
ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరుపై రగడ
పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల ఆందోళన
నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు పేరు పెట్టడంపై పార్లమెంటులో దుమారం రేగింది. మంగళవారం నాడు ఉభయ సభల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయమై టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి వాయిదా తీర్మానం కోరగా స్పీకర్ సుమిత్రా మహాజన్ దాన్ని తిరస్కరించారు. అంతకుముందు టీఆర్‌ఎస్‌కు చెందిన 11 మంది ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీనిపై ఆందోళన చేయవద్దని, మాట్లాడేందుకు అనుమతిస్తానని స్పీకర్ తెలిపారు.
జీరో అవర్‌లో జితేందర్‌రెడ్డి పేరు పిలవగా ఆయన ఆ సమయంలో అందుబాటులో లేకపోవడంతో మరో ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడారు. ‘కేంద్ర పౌర విమానయాన మంత్రి, టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు హైదరాబాద్‌లోని శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టారు. విమానాశ్రయానికి ఇప్పటికే రాజీవ్‌గాంధీ పేరు ఉంది. దేశంలోని ఇతర విమానాశ్రయాలకు ఒకే పేరుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అనవసరంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించలేదు. హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణలో భాగం. వాళ్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కావాలంటే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలోని ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోమనండి. అందులో తప్పేమీ లేదు. కానీ అనవసరంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాజధానిలో వివాదాన్ని సృష్టించారు. రాష్ట్రంలో ఒక కొత్త సమస్యను తెచ్చిపెట్టారు. అందువల్ల ప్రభుత్వం ఈ పేరును తక్షణం ఉపసంహరించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.
ఆ వెంటనే ఇదే అంశమై అనకాపల్లి సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు. ‘అవిభాజ్య రాష్ట్రంలో బేగంపేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరుండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తొలగించింది. ఎన్టీఆర్ జాతీయ నాయకుడు. తెలుగు ప్రజలకు గర్వకారణమైన నేత. ఆయనను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం సరికాదు.
జరిగిన పొరపాటును ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం సరిచేసింది. అందువల్ల ఆ పేరును కొనసాగించాలని కోరుతున్నాన’ని పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సభ ప్రారంభమైనప్పటి నుంచే సభ్యులు వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్ తదితరులు ఎన్టీఆర్ పేరును ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. దీనిపై తనను మాట్లాడనివ్వాలని జీరో అవర్‌లో ఆ పార్టీ ఎంపీ ఆనంద్ శర్మ పట్టుబట్టారు. అయితే దీనిపై నోటీసు ఇచ్చిన తర్వాతే మాట్లాడాలని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సూచించారు.
అయినప్పటికీ శర్మ మాట్లాడుతూ.. ‘విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును ఉపసంహరించుకోవాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేంద్రం కనీసం ఆ రాష్ట్రాన్ని కూడా సంప్రదించలేదు’ అని వివరించబోగా.. ఉప సభాపతి కల్పించుకుంటూ.. ‘మీరు నోటీసు ఎందుకివ్వరు?’ అని ప్రశ్నించారు. శర్మ తిరిగి మాట్లాడుతూ.. ‘కేంద్రం చర్య ఆమోదించదగినది కాదు. ప్రభుత్వం నుంచి జవాబు కావాలి’ అని పేర్కొన్నారు. అప్పటివరకు సభను నడవనివ్వమని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో రాజ్యసభ వరుసగా రెండుసార్లు వాయిదా పడింది.