![Supreme Court Hearing On Pending Bills At Telangana Governor - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/24/Supreme%20Court_01.jpg.webp?itok=HbyRUkA7)
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లులు లేనందున కేసు పరిష్కారం అయినట్లు సీజేఐ ధర్మాసనం ప్రకటించింది. కేసును ముగిస్తూ.. బిల్లుల విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 200(1) ప్రకారం సాధ్యమైనంత త్వరగా అనే అంశం ప్రాధాన్యతను గవర్నర్లు గుర్తించాలని సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా తమవద్ద ఏ బిల్లులు పెండింగ్‌లో లేవని గవర్నర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. రెండు బిల్లుల విషయంలో ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం, క్లారిఫికేషన్ కోరినట్లు పేర్కొన్నారు. కాగా కీలక బిల్లులను తిప్పి పంపారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎన్నికైన చట్ట సభల ప్రతినిధులు గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు.
బిల్లులు తిప్పి పంపాలంటే వీలైనంత వెంటనే పంపొచ్చని, కానీ తన వద్దనే పెండింగులో పెట్టుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఒక వారంలో, గుజరాత్‌లో ఒక నెలలో బిల్లులన్నీ క్లియర్ అవుతున్నాయన్న విషయాన్ని కోర్టుకు తెలిపారు. గవర్నర్లు కూడా రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలని సూచించారు. గవర్నర్లు నిర్ణీత కాలవ్యవధిలోగా బిల్లులపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. వివరణ కోసం గవర్నర్ బిల్లులు తిప్పి పంపే అధికారం ఉందని స్పష్టం చేసింది. అయినా ప్రస్తుతం గవర్నర్ వద్ద ఏదీ పెండింగులో లేదని తెలిపింది. అయితే రాజ్యంగంలోని 200(1)వ అధికరణను గవర్నర్లు దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
చదవండి: ఎవడెన్ని ట్రిక్‌లు చేసిన హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: మంత్రి హరీష్ రావు
Comments
Please login to add a commentAdd a comment