరకు ఎన్నికలను నిలిపి వేయాల్సిందిగా చాముండి కోరుతున్నారు. అయితే తాను నామినేషన్ వేసిన సమయంలో 70 ఏళ్లలోపే ఉన్నానని, కోర్టుల కారణంగా ఆలస్యమైతే అది తనకు వర్తించదని జితేందర్ స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం పి.మల్లారెడ్డి (సైక్లింగ్ సంఘం), సి.బాబూరావు (బాక్సింగ్), కోశాధికారి పదవికి సతీశ్ గౌడ్ (తైక్వాండో), ప్రదీప్‌కుమార్ (కయాకింగ్ అండ్ కనోయింగ్) పోటీ పడుతున్నారు. అధ్యక్ష, కార్యదర్శి పదవులకు మినహా మిగతా అన్ని పదవులకు ఏకగ్రీవ ఎంపిక జరగడం ఖాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment