Jitender reddy
-
జితేందర్‌రెడ్డి వర్సెస్ చాముండేశ్వరనాథ్
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం.. కోర్టు వివాదాలు ముగిసిన తర్వాత తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 21న ఒలింపిక్ భవన్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లోనే ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇచ్చినా, వేర్వేరు కారణాలతో ఈ ప్రక్రియ కోర్టుకు చేరింది. ఇప్పుడు అన్నీ చక్కబడటంతో రాష్ట్రంలోని వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు బరిలో నిలిచారు. మొత్తం 68 మంది ఓటర్లు ఉండగా, ముగ్గురికి ఓటింగ్ అర్హత లేదని రిటరి్నంగ్ అధికారి ప్రకటించారు. దీంతో 65 ఓట్ల నుంచే విజేత ఎవరో తేలనుంది. ప్రధానంగా అధ్యక్ష పదవిపైనే పోటీ నెలకొంది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో కేబినెట్ హోదాలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న ఏపీ జితేందర్‌రెడ్డి (రోయింగ్ సంఘం) అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘంలో కూడా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోపాటు క్రీడా సంఘాల్లో తనకున్న పరిచయాలు గెలిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు. అయితే మరోవర్గం నుంచి ఆంధ్ర మాజీ క్రికెటర్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరనాథ్ ప్రత్యర్థిగా ఉన్నారు.ఓటింగ్‌కంటే ముందే జితేందర్‌ను పోటీ నుంచి తప్పించి తాను గెలిచేందుకు చాముండి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి కీలకాంశాన్ని ఆయన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) దృష్టికి తీసుకెళ్లారు. 70 ఏళ్లు దాటిన జితేందర్‌రెడ్డి పోటీకి అనర్హుడన్నారు. పైగా ఓటర్ల జాబితాలో పలు తప్పులు జరిగినట్టు ఆయన చెబుతున్నారు. నిజానికి తెలంగాణ ఒలింపిక్ సంఘంలో కొంతకాలంగా వివాదాలు సాగుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులను సమీక్షించే ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా వీఏ షియాద్తో ఐఓఏ ఏకసభ్య కమిటీని నియమించింది. దీనికి 10 డిసెంబర్ వరకు గడువు ఇచ్చింది.కాబట్టి ఈ నివేదిక వచ్చే వరకు ఎన్నికలను నిలిపి వేయాల్సిందిగా చాముండి కోరుతున్నారు. అయితే తాను నామినేషన్ వేసిన సమయంలో 70 ఏళ్లలోపే ఉన్నానని, కోర్టుల కారణంగా ఆలస్యమైతే అది తనకు వర్తించదని జితేందర్ స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం పి.మల్లారెడ్డి (సైక్లింగ్ సంఘం), సి.బాబూరావు (బాక్సింగ్), కోశాధికారి పదవికి సతీశ్ గౌడ్ (తైక్వాండో), ప్రదీప్‌కుమార్ (కయాకింగ్ అండ్ కనోయింగ్) పోటీ పడుతున్నారు. అధ్యక్ష, కార్యదర్శి పదవులకు మినహా మిగతా అన్ని పదవులకు ఏకగ్రీవ ఎంపిక జరగడం ఖాయమైంది. -
ఆలయాలపై దాడులు ఆపకపోతే.. బీజేపీ నేతలు హెచ్చరిక
-
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
ముదుగంటి క్రియేషన్స్‌పై తెరకెక్కిన జితేందర్ రెడ్డి సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రాన్ని ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్ వర్రె లీడ్ రోల్లో నటించిన జితేందర్ రెడ్డి విడుదలకు సిద్ధంగా ఉంది. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. చిన్నప్పటినుండే సమాజం పట్ల అంకితభావం ఉన్న జితేందర్ రెడ్డి, సమాజానికి ఏదో ఒక మంచి చెయ్యాలి అనే భావంతో పెరుగుతాడు. ఆ లక్షణాలు జితేందర్ రెడ్డితో పాటు పెరిగి, కాలేజీ ఎలక్షన్స్ లో లీడర్ గా ఎదిగి, ఆ తరవాత పోలీసు వ్యవస్థకే దీటుగా, సమాజంలో నక్సలైట్లు చేసే దోర్జన్యాలకు ఎదురు వెళ్తాడు, ట్రైలర్ మద్యలో హిందుత్వం వంటి డైలాగ్ లు మరింత ఆశక్తి పెంచేలా ఉన్నాయి. 1980’s ఒక వ్యక్తి జీవితంలో జరిగే కాలేజీ పాలిటిక్స్, ఆ తరవాత నిజమైన రాజకీయాలు నేపధ్యంలో ఈ కథ సాగుతున్నట్టు ఉంది. మొత్తానికి ప్రేక్షకులను మెప్పించేలా కథ ఉంది. మే 10న ‘జితేందర్ రెడ్డి విడుదల కాబోతుంది అని చిత్ర యూనిట్ ట్రైలర్ ద్వారా తెలిపారు. -
‘జితేందర్ రెడ్డి’ సినిమా నుంచి 'అ ఆ ఇ ఈ ఉ ఊ' సాంగ్ విడుదల
‘బాహుబలి’ ఫేమ్ రాకేష్ వర్రే టైటిల్ రోల్లో రూపొందిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. హిస్టరీ నీడ్స్ టు బీ టోల్డ్ అనేది ఉపశీర్షిక (చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది), ‘ఉయ్యాలా జంపాలా, మజ్ను’ వంటి ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. ఇప్పుడు ఈ సినిమాలో 'అ ఆ ఇ ఈ ఉ ఊ' అంటూ సాగే యూత్ ఫుల్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ఆర్ట్స్, సైన్స్, ఇంగ్లీష్ కంటే ముందు ఎన్నో విషయాలు జరిగాయి అవి తెలుసుకోవాలి. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, న్యూటన్ ఏ కాదు మనదేశంలో కూడా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటూ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో యూత్ ఫుల్‌గా ఈ సాంగ్‌ని తెరకెక్కించారు. ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు మరియు రాహుల్ సిప్లిగంజ్ పాటని చాలా బాగా పాడారు. కాలేజీలో జరిగే ఎలక్షన్స్ గ్యాంగ్స్ మధ్య ఉండే రైవలరీస్ ఈ లిరికల్ సాంగ్ లో చూపించారు. 1980' లో జితేందర్ రెడ్డి అనే వ్యక్తి గురించి అందరూ తెలుసుకోవాలి అని ఈ సినిమాని తెరకెక్కించారు. కాలేజ్ స్టూడెంట్ లీడర్‌గా అదేవిధంగా ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే నాయకుడిగా జితేందర్ రెడ్డి చేసిన సేవలను ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ముదిగంటి రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ : ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే సినిమా పైన అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటా ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ ద్వారా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని అన్నారు. ఈ చిత్రం మే 3న రిలీజ్ కానుంది. -
Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ వచ్చేస్తున్నాడు
‘బాహుబలి’ ఫేమ్ రాకేష్ వర్రే టైటిల్ రోల్లో రూపొందిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. హిస్టరీ నీడ్స్ టు బీ టోల్డ్ అనేది ఉపశీర్షిక (చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది), ‘ఉయ్యాలా జంపాలా, మజ్ను’ వంటి ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం మే 3న రిలీజ్ కానుంది. ‘‘జగిత్యాలలో 1980లలో జరిగిన కథే ఈ సినిమా. ఆ రోజుల్లో విలువలతో కూడిన పాత్ర, దాని చుట్టూ తిరిగే కథని ఈ తరం ప్రేక్షకులకు అందించాలని చేసిన ప్రయత్నమే ఈ సినిమా’’ అన్నారు విరించి వర్మ. ‘‘జరిగిన కథను చూపించాం తప్ప ఎవర్నీ కించపరిచే విధంగా తీయలేదు’’ అన్నారు రవీందర్ రెడ్డి. -
కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన జితేందర్, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకు ముందు జితేందర్‌తో పాటు మిథున్‌రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానానికి తమ రాజీనామా లేఖలు పంపారు. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే జితేందర్‌రెడ్డికి కేబినెట్ మంత్రి హోదాతో కూడిన రెండు పదవులు లభించాయి. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడా వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. బండిని తప్పించడంతోనే తిరోగమనం..: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండగా పార్టీ రాష్ట్రం బలం పుంజుకుని రాజకీయశక్తిగా ఎదిగిందని మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర నాయకత్వం మార్పు జరిగాక బీజేపీకి తీవ్రంగా నష్టం జరిగిందని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లలో గెలవాల్సిందిపోయి 8 స్థానాలకే పరిమితమైందని తెలిపా రు. బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాకు పంపించిన రాజీనామా లేఖలో ఆయా అంశాలను ప్రస్తావించారు. తనకు బీజేపీలో ఇన్నాళ్లూ పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జేపీనడ్డాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి రేవంత్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత జితేందర్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జితేందర్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి ఆశించారు. మొదటి నుంచి ఇక్కడ పోటీ చేయాలని జితేందర్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. కానీ, బీజేపీ హైకమాండ్ మాత్రం జితేందర్ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది. దీంతో, టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డి భంగపాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ మా ఇంటికి రావడం కొత్తేమీ కాదు. తన అన్న ఇంటికి వచ్చాడు అంతే. మాది ఒక్కటే జిల్లా. నాకు సీటు రాలేదని ఓదర్చాడానికే వచ్చాడు. నేను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నాను. బీజేపీలో సంతోషంగానే ఉన్నాను. నా సీటు గురించి అధిష్టానం చూసుకుటుంది. కాంగ్రెస్‌లో టికెట్లు ఫుల్ ఫిల్ అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో వంశీ, చేవెళ్లలో పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌కు ఉన్నారు. పార్టీలోకి సీఎం రేవంత్ నన్ను ఆహ్వానించలేదు. నేను కూడా ఏమీ మాట్లాడలేదు. కేవలం పరామర్శ కోసమే రేవంత్ మా ఇంటికి వచ్చాడు అని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ కేంద్ర పెద్దలపై జితేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. జితేందర్ రెడ్డి గతంలో బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్ చేసి పలు సెటైరికల్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇటీవల కూడా ఒక వీడియోను షేర్ చేయడంతో బీజేపీ నేతలు ఖంగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ జితేందర్ రెడ్డి సీటు నిరాకరించినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. CM Revanth Reddy met former MP BJP leader Jithender Reddy at his residence.#RevanthReddy • @revanth_anumula • @apjithender • @mpponguleti • @Drpmahendereddy pic.twitter.com/biQVwz2R3w — Congress for Telangana (@Congress4TS) March 14, 2024 -
బీజేపీ జితేందర్ రెడ్డి: ఆనాడు దున్నపోతు.. ఇప్పుడు..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బట్టలు లేకుండా ఆలోచిస్తున్న ఓ చిన్నపిల్లోడి వీడియోను షేర్ చేశారు. దీంతో, బీజేపీ రాజకీయాలపైనే ఆయన ఇలా సెటైరికల్ కామెంట్స్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాదా, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా.. వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ ఎన్నికల ముందు ఆలోచిస్తున్నట్లు ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్నపిల్లాడు బట్టలు లేకుండా థింక్ చేస్తూ అటు ఇటూ తిరుగుతుంటాడు. ఇక, ఈ వీడియోను ప్రధాని మోదీ, అమిత్ షా, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్, జేపీ నడ్డా, శివప్రకాశ్కు ట్యాగ్ చేశారు. What to do,what not to do.Thinking before elections.@narendramodi @AmitShah @sunilbansalbjp @tarunchughbjp @JPNadda @shivprakashbjp @BJP4India @BJP4Telangana pic.twitter.com/QYvt5xR7Ge — AP Jithender Reddy (@apjithender) February 29, 2024 కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు బీజేపీ అధిష్టానం ఆలోచన తీరు అలా ఉందనే అర్థం చేసుకోవాలా? లేక మరేదైనా అర్థం వచ్చేలా పెట్టారా? అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇక, గతంలో దున్నపోతులను వాహనంలో ఎక్కించి కొట్టే వీడియోను జితేందర్ రెడ్డి షేర్ చేయడంతో బీజేపీలో పెను దుమారమే చోటుచేసుకుంది. పార్టీ నేతలకు అదేవిధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని అర్ధం వచ్చేలా నాడు వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. -
వరంగల్‌లో కొట్టుకున్న బీజేపీ నేతలు!
-
TS: మోదీ పర్యటన వేళ.. పార్టీ ఆఫీసు ధ్వంసం చేసిన బీజేపీ నేతలు!
సాక్షి, వరంగల్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. కొన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఇక, రెండు రోజుల్లో వరంగల్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీలో రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గమన్నాయి. ఈ క్రమంలో పార్టీ నేతలు బీజేపీ ఆఫీసుపైనే దాడులు చేయడం సంచలనంగా మారింది. కొందరు నేతలు తమకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు. వివరాల ప్రకారం.. నర్సంపేట పట్టణంలో బీజేపీలో ఒక్కసారిగా ఎప్పటి నుండో నివురుగప్పిన ట్లుగా ఉన్న అసమ్మతి బయటకు వచ్చింది. పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంపై సొంత పార్టీ నేతలు దాడి చేశారు. పార్టీలో మాకు గుర్తింపు లేదు, ప్రాధాన్యం లేదని దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో, ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. వాగ్వాదంలో భాగంగా పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు. అయితే, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సమక్షంలోనే ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం. ఇక, ప్రధాని మోదీ పర్యటన వేళ వరంగల్ జిల్లాలో ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: త్వరలో ధరణి ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నాం.. రేవంత్ సంచలన ఆరోపణలు -
వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి: ఈటల కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇక, నిన్న(గురువారం) బీజేపీ నేత జితేందర్ రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలపై ట్వీట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి ట్వీట్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఇక, తాజాగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. జితేందర్ రెడ్డి అలా ఎందుకు ట్వీట్ చేశారో ఆయననే అడగాలి. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. ఇతరుల స్వేచ్చ, గౌరవం తగ్గించకూడదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీలో క్రమశిక్షణ పట్టాలు తప్పుతుండటంతో గీత దాటుతున్న నేతలకు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి నష్టం చేస్తున్న నేతలను హెచ్చరించారు. క్రమశిక్షణారాహిత్యం, నిర్లక్ష్యపూరిత వైఖరిని సహించేదిలేదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీపైనా, పార్టీ నాయకత్వంపైనా బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తే పార్టీకి నష్టం చేసినట్టేనని అన్నారు. పార్టీ ఎజెండా కంటే వ్యక్తిగత ఎజెండాలు ఎప్పటికీ ఎక్కువ కాదని స్పష్టం చేశారు. పార్టీలో ఒక లక్ష్మణ రేఖ ఉందని మర్చిపోకూడదని సూచించారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్, బీజేపీకి షాక్!.. పొంగులేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
కేసీఆర్ లీక్స్ పట్టించుకోవద్దు.. బీజేపీ కేడర్‌కు జితేందర్ రెడ్డి సూచన
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి నివాసంలో బీజేపీ ముఖ్య నేతల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో విజయశాంతి, కొండా సురేఖ, నర్సయ్య గౌడ్, విఠల్ పాల్గొన్నారు. ఈ క్రమంలో బీజేపీలో పరిణామాల(మార్పులు, చేర్పులపై) చర్చించినట్టు సమాచారం. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టార్గెట్‌గా సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఇక, భేటీ అనంతరం జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళతాం. జరిగిన అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళతాం. కేసీఆర్ కొన్ని లీక్‌లు ఇస్తూ మా పార్టీ కేడర్‌లో అయోమయం సృష్టిస్తున్నారు. కేసీఆర్ దుష్ర్పచారాన్ని తిప్పికొడతాం. కేసీఆర్ కుట్రలను పట్టించుకోవద్దని పార్టీ కేడర్‌కు చెబుతున్నాం. హైకమాండ్‌లో చర్చ జరిగిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయి. లీక్స్‌పై పార్టీ కేడర్‌కు మెసేజ్ పంపేందుకే భేటీ అయ్యాం. మాది జాతీయ పార్టీ. మాకు ఓ విధానం ఉంటుంది. తెలంగాణ బీజేపీలో ఎలాంటి అసంతృప్తి లేదు. పార్టీ బలోపేతంపై చర్చించాం. కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తుపెట్టుకోవడం ఖాయం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: కోమటిరెడ్డితో జూపల్లి భేటీ.. వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు -
కర్నాటక ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార బీజేపీతో సహా కాంగ్రెస్, జేడీఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్లను కాదని కొత్త వారికి అవకాశం కల్పించింది. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ సరికొత్త ప్రయోగానికి తెర లేపింది. కాగా కర్నాటక ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ నేతలను ఎంపిక చేసింది. మొత్తం 13 రాష్ట్రాల నుంచి కర్నాటక ఎన్నికల ప్రచారానికి నేతలను ఎంపిక చేయగా.. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా తెలంగాణ నేతలను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో, వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గాలకు బయలుదేరారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనున్నారు. అయితే, ఇన్‌ఛార్జ్‌లుగా నియమించిన వారిలో బీజేపీ నేతలు లక్ష్మణ్, అర్వింద్, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గరికపాటి, బండ కార్తీకరెడ్డి, కొల్లి మాధవి, ఎస్ కుమార్ ఉన్నారు. ఇక, లక్ష్మణ్‌తో సహా మరికొందరికి నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలో ఉన్న మరో 5 నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను కూడా అధిష్టానం అప్పగించింది. మరోవైపు.. కర్నాటకలోని 224 నియోజకవర్గాలకు 224 మందిని ఇతర రాష్ట్రాల నుంచి ఇన్‌ఛార్జ్‌లుగా నియామకం అయ్యారు. -
కేసీఆర్ రూపొందించిన సినిమా అట్టర్ ప్లాప్: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర అంటూ కేసీఆర్ రూపొందించిన సినిమా అట్టర్ ప్లాప్ అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఈ సినిమాలో నటీనటులంతా జీవించినా... కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఫెయిలైందన్నారు. ఎఫ్ఐఆర్ లేదా రిమాండ్ రిపోర్ట్‌లో ఎక్కడా బీజేపీ నేతలు డీకే ఆరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి పేర్లు లేకపోయినా టీఆర్ఎస్ నేతలు వారిపై ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. గురువారం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశంపై ఉన్నతస్థాయి విచారణ సంస్థలను ఆశ్రయిస్తామని, మొత్తం వ్యవహారం నిగ్గు తేలేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎన్నికల వ్యూహకర్త పాత్ర ఏమిటి? సీఎం స్వయంగా ఈ కుట్రకు తెరదీశారా? అనే దానిపైనా విచారణ జరపాలన్నారు. అవినీతి ఆరోపణలున్న మంత్రిని కాపాడబోయి సీఎం మరిన్ని తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కొందరు ఐపీఎస్‌లు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధ కలుగుతోందని, ప్రభుత్వం కొమ్ము కాస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరైతే మంత్రి అక్రమాలపై పూర్తి ఆధారాలతో కోర్టులు, ఎన్నికల కమిషన్‌ను.. తమ హత్యకు కుట్ర జరుగుతోందని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారో వారే హత్యకు కుట్ర పన్నారంటూ పోలీసులు కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. నిర్మల్‌లో సాజిద్ ఖాన్ అనే వ్యక్తి 16 ఏళ్ల బాలికను డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని ఆశ చూపి అత్యాచారం చేస్తే పట్టుకోడానికి పోలీసులకు వారం రోజులు పడితే, మంత్రి హత్యకు కుట్ర పన్నారంటూ ఒక్కరోజులోనే ఢిల్లీపోయి కొందరిని పట్టుకొచ్చారని అన్నారు. చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. డీకే అరుణ, జితేందర్ రెడ్డి రియాక్షన్ రాష్ట్ర పోలీసుల తీరుపై తాము ఫిర్యాదు చేస్తే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారని, ఈ విచారణను రాష్ట్ర పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుందనే కనీస సోయి కూడా లేదా? అని నిలదీశారు. ‘ఢిల్లీలో కిడ్నాప్‌నకు గురైన వారి అకామిడేషన్ నా పేరు మీదే ఉంది. ప్రజల్లో తిరిగే వాళ్లం. ఎవరైనా ఢిల్లీకి వస్తే వాళ్లకు ఆశ్రయమిస్తాం. భోజనం పెడతాం’అని ఒక ప్రశ్నకు సంజయ్ బదులిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, రవీంద్రనాయక్, జి.ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు. చదవండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర: ‘కిడ్నాప్’ల వ్యవహారంలో సంచలన మలుపు -
ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపే కీలకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు వ్యవహారం జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో జరుగుతుందని స్పష్టంచేశారు. వివిధ నియోజకవర్గాల్లో ఎస్సీలతోపాటు ఇతర అన్ని సామాజికవర్గాల ప్రజలను బీజేపీవైపు మళ్లించడంతోపాటు టీఆర్ఎస్ సర్కార్ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుకునేలా కార్యాచరణ రూపొందించాలని ఆయన ముఖ్యనేతలకు సూచించారు. సోమవారం ఒక హోటల్లో జరిగిన పార్టీ ‘ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ’తొలి సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపే కీలకమని పేర్కొన్నారు. ‘మిషన్–19’పేరిట రాష్ట్రంలోని 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ‘ఎస్సీ నియోజకవర్గాల్లో ఓట్ల శాతమే గెలుపోటములను నిర్ణయిస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ అభ్యర్థుల గెలుపోటముల్లో ఎస్సీ నియోజకవర్గాల్లోని ఓట్లే కీలక పాత్ర పోషించాయి. అందుకు నా గెలుపే ఒక ఉదాహరణ. కరీంనగర్ ఎంపీ సీటు పరిధిలో చొప్పదండి, మానకొండూరు ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చొప్పదండిలో 9 శాతం, మానకొండూరులో 2.52 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అదే పార్లమెంట్ ఎన్నికలొచ్చేసరికి చొప్పదండిలో 61 శాతం, మానకొండూరులో 51.5 శాతం ఓట్లు బీజేపీకి పోలయ్యాయి. అందుకే నేను దాదాపు లక్ష ఓట్లతో గెలవగలిగాను’అని సంజయ్ అన్నారు. ఎస్సీ ఓట్లను మాత్రమే కాకుండా ఇతర సామాజిక వర్గాల ఓట్లను కూడా రాబట్టేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎస్సీ సమన్వయ కమిటీ చైర్మన్ ఎ.పి.జితేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు ఒంటేరు జైపాల్, సీహెచ్ విఠల్, కాంచన కృష్ణతోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో కమలం... కమిటీలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పకడ్బందీ ప్రణాళికలతో సిద్ధం కావడంలో భాగంగా పార్టీలో చేరికలు, సమన్వయం, ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మూడు కమిటీలను నియమించారు. పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి చైర్మన్‌గా కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా శాసనమండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్, మాజీ మంత్రులు డాక్టర్ ఎ.చంద్రశేఖర్, డి.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, మహిళా మోర్చా నాయకురాలు బండారి రాధిక ఉన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతోపాటు పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు తదితరులను చేర్చుకొనేటప్పుడు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు లోబడి పనిచేసే వారిని, ప్రజాదరణ ఉన్న వారిని గుర్తించి చేర్చుకొనే లక్ష్యంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ‘ముందస్తు’ఉండొచ్చనే... శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది చివర్లో జరగాల్సి ఉన్నా అంతకంటే ముందుగానే ఇక్కడ ఎన్నికలు జరగొచ్చనే ఊహాగానాల మధ్య 119 నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో పట్టున్న, బలమైన పార్టీ ముఖ్య నేతలు పోటీకి అవకాశమున్న స్థానాలను మినహాయించి మిగతా సీట్లలో ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. ఆ 31 సీట్లపై ప్రత్యేక దృష్టి... రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాలపై బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఆయా స్థానాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు పార్టీ అంచనా వేస్తోంది. ఈ స్థానాల్లో కనీసం 20–25 సీట్లు గెలుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎస్సీ నియోజకవర్గాల్లోని బలాబలాలు, సమస్యలపై ఎస్సీ ముఖ్యనేతలతో బండి సంజయ్ అధ్యక్షతన ఇటీవలే రాష్ట్ర స్థాయి సమీక్ష జరిగింది. ఈ స్థానాల్లో విశ్లేషణ నిమిత్తం తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి చైర్మన్‌గా ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీని సంజయ్ నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా మాజీ ఎమ్మెల్యేలు ఒంటేరు జైపాల్, ఎం.ధర్మారావు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహేచ్ విఠల్, ఎస్సీ మోర్చా నాయకురాలు కాంచన కృష్ణ ఉన్నారు. అలాగే ఎస్టీ స్థానాల్లో బలబలాలు, క్షేత్రస్థాయి పరిస్థితుల అంశాల పరిశీలనకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు చైర్మన్‌గా ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీని సంజయ్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, కూన శ్రీశైలంగౌడ్, సీనియర్ నేత చింతా సాంబమూర్తి, మాజీ జడ్పీ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి ఉన్నారు. -
తెలంగాణకు పెద్దపీట
సాక్షి , హైదరాబాద్/ న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణకు పార్టీ నాయకత్వం పెద్ద పీట వేసింది. రాష్ట్రం నుంచి నలుగురు సభ్యులకు అవకాశం కల్పించింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావులకు జాతీయ కార్యవర్గంలో స్థానం లభించింది. ఈటల రాజేందర్, విజయశాంతిలకు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కన్నా లక్ష్మీ నారాయణకు చోటు కల్పించారు. కొత్త మంత్రులకు చోటు రాబోయే ఎన్నికలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన బీజేపీ అందుకనుగుణంగా పార్టీ కొత్త జాతీయ కార్య నిర్వాహక కమిటీని గురువారం ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా నియమించిన కమిటీలో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, గోయల్, అద్వానీ, మురళీ మనోహర్ జోషి సహా 80 మంది సభ్యులు ఉన్నారు. మంత్రివర్గంలో కొత్తగా చేరిన అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింథియా, మీనాక్షి లేఖిలను కమిటీలోకి తీసుకున్నారు. మేనక, వరుణ్‌లకు దక్కని స్థానం లఖీమ్‌పూర్ ఘటనలో రైతులకు న్యాయం జరగాలని, కారకులకు శిక్ష పడాలంటూ సంబంధిత వీడియోను ట్వీట్‌చేసిన పార్టీ ఎంపీ వరుణ్ గాంధీకి కొత్త కమిటీలో చోటు దక్కలేదు. మోదీ సర్కార్ విధానాలపై విమర్శలు చేసిన మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్‌లతో పాటు వ్యవసాయ చట్టాల్లో రైతు అనుకూల వ్యాఖ్యలు చేసిన ఎంపీ మేనకాగాంధీలను కమిటీ నుంచి తప్పించారు. కమిటీలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 35 మంది పార్టీ పదాధికారులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులకూ చోటు కల్పించారు. శాశ్వత ఆహ్వానితుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, జాతీయ మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. -
‘నా మీద సర్జికల్ స్ట్రైక్ చేశారు’
ఢిల్లీ: టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత జితేందర్ రెడ్డి టీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి అమిత్ షా సాదరంగా ఆహ్వానించారు. జితేందర్ రెడ్డి చేరికలో బీజేపీ అగ్రనేత రాంమాధవ్ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. జితేందర్ రెడ్డి బీజేపీలో చేరడంతో మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి కాకుండా మరో నేత మన్నె శ్రీనివాస్ రెడ్డికి కేటాయించడంతో నాలుగైదు రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం జితేందర్ రెడ్డి పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ లోక్ సభ సీటు ఇవ్వలేదని తాను ఎప్పుడూ బాధపడలేదన్నారు. తన మీద సర్జికల్ స్ట్రైక్ చేశారని, పదవి కోసం తానెప్పుడూ ఆశపడలేదన్నారు. చిన్న కార్యకర్త నుంచి పెద్దవాళ్ల వరకు సేవ చేయడానికి అందరూ కృషి చేశారని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రంలో టికెట్ ఇవ్వకపోతే దేశంలో సేవ చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ తనకు అవకాశం ఇవ్వకపోయినా మోదీ అవకాశం ఇచ్చారన్నారు. ఇప్పటినుంచి తెలంగాణ ప్రజల కోసం మరింత కష్టపడతానన్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడేలా చూస్తామన్నారు. డీకే అరుణ గెలుపు కోసం తప్పకుండా కృషి చేస్తానన్నారు. తన మీద సర్జికల్ స్ట్రైక్ ఎందుకు జరిగిందో కేసీఆర్ జవాబు చెప్పడం లేదన్నారు. ఈ నెల 21న తన పేరు లిస్టులో లేని సమయం నుంచి ఇప్పటివరకు కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా కేసీఆర్ చేయలేదన్నారు. పుట్టినరోజు నాడు చాలా ఆప్యాయంగా ముద్దు పెట్టి పలకరించిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదని, ఇంకా బీజేపీలో చేరడానికి చాలా మంది క్యూలో ఉన్నారన్నారు. బీజేపీలో మంచి స్థానం ఉంటుందని అమిత్ షా నుంచి హామీ లభించిందని తెలిపారు. -
రిజర్వేషన్లపై అధికారం మాకే అప్పగించండి
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వేషన్లను పెంచుకునే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టాలని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆర్థిక వెనకబాటు రిజర్వేషన్ల బిల్లుపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఈ బిల్లును టీఆర్ఎస్ స్వాగతిస్తోంది. సమాజం సమ్మిళితంగా, బలోపేతంగా ఉండేలా చేసే అన్ని మార్గాలను మేం స్వాగతిస్తాం. ఈ బిల్లుద్వారా ఆర్థికంగా వెనకబాటుకు గురైన వారికి మేలు జరుగుతుంది. కులప్రాతిపదికన వెనకబాటు తనం, ఆర్థిక వెనకబాటు తనం రెండూ వేరువేరని ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం చెబుతోంది. ఆర్థికంగా వెనకబాటు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? స్వతంత్ర భారతంలో కూడా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకపోవడం, సాగునీరు, విద్యుత్తు, వ్యవసాయ సాయం కల్పించకపోవడం వల్ల ఆర్థిక వెనకబాటుతనం ఏర్పడింది. అది కాంగ్రెస్ పార్టీ కావొచ్చు.. బీజేపీ కావొచ్చు. పాలనలో ఎవరున్నా.. సగటు మనిషి గురించి ఆలోచించకుండా పైచేయి కోసమే ప్రయత్నించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఆర్థిక వెనకబాటు తనం అనే పదం వెలుగులోకి వచ్చింది. రిజర్వేషన్లు లభించక, మౌలిక వసతులు సమకూరక కొన్ని వర్గాలు ఆర్థికంగా వెనుకబాటుకు గురయ్యాయి. ఏపీ విభజన అనంతరం తెలంగాణలో సామాజిక సమీకరణాలు మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలు 8% ఉండగా.. ప్రత్యేక రాష్ట్రంలో 12 శాతంగా ఉన్నారు. ఎస్టీలు ఉమ్మడి రాష్ట్రంలో 6% ఉండగా.. తెలంగాణ ఏర్పాటయ్యాక వారి సంఖ్య 10%కు పెరిగింది. ఈ మార్పుల వల్ల తెలంగాణ సర్కారు 2017లో ముస్లింలకు 12%, గిరిజనులకు 10% రిజర్వేషన్లు పెంచుతూ చట్టం తెచ్చింది. దీన్ని కేంద్రం వ్యతిరేకిస్తోంది. మరోసారి కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకొస్తున్నాం. దేశంలో ఒకే చట్టం ఉండాలి. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఉన్నాయి. షెడ్యూలు 9లో ఈ అంశాన్ని చేర్చారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకే కట్టబెట్టాలి. జనాభా దామాషా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. అందువల్లే ఈ డిమాండ్ కోసం మేం పార్లమెంటులో పోరాటం చేశాం. కేంద్రం వద్ద ఈ అధికారాన్ని పెట్టుకుంటే రాష్ట్రాల్లోని జనాభా దామాషా మేరకు వారికి న్యాయం జరగదు. ఈ బిల్లును స్వాగతిస్తూనే కొన్ని సవరణలు ప్రతిపాదిస్తున్నాం’అని ఆయన పేర్కొన్నారు. అయితే చర్చ అనంతరం సామాజిక న్యాయ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ సమాధానంలో జితేందర్ రెడ్డి లేవనెత్తిన అంశాలను ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో ఆయన లేచి మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. అంతలోనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ వెంటనేVఆ బిల్లుపై ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. -
‘ట్రిపుల్ తలాక్’కు మేం వ్యతిరేకం!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటులో ట్రిపుల్ తలాక్ బిల్లును టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ముస్లి మహిళల (వివాహ హక్కు రక్షణ) బిల్లు – 2018పై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఈ సమయంలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టడం వెనక ప్రభుత్వ ఉద్దేశమేంటని ఆయన ప్రశ్నించారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడే విషయంలో ఈ బిల్లు నిరంకుశంగా ఉందని జితేందర్ రెడ్డి విమర్శించారు. మైనారిటీల విశ్వాసాన్ని వమ్ముచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14, ఆర్టికల్ 21లను ఉల్లంఘించేదిగా ఉందన్నారు. మత విశ్వాసాలను రాజ్యాంగ పరిధిలో విచారించడం న్యాయస్థానాల పని అని.. ఇకనైనా ఎన్డీయే ప్రభుత్వం మైనారిటీల విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హితవు ఆయన పలికారు. లింగసమానతల విషయంలో టీఆర్ఎస్, పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టతతో ఉన్నామని.. అయితే, ముస్లిం ల పురుషులకు మూడేళ్ల పా టు జైలుశిక్ష విధించాలన్న నిబంధనకు టీఆర్ఎస్ పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. కేబుల్ ఆపరేటర్ల డిమాండ్లపై.. మహబూబ్‌నగర్ కేబుల్ ఆపరేటర్స్ సంఘం చేసిన డిమాండ్లను కేంద్రం తక్షణమే పరిష్కరించాలని సమాచార, ప్రసారశాఖ మంత్రిని జితేందర్‌రెడ్డి కోరారు. ఎంపిక చేసుకున్న చానెళ్లకే డబ్బులు చెల్లించాలన్న ట్రాయ్ నిబంధన ద్వారా కేబుల్ ఆపరేటర్లకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఆపరేటర్లు చానళ్ల ప్రసారాల విషయంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టినందున వారి సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. ప్రసార కంపెనీలలబ్ధికే ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని, వీటి ద్వారా కేబుల్ ఆపరేటర్లకు, వినియోగదారులకు లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు. టీవీ ప్రసార పరిశ్రమలో ఏకఛత్రాధిపత్యాన్ని తగ్గించేలా మంత్రి చొరవతీసుకోవాలని డిమాండ్ చేశారు. -
జితేందర్‌రెడ్డి ప్లాట్లు కబ్జా!
పటాన్చెరు టౌన్: మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి ప్లాట్లు కబ్జాకు గురయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి రింగ్ రోడ్డు నుంచి పోచారం వెళ్లే దారిలో ఉన్న వాణి వెంచర్లో ఎంపీ జితేందర్‌రెడ్డి 12 ప్లాట్లు (3,600 గజాల స్థలం) కొనుగోలు చేశారు. అయితే ఆ స్థలం తమదేనంటూ సంగారెడ్డికి చెందిన మహ్మద్ నజీం అలియాస్ అజ్జూబాయ్, రామచంద్రాపురానికి చెందిన మహ్మద్ గౌస్ కలసి కడీలు పాతారు. దీనిపై ఎంపీ శనివారం పటాన్చెరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఎంపీ ముత్తంగిలో ఉన్న తన స్థలం వద్ద చేరుకొని కడీలను తీయించి ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. 1984లో తాను మస్కట్‌లో ఉండగా ప్లాట్లు కొన్నా నని, దీన్ని కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. -
మీరు మైనారిటీలకు వ్యతిరేకం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకమని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆ పార్టీకి పట్టరని టీఆర్ఎస్ ఎంపీలు నిప్పులు చెరిగారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని, అలా పెంచుకునే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు మంగళవారం ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. సభ వాయిదా పడగానే గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, బి.వినోద్‌కుమార్, అజ్మీరా సీతారాం నాయక్, నగేష్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సి.హెచ్.మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పసునూరి దయాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘7 రోజులుగా ధర్నా చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆమోదం తెలిపిన రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూలులో చేర్చాలన్నదే మా ప్రధాన డిమాండ్. ఒక దేశంలో ఒకే నీతి ఉండాలని కోరుతున్నాం. జనాభా దామాషా ప్రకారం రాష్ట్రాలు వివిధ వర్గాలకు రిజర్వేషన్లు పెంచుకునే హక్కు కల్పించాలని అడుగుతున్నాం. తమిళనాడులో 69 శాతం, మహారాష్ట్రలో 52 శాతం అమలు చేస్తున్నారు. రాజస్తాన్‌లో, హర్యానాలో అడుగుతున్నారు. అలాంటప్పుడు రిజర్వేషన్లపై మీ పెత్తనం ఎందుకు? మేం కేంద్రంలో రిజర్వేషన్లు అడగటం లేదు. మా రాష్ట్రంలో మేం ఇచ్చుకుంటాం అంటున్నాం. దేశంలో ఒకే పన్ను ఉండాలని జీఎస్టీ ఆమోదించుకున్నారు. ఒకే దేశం ఒకేసారి ఎన్నికలని మద్దతు కూడగడుతున్నారు. అన్నీ ఒకటి ఉన్నప్పుడు రిజర్వేషన్లపై విభిన్న రీతులు ఎందుకు?’అని ప్రశ్నించారు. కేంద్రం దగా చేస్తోంది – సీతారాం ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ వర్గాల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయని, తెలంగాణలోనూ ఆ విధానాన్నే అమలు చేయాలని ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. ‘రాజ్యాంగంలో నిర్దిష్టంగా ఉంటే ఇవ్వకండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు జనాభా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయొద్దా? రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని ఎక్కడుందో చెప్పండి. సుప్రీంకోర్టు.. తన తీర్పులోనే స్పష్టంగా ప్రత్యామ్నాయం చూపింది. కానీ కేంద్రం ఇది చేస్తం, అది చేస్తం అని దగా చేస్తోంది’అని విమర్శించారు. న్యాయమైన డిమాండ్ – డి. శ్రీనివాస్ రిజర్వేషన్ల పెంపు న్యాయమైన డిమాండ్ అని రాజ్యసభ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. 1992లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు వీలుగా సవరణ చేశారని, ఇప్పుడూ జనాభా దామాషా ప్రకారం రాష్ట్రాలు రిజర్వేషన్లు పెంచుకునే వీలు కల్పించాలన్నారు. ‘మీరు మైనారిటీలకు వ్యతిరేకం. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు పట్టరా? రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను కేంద్రం తొక్కిపెట్టడం సరికాదు. దయచేసి ప్రధాని జోక్యం చేసుకుని రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలి’అన్నారు. ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల పెంపునకు వీలుగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు నిరసనగా ఆందోళన చేస్తున్నాం. కేంద్రం పెడచెవిన పెట్టడాన్ని తెలంగాణ గమనిస్తోంది’ అని అన్నారు. బీజేపీకి మనుగడ ఉండదు– పసునూరి విభజన జరిగిన తర్వాత మారిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెరగకపోతే ఎస్సీలు నష్టపోతారని ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ‘కేంద్రం అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేస్తోంది. ఎస్సీ వర్గీకరణపై అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయినా ఇప్పటివరకు కనీసం పట్టించుకోలేదు. వర్గీకరణపై తెలంగాణ తీర్మానం చేసి పంపి నాలుగేళ్లయినా నిర్ణయం తీసుకోలేదు. వర్గీకరణ కోసం ఉద్యమాలు చేస్తున్నా పెడచెవిన పెడుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సమస్యలను ప్రభుత్వం పక్కనబెడుతోంది. వీటిని పరిష్కరించకపోతే బీజేపీకి మనుగడ ఉండదు’అని దయాకర్ విమర్శించారు. -
పెదవి విరిచిన టీఆర్ఎస్ ఎంపీలు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై మరింత స్పష్టత రావాల్సి ఉందని, ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి ఎన్ని నిధులు కేటాయించారో కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్పష్టత లేదని టీఆర్ఎస్ ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయం కావడంతో ఆకర్షణీయమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, కానీ కొన్ని విషయాలను బడ్జెట్లో విస్మరించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళుతామని, రాష్ట్రానికి తగిన నిధులు కేంద్రం కేటాయింస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. రాష్ట్రాల వారీగా కాకుండా మంత్రిత్వ శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు జరిపారు గత సంవత్సరం నుంచి ఈ కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోంది ఇంటింటికి మంచినీరు, రైతుల ఆదాయం రెట్టింపు, రైల్వే, మౌలిక వసతులకు బడ్జెట్ లో పెద్దపీఠ వేశారు రాష్ట్రాల అవసరాలను బట్టి బడ్జెట్‌ను మంత్రిత్వ శాఖలు కేటాయిచనున్నారు రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం రాష్ట్ర అభివృద్ధికి రావాల్సిన నిధులను సాధిస్తాం సీఎం కేసీఆర్ లాగా బడ్జెట్‌ను కేంద్రంగానీ, ఏ దేశంగానీ రూపొందించలేవు అన్ని వర్గాల ప్రజల కష్టాలు, అవసరాలు, ప్రజల నాడిని పట్టుకొని సీఎం రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు మిషన్ భగీరథ, పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ ఇలా ఎన్నో పథకాలను సీఎం కేసీఆర్ రూపొందించారు బడ్జెట్ ప్రసంగం విన్నా, చిన్న పిల్లాడు చదివినా అర్థం అయ్యేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది కానీ కేంద్ర బడ్జెట్లో స్పష్టత లేదు - జితేందర్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల సంవత్సరం కావడంతో ఆకర్షణీయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు గ్రామీణాభివృద్ధి, రైతాంగానికి పెద్దపీఠ వేశారు అయితే కొన్ని అంశాలను విస్మరించారు పశుసంవర్థక శాఖకు కేవలం రూ. 11 వేల కోట్లు, హార్టికల్చర్‌కు రూ. 2 వేల కోట్లు మాత్రమే కేటాయించారు కేంద్రం బడ్జెట్‌తో పోలిస్తే తెలంగాణ బడ్జెటే ముందుంది గొర్రెల పెంపకానికే రాష్ట్ర ప్రభుత్వం రూ. నాలుగు వేల కోట్లు కేటాయించింది బడ్జెట్లో లెక్కలు చెప్పారు కానీ, ఏ రాష్ట్రంలో ఏది నెలకొల్పబోతున్నారు, ఏం కేటాయించబోతున్నారో చెప్పలేదు తెలంగాణపై పెట్టుబడి పెడితే, తిరిగి రాష్ట్రం దేశానికి కాంట్రిబ్యూషన్ ఇస్తుంది దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి వచ్చే టాక్స్‌లు ఎక్కువ నిరుద్యోగుల శిక్షణకు నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయం గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య పాఠశాలలు నెలకొల్పే ఆలోచనను స్వాగతిస్తున్నాం గిరిజన బిడ్డలు అధికంగా ఉన్న తాండూరు, పరిగి లో కొత్తగా ఏకలవ్య పాఠశాలలు వస్తాయని ఆశిస్తున్నా సొంతిళ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు కేటాయించింది ఈ విషయంలో డబుల్ బెడ్ రూం స్కీంతో తెలంగాణ ముందు వరుసలో ఉంది మిషన్ భగీరథ, కాకతీయ, నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులు కోరాం కేంద్రం సైతం ఇంటింటికి మంచినీటి పథకం కోసం నిధులు కేటాయించింది ఈ పథకంలో భాగంగా ఇంటింటికీ నీరందించే మిషన్ భగీరథకు నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నా - కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎంపీ -
పట్టా కోసం రైతు ఆత్మహత్యాయత్నం
జగిత్యాల: తన భూమి పట్టా చేయడం లేదంటూ సోమవారం ఓ రైతు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు ఆస్పత్రికి తరలించగా, రాత్రి చనిపోయాడు. సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన చిట్యాల గంగయ్య 2001లో 210 సర్వేనంబరులో 1.20 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన జితేందర్‌రెడ్డి వద్ద సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశాడు. ఇటీవల పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, భూమి అమ్మిన వ్యక్తి చనిపోవటంతో ఆయన కుటుంబసభ్యులు సదరు భూమి తమదేనని చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సోమవారం గంగయ్య తన భార్య సుశీలతో కలిసి ప్రజావాణికి వచ్చాడు. కలెక్టర్‌కు దరఖాస్తు ఇచ్చిన అనంతరం అందరి ముందే వెంటతెచ్చుకున్న క్రిమిసంహారక మందు డబ్బా తీసి తాగేందుకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది, ఏవో మహేశ్ బాధితుడిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా, రాత్రి గంగయ్య చనిపోయాడు. -
హామీల సాధనకు పోరాడతాం
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలో ఇచ్చిన హైకోర్టు విభజన, బయ్యారం స్టీల్ ప్లాంట్, అసెంబ్లీ సీట్లపెంపు హామీల సాధనకు పార్లమెంటు సమావేశాల్లో పట్టుబడతామని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో గురువారం ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత బడ్జెట్లో తెలంగాణకు మంజూరు చేసిన ఎయిమ్స్‌కు కేంద్రం ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదని, అలాగే హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, అసెంబ్లీ సీట్లపెంపు తదితర అంశాలను ఉభయ సభల్లో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. అంశాల వారీగా కేంద్రానికి తమ మద్దతు ఉంటుందని, అయితే రాష్ట్ర ప్రయోజనాలు, హామీల సాధనలో వెనక్కుతగ్గబోమని ఆయన స్పష్టం చేశారు. -
అన్ని రంగాల్లో రెడ్లు రాణించాలి
హైదరాబాద్: ఆర్థికంగా అభివృద్ధి చెందిన రెడ్లు ఇతరులకు సాయం చేయాల్సిన బాధ్యత ఉందని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాగోలు సమీపం లోని జే కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ‘గ్లోబల్ రెడ్డి కన్వెన్షన్’ రెండో రోజు సదస్సుకు ఆదివారం ఆయన హాజరయ్యారు. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరూ ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారన్నారు. సమస్యలేమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని విద్య, వైద్య, ఉద్యోగ రంగాల్లో రాణించాలని మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. యువతకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించి వారి అభ్యున్నతికి తోడ్పాటు అందించాలన్నారు. కొందరు విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోతు న్నారని, అలాంటి వారి పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని చదివించాలని పద్మభూషణ్ అవార్డు గ్రహీత జి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్‌లుగా తీర్చి దిద్దాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆంజ నేయరెడ్డి సూచించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత వర ప్రసాద్‌రెడ్డి, ఎన్ఆర్ఐ పైళ్ల మల్లారెడ్డి, హైకోర్టు మాజీ జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి మాట్లా డుతూ... విద్యార్థులు ఆర్థికంగా ఎలా అభి వృద్ధి చెందాలో, యువ పారిశ్రామిక వేత్త లుగా ఎలా రాణించాలో అవగాహన కల్పిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రమాకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మోహన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు పటోళ్ల కార్తీక్‌రెడ్డి, రెడ్డి జాతీయ ఐక్య వేదిక అధ్య క్షుడు కరుణాకర్‌రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వసుంధరా రెడ్డి, ధనుంజయరెడ్డి, తరుణ్శ్రీరెడ్డి, శేఖర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. -
పార్లమెంటులో నగదు రహిత లావాదేవీలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో నగదు రహిత లావాదేవీలకు వీలుగా కార్డు ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఆహార నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఉన్న టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి అన్ని క్యాంటీన్లలో ఈ మిషన్ల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. బుధవారం వీటిని లోక్‌సభ స్పీకర్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పార్లమెంటు క్యాంటీన్లలో నగదు రహిత లావాదేవీలకు వీలు కల్పించిన జితేందర్ రెడ్డిని ప్రశంసించారు. -
పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలి
జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి తలమడుగు : అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భీంపూర్ మండలం తాంసి కే గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారులు స్థానికంగా ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అలాగే తలమడుగు మండలం బరంపూర్, తాంసి మండలం గిరిగామ్ గ్రామాల్లోనూ అ ధికారులు గ్రామదర్శిని నిర్వహించారు. అంగన్వాడీకేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి సమస్యలు తెలుసుకున్నారు. రేషన్ సరుకుల పంపిణీ విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. తహసీల్దార్లు రాజేశ్వర్, రాంరెడ్డి, చిత్రు, ఎంపీడీవోలు భూమయ్య, సునీత, మండల ప్రత్యేక అధికారులు రాజేశ్వర్‌రాథోడ్, ఉమాదేవి, ఎంపీపీ మంజుల, రాము, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పుష్కర అవార్డుల ప్రదానం తలమడుగు మండల కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థులకు జెడ్పీ హాల్లో కోరమాండల్ ప్రతిభ పుష్కర అవార్డును జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, ఆదిలాబాద్ మున్సిపాల్ చైర్పర్సన్ మనీషా అందజేశారు. జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా తలమడుగు మండలకేంద్రంలోని జెడ్పీ పాఠశాల విద్యార్థులకు రెండో స్థానం దక్కింది. దీంతో రూ.3500 నగదు అందజేశారు. ఉపాధ్యాయుడు రత్నాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు విభజనే ప్రధాన ఎజెండా
- కేంద్రం స్పందించే తీరును బట్టి ప్రణాళిక ఉండాలి - పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం - పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ - అంశాల వారీగా కేంద్రానికి మద్దతిస్తాం: జితేందర్‌రెడ్డి - నేడు ప్రధాని మోదీతో సమావేశం కానున్న కేసీఆర్ సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు విభజనే ప్రధాన ఎజెండాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ముందుకెళ్లాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. అయితే ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం స్పందించే తీరును బట్టి మన ప్రణాళిక ఉండాలని ఆయన సూచిం చారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు ఆయన అధికార నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి, పార్టీ ఎంపీలు పాల్గొ న్నారు. సమావేశం అనంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘వర్షాకాల సమావేశాల్లో పార్టీ వైఖరి ఎలా ఉండాలన్న విషయమై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వారి ఆదేశానుసారం వర్షాకాల సమావేశాల్లో మొట్టమొదట హైకోర్టు విభజన అంశాన్ని ప్రస్తావిస్తాం. రెండేళ్లుగా ప్రతీ సమావేశాల్లోనూ మేం ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నాం. హైకోర్టు విషయాన్ని లేవనెత్తిన ప్రతిసారీ హోంమంత్రి, న్యాయమంత్రి, ఇతర మంత్రులుగానీ సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు. మేం కూడా సహకరిస్తూ వచ్చాం. రెండేళ్లు పూర్తయినా విభజన కాలేదు. ఇంతకుముందు ఉత్తరాఖండ్, ఛ త్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు 15 రోజుల్లో హైకోర్టులు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణ విషయంలో అనవసరంగా జాప్యం చేస్తూ వస్తున్నారు. అందువల్ల ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విభజన చేయాలన్నది మా డిమాండ్. అంతేకాక నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు, రహదారులు, రైల్వేలు, మేం చేపట్టిన వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, హరితహారం తదితర పథకాలకు కేంద్రం సాయం చేయాలని కోరుతాం. ఏయే శాఖల నుంచి ఎంత అవసరమో సంబంధిత అంశాలను లేవనెత్తుతాం. కేంద్ర ప్రభుత్వానికి అంశాలవారీగా మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది..’ అని పేర్కొన్నారు. హైకోర్టు విభజనపై పార్లమెంటులో ఆందోళన ఏవిధంగా ఉండబోతోందన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘మా నిరసన తెలుపుతాం. ఏవిధంగా ఉండబోతోందన్న దానిపై వ్యూహం ఖరారు చేస్తాం. వారి స్పందనను బట్టి మా వైఖరి ఉంటుంది..’ అని పేర్కొన్నారు. హైకోర్టు విభజన రాష్ట్ర పరిధిలో ఉందని, కేంద్రం విధి ఏమీ లేదని గతంలో న్యాయ మంత్రి చెప్పారని మీడియా ప్రస్తావించగా ‘కేంద్రం గందరగోళంలో ఉంది. న్యాయమంత్రి సబ్ జ్యుడీస్ అని చెబుతారు. మరికొందరు పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఏదేమైనా హైకోర్టు విభజన జరగాలి. అంతవరకూ మా ఆందోళన కొనసాగుతుంది..’ అని చెప్పారు. నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటుపై ఏపీ పట్టుబడుతోందన్న ప్రశ్నకు బదులుగా ‘బ్రిజేశ్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చేవరకు బోర్డు ఏర్పాటు చేయరాదు. కేంద్రాన్ని కూడా ఆవిధంగా కోరాం. అంశం ట్రిబ్యునల్ పరిధిలో ఉంది. అంటే సబ్ జ్యుడీస్ అవుతుంది. అలాంటప్పుడు బోర్డు ఎలా ఏర్పాటు చేస్తారు? అది సరికాదని మా వాదన మేం వినిపిస్తాం..’ అని పేర్కొన్నారు. నేడు ప్రధానితో కేసీఆర్ భేటీ: ఎంపీ వినోద్ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం లోక్‌సభలో టీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బోయినపల్లి వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారని వెల్లడించారు. హైకోర్టు విభజన, ఇతర ముఖ్యమైన అంశాలపై ఆయన ప్రధానితో చర్చిస్తారని వివరించారు. పార్లమెంటులో జీఎస్టీ బిల్లుకు తాము మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారని వినోద్ వివరించారు. -
తెలంగాణకు టీఎన్నారైలే కీలకం
డల్లాస్ : తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో టీ ఎన్నారైలు కీలక పాత్ర పోషిస్తున్నారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వానికి మీరంతా పూర్తి సహాయ సహకారాలు అందించాలని టీ ఎన్నారైలకు ఆయన పిలుపునిచ్చారు. తొలిసారిగా ప్రపంచ తెలంగాణ సమావేశాలు డల్లాస్‌లో అట్టహాసంగా ప్రారంభమమైన సంగతి తెలిసిందే. అందులోభాగంగా ఆదివారం డల్లాస్ నగరంలో తెలంగాణ ఎన్నారైల రాజకీయ చర్చా వేదిక నిర్వహించారు. ఈ చర్చా కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, డీకే అరుణా, మధుయాష్కీగౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చా కార్యాక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో ఎన్నారైల పాత్రను ప్రస్తుతించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మరింతగా ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో వాచ్ డాగ్స్ వలే వ్యవహరించాలని ఎన్నారైలకు ఉత్తమ్ సూచించారు. తెలంగాణ ఎన్నారైలకు గోబల్ తెలంగాణ కన్వెన్షన్ ఓ వేదికగా ఉపయోగపడుతోందన్నారు. అందుకు నిర్వాహాకులు అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షుడు విజయ్ పిట్టా లక్ష్మణ్, సెక్రటరీ ప్రవీణ్ కాశీ రెడ్డి, ఎఫ్‌బీఐ ట్రస్టీ అజయ్ రెడ్డి, రవిశంకర్ పటేల్‌లను ధన్యవాదాలు తెలిపారు. ది హిందూకు చెందిన రవికాంత్ రెడ్డి ఈ చర్చావేదికలో అనుసంధానకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి డేటా(డల్లా ఏరియా తెలంగాణ అసోసియేషన్), టీప్యాడ్(తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్) సంస్థలు కూడా మద్దతిచ్చాయి. -
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరాం
లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే పక్షంలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నామని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్షనేత జితేందర్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొద్దిరోజుల్లో మొదలవనున్న నేపథ్యంలో మంగళవారం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హెచ్‌సీయూ, జేఎన్‌యూ సమస్యలను పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే పరిష్కరించాలని సమావేశంలో సూచించామన్నారు. ‘‘రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వెనుకబడిన ప్రాంతాల నిధులు, ఎయిమ్స్ ఏర్పా టు తదితర అంశాలను చర్చించాలని.. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలని కోరాం. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపు ప్రక్రియను ఈ సమావేశాల నుంచే ప్రారంభించాలని కోరాం...’’ అని జితేందర్‌రెడ్డి చెప్పారు. -
‘విభజన’ వేగం పెంచండి
కేంద్ర హోంమంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన అంశాల అమలు ఇంకా మిగిలే ఉందని, సాధ్యమైనంత త్వరగా వాటిని అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో రాజ్‌నాథ్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్... ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అధికారుల విభజన వివిధ స్థాయిల్లో ఇంకా పూర్తవలేదు. సంబంధిత విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కొత్త రాష్ట్రమైనందున అధికారుల కొరతతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అఖిల భారత సర్వీసు అధికారుల కొరత తీవ్రంగా ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు ఎవరైనా డెప్యుటేషన్‌పై రాదలిస్తే త్వరితగతిన సంబంధిత అభ్యర్థనలను సానుకూలంగా పరిష్కరించండి. తెలంగాణలో నగర ప్రాంతం ఎక్కువగా ఉన్నందున ఐపీఎస్ అధికారుల సంఖ్యను 112 నుంచి 141కు పెంచాలి’’ అని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిపి అసెంబ్లీ స్థానాలను పెంచాలని, ఇందుకు వీలుగా రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే చట్ట సవరణ చేయాలన్నారు. అంతకుముందున్న చట్టాలతో సంబంధం లేకుండా నియోజకవర్గాల పెంపు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కూడా హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. ‘‘రెండు రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ ఉన్న సంగతిని హోంమంత్రి ప్రస్తావించారు. ఈ సమావేశాల్లోనే చట్ట సవరణకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు’’ అని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి సమావేశ వివరాలు వెల్లడించారు. అలాగే గోదావరి, ప్రాణహిత నదుల వెంట ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలను కలుపుతూ 330 కి.మీ. మేర నిర్మించ తలపెట్టిన రహదారికి అన్ని అనుమతులిచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరినట్లు సమాచారం. ఈ భేటీలో మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు కె.కేశ వరావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌కు అపూర్వ ఆదరణ: జితేందర్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రధాని, కేంద్ర మంత్రులు అపూర్వంగా ఆదరించారని...ఇప్పటివరకు విన్నవించిన సమస్యలన్నింటినీ సానుకూలంగా పరిష్కరించే పరిస్థితి కనిపిస్తోందని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. హోంమంత్రితో ముఖ్యమంత్రి, ప్రతినిధి బృందం భేటీ అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. విభజన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. హైకోర్టును విభజించాలని సీజేఐకి వినతి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైకోర్టు విభజన జరపాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ టి.ఎస్. ఠాకూర్‌ను కలిశారు. హైకోర్టు విభజించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సూచనల మేరకు తొలుత తాము తెలంగాణ హైకోర్టు కోసం గచ్చిబౌలిలో తాత్కాలిక వసతిని గుర్తించామని, ఆ ప్రతిపాదనలను పంపినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని...ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు భవనాలు నిర్మాణమయ్యేంతవరకు తామేమీ చేయలేమన్న రీతిలో వ్యవహరిస్తోందని సీఎం వివరించినట్టు సమాచారం. అందువల్ల ప్రత్యేక హైకోర్టు ప్రక్రియను వేగవంతం చేయాలని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. జూనియర్ సివిల్ జడ్జి, ఇతర న్యాయాధికారుల నియామకాలను కూడా హైకోర్టు విభజన జరిగే వరకు చేపట్టరాదని సీజేఐకి కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు తెలియ వచ్చింది. -
ఆయుధ’ చిక్కులు!
విస్తరిస్తున్న నయా కల్చర్ ఆయుధ పూజలో లెసైన్స్డ్ వెపన్స్‌తో కాల్పులు తెలిసీ తెలియక చట్టం ఉల్లంఘన సుమోటో కేసుకు అవకాశం ఉన్నా పట్టని వైనం మంత్రి, ఎంపీ వివాదాల్ని పరిశీలిస్తున్నాం: కాప్స్ సిటీబ్యూరో:దసరా నేపథ్యంలో చేసే ఆయుధ పూజ కొత్త సంస్కృతికి నాంది పలుకుతోంది. తెలిసీ తెలియక ఆయుధ చట్టాన్ని ఉల్లంఘిస్తూ సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులూ వివాదాలకు కేంద్ర బిందువులు అవుతున్నారు. గత బుధవారం జరిగిన ఆయుధ పూజ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో, మహబూబ్‌నగర్ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఆయుధాలు ప్రదర్శించడం, గాల్లోకి కాల్పులు జరిపారంటూ కొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వివాదాస్పమైన ఈ రెండు అంశాలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. పూర్తి బాధ్యుడు లెసైన్స్ హోల్డరే... ఓ వ్యక్తికి పొంచి ఉన్న ముప్పు, నిర్వహించే వ్యాపార లావాదేవీలను పరిగణలోకి తీసుకున్న తరువాతే పోలీసు విభాగం ఆయుధ లెసైన్సు మంజూరు చేస్తుంది. సాధారణంగా నేర చరిత్ర, దుందుడుకు స్వభావం ఉన్న వారికి మంజూరు చేయరు. లెసైన్స్ పొంది ఆయుధాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి దాని పూర్తి రక్షణకు బాధ్యుడు అవుతాడు. లెసైన్స్ హోల్డర్‌కు చెందిన తుపాకీని మరో వ్యక్తి నిర్వహించడం, చేత్తో పట్టుకుని సంచరించడం ఆయుధ చట్టం ప్రకారం నేరాలే. దీనికి ఆ ఆయుధాన్ని పట్టుకున్న వ్యక్తితో పాటు లెసైన్స్ కలిగిన వ్యక్తి బాధ్యుడు అవుతాడు. ప్రాణహాని ఉంటేనే కాల్పులు... లెసైన్స్ హోల్డర్ కేవలం తనకు ప్రాణహాని ఉన్న సందర్భాల్లో మాత్రమే తుపాకీని వినియోగించి కాల్పులు జరపాల్సి ఉంటుంది. సరదా కోసమో, ఆర్భాటంలో భాగంగానో, ఆనవాయితీ పేరుతోనో కాల్పులకు దిగడం చట్ట ప్రకారం నేరమే. లెసైన్స్ హోల్డర్ ఖరీదు చేసే, ఖర్చు పెట్టే ప్రతి తూటాకీ కచ్చితంగా లెక్కచెప్పాలి. ప్రతి ఏటా పోలీసులు చేసే ఆడిట్‌తో పాటు లెసైన్స్ రెన్యూవల్ సమయంలో ఈ వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అధికారులు ఈ వ్యవహారాల్లో ఏమాత్రం అనుమానాస్పదంగా ఉన్నవి గుర్తించినా రెన్యూవల్ చేయకుండా లెసైన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. ఆయుధ పూజ నేపథ్యంలో కొందరు తమ ఆయుధాలను ప్రదర్శిస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. ఇలా ప్రదర్శించడం చట్ట ప్రకారం తప్పు కాకపోయినప్పటకీ వారితో పాటు వారి సంబంధీకులూ ఆ ఆయుధాలను చేతపట్టుకోవడం మాత్రం ఉల్లంఘన కిందికే వస్తుంది. సుమోటో కేసుకీ అవకాశం... అకారణంగా ఆయుధాన్ని వినియోగించడం, ఎదుటి వారిని భయభ్రాంతులకు గురి చేయడం, అవసరం లేకుండా కాల్పులు జరపడం ఇవన్నీ ఆయుధ చట్టం ఉల్లంఘనల కిందికే వస్తాయి. ఈ తరహా ఉదంతాలు జరిగినప్పుడు పోలీసులు ఫిర్యాదుతో సంబంధం లేకుండా సుమోటోగా కేసు నమోదు చేస్తారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు నోటీసులు జారీ చేసి..అవసరమైతే లెసైన్స్ సైతం రద్దు చేస్తారు. గతంలో సికింద్రాబాద్‌లోని ఓ పత్రిక కార్యాలయం వద్ద హల్చల్ చేసిన సిటీ నటుడు, బంజారాహిల్స్‌లోని రాజ కీయ పార్టీ కార్యాలయం వద్ద గాల్లోకి కాల్పులు జరిపిన నేత విషయంలో సుమోటో కేసులు నమోదు చేశారు. ఆ రెండు వివాదాలూ పరిశీలిస్తున్నాం: పోలీసులు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, బంజారాహిల్స్‌లో ఎంపీ జితేందర్‌రెడ్డిల ఆయుధాల ప్రదర్శన వివాదాలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. వీటిలో ఆయుధ చట్ట ఉల్లంఘనలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్థారణైతే చట్ట ప్రకారం తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేస్తున్నారు. వాస్తవం కాదు... తనపై వచ్చిన వివాదానికి సంబంధించి ఎంపీ జితేందర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఆయుధంతో ఎవరినీ భయభ్రాంతులకు గురి చేయలేదు. శాంతిభద్రతలకు భంగం కలిగేలా ప్రవర్తించలేదు. కేవలం సంప్రదాయం లో భాగంగానే ఆయుధాలను చేతపట్టుకున్నా’ అని అన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాజేష్ మాట్లాడుతూ... ‘దుర్గాష్టమి నేపథ్యంలో ఆయు ధ పూజ తరువాత ఆయుధాన్ని చేతపట్టుకోవడమనేది ఏళ్ళుగా జరుగుతున్న ఆనవాయితీ. అందులో భాగంగానే మంత్రి తన ఆయుధాన్ని పట్టుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపారన్నది అవాస్తవం’ అని పేర్కొన్నారు. రివాల్వర్‌తో బెదిరించాడని ఫిర్యాదు బంజారాహిల్స్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రహ్మత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కుమారుడు బండపల్లి భవానీ శంకర్ తనను రివాల్వర్ చూపి బెదిరించాడంటూ రహ్మత్‌నగర్‌కు చెందిన రఘునాథ్ అనే యువకుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భవానీ శంకర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 21వ తేదీ రాత్రి భవానీశంకర్ దుర్గామాత మండపం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా స్థానికంగా నలుగురు యువకులు ఆయనను అడ్డగించి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో భవానీశంకర్ కోపం పట్టలేక తన జేబులో ఉన్న రివాల్వర్ బయటకు తీసి చంపేస్తానంటూ బెది రించాడని, దుర్గామాత మండపం వద్ద కుర్చీలు, లైట్లు ధ్వంసం చేశాడని రఘునాథ్ అనే యువకుడు ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు భవానీశంకర్‌పై ఐపీసీ సెక్షన్ 506, 427 కింద కేసు నమోదు చేశారు. ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేయాలా వద్ద అన్నదానిపై న్యాయ సలహా కోరి నట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి తెలిపారు. న్యాయ పరిశీలన అనంతరం ఏ సెక్షన్ నమోదు చేయాలన్నది తేలుస్తామని ఆయన తెలిపారు. -
మంత్రి, ఎంపీకి చేదు అనుభవం
బెంగళూరు: తెలంగాణ - కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డికి మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సదరు ప్రజా ప్రతినిధులతోపాటు పలువురు నాయకులు బృందంగా మంగళవారం ఆ ప్రాజెక్టులను పరిశీలించేందుకు బయలుదేరింది. ఆ విషయం తెలిసిన కర్ణాటక పోలీసులు సరిహద్దుల్లో వారిని అడ్డుకున్నారు. మీ పర్యటనకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ అక్కడి పోలీసులు జూపల్లి, జితేందర్‌రెడ్డికి తేల్చి చెప్పారు. ఆ క్రమంలో వారు కర్ణాటక పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. ప్రాజెక్టులు పరిశీలించేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ వారు కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి.. అక్కడే భీష్మించుకుని కుర్చున్నారు. -
ఎన్‌హెచ్-44పై సదుపాయాలు కల్పించండి
* లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ మీదుగా వెళుతున్న 44వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి నివారణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా గుండా వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారిపై 78 చోట్ల గ్రామాలకు వెళ్లే అప్రోచ్ రోడ్లు ఉన్నాయని, ఆయా గ్రామాలకు వెళ్లే వారు హైవేను దాటాల్సి ఉంటుందని, ఆ సమయంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 500 మంది ఈ రోడ్డులో ప్రమాదవశాత్తు చనిపోయారన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన 78 చోట్ల్ల జీబ్రాలైన్లు, స్పీడ్‌బ్రేకర్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. -
ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరుపై రగడ
పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల ఆందోళన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు పేరు పెట్టడంపై పార్లమెంటులో దుమారం రేగింది. మంగళవారం నాడు ఉభయ సభల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయమై టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి వాయిదా తీర్మానం కోరగా స్పీకర్ సుమిత్రా మహాజన్ దాన్ని తిరస్కరించారు. అంతకుముందు టీఆర్ఎస్కు చెందిన 11 మంది ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీనిపై ఆందోళన చేయవద్దని, మాట్లాడేందుకు అనుమతిస్తానని స్పీకర్ తెలిపారు. జీరో అవర్‌లో జితేందర్‌రెడ్డి పేరు పిలవగా ఆయన ఆ సమయంలో అందుబాటులో లేకపోవడంతో మరో ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడారు. ‘కేంద్ర పౌర విమానయాన మంత్రి, టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు హైదరాబాద్‌లోని శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టారు. విమానాశ్రయానికి ఇప్పటికే రాజీవ్‌గాంధీ పేరు ఉంది. దేశంలోని ఇతర విమానాశ్రయాలకు ఒకే పేరుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అనవసరంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించలేదు. హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణలో భాగం. వాళ్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కావాలంటే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలోని ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోమనండి. అందులో తప్పేమీ లేదు. కానీ అనవసరంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాజధానిలో వివాదాన్ని సృష్టించారు. రాష్ట్రంలో ఒక కొత్త సమస్యను తెచ్చిపెట్టారు. అందువల్ల ప్రభుత్వం ఈ పేరును తక్షణం ఉపసంహరించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. ఆ వెంటనే ఇదే అంశమై అనకాపల్లి సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు. ‘అవిభాజ్య రాష్ట్రంలో బేగంపేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరుండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తొలగించింది. ఎన్టీఆర్ జాతీయ నాయకుడు. తెలుగు ప్రజలకు గర్వకారణమైన నేత. ఆయనను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం సరికాదు. జరిగిన పొరపాటును ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం సరిచేసింది. అందువల్ల ఆ పేరును కొనసాగించాలని కోరుతున్నాన’ని పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సభ ప్రారంభమైనప్పటి నుంచే సభ్యులు వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్ తదితరులు ఎన్టీఆర్ పేరును ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. దీనిపై తనను మాట్లాడనివ్వాలని జీరో అవర్‌లో ఆ పార్టీ ఎంపీ ఆనంద్ శర్మ పట్టుబట్టారు. అయితే దీనిపై నోటీసు ఇచ్చిన తర్వాతే మాట్లాడాలని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సూచించారు. అయినప్పటికీ శర్మ మాట్లాడుతూ.. ‘విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును ఉపసంహరించుకోవాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేంద్రం కనీసం ఆ రాష్ట్రాన్ని కూడా సంప్రదించలేదు’ అని వివరించబోగా.. ఉప సభాపతి కల్పించుకుంటూ.. ‘మీరు నోటీసు ఎందుకివ్వరు?’ అని ప్రశ్నించారు. శర్మ తిరిగి మాట్లాడుతూ.. ‘కేంద్రం చర్య ఆమోదించదగినది కాదు. ప్రభుత్వం నుంచి జవాబు కావాలి’ అని పేర్కొన్నారు. అప్పటివరకు సభను నడవనివ్వమని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో రాజ్యసభ వరుసగా రెండుసార్లు వాయిదా పడింది. -
పార్లమెంటు క్యాంటీన్లో హైదరాబాద్ బిర్యానీ!
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హైదరాబాదీ బిర్యానీ ఇకపై పార్లమెంటు క్యాంటీన్లో భోజనప్రియులకు ఆహ్వానం పలకనుంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే క్యాంటీన్లో బిర్యానీని అందుబాటులోకి తీసుకువస్తామని పార్లమెంటు ఫుడ్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఏపీ జితేందర్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. బిర్యానీతో పాటు మిర్చ్ కా సాలన్, షాహీ తుక్డా, కుబానీ కా మీఠాలను సైతం క్యాంటీన్లలో వడ్డించనున్నారు. ఎంపీ లాడ్స్ నిధులను రూ. 50 కోట్లకు పెంచాలని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. -
విద్యుత్ కోతలకు బాబే కారణం
పరిగి: తెలంగాణలో విద్యుత్ కోతలకు చంద్రబాబే కారణమని, గత పాలన లో ఇక్కడి వనరులను తరలించుకెళ్లి సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పారని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన తాండూరులో కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారా వు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మేని ఫెస్టోలో పేర్కొన్న విధంగా అధికారం చేపట్టిన 11 వారాల్లోనే 43 అంశాలపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికే దళితులకు మూడెకరాల భూమి పథకం ప్రారంభమైంద ని, రూ.మూడు లక్షలతో ఇంటి నిర్మా ణం పథకం త్వరలో కార్యరూపం దాల్చనుందని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ ప్రాంతంలోని తాగు, సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నెట్టెం పాడు, బీమా-1, బీమా-2, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టి త్వర లో పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, బాల్‌రాజ్‌లు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఒకేరోజున నాలుగున్నర కోట్ల ప్రజల వివరాలు సేకరించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రతిపక్షాలు అవగాహనా రాహిత్యంతో చవకబారు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తుంటే ఇక్కడి టీడీపీ నాయకులు కనీస అవగాహన లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం 2009 నుంచి ఇప్పటివరకు పంటనష్ట పరిహారం చెల్లించకుండా జాప్యంచేస్తే తమ ప్రభుత్వం అన్నికలిపి ఒకేసారి చెల్లిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొప్పుల మహేష్‌రెడ్డి, కొప్పుల నాగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు భాస్కర్, పార్టీ సీనియర్ నాయకులు సురేందర్, వెంకటయ్య, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో పదిలక్షల ఎకరాలకు సాగునీరు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లాలోని పది లక్షల ఎకరాలకు సాగునీరు అం దించడమే తన ప్రధాన లక్ష్యమని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యులు జితేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పాలమూరు రెడ్డి సేవా సమితి బాలుర వసతి గృహంలో జిల్లాలోని రెడ్డి ప్రతినిధులను సన్మానించారు. సమితి అధ్యక్షుడు టి.ఇంధ్రసేనారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎం.పి. జితేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పేద రెడ్డి పిల్లల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జల్లాలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేసి అందరికి ఉపాధి కల్పిస్తామన్నారు. సమితి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కల్యాణ మండపానికి తన వంతు సహకారమందిస్తానన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో రెడ్లు ముఖ్యభూమికను పోషిస్తున్నారన్నారు. జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రెడ్డి సోదరులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అందరికి తనవంతు సేవలందిస్తానన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ ఛైర్పర్సన్ రాధ, కౌన్సిలర్లు విఠల్‌రెడ్డి, రవికిషన్‌రెడ్డి, పాండురంగారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మల్లు సరస్వతిని సేవా సమితి సభ్యులు సన్మానించారు. అథితులుగా హాజరైన జయరామ మోటర్స్ అధినేత బెక్కరి రాంరెడ్డి బాలబాలికల వసతి గృహానికి *10లక్షల విరాళం ప్రకటించారు. కళ్యాణ మండపం నిర్మాణానికి మల్లు నర్సింహ్మారెడ్డి 2లక్షలు, షాద్‌నగర్ విష్ణువర్ధన్‌రెడ్డి *50వేలు విరాళం ప్రకటించారు. చదువులో విశేష ప్రతిభ కనభర్చిన ముచ్చింతల నివాసి సందీప్‌రెడ్డికి వైద్య విద్య ఎంబిబిఎస్ పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం అందిస్తామని, బి.ఇడి విద్యార్థి లక్ష్మణ్‌కు చదువు ఖర్చు బరిస్తామని రెడ్డి సేవా సమతి అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో సలహాదారు వి.మనోహర్‌రెడ్డి, ప్రొద్దుటూరి ఎల్లారెడ్డి, గౌరవ అధ్యక్షుడు వి.చిన్నారెడ్డి, పి.రాఘవరెడ్డి, ప్రచార కార్యదర్శి యన్.సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర పెత్తనం సాగనివ్వం!
మద్దతు పలికిన ఎంఐఎం సభ 2 సార్లు వాయిదా ఉమ్మడి రాజధానిపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఉందన్న రాజ్‌నాథ్ రాజ్‌నాథ్‌ను కలసిన టీఆర్ఎస్ ఎంపీలు అమలును తాత్కాలికంగా నిలిపేస్తామని హామీ ఇచ్చారని వెల్లడి పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ఉంది.. విభజన చట్టం సెక్షన్ 8 (2) ప్రకారం గవర్నర్‌కు శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్యమైన సంస్థల భద్రత, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కేటాయింపు విషయంలో ప్రత్యేక అధికారాలు ఉంటాయి. సెక్షన్ 8 (3) ప్రకారం తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించి గవర్నర్ తన తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చు. చట్టంలోనే దీనిపై స్పష్టత ఉంది. ఇక కేంద్ర హోంశాఖ జారీ చేసిన సర్క్యులర్ కేవలం సలహాపూర్వకమైనదే. అందులో కొత్తగా చెప్పిందేమీ లేదు. ఇది చట్టంలోనే ఉంది. సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు అప్పగించడంపై టీఆర్ఎస్ లోక్‌సభలో తీవ్ర నిరసన తెలిపింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం సాగనివ్వబోమని స్పష్టం చేసింది. తొలుత లోక్‌సభ సమావేశం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా.. టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం హక్కులు కాపాడాలని, న్యాయం కావాలని నినాదాలు చేస్తూ సభను స్తంభింపజేశారు. ఈ అంశంపై చర్చించేందుకు వాయిదా తీర్మానం కోసం నోటీస్ ఇచ్చారు. కానీ సభాపతి సుమిత్రా మహాజన్ దానికి నిరాకరించి, జీరో అవర్‌లో ప్రస్తావించేందుకు అవకాశమిస్తానన్నారు. కానీ టీఆర్ఎస్ సభ్యులు మాత్రం.. సభా కార్యక్రమాలను వాయిదా వేసి ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. వారికి ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా జత కలిశారు. ఈ ఆందోళన, నిరసనల హోరు మధ్య సోమవారం లోక్‌సభ రెండుసార్లు వాయిదాపడింది. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి లేచి మాట్లాడారు. తాను వాయిదా తీర్మానం కోసం నోటీసు ఇచ్చానంటూ చెబుతుండగానే... సభాపతి కల్పించుకుని ‘అవును. ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్‌లో అనుమతిస్తాను..’ అన్నారు. దానిపై జితేందర్‌రెడ్డి స్పందిస్తూ... ‘ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదు..’ అని వివరించబోయారు. దాంతో స్పీకర్.. ‘మీరు చెబుతున్న అంశం ముఖ్యమైనదే. కానీ వాయిదా తీర్మానం ద్వారా చర్చించేంత ముఖ్యమైనది కాదు’ అని పేర్కొనగానే... టీఆర్ఎస్ ఎంపీలు బాల్క సుమన్ తదితరులు స్పీకర్ పోడియం వద్ద పెద్ద పెట్టున నినాదాలు ప్రారంభించారు. అయినా స్పీకర్ మాత్రం ఈ అంశంపై మాట్లాడేందుకు జీరో అవర్‌లో అనుమతిస్తానని పేర్కొంటూ... ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ నిరసనల మధ్యే కొద్దిసేపు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించినా... టీఆర్ఎస్ సభ్యుల ఆందోళన ఉధృతమవడంతో 11.20 గ ంటలకు స్పీకర్ పది నిమిషాల సేపు సభను వాయిదా వేశారు. పట్టుబట్టిన జితేందర్‌రెడ్డి.. తిరిగి 11.30కు సభ ప్రారంభం కాగానే... టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా.. ‘మాకు హోంమంత్రి నుంచి ఒక ప్రకటన కావాలి..’ అని జితేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కానీ స్పీకర్ మాత్రం.. ‘జీరో అవర్‌లో అవకాశం ఇస్తాను. అప్పుడు హోంమంత్రి ఉంటే, ఆయన సమాధానం ఇవ్వాలనుకుంటే ఇస్తారు.. ఇప్పుడు కుదరదు.. అయినా హోంమంత్రి రాజ్యసభలో ఉన్నారు. నేనేం చేయగలను?’ అని ప్రశ్నించారు. దాంతో హోంమంత్రి రాగానే ప్రకటన ఇప్పించాలని జితేందర్‌రెడ్డి కోరారు. ఇదే సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు లేచి.. ‘హోంమంత్రి రాజ్యసభలో ఉన్నారు. సభాపతి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం స్పందించడానికి సిద్ధంగా ఉంది..’ అని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. ‘ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. హోంశాఖ పంపిన సర్క్యులర్ వల్ల గందరగోళం ఏర్పడింది. ఒకసారి హోంమంత్రి స్పష్టత ఇస్తే ఈ సమస్యకు తెరపడుతుంది. జీరో అవర్‌లో వాళ్లు దీనిని ప్రస్తావిస్తారు. హోంమంత్రి రాగానే దీనిపై స్పందిస్తే సరిపోతుంది..’ అని సూచించారు. ప్రతి విషయంలో అన్యాయమే.. మధ్యాహ్నం 12.46 గంటలకు స్పీకర్ జీరో అవర్ ప్రారంభించగానే జితేందర్‌రెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించారు. దీంతో ఆయన లేచి.. ‘‘ఒక సందర్భంలో హోంమంత్రి మాట్లాడుతూ అందరికీ న్యాయం చేస్తామన్నారు. మేం తెలంగాణకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం. అనేక మంది ప్రాణత్యాగం, పోరాటం తరువాత 60 ఏళ్ల మా కల ఫలించింది. కానీ ఇప్పుడు తెలంగాణపై ఒక అంకుశాన్ని తెచ్చారు. తెలంగాణ వచ్చిందని, రాఖీ పండుగ జరుపుకొంటున్నామని సంతోషంతో ఉన్న మాకు 8వ తేదీన కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఒక సర్క్యులర్ అందింది. దాని ప్రకారం పోలీస్‌స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌ను బదిలీ చేయాలన్నా, డీసీపీని బదిలీ చేయాలన్నా సీఎం ఆ ఫైల్‌ను గవర్నర్‌కు పంపాలట.. ఆయన నిర్ణయం తీసుకోవాలట.. ఏ ముఖ్యమంత్రికైనా ఇలాంటి పరిస్థితి వస్తుందా? దీనిపై మా అభిప్రాయాలు కోరుతూ గత నెలలోనే హోంశాఖ నుంచి లేఖ వచ్చింది. అప్పుడు ఎంపీలందరం హోంమంత్రిని కలిశాం. ఆయన దాన్ని రెండు సార్లు చదివి.. దాన్ని అమలుచేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేరన్నారు. అది గవర్నర్ పాలనే అవుతుందని, అలాంటి నిబంధనలు రావని, నిశ్చింతగా ఉండాలని చెప్పారు. అది నమ్మి మేం తెలంగాణ ప్రజలకు కూడా చెప్పాం. మాకు తెలంగాణ వచ్చి పది వారాలే అయ్యింది. కానీ ప్రతి విషయంలో మాకు అన్యాయమే జరుగుతోంది. పోలవరం విషయంలో అన్యాయం జరిగింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో లేని గవర్నర్ పాలన తెలంగాణలో మాత్రమే ఎందుకు పెట్టాల్సి వస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోడీకి రాష్ట్రాలపై ఆంక్షలు విధించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసు. ఆయనకు తెలిసే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయా? అన్న అనుమానం ఉంది. కేంద్ర హోంమంత్రి దీనికి సమాధానం చెప్పాలి..’’ అని డిమాండ్ చేశారు. అది సలహా పూర్వకమైనదే: కేంద్ర హోంమంత్రి ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాల అంశమని, రాష్ట్రాల అధికారాలను కేంద్రం తీసేసుకోవాలన్న ఉద్దేశం తమకు లేదని, అలాంటి ప్రయత్నమూ చేయడం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8(1) ప్రకారం అపాయింటెడ్ డే నుంచి ఉమ్మడి రాజధానిలో పాలనా వ్యవహారాల నిమిత్తం గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఉంది. అక్కడ నివసించే ప్రజల జీవితాలు, స్వేచ్ఛ, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఆ బాధ్యత ఉంటుంది..’’ అని వివరించబోయారు. దీనిపై ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడుతూ... ‘అది రాజ్యాంగ విరుద్ధం’ అంటూ నినదించారు. ఆయనతోపాటు టీఆర్ఎస్ సభ్యులు కూడా నిరసన వ్యక్తం చేశారు. అయినా రాజ్‌నాథ్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘విభజన చట్టం సెక్షన్ 8 (2) ప్రకారం గవర్నర్‌కు శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్యమైన సంస్థల భద్రత, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కేటాయింపు విషయంలో ప్రత్యేక అధికారాలు ఉంటాయి. సెక్షన్ 8 (3) ప్రకారం తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించి గవర్నర్ తన తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చు. చట్టంలోనే దీనిపై స్పష్టత ఉంది. ఇక కేంద్ర హోంశాఖ జారీ చేసిన సర్క్యులర్ కేవలం సలహాపూర్వకమైనదే. అందులో కొత్తగా చెప్పిందేమీ లేదు. ఇది చట్టంలోనే ఉంది..’’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో జితేందర్‌రెడ్డి లేచి.. హోంమంత్రి చెబుతున్నది సరికాదని పేర్కొన్నారు. మరో ఎంపీ వినోద్‌కుమార్ లేచి తాను ఒక స్పష్టత కోరుతానని అడగగా.. స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ సభను 2 గంటల వరకు వాయిదా వేశారు. తాత్కాలికంగా ఉత్తర్వుల అమలు నిలిపివేత.. లోక్‌సభ వాయిదా పడిన అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా దీనిపై 18వ తేదీన మరోమారు చర్చించుకోవచ్చని, అప్పటివరకు ఉత్తర్వుల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తామని రాజ్‌నాథ్ తమకు హామీ ఇచ్చారని టీఆర్ఎస్ ఎంపీలు అనంతరం విలేకరులకు తెలిపారు. చట్టంలో పేర్కొన్నవాటికి అదనంగా హోంశాఖ ఉత్తర్వుల్లో ఏమున్నా వాటిని తొలగిస్తామని చెప్పారని వెల్లడించారు. -
లోక్‌సభా పక్ష నేతగా జితేందర్?
పరిశీలనలో వినోద్‌కుమార్ పేరు పార్లమెంటరీ పార్టీ నేతగా కేకేనే! హస్తిన నుంచి తిరిగొచ్చిన కేసీఆర్ హైదరాబాద్/న్యూఢిల్లీ: లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. 11 మంది టీఆర్ఎస్ లోక్‌సభ సభ్యుల్లో సీనియర్లయిన ఎ.పి.జితేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), బి.వినోద్‌కుమార్ (కరీంనగర్) పేర్లు గట్టిగా విన్పిస్తున్నాయి. మోడీ నేతృత్వంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వంలోని చాలామంది ముఖ్యులతో జితేందర్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. వినోద్‌కు కూడా జాతీయ స్థాయిలోని నేతలతో పరిచయాలున్నాయి. పైగా పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడని కూడా పేరుంది. కాకపోతే సామాజిక సమతూకం తదితరాల కోణంలో జితేందర్‌రెడ్డికే అవకాశం దక్కవచ్చంటున్నారు. మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో దీనిపై కేసీఆర్‌ను ప్రశ్నించగా, ‘తొందరేముంది? హైదరాబాద్‌లో ఎంపీలంతా సమావేశమై ఎన్నుకుంటారు’ అంటూ స్పందించారు. ఇక తాను రాజీనామా చేసిన మెదక్ లోక్‌సభ స్థానం బరిలో ఎవరిని నిలపాలన్న దానిపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ ఎంపీలు, ఇతర నేతలు కూడా ఆయనతో పాటు తిరిగొచ్చారు. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఆయన ఢిల్లీ రావడం తెలిసిందే. ఇక టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా మాత్రం పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు వ్యవహరించనున్నారు.