సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపు కొందరు పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆదివారం మునుగోడు ఫలితం వెలువడ్డాక బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ నేతలు డాక్టర్ మనోహర్‌రెడ్డి, ఎస్.కుమార్, టి.వీరేందర్‌గౌడ్, జె.సంగప్ప, వెంకటరమణలతో కలసి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
‘సీఎం మోచేతి నీళ్లు తాగుతున్న ఆ అధికారులు టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు అడ్డదారులు తొక్కారు. పోలీసులే దగ్గరుండి డబ్బు పంచారు. రూ. వందల కోట్లు పంచిన టీఆర్‌ఎస్ నేతలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎందుకు పట్టుపడలేదో, ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు కాలేదో వారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్‌కు బీజేపీకంటే అధిక ఓట్లు రావాలని ఆ పార్టీ తరఫున సైతం టీఆర్‌ఎస్ నేతలు డబ్బు పంచారు.
అయినా ప్రజలు టీఆర్‌ఎస్‌కు అసలు సిసలైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆశీర్వదించారు’ అని సంజయ్ పేర్కొన్నారు. అయితే ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని ప్రకటించారు. ఓడిపోయినప్పడు కుంగిపోమని, గెలిచినప్పుడు పొంగిపోమని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి యుద్ధంలో హీరోలా పోరాడారన్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం..
‘టీఆర్‌ఎస్ నేతల పిచ్చి కూతలతో బీజేపీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. మరింత ఉత్సాహంతో, కసితో ప్రజలపక్షాన పోరాడతాం. వచ్చే ఎన్నికల్లో మునుగోడులో బీజేపీ జెండా ఎగరేస్తాం. మునుగోడు ఫలితంపై విశ్లేషించుకుంటాం’ అని బండి చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఈ ఫలితం ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు.
‘తెలంగాణలో కాంగ్రెస్ ఖతమైంది. సిట్టింగ్ స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. సీపీఐ, సీపీఎంతో ప్రత్యక్షంగా, కాంగ్రెస్‌తో పరోక్షంగా పొత్తు పెట్టుకొని పోటీ చేసినా... మనీ, మద్యం, మాంసం ఏరులై పారించినా... ఎన్నికల సంఘం అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకున్నా టీఆర్‌ఎస్‌కు 10 వేలకు మించి మెజారిటీ రాలేదు. బీజేపీ సింహంలా సింగిల్‌గా పోటీ చేసి గతంతో పోలిస్తే 7 రెట్లు అధికంగా 86 వేలకుపైగా ఓట్లు సాధించింది’ అని బండి సంజయ్ చెప్పారు.
ఆ 12 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా?
సీఎం కేసీఆర్‌కు ధైర్యముంటే కాంగ్రెస్ నుంచి అనైతికంగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి వెళ్లే దమ్ముందా? అని సంజయ్ సవాల్ విసిరారు. ఉపఎన్నికలో గెలిపిస్తే మునుగోడులోని సమస్యలన్నీ 15 రోజుల్లో పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారని... ఆ గడువులోగా హామీలన్నింటినీ అమలు చేయాల్సిందేనని లేనిపక్షంలో ఊరుకోబోమని హెచ్చరించారు.
కాగా, మునుగోడులో నైతిక విజయం బీజేపీ, రాజగోపాల్‌రెడ్డిదేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె. లక్ష్మణ్ చెప్పారు. సీఎం కేసీఆర్ మనీ, మద్యాన్ని ఏరులై పారించినా, ఊరికో ఎమ్మెల్యేను, మంత్రిని నియమించినా, రెండుసార్లు సీఎం పర్యటించినా బీజేపీ ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment