సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళుతుందనే అంచనాలతో.. ప్రస్తుతం జరుగుతున్న పాదయాత్రకు బదులు బస్సుయాత్ర చేపట్టేందుకు రాష్ట్ర బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికలుంటే పాదయాత్రకు సమయం సరిపోయే అవకాశం తక్కువకావడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టాలని భావిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ పూర్తిగా సన్నద్ధంగా ఉండేలా.. అన్ని నియోజకవర్గాలను చుట్టేలా కేడర్‌ను సంసిద్ధం చేస్తోంది.
ఆరో విడత యాత్ర జంటనగరాల పరిధిలో..
ప్రస్తుతం ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్.. అది ముగిసిన వెంటనే మూడు నాలుగు రోజులు విరామమిచ్చి ఆరో విడత యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ సారి హైదరాబాద్ జంట నగరాల పరిధిలో పాదయాత్రకు రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నారు. గతంలో మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర నిర్వహించిన తరహాలోనే జంట నగరాల పరిధిలో పది రోజుల యాత్ర కొనసాగించేలా పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్‌రెడ్డి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 18న కరీంనగర్‌లో ఐదో విడత పాదయాత్ర ముగింపు బహిరంగసభలో ఆరో విడత యాత్రపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
జిల్లాల వారీగా సమీక్షలు
బండి సంజయ్ ఒకవైపు పాదయాత్ర నిర్వహిస్తూనే.. మరోవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పాదయాత్ర విరామ సమయంలో, ఉదయం పూట పార్టీ నేతలతో సమావేశమై జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
ఈ క్రమంలో మూడు రోజుల క్రితం నిర్మల్ జిల్లా ముఖ్య నేతలతో సమీక్షించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా నేతలతో, 6న నిజామాబాద్, 7న ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల ముఖ్య నేతలతో సమీక్షలు జరపనున్నారు. ఈ విడత పాదయాత్ర ముగిసేలోగా ఉత్తర తెలంగాణ జిల్లాల సమీక్షలు పూర్తి చేయనున్నారని.. తర్వాత దక్షిణ తెలంగాణ జిల్లాలపై దృష్టి పెడతారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment