సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదోవిడత పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 16న కరీంనగర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటూ ప్రజలకు వివరించనున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మరోసారి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైతే ఆ వెంటనే హైదరాబాద్, సికింద్రాబాద్‌ల పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాలు చుట్టివచ్చేలా ఆరో విడత పాదయాత్రకు బండి సంజయ్ ప్రణాళికలు సిద్ధం చేశారు.
మొత్తంగా ఐదు విడతల యాత్ర ద్వారా 56 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేయనుండగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఆయన ఆరోవిడత యాత్ర చేపట్టనున్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించేలా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా పాల్గొనేలా భారీ బహిరంగ సభ నిర్వహణకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది.
పాదయాత్రల ద్వారా మొత్తం 70 నియోజకవర్గాలు కవర్ చేస్తున్నందున, గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన 50 నియోజకవర్గాలను వీలైనంత తక్కువ సమయంలో బస్సుయాత్ర ద్వారా చుట్టిరావాలని బండి సంజయ్ భావిస్తున్నారు. బస్సు యాత్ర ద్వారా రోజుకు రెండు అసెంబ్లీ స్థానాలను చుట్టొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment