Telangana Minister KTR Sensational Comments On Bandi Sanjay - Sakshi
Sakshi News home page

మసీదులు, సమాధులు కాదు.. అభివృద్ధికి పునాదులు తవ్వుదాం

Published Wed, Feb 1 2023 2:36 AM | Last Updated on Wed, Feb 1 2023 10:47 AM

Telangana Minister KTR Sensational Comments On Bandi Sanjay - Sakshi

బహిరంగసభలో మాట్లాడుతున్న పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ . చిత్రంలో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  ‘‘అమలుకాని వాగ్దానాలతో గద్దెనెక్కిన మోదీ పాలనలో ధరాఘాతంతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ద్రవ్యోల్బణం పెరిగింది. అప్పులు ఆకాశాన్ని తాకుతుంటే.. రూపాయి పాతాళంలోకి జారిపోయింది. మతం పేరిట చిచ్చురేపడం మినహా బీజేపీ చేసేదేం లేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మసీదులు, సమాధులు తవ్వుదామంటూ రెచ్చగొడతారు.

తవ్వాల్సింది మసీదులు, సమాధులు కాదు.. హుజూరాబాద్‌లో కాలువలు, డబుల్‌ బెడ్రూం ఇళ్లకు పునాదులు తవ్వుదాం రా..’’మంత్రి కె.తారకరామారావు సవాల్‌ విసిరారు. మంగళవారం మధ్యాహ్నం కరీంనగర్‌ జిల్లాలో ‘కరీంనగర్‌ సర్క్యూట్‌ రెస్ట్‌హౌజ్, ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్‌.. సాయంత్రం జమ్మికుంట డిగ్రీ కాలేజీ మైదానంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తమ పార్టీ పేరు మాత్రమే మారిందని.. డీఎన్‌ఏ, జెండా, ఎజెండా మారలేదని.. ప్రజల కోసం అవసరమైతే దేవుడితోనైనా కొట్లాడుతామని పేర్కొన్నారు. 

సమాధులు కాదు.. పునాదులు తవ్వుదాం! 
ప్రధాని మోదీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారని.. దేశ ప్రజలందరి ఖాతాలో రూ.15 లక్షలు, రైతుల ఆదాయం రెట్టింపు, ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు, సొంతిళ్లు అంటూ పలికినవన్నీ ప్రగల్భాలేనని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ఎంపీ బండి సంజయ్‌ మోదీని దేవుడనడంపై విస్మయం వ్యక్తం చేశారు. ‘‘రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1,200 చేసినందుకా..? నిత్యావసరాల ధరలు పెంచినందుకా?

రూ.70 ఉన్న పెట్రోల్‌ను రూ.110 చేసినందుకా? పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో జనాల నుంచి రూ.30 లక్షల కోట్లు వసూలు చేసినందుకా? దేనికి మోదీ దేవుడు అయ్యాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 14 మంది ప్రధానులు రూ.56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. కేవలం 8 ఏళ్లలో మోదీ ఒక్కడే 100 లక్షల కోట్ల అప్పు చేసినందుకా? చేనేతలపై 5 శాతం జీఎస్టీ విధించినందుకా? గిరిజన రిజర్వేషన్లు కల్పించనందుకా? 30 ఏళ్లలో ఎన్నడూ చూడని నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వచ్చినందుకు మోదీ దేవుడు అయ్యాడా?’’అని ప్రశ్నించారు. 

ఎవరి పాలనతో అరిష్టం? 
‘రైతుబంధుతో 66 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లు ఇచ్చిన కేసీఆర్‌ పాలన అరిష్టమా? లేక 700 మంది రైతుల ప్రాణాలు పోయేందుకు కారణమైన మోదీ పాలన అరిష్టమా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘‘ప్రజలు ఆగం కావొద్దు. మళ్లీ పొరపాటు చేయవద్దు. సానుభూతి మాటలకు మోసపోవద్దు. హుజూరాబాద్‌లో గెలిచిన వ్యక్తి ఇక్కడ లేకుండా పోయారు. కానీ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, పాడి కౌశిక్‌రెడ్డి ప్రజల్లోనే ఉంటున్నారన్న సంగతి గుర్తించాలి.

వారి వినతి మేరకు రూ.100 కోట్లను మహిళా సంఘాలకు, రూ.10 కోట్ల చొప్పున జమ్మికుంట, హుజూరాబాద్‌ క్రీడామైదానాలను మినీస్టేడియాలుగా మార్చేందుకు నిధులు ఇస్తున్నాం. త్వరలోనే డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తాం’’అని చెప్పారు. ఈసారి పాడి కౌశిక్‌రెడ్డికి తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఉంటుందని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఆయనను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించడంతో అనుచరులు, నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సభలో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.  

ఈటలకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆరే.. 
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఇది చేస్తాం అది చేస్తామంటూ ఈటల రాజేందర్‌ ప్రగల్భాలు పలికారని, గెలిచాక ఒక్క పైసా పని చేశాడా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలన రాష్ట్రానికి అరిష్టమని అంటున్న ఈటల తీరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టేనని మండిపడ్డారు. 33 మంది సీనియర్లను కాదని 2004లో ఈటలకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్‌ కాదా అని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement