సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్. చిత్రంలో జితేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు వ్యవహారం జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో జరుగుతుందని స్పష్టంచేశారు. వివిధ నియోజకవర్గాల్లో ఎస్సీలతోపాటు ఇతర అన్ని సామాజికవర్గాల ప్రజలను బీజేపీవైపు మళ్లించడంతోపాటు టీఆర్‌ఎస్ సర్కార్ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుకునేలా కార్యాచరణ రూపొందించాలని ఆయన ముఖ్యనేతలకు సూచించారు.
సోమవారం ఒక హోటల్‌లో జరిగిన పార్టీ ‘ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ’తొలి సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపే కీలకమని పేర్కొన్నారు. ‘మిషన్–19’పేరిట రాష్ట్రంలోని 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ‘ఎస్సీ నియోజకవర్గాల్లో ఓట్ల శాతమే గెలుపోటములను నిర్ణయిస్తుంది.
లోక్‌సభ ఎన్నికల్లోనూ అభ్యర్థుల గెలుపోటముల్లో ఎస్సీ నియోజకవర్గాల్లోని ఓట్లే కీలక పాత్ర పోషించాయి. అందుకు నా గెలుపే ఒక ఉదాహరణ. కరీంనగర్ ఎంపీ సీటు పరిధిలో చొప్పదండి, మానకొండూరు ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చొప్పదండిలో 9 శాతం, మానకొండూరులో 2.52 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అదే పార్లమెంట్ ఎన్నికలొచ్చేసరికి చొప్పదండిలో 61 శాతం, మానకొండూరులో 51.5 శాతం ఓట్లు బీజేపీకి పోలయ్యాయి.
అందుకే నేను దాదాపు లక్ష ఓట్లతో గెలవగలిగాను’అని సంజయ్ అన్నారు. ఎస్సీ ఓట్లను మాత్రమే కాకుండా ఇతర సామాజిక వర్గాల ఓట్లను కూడా రాబట్టేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎస్సీ సమన్వయ కమిటీ చైర్మన్ ఎ.పి.జితేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు ఒంటేరు జైపాల్, సీహెచ్ విఠల్, కాంచన కృష్ణతోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment