
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ డైరెక్షన్‌లోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమాలతో ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న గ్రాఫ్‌ను తగ్గించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ‘గతంలో బీజేపీ నిరుద్యోగ దీక్ష చేపట్టిన రోజే కాంగ్రెస్ కార్యక్రమాలు చేపట్టింది. నిర్మల్‌లో మేం బహిరంగ సభ నిర్వహించిన రోజే కాంగ్రెస్ పార్టీ గజ్వేల్‌లో పోటీ సభ నిర్వహించింది. మహబూబ్‌నగర్‌లో మా పార్టీ సభ పెట్టిన రోజే పీసీసీ కార్యక్రమాలు నిర్వహించింది.
తాజాగా 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ఆగస్టు 2న ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయిస్తే... అదే రోజున కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో రాహుల్‌గాంధీతో సభ నిర్వహించాలనుకుంటోంది. ఈ ఏడాది కాలంలో ప్రజల పక్షాన బీజేపీ ఆందోళనలు చేపట్టిన ప్రతిసారీ పోటీగా కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహించింది’అని విమర్శించారు. ఇది ముమ్మాటికీ సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లో కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అనడానికి పై ఘటనలే నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే తాను ముక్కలని, అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఒకే అభ్యర్థికి మద్దతిస్తున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment