కేంద్ర పెత్తనం సాగనివ్వం!
-
మద్దతు పలికిన ఎంఐఎం
-
సభ 2 సార్లు వాయిదా
-
ఉమ్మడి రాజధానిపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఉందన్న రాజ్‌నాథ్
-
రాజ్‌నాథ్‌ను కలసిన టీఆర్‌ఎస్ ఎంపీలు
-
అమలును తాత్కాలికంగా నిలిపేస్తామని హామీ ఇచ్చారని వెల్లడి
పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోనే ఉంది..
విభజన చట్టం సెక్షన్ 8 (2) ప్రకారం గవర్నర్‌కు శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్యమైన సంస్థల భద్రత, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కేటాయింపు విషయంలో ప్రత్యేక అధికారాలు ఉంటాయి. సెక్షన్ 8 (3) ప్రకారం తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించి గవర్నర్ తన తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చు. చట్టంలోనే దీనిపై స్పష్టత ఉంది. ఇక కేంద్ర హోంశాఖ జారీ చేసిన సర్క్యులర్ కేవలం సలహాపూర్వకమైనదే. అందులో కొత్తగా చెప్పిందేమీ లేదు. ఇది చట్టంలోనే ఉంది.
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు అప్పగించడంపై టీఆర్‌ఎస్ లోక్‌సభలో తీవ్ర నిరసన తెలిపింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం సాగనివ్వబోమని స్పష్టం చేసింది. తొలుత లోక్‌సభ సమావేశం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా.. టీఆర్‌ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం హక్కులు కాపాడాలని, న్యాయం కావాలని నినాదాలు చేస్తూ సభను స్తంభింపజేశారు. ఈ అంశంపై చర్చించేందుకు వాయిదా తీర్మానం కోసం నోటీస్ ఇచ్చారు. కానీ సభాపతి సుమిత్రా మహాజన్ దానికి నిరాకరించి, జీరో అవర్‌లో ప్రస్తావించేందుకు అవకాశమిస్తానన్నారు. కానీ టీఆర్‌ఎస్ సభ్యులు మాత్రం.. సభా కార్యక్రమాలను వాయిదా వేసి ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. వారికి ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా జత కలిశారు. ఈ ఆందోళన, నిరసనల హోరు మధ్య సోమవారం లోక్‌సభ రెండుసార్లు వాయిదాపడింది. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి లేచి మాట్లాడారు. తాను వాయిదా తీర్మానం కోసం నోటీసు ఇచ్చానంటూ చెబుతుండగానే... సభాపతి కల్పించుకుని ‘అవును. ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్‌లో అనుమతిస్తాను..’ అన్నారు. దానిపై జితేందర్‌రెడ్డి స్పందిస్తూ... ‘ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదు..’ అని వివరించబోయారు. దాంతో స్పీకర్.. ‘మీరు చెబుతున్న అంశం ముఖ్యమైనదే. కానీ వాయిదా తీర్మానం ద్వారా చర్చించేంత ముఖ్యమైనది కాదు’ అని పేర్కొనగానే... టీఆర్‌ఎస్ ఎంపీలు బాల్క సుమన్ తదితరులు స్పీకర్ పోడియం వద్ద పెద్ద పెట్టున నినాదాలు ప్రారంభించారు. అయినా స్పీకర్ మాత్రం ఈ అంశంపై మాట్లాడేందుకు జీరో అవర్‌లో అనుమతిస్తానని పేర్కొంటూ... ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ నిరసనల మధ్యే కొద్దిసేపు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించినా... టీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన ఉధృతమవడంతో 11.20 గ ంటలకు స్పీకర్ పది నిమిషాల సేపు సభను వాయిదా వేశారు.
పట్టుబట్టిన జితేందర్‌రెడ్డి..
తిరిగి 11.30కు సభ ప్రారంభం కాగానే... టీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా.. ‘మాకు హోంమంత్రి నుంచి ఒక ప్రకటన కావాలి..’ అని జితేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కానీ స్పీకర్ మాత్రం.. ‘జీరో అవర్‌లో అవకాశం ఇస్తాను. అప్పుడు హోంమంత్రి ఉంటే, ఆయన సమాధానం ఇవ్వాలనుకుంటే ఇస్తారు.. ఇప్పుడు కుదరదు.. అయినా హోంమంత్రి రాజ్యసభలో ఉన్నారు. నేనేం చేయగలను?’ అని ప్రశ్నించారు. దాంతో హోంమంత్రి రాగానే ప్రకటన ఇప్పించాలని జితేందర్‌రెడ్డి కోరారు. ఇదే సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు లేచి.. ‘హోంమంత్రి రాజ్యసభలో ఉన్నారు. సభాపతి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం స్పందించడానికి సిద్ధంగా ఉంది..’ అని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. ‘ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. హోంశాఖ పంపిన సర్క్యులర్ వల్ల గందరగోళం ఏర్పడింది. ఒకసారి హోంమంత్రి స్పష్టత ఇస్తే ఈ సమస్యకు తెరపడుతుంది. జీరో అవర్‌లో వాళ్లు దీనిని ప్రస్తావిస్తారు. హోంమంత్రి రాగానే దీనిపై స్పందిస్తే సరిపోతుంది..’ అని సూచించారు.
ప్రతి విషయంలో అన్యాయమే..
మధ్యాహ్నం 12.46 గంటలకు స్పీకర్ జీరో అవర్ ప్రారంభించగానే జితేందర్‌రెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించారు. దీంతో ఆయన లేచి.. ‘‘ఒక సందర్భంలో హోంమంత్రి మాట్లాడుతూ అందరికీ న్యాయం చేస్తామన్నారు. మేం తెలంగాణకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం. అనేక మంది ప్రాణత్యాగం, పోరాటం తరువాత 60 ఏళ్ల మా కల ఫలించింది. కానీ ఇప్పుడు తెలంగాణపై ఒక అంకుశాన్ని తెచ్చారు. తెలంగాణ వచ్చిందని, రాఖీ పండుగ జరుపుకొంటున్నామని సంతోషంతో ఉన్న మాకు 8వ తేదీన కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఒక సర్క్యులర్ అందింది. దాని ప్రకారం పోలీస్‌స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌ను బదిలీ చేయాలన్నా, డీసీపీని బదిలీ చేయాలన్నా సీఎం ఆ ఫైల్‌ను గవర్నర్‌కు పంపాలట.. ఆయన నిర్ణయం తీసుకోవాలట.. ఏ ముఖ్యమంత్రికైనా ఇలాంటి పరిస్థితి వస్తుందా? దీనిపై మా అభిప్రాయాలు కోరుతూ గత నెలలోనే హోంశాఖ నుంచి లేఖ వచ్చింది. అప్పుడు ఎంపీలందరం హోంమంత్రిని కలిశాం. ఆయన దాన్ని రెండు సార్లు చదివి.. దాన్ని అమలుచేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేరన్నారు. అది గవర్నర్ పాలనే అవుతుందని, అలాంటి నిబంధనలు రావని, నిశ్చింతగా ఉండాలని చెప్పారు. అది నమ్మి మేం తెలంగాణ ప్రజలకు కూడా చెప్పాం. మాకు తెలంగాణ వచ్చి పది వారాలే అయ్యింది. కానీ ప్రతి విషయంలో మాకు అన్యాయమే జరుగుతోంది. పోలవరం విషయంలో అన్యాయం జరిగింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో లేని గవర్నర్ పాలన తెలంగాణలో మాత్రమే ఎందుకు పెట్టాల్సి వస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోడీకి రాష్ట్రాలపై ఆంక్షలు విధించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసు. ఆయనకు తెలిసే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయా? అన్న అనుమానం ఉంది. కేంద్ర హోంమంత్రి దీనికి సమాధానం చెప్పాలి..’’ అని డిమాండ్ చేశారు.
అది సలహా పూర్వకమైనదే: కేంద్ర హోంమంత్రి
ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాల అంశమని, రాష్ట్రాల అధికారాలను కేంద్రం తీసేసుకోవాలన్న ఉద్దేశం తమకు లేదని, అలాంటి ప్రయత్నమూ చేయడం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8(1) ప్రకారం అపాయింటెడ్ డే నుంచి ఉమ్మడి రాజధానిలో పాలనా వ్యవహారాల నిమిత్తం గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఉంది. అక్కడ నివసించే ప్రజల జీవితాలు, స్వేచ్ఛ, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఆ బాధ్యత ఉంటుంది..’’ అని వివరించబోయారు. దీనిపై ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడుతూ... ‘అది రాజ్యాంగ విరుద్ధం’ అంటూ నినదించారు. ఆయనతోపాటు టీఆర్‌ఎస్ సభ్యులు కూడా నిరసన వ్యక్తం చేశారు. అయినా రాజ్‌నాథ్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘విభజన చట్టం సెక్షన్ 8 (2) ప్రకారం గవర్నర్‌కు శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్యమైన సంస్థల భద్రత, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కేటాయింపు విషయంలో ప్రత్యేక అధికారాలు ఉంటాయి. సెక్షన్ 8 (3) ప్రకారం తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించి గవర్నర్ తన తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చు. చట్టంలోనే దీనిపై స్పష్టత ఉంది. ఇక కేంద్ర హోంశాఖ జారీ చేసిన సర్క్యులర్ కేవలం సలహాపూర్వకమైనదే. అందులో కొత్తగా చెప్పిందేమీ లేదు. ఇది చట్టంలోనే ఉంది..’’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో జితేందర్‌రెడ్డి లేచి.. హోంమంత్రి చెబుతున్నది సరికాదని పేర్కొన్నారు. మరో ఎంపీ వినోద్‌కుమార్ లేచి తాను ఒక స్పష్టత కోరుతానని అడగగా.. స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ సభను 2 గంటల వరకు వాయిదా వేశారు.
తాత్కాలికంగా ఉత్తర్వుల అమలు నిలిపివేత..
లోక్‌సభ వాయిదా పడిన అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా దీనిపై 18వ తేదీన మరోమారు చర్చించుకోవచ్చని, అప్పటివరకు ఉత్తర్వుల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తామని రాజ్‌నాథ్ తమకు హామీ ఇచ్చారని టీఆర్‌ఎస్ ఎంపీలు అనంతరం విలేకరులకు తెలిపారు. చట్టంలో పేర్కొన్నవాటికి అదనంగా హోంశాఖ ఉత్తర్వుల్లో ఏమున్నా వాటిని తొలగిస్తామని చెప్పారని వెల్లడించారు.