కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి | EX MP Jithender Reddy Joined In Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి

Published Sat, Mar 16 2024 7:37 AM | Last Updated on Sat, Mar 16 2024 12:44 PM

EX MP Jithender Reddy Joined In Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేత, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బీజేపీ నుంచి మహబూబ్‌నగర్‌ ఎంపీ టికెట్‌ ఆశించి భంగపడిన జితేందర్, ఆయన కుమారుడు మిథున్‌ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. 

కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ లోక్‌సభ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకు ముందు జితేందర్‌తో పాటు మిథున్‌రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానానికి తమ రాజీనామా లేఖలు పంపారు. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే జితేందర్‌రెడ్డికి కేబినెట్‌ మంత్రి హోదాతో కూడిన రెండు పదవులు లభించాయి. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడా వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

బండిని తప్పించడంతోనే తిరోగమనం..: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ఉండగా పార్టీ రాష్ట్రం బలం పుంజుకుని రాజకీయశక్తిగా ఎదిగిందని మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర నాయకత్వం మార్పు జరిగాక బీజేపీకి తీవ్రంగా నష్టం జరిగిందని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లలో గెలవాల్సిందిపోయి 8 స్థానాలకే పరిమితమైందని తెలిపా రు. బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డాకు పంపించిన రాజీనామా లేఖలో ఆయా అంశాలను ప్రస్తావించారు. తనకు బీజేపీలో ఇన్నాళ్లూ పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జేపీనడ్డాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement