ధ్వంసమైన ఫర్నిచర్‌ను పరిశీలిస్తున్న బండి
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై టీఆర్‌ఎస్ కిరాయి గూండాలు దాడి చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పోలీసుల సహకారంతోనే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. శనివారం సంజయ్ బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న అర్వింద్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కుటుంబం అహంకారాన్ని తెలంగాణ ప్రజలు చూశారన్నారు. దాడి చేయాల్సినంత కారణం ఏమిటో అంతుబట్టడం లేదన్నారు. ఎన్నికల సమయం దగ్గరకు వస్తుండటంతో సీఎం కేసీఆర్‌లో భయం మొదలైందన్నారు. హిందువులు అందరూ తల్లిగా భావించే తులసీ అమ్మవారి మీద, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో మీద దాడి చేశారని ఆరోపించారు.
తన దైవం మీద దాడి చేశారని అర్వింద్ తల్లి ఆందోళన వ్యక్తం చేశారన్నారు. పోలీసుల సహకారంతోనే టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఈ దాడి చేశారన్నారు. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలే తప్ప భౌతిక దాడులు సరైంది కాదని ఆయన అన్నారు. దాడులు ఎవరు చేసినా మంచిది కాదని, తమ పార్టీ కార్యకర్తలకు కూడా ఇదే చెప్పామని స్పష్టంచేశారు.
దాడి సమయంలో నిర్లక్ష్యంగా ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిల్లలు ఆయన అదుపులో లేరన్నారు. దాడి ఘటనపై వెంటనే కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అర్వింద్ ఇంటిపై దాడి జరిగిన విషయాన్ని ఆరా తీశారన్నా రు. గతంలో జరిగిన దాడులనూ ఆయన దృష్టికి తీసుకెళ్లామని సంజయ్ చెప్పారు. పొర్లుదండాలు పెట్టి బీజేపీకిలోకి వస్తానని కేసీఆర్ బతిమిలాడినా తీసుకోలేదని, మరి ఆయన కూతురును ఎలా తీసుకుంటామని అన్నారు. ప్రజల కోసం, దేశం కోసం, తెలంగాణ కోసం తాము పని చేస్తామన్నారు.
కేసీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదు: ఈటల
కేసీఆర్ ప్రభుత్వం ప్రజల విశ్వా సం కోల్పోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అర్వింద్ నివాసంపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. శనివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆయన తల్లి విజయలక్ష్మిలను పరామర్శించిన అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రజాప్రతినిధుల ఇళ్లపై ఇంత నీచంగా దాడులకు పాల్పడలేదన్నారు.
అర్వింద్ ఇంటిపై దాడి గురించి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు రక్షణ కల్పించడంలో కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల రక్తాన్ని కళ్లజూసి టీఆర్‌ఎస్ పార్టీని బతికించుకోవాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment