
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య వివాదాల నేపథ్యంలో ఆదివారం గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో గవర్నర్ల వ్యవస్థపై వచ్చిన రెండు ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. విశ్వవిద్యాలయాలకు కులపతిగా గవర్నర్ల నియామకాన్ని వ్యతిరేకిస్తూ జస్టిస్ మదన్ మోహన్ పుంచీ కమిషన్ చేసిన సిఫారుసులపై ఓ ప్రశ్న వచ్చింది. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితులపై గవర్నర్ తమిళిసై కొంతకాలంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు వీలు కల్పించే బిల్లును ఆమోదించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వర్సిటీలపై గవర్నర్ల ఆజమాయిషీని ప్రశ్నిస్తూ గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ఈ ప్రశ్న అడగడం గమనార్హం. ‘ ఏ) రాజ్యాంగ బాధ్యతలను న్యాయంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించడానికి గవర్నర్‌పై.. రాజ్యాంగం కల్పించని పదవులు, అధికారాల (వర్సిటీల చాన్స్‌లర్ వంటి పదవులు)తో భారం వేయకూడదు. బీ) గవర్నర్‌ను విశ్వవిద్యాలయాలకు చాన్స్‌లర్‌గా చేయడం ద్వారా అతనికి/ఆమెకు అధికారాలను అప్పగించడం చారిత్రకంగా కొంత ఔచిత్యాన్ని కలిగి ఉన్నప్పటికీ నేడు కాల, పరిస్థితుల మార్పుతో అది ఉనికిని కోల్పోయింది’ అనే సిఫారసులను ఏ కమిషన్ చేసిందని ప్రశ్న వచ్చింది.
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 8 బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా దీర్ఘకాలంగా రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉంచడాన్ని సవాలు చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌కు నేరుగా నోటీసులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. గవర్నర్‌కు బదులుగా కేంద్ర ప్రభుత్వానికి నోటిసులిచ్చింది. ఈ కేసు నేపథ్యంలో గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో మరో ఆసక్తికర ప్రశ్న రావడం గమనార్హం.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి, న్యాయశాఖ మంత్రి, ఒక రాష్ట్ర గవర్నర్లలో ఎవరు తమ పదవీ కాలంలో అధికారాలు, విధుల నిర్వహణ, పనితీరుపై ఏ న్యాయస్థానానికి జవాబుదారిగా ఉండరు?’ అని మరో ప్రశ్న వచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్లకు మాత్రం ఈ మేరకు రాజ్యాంగపర రక్షణ ఉంది. గవర్నర్ల వ్యవస్థపై ప్రశ్నలు రావడంతో రాజ్‌భవన్ వర్గాలు ఆరా తీశాయి. ప్రశ్నపత్రాన్ని తెప్పించుకొని పరిశీలించాయి.
చదవండి: UPSC 2023: సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల