
శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న సీఎం రేవంత్
కొడంగల్: ‘ఒక్క సంతకంతో కొడంగల్‌కు అన్నీ వస్తాయి. ఎవరినీ అడుక్కోవాల్సిన అవసరం లేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మంచి చెడుల్లో ఎల్లప్పుడూ కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని పాలించే శక్తిని కొడంగల్ ప్రజలే ఇచ్చారని వ్యాఖ్యానించారు. కొడంగల్‌లోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం శనివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేయదని అన్నారు. కొందరికి వాళ్ల కుర్చీ పోయిందనే దుఃఖం ఉందని, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. నేనేం చేస్తానో.. ఏం చేశానో నాకంటే మీకే ఎక్కువగా తెలుసునన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్ పాల్గొన్నారు.
శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ
కొడంగల్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా పద్మావతీ సమేత శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ధర్మకర్తలు శ్రీవారి ప్రతిమను బహూకరించారు. అర్చకులు ఆశీర్వాదం అందించారు.