NTR Name
-
కనుల ముందు కలల జిల్లాలు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రజలు ఎన్నో ఏళ్లుగా కలలు గంటున్న జిల్లాలు వాస్తవ రూపం దాల్చి కనుల ముందు నిలవనున్నాయి. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, భౌగోళిక అనుకూలతలతో పాటు ప్రజల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. శాస్త్రీయ అధ్యయనాలతో అన్ని ప్రాంతాల మధ్య సమతూకం పాటించింది. ఫలితంగా జిల్లాల పునర్వ్యస్థీకరణ బాగా జరిగిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని, అత్యంత ప్రముఖుల పేర్లను జిల్లాలకు పెట్టాలనే డిమాండ్లు పలుచోట్ల అనేక సంవత్సరాలుగా ఉన్నాయి. ఇలాంటి అనేక అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. అక్కడి స్థానిక ప్రాధాన్యాన్ని, కొన్ని ప్రాంతాలకు ఉన్న చారిత్రక నేపథ్యం, స్థానిక పరిస్థితులను స్వయంగా ప్రభుత్వమే గుర్తించి కొత్త జిల్లాల్లో ప్రతిబింబించేలా చూసింది. అదే సమయంలో పాత జిల్లాల ప్రాధాన్యం, ప్రాశస్త్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది. జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. మన్యం విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాటం జరిపిన ప్రాంతాన్ని ఆయన పేరుతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. దాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు పాడేరు కేంద్రంగా అరకు ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేశారు. దీంతో గిరిజనుల కల నెరవేరుతోంది. పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటుతో గిరిపుత్రులకు గౌరవం ఇచ్చారు. గిరిజన ప్రాంతాలతో ఏర్పడుతున్న ఈ రెండు జిల్లాలు వారి మనోభావాలను గౌరవించడంతోపాటు ఆ ప్రాంతాల అభివృద్ధికి, మెరుగైన మౌలిక వసతుల కల్పనకు దోహదపడుతుంది. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను కొనసాగించారు. చదవండి: (ప్రత్యేక ఆకర్షణగా సీఎం వైఎస్ జగన్) తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం ప్రత్యేకతను తెలియజెప్పేలా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసి, అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించింది ప్రభుత్వం. అమలాపురం ప్రాంతాన్ని కోనసీమ జిల్లాగా చేయాలని ఉద్యమాలు కూడా జరిగాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ ఉద్యమాలను అణచివేశారు. అప్పటి నుంచి మరుగునపడిన ఈ ప్రతిపాదనను వైఎస్ జగన్ ప్రభుత్వం వాస్తవ రూపంలోకి తీసుకొచ్చింది. గోదావరి జిల్లాల ప్రాశస్త్యం దెబ్బ తినకుండా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను పునర్వ్యస్థీకరించింది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాగా, నర్సాపురం పార్లమెంటును భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాగా మార్చి వాటి ప్రాధాన్యతను కొనసాగించింది. ఈ జిల్లాలు గోదావరి తీర ప్రాంతాలు. ఎన్టీఆర్ జన్మించిన కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చాలాకాలం నుంచి ఉన్నా ఆచరణలోకి రాలేదు. చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ని గౌరవించే విషయంలో టీడీపీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు. ఆ మాట నిలబెట్టుకుంటూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇది మంచి నిర్ణయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు మచిలీçపట్నాన్ని కృష్ణా జిల్లాగా కొనసాగిస్తూ దాని చారిత్రక ప్రాధాన్యతను ప్రభుత్వం నిలబెట్టింది. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం ప్రత్యేకతను నిలబెడుతూ ప్రత్యేక జిల్లా చేయాలని అనేక ఉద్యమాలు జరిగాయి. ఇప్పటివరకు ఎవరూ అక్కడి ప్రజల డిమాండ్‌ను పట్టించుకోలేదు. ఇప్పుడు పల్నాటి పౌరుషాన్ని ప్రతిబింబించేలా నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాపట్లను జిల్లాగా చేయాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా ఉంది. ఆ కల ఇప్పుడు నెరవేరింది. పుట్టపర్తి ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన సత్య సాయిబాబాను స్మరిస్తూ శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు గొప్ప ముందడుగుగా చెబుతున్నారు. ఆ ప్రాంత అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. చదవండి: (వైజాగ్–చెన్నై కారిడార్ పనులు చకచకా) అన్నింటికీ మించి తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా ఏర్పాటు ద్వారా ఆధ్యాత్మిక వారసత్వాన్ని గౌరవించింది ప్రభుత్వం. తిరుపతి వేంకటేశ్వరస్వామిని స్మరించేలా బాలాజీ జిల్లా ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా హర్తం వ్యక్తమవుతోంది. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య నడయాడిన ప్రాంతం రాయచోటి. ఆ ప్రాంతాన్ని అన్నమయ్య పేరుతోటే అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసి ఆయన కీర్తిని మరింతగా ఇనుమడింపజేసింది. -
అన్న ఎన్టీఆర్ పేరెక్కడ ?
-
కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే..
హైదరాబాద్ : అనంతపురం జిల్లా హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన మనసులో మాటను బయటపెట్టారు. గతంలో అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్నారని...అయితే ఇప్పుడు కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టినట్లు అయితే ..అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటామన్నారు. కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టకపోతే జిల్లాల డీలిమిటేషన్లో అనంతపురం రెండు జిల్లాలుగా ఏర్పడుతుందని..అప్పుడు హిందుపురానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుదామని బాలయ్య గురవారం అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో పేర్కొన్నారు. -
కేసీఆర్‌ను సంప్రదిస్తే వివాదం ఉండేది కాదు
-
'కేసీఆర్ ను సంప్రదిస్తే వివాదం ఉండేది కాదు'
న్యూఢిల్లీ: విజయవాడ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆయన సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించేందుకు టీడీపీ ప్రయత్నం చేయాలని అన్నారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ఎన్టీఆర్ పేరును చంద్రబాబు వివాదాల్లోకి లాగుతున్నారని వాపోయారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఎన్టీఆర్ పేరు పెట్టే ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ ను సంప్రదించివుంటే వివాదం వచ్చేదికాదన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. -
‘బేగంపేట’కు ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: బేగంపేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. ఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చెన్నైలో విమానాశ్రయానికి రెండు పేర్లున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. అక్కడ అంతర్జాతీయ, దేశీయ టర్మినల్‌లు రెండూ వేర్వేరుగా ఉన్నాయి. కానీ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలకు ఒకటే ద్వారం ఉంది. ఒక్క విమానాశ్రయానికి రెండు పేర్లెలా పెడతారు’’ అని ప్రశ్నించారు. -
ఏపీకి ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి: బాల్క సుమన్
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘చంద్రబాబు... మీకు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే ఏపీలోని 4 విమానాశ్రయాలకు ఆయన పేరు పెట్టుకో. ప్రేమ మరీ ఎక్కువైతే ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌గా పేరు పెట్టుకో’’ అని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ సలహా ఇచ్చారు. విజయ్‌చౌక్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టి తెలంగాణపై ఆధిపత్యాన్ని కొనసాగించవద్దన్నారు. దీనిపై సమాధానం చెప్పాల్సి వస్తుందని మంత్రి అశోక్‌గజపతి రాజు సభలకు హాజరవకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. టెర్మినల్ పేరు మార్పిడిలో బాబు కుట్రలపై ప్రధాని మోదీని కలసి వివరించనున్నట్టు చెప్పారు. -
తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు ఒక్కటైన వేళ
* శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరుపై రాజ్యసభలో కొనసాగిన ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పేరు పెట్టడంపై రాజ్యసభలో మూడో రోజూ ఆందోళన కొనసాగింది. గురువారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ తాను విమానాశ్రయ పేరు మార్పు అంశంపై నోటీసు ఇచ్చానని, మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. సభాపతి స్థానంలో కూర్చున్న ఉప సభాపతి కురియన్ తొలుత నిరాకరించినా, వీహెచ్ పదే పదే కోరడంతో అనుమతించారు. ‘అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఆరేడేళ్ల తరువాత వాళ్లు ఈ పనికి దిగారు. వాళ్లు రాజకీయ ప్రయోజనాలను కాంక్షించే ఈ చర్యకు దిగారు..’ అని వివరించబోతుండగా డిప్యూటీ చైర్మన్ కల్పించుకుని ‘నేను చెప్పేది ఒకసారి వినండి’ అంటూ పలుమార్లు వీహెచ్‌కు సూచించారు. ‘ముందురోజు ఆర్థిక మంత్రి దీనిపై వివరణ ఇచ్చారు. మీరు ఇప్పుడు జీరో అవర్‌లో తిరిగి చర్చించలేరు. అవసరమైతే మీరు మరో నోటీసుతో రండి’ అని కోరారు. అయినప్పటికీ వీహెచ్ వినలేదు. ఆయనకు తోడు ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, ఎం.ఎ.ఖాన్ తదితర తెలంగాణ ఎంపీలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు కె.చిరంజీవి, కె.వి.పి. రామచంద్రరావు, జేడీ శీలం, ఇతర రాష్ట్రాల ఎంపీలు సైతం పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. పేరును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. దీంతో 11.07 గంటలకు పది నిమిషాలపాటు వాయిదావేశారు. తిరిగి సభ ప్రారంభమైన తరువాత కూడా ఆందోళన కొనసాగింది. ఈ సమయంలోనే టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మాట్లాడుతూ కేంద్రం ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలని కోరారు. 12 గంటలకు ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే మళ్లీ ఆందోళనను కొనసాగించారు. సభాకార్యకలాపాలకు అడ్డుతగిలారు. దీంతో సభను 12.30 గంటలకు వాయిదా వేశారు. తిరిగి రెండు గంటలకు సభ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగింది. కాగా సాయంత్రం ఇదే అంశమై ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి స్పెషల్ మెన్షన్ కింద మాట్లాడుతూ తక్షణం శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఎన్టీఆర్ పేరును తొలగించం
* శంషాబాద్ దేశీయ టెర్మినల్ పేరుపై రాజ్యసభలో కేంద్రం వెల్లడి * గతంలో ఉన్న పేరునే పునరుద్ధరించామని అరుణ్ జైట్లీ స్పష్టీకరణ * సభా కార్యక్రమాలను అడ్డుకున్న టీకాంగ్రెస్ ఎంపీలు * రాజ్యసభ పలుమార్లు వాయిదా, గాంధీ విగ్రహం వద్ద ఎంపీల నిరసన సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పేరు పెట్టడంపై రాజ్యసభలో మళ్లీ దుమారం రేగింది. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో బుధవారం సభ పలుమార్లు వాయిదా పడింది. మరోవైపు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించామని, దాన్ని తొలగించడానికి అంగీకరించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. జీరో అవర్‌లో ఈ అంశంపై కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద్‌భాస్కర్ మాట్లాడారు. ‘మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. నీతి నియమాలు సంకటంలో పడ్డాయి. సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారు. రాజుల కుటుంబం నుంచి వచ్చిన పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు కుయుక్తులకు పాల్పడుతున్నారు. కేంద్రం నిర్ణయం తెలంగాణ, హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలను మనోవేదనకు గురిచేస్తోంది. ఇలాంటి కుయుక్తులతో విభేదాలను, అనవసర ఇబ్బందులు మాత్రమే పొడచూపుతాయి. ఎలాంటి ఫలితాలను ఇవ్వవు. అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఒక పైలట్. ఆయన ఈ రంగంలోకి హైదరాబాద్‌లోనే ప్రవేశించారు. అందువల్లే హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆయన పేరును పెట్టారు. ప్రజలకు ఒక జ్ఞాపకంగా ఉంటుందనే అలా చేశారు. అయితే ఇప్పుడు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టడం అవాంచిత చర్య. దాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ అసెంబ్లీ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసింది. అందువల్ల రాజీవ్‌గాంధీ పేరును కొనసాగిస్తూ ఎన్టీఆర్ పేరును ఉపసంహరించుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. ఆనంద్ భాస్కర్ తన ప్రసంగాన్ని ముగించబోతుండగానే వి.హన్మంతరావు, ఎం.ఎ.ఖాన్ తదితరులు ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. ఇదే అంశంపై కాంగ్రెస్‌కే చెందిన మరో ఎంపీ ఆనంద్‌శర్మ కూడా తనకు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని కోరగా డిప్యూటీ చైర్మన్ అందుకు అనుమతించలేదు. ఈ సమయంలోనే సభలో మరింత గందరగోళం చోటుచేసుకుంది. ఈ సందర్భంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ అంశంపై ఒక ప్రకటన చేశారు. ‘కాంగ్రెస్ సభ్యులు ఒక ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. రాజీవ్‌గాంధీ, ఎన్.టి.రామారావు ఇద్దరూ ఈ దేశంలో గౌరవనీయులైన నాయకులే. ప్రభుత్వంలో ఉన్నవారెవరికీ వారిని అగౌరవపరచాలని లేదు. పౌరవిమానయాన మంత్రి కూడా ఇక్కడే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరు ఉంది. అదే కొనసాగుతుంది. అలాగే డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్.టి.రామారావు పేరు ఉంది. అదే కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. ఇదే అంశంపై అశోక్ గజపతిరాజు మాట్లాడబోతుండగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో ‘మీకు జవాబు కావాలా? వద్దా?’ అంటూ మంత్రి ప్రశ్నించారు. తిరిగి జైట్లీ లేచి.. ‘ఎన్టీఆర్ పేరును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మా ప్రభుత్వం అందుకు ఒప్పుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యుల నినాదాలు మరింత పెరగడంతో సభ వాయిదా పడింది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమైనప్పటికీ పరిస్థితి మారకపోవడంతో సభను చైర్మన్ అరగంట పాటు వాయిదా వేశారు. ఆ తర్వాతా సభలో గొడవ సద్దుమణగలేదు. దీంతో ఒంటి గంట వరకు రాజ్యసభ వాయిదా పడింది. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీలు వి.హన్మంతరావు, ఆనంద్‌భాస్కర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ తదితరులు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. -
'ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మేల్కోవాలి'
న్యూఢిల్లీ: శంషాబాద్ దేశీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పెట్టడమే అంటే ఆయనను చిన్నబుచ్చడమేనని టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. విజయవాడ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పెట్టాలని సూచించారు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు, మరణం తర్వాత కూడా ఆయనను అవమానిస్తున్నారని అన్నారు. ఇకనైనా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మేల్కోవాలని పేర్కొన్నారు. -
ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరుపై రగడ
పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల ఆందోళన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు పేరు పెట్టడంపై పార్లమెంటులో దుమారం రేగింది. మంగళవారం నాడు ఉభయ సభల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయమై టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి వాయిదా తీర్మానం కోరగా స్పీకర్ సుమిత్రా మహాజన్ దాన్ని తిరస్కరించారు. అంతకుముందు టీఆర్ఎస్కు చెందిన 11 మంది ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీనిపై ఆందోళన చేయవద్దని, మాట్లాడేందుకు అనుమతిస్తానని స్పీకర్ తెలిపారు. జీరో అవర్‌లో జితేందర్‌రెడ్డి పేరు పిలవగా ఆయన ఆ సమయంలో అందుబాటులో లేకపోవడంతో మరో ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడారు. ‘కేంద్ర పౌర విమానయాన మంత్రి, టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు హైదరాబాద్‌లోని శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టారు. విమానాశ్రయానికి ఇప్పటికే రాజీవ్‌గాంధీ పేరు ఉంది. దేశంలోని ఇతర విమానాశ్రయాలకు ఒకే పేరుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అనవసరంగా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించలేదు. హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణలో భాగం. వాళ్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కావాలంటే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలోని ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోమనండి. అందులో తప్పేమీ లేదు. కానీ అనవసరంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాజధానిలో వివాదాన్ని సృష్టించారు. రాష్ట్రంలో ఒక కొత్త సమస్యను తెచ్చిపెట్టారు. అందువల్ల ప్రభుత్వం ఈ పేరును తక్షణం ఉపసంహరించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. ఆ వెంటనే ఇదే అంశమై అనకాపల్లి సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు. ‘అవిభాజ్య రాష్ట్రంలో బేగంపేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరుండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తొలగించింది. ఎన్టీఆర్ జాతీయ నాయకుడు. తెలుగు ప్రజలకు గర్వకారణమైన నేత. ఆయనను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం సరికాదు. జరిగిన పొరపాటును ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం సరిచేసింది. అందువల్ల ఆ పేరును కొనసాగించాలని కోరుతున్నాన’ని పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సభ ప్రారంభమైనప్పటి నుంచే సభ్యులు వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్ తదితరులు ఎన్టీఆర్ పేరును ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. దీనిపై తనను మాట్లాడనివ్వాలని జీరో అవర్‌లో ఆ పార్టీ ఎంపీ ఆనంద్ శర్మ పట్టుబట్టారు. అయితే దీనిపై నోటీసు ఇచ్చిన తర్వాతే మాట్లాడాలని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సూచించారు. అయినప్పటికీ శర్మ మాట్లాడుతూ.. ‘విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును ఉపసంహరించుకోవాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేంద్రం కనీసం ఆ రాష్ట్రాన్ని కూడా సంప్రదించలేదు’ అని వివరించబోగా.. ఉప సభాపతి కల్పించుకుంటూ.. ‘మీరు నోటీసు ఎందుకివ్వరు?’ అని ప్రశ్నించారు. శర్మ తిరిగి మాట్లాడుతూ.. ‘కేంద్రం చర్య ఆమోదించదగినది కాదు. ప్రభుత్వం నుంచి జవాబు కావాలి’ అని పేర్కొన్నారు. అప్పటివరకు సభను నడవనివ్వమని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో రాజ్యసభ వరుసగా రెండుసార్లు వాయిదా పడింది. -
'ఎన్టీఆర్ పేరు పెట్టడం.. ఆయనస్థాయి తగ్గించడమే'
శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం ఆయన స్థాయిని తగ్గించడమేనని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కేవలం డొమెస్టిక్ టెర్మినల్‌కు మాత్రమే ఆయన పేరు పెట్టడం ఏంటని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, వైశ్రాయ్ హోటల్లో ఆయనపై చెప్పులు వేయించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఎన్టీఆర్ పేరు గురించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని బీజేపీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని కూడా రఘువీరారెడ్డి ఆరోపించారు. -
తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన విప్లవకారుడు ఎన్టీఆర్
టీడీపీనేత మోత్కుపల్లి నర్సింహులు సాక్షి, హైదరాబాద్: పటేల్, పట్వారీ పెత్తందారి వ్యవస్థను రద్దు చేసి తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన విప్లవకారుడు ఎన్టీ రామారావు అని తెలుగుదేశం నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం హేయమైన చర్య అని ఆయన ధ్వజమెత్తారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిన ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించడంపై ప్రధాని మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, కొత్త ప్రాజెక్టులకు పేర్లు పెట్టే విషయమై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోవచ్చు గానీ, ఇది వరకే ఉన్న పేరును కొనసాగించేందుకు అవసరం లేదని అన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టడం సబబే: తీగల మహేశ్వరం: శంషాబాద్ విమానాశ్రయంలో టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యక్తిగతంగా తాను సమర్థిస్తున్నానని ఇటీవల టీఆర్ఎస్లో చేరిన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. కాగా.. తెలంగాణ జన జీవనానికి వైతాళికుడైన మాజీ సీఎం ఎన్టీ రామారావు సీమాంధ్రకు పరిమితమనడం తెలంగాణ సీఎం కేసీఆర్ విచక్షణకు, సంస్కారానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు పి. సాయిబాబు అన్నారు. తెలుగు వ్యక్తి పేరు పునరుద్ధరిస్తే రాజకీయం చేయడమా తెలంగాణ సంస్కృతి అని శుక్రవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనల్లో నిలదీశారు. శంషాబాద్ డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. -
నీ కుమారుడి పేరు మార్చుకో
కేసీఆర్‌కు అచ్చెన్నాయుడి సూచన సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై అభ్యంతరం తెలుపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందుగా తన కుమారుడు తారక రామారావు పేరును మార్చుకోవాలని ఏపీ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సూచించారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో మీడియాతో మాట్లాడుతూ, విమానాశ్రయం పేరు మార్పుపై కేసీఆర్ తీరును ఖండించారు. ఈ విషయాన్ని కేసీఆర్ రాజకీయకోణంలో చూడడం తగదన్నారు. -
మా వాళ్లు లేరా ?
శంషాబాద్ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరుపై అభ్యంతరం యథాతథస్థితి కొనసాగించాలని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీర్మానం విడిపోయినా వారి పేర్లేనా.. చర్చ ఎన్టీఆర్ గురించి కాదు.. పక్క రాష్ర్టం వారి పేరుపైనే తెలంగాణలో పీవీ, కొమురం భీం వంటి వారెందరో ఉన్నారన్న కేసీఆర్ తీర్మానానికి కాంగ్రెస్, ఎంఐఎం, వైఎస్సార్సీపీ, వామపక్షాల మద్దతు టీడీపీ వ్యతిరేకత.. సవరణలు కోరిన బీజేపీ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటన.. విపక్షాల తీవ్ర నిరసన సోమవారానికి సభ వాయిదా సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ శుక్రవారం తీర్మానించింది. ఈ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్భాగంగా ఉన్న దేశీయ టెర్మినల్‌ను వేరు చేస్తూ ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తెలంగాణ శాసనసభ విచారం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తపరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకుని యథాతథస్థితిని కొనసాగించాలని సభ విజ్ఞప్తి చేస్తోంది’ అని తీర్మానాన్ని కేసీఆర్ చదివి వినిపించారు. ‘ఎన్టీఆర్ పేరును పెట్టడంపై ఇక్కడ చర్చ జరగడం లేదు. పక్క రాష్ట్రం వారి పేరు పెట్టడంపైనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్‌ను అగౌరవ పరచాలనే ఉద్దేశం మాకు లేదు’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల కాపీని ఈ సందర్భంగా సభలో ప్రదర్శించారు. కేంద్రంతో తమకు ఘర్షణ వైఖరి లేదని, ఇది తమ విజ్ఞప్తి మాత్రమేనని, విపక్షాలు దీన్ని వివాదం చేయొద్దని సీఎం కోరారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించగా బీజేపీ మాత్రం కొన్ని సవరణలు ప్రతిపాదించింది. ఇక తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. ఎన్టీఆర్ పేరుపై సభలో దుమారం ఉదయం సభ ప్రారంభం కాగానే శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై అధికార, విపక్షాల వాదనలతో సభ అట్టుడికింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని కాంగ్రెస్ పట్టుబట్టగా.. దీనికి అధికార పార్టీ కూడా మద్దతు పలికింది. మరోవైపు టీడీపీ, బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు చేపట్టడంతో కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు. ఎన్టీఆర్ పేరు విషయంలో తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చించిన తర్వాతే మిగతా అంశాలకు వెళ్లాలని పట్టుబట్టారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో పేరు అవసరం లేదని, రెండు రన్వేలు ఉన్న చోటనే రెండు పేర్లు పెడతారని, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. సీమాంధ్రకు చెందిన నేతల పేర్లు అక్కడే పెట్టుకోవాలన్నారు. కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని దుయ్యబట్టారు. సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తిరిగి సభ ప్రారంభం కాగానే.. ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశ పెడతారని స్పీకర్ ప్రకటించారు. ఆ వెంటనే సీఎం లేచి తీర్మానం చదువబోతుండగా.. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కల్పించుకొని దేనిపై తీర్మానం చేస్తారో ముందుగా చెప్పాలన్నారు. అంతకుముందున్న ఎన్టీఆర్ పేరును తీసేశారన్నారు. ‘మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరుతో ఢిల్లీలో ఘాట్ ఏర్పాటు చేయాలని మా నాయకుడు చంద్రబాబు లేఖ రాశారు.. మీరు రాశారా?’ అని దయాకర్‌రావు ప్రశ్నించడంతో సీఎం జోక్యం చేసుకున్నారు. ‘ఢిల్లీలో పీవీ ఘాట్ ఏర్పాటు చేసి, ఆయన విగ్రహం పెట్టాలని సీఎంగా నేనే లే ఖ రాశా. మీరు చెప్పేది చెప్పండి.. ఆరోపణ లెందుకు? బట్టకాల్చి మీద వేయడం ఎందుకు?’ అని ఎర్రబెల్లి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. మరణానికి కారకులెవరు?: అక్బరుద్దీన్ ఈ సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కల్పించుకుంటూ.. ‘మహానుభావుడైన ఎన్టీఆర్ పేరు ఉంచాలని దయాకర్‌రావు అంటున్నారు. కానీ, ఆయన ఓ విషయం మరిచిపోయారు. ఆ మహా నాయకుడు ఎందుకు చనిపోయారు? ఎవరు అందుకు బాధ్యులు? ఆయన మరణానికి కారకులు ఎవరు? తమ ప్రచారం కోసం ఆ మహానుభావుని పేరు వాడుకుంటున్నారు. పేరు మార్చాలనుకున్నపుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చించి కొన్ని పేర్లను పంపిస్తుంది. అందులోని ఏైదె నా పేరు పెట్టాలి. కానీ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే పేరు ఖరారు చేయడం తీవ్రమైన విషయం’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం వచ్చిం దని సంతోషంగా ఉన్న సమయంలో పక్క రాష్ట్ర సీఎం తెలంగాణను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజల మనోభావాల ప్రకారం ప్రభుత్వాలు నడుచుకోవాలని సీపీఎం నేత సున్నం రాజయ్య చెప్పారు. తెలంగాణ ఇప్పటికే ఎన్నో సమస్యల్లో ఉంటే అగ్నిలో ఆజ్యం పోసినట్లు కేంద్రం వ్యవహరించడం సరికాదని సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ అన్నారు. పీవీ, కొమురం భీం పేర్ల ప్రస్తావన ఈ క్రమంలోనే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని తాము బలపరుస్తున్నామని ప్రతిపక్ష నేత జానారెడ్డి చెప్పారు. పీవీ నరసింహారావు, కొమురం భీం పేర్లు పెట్టాలని తీర్మానంలో పొందుపర్చాలని బీజేపీ పక్ష నేత లక్ష్మణ్ సవరణలు ప్రతిపాదించారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కేసీఆర్, జానారెడ్డి ఎన్టీఆర్ వద్దే రాజకీయాలు నేర్చుకున్నారు. గతంలో అన్ని పథకాలకు రాజీవ్, ఇందిర పేర్లే పెట్టారు. పీవీ, కొమురం భీం వంటి వారి పేర్లు ఎందుకు పెట్టలేదు. ప్రాంతీయ సెంటిమెంట్ ఉన్నందున వారి పేర్లు పెట్టాలని కేంద్రానికి సూచించాలి’ అని పేర్కొన్నారు. తీర్మానంపై టీడీపీ సభ్యులు కూడా అభ్యంతరం తెలిపారు. ‘దేశీయ టెర్మినల్‌కు గతంలో ఎన్టీఆర్ పేరు ఉంది. గత ప్రభుత్వం కావాలనే ఆ పేరును తొలగించింది. ఇప్పుడు అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్‌గాంధీ పేరే ఉంది. ఎన్టీఆర్, రాజీవ్‌లు వేరే రాష్ట్రాలకు చెందిన వారు. తీసేయాల్సి వస్తే ఆ ఇద్దరి పేర్లు తీసేయాలి. అంతర్జాతీయ విమానాశ్రయానికి పీవీ పేరు, దేశీయ టెర్మినల్‌కు మరో పేరు పెట్టాలి. కేంద్రానికి వ్యతిరేకంగా ఉండకుండా తీర్మానాన్ని సవరించాలి’ అని ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. శంషాబాద్ టెర్మినల్‌కు బాబా షరీఫుద్దీన్ పేరు పెట్టాలని అక్బరుద్దీన్ సూచించారు. ‘గతంలో అక్కడ షరీపుద్దీన్ హజ్రత్ దర్గా ఉండేది. అవన్నీ వక్ఫ్ భూములు. అందుకే ఆ పేరును పరిశీలించాలి’ అని కోరారు. పేరు మార్చాల్సి వస్తే కొమురం భీం పేరు పెట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. దీంతో ఇది ఏకగ్రీవం కాదని అడ్డుపడుతూ బీజేపీ, టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం మధ్యే సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. ఇది సాంస్కృతిక దాడి: కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు శాసనసభలో వివిధ పక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆవేశంగా మాట్లాడారు. ‘దీన్ని తెలంగాణ ప్రజలు అసహజ చర్యగా భావిస్తున్నారు. ఇది చాలా సున్నితమైన అంశం. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా ఉన్నప్పుడు తెలంగాణపై సాంస్కృతిక దాడి జరిగింది. ఇప్పుడిప్పుడే స్వయం పాలనలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే సమయంలో ఎయిర్‌పోర్టు పేరుపై నిర్ణయం తెలంగాణపై రాయి విసిరినట్లుగా ఉంది. తమ అస్తిత్వం..అస్తిత్వ చిహ్నాలపై దాడి జరిగిందనే బాధ ప్రజల్లో బలంగా ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు రాజీవ్‌గాంధీ పేరిట ఉంది. అక్కడి దేశీయ టెర్మినల్‌కు మరో పేరు పెట్టాలనుకుంటే తెలంగాణలో ఎంతో మంది మహానుభావులున్నారు. దళిత నాయకుడు భాగ్యరెడ్డి వర్మ, గిరిజన నాయకుడు కొమురం భీం, సాయుధ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, షేక్ బందగీ... వీళ్లందరి పేర్లు లేవా? దక్షిణ భారతం నుంచి ఇద్దరే ప్రధానులయ్యారు. దేవెగౌడ, పీవీ నరసింహరావు. మన ప్రాంతానికి చెందిన ముద్దుబిడ్డ పీవీ పేరు పెట్టమని అడుగుదాం. అలా కాదని ఆంధ్రా నాయకుల పేర్లు పెట్టడం తెలంగాణను కించపరిచే విధంగా ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ గురించి చర్చ కాదు. ఆయన మహానుభావుడు. ఆయనను అగౌరవ పరిచే దురుద్దేశం మాకు లేదు. కాని రాష్ట్రం విడిపోయాక కూడా వారి పేర్లే పెట్టాలా? తెలంగాణ మహానుభావులే లేరా? ఇక్కడి వారి పేరు పెడితే ఏంటి? లేదంటే యథాతథంగా ఉంచండి. ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో విమానాశ్రయాలున్నాయి. ఆ నాలుగింటికీ ఎన్టీఆర్ పేరు పెట్టండి’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరుపై మండలిలోనూ రగడ సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానశ్రయం లో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై శాసన మండలి దద్దరిల్లింది. దీనిపై అధికార, విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మండలి చైర్మన్ స్వామిగౌడ్ తన స్థానంలో కూర్చొంటున్న సమయంలోనే.. సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరును కొనసాగించాలని, ఎన్డీయే నిరంకుశ వైఖరి నశించాలంటూ నినదించారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి సభను అడ్డుకున్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ మండలి తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలు పూర్తయ్యాక ఈ అంశంపై చర్చిద్దామని చైర్మన్ నచ్చజెప్పినా సభ్యులు వినకపోవడంతో సభ ను అరగంట పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత.. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంత్రి హరీశ్‌రావు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్భాగంగా ఉన్న డొమెస్టిక్ టెర్మినల్‌ను వేరుచేస్తూ, దానికి ఎన్టీ రామారావు పేరు పెట్టడంపై శాసనమండలి విచారం వ్యకం చేస్తోందని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానానికి మూజువాణి ఓటుతో శాసన మండలి ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వ నిర్ణయాన్నే అమలు చేశాం పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో ఇంటర్నేషనల్ టర్మినల్‌కు రాజీవ్గాంధీపేరు, డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడుతూ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్నే తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందని, కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు శుక్రవారం స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అనంతరం ఆయన నార్త్‌బ్లాక్ వద్ద మీడియాతో మాట్లాడారు. 1999 లోనే డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టారని ఆయన గుర్తు చేశారు. శంషాబాద్‌కు ఎయిర్‌పోర్టు తరలినప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదన్నారు. తెలుగువారంతా అభిమానించే ఎన్టీరామారావును ఒక ప్రాంతానికి పరిమితం చేయ డం తగదన్నారు. ఎన్టీఆర్, కేసీఆర్, తాను ఇలా అంతా ఒక ప్రాంతానికే పరిమితం కాదని అంతా భారతీయులమేనన్నారు. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోకుండా నే కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వస్తున్నాయని ప్రశ్నించగా, ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వమూ పేరు ప్రతిపాదించవచన్నారు.వాటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సైతం ఎన్టీఆర్‌పై అభిమానంతో తన కుమారుడికి రామారావు పేరు పెట్టారని ఆయన గుర్తుచేశారు. -
ఎన్టీఆర్ పేరుందని కొడుకుని వదులుకుంటారా?
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించడం తెలంగాణ సీఎం కేసీఆర్ కు తగదని ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు, సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఎన్టీఆర్ పై అభిమానంతో తన కుమారుడికి ఆయన పేరు పెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు పేరు మారుస్తారా లేదా ఎన్టీఆర్ పేరుందని కుమారుడిని వదులుకుంటారా అని ప్రశ్నించారు. శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ కుపెట్టినందుకు తెలుగుజాతి గర్వపడాలని ఏపీ బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్టీఆర్ పేరు తొలగించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. -
'ఎయిర్ పోర్ట్ కు ఎన్టీఆర్ పేరు పెట్టింది నేను కాదు'
న్యూఢిల్లీ: శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టింది తాను కాదని పౌరవిమానయాన శాఖ మంత్రి పి. అశోక్‌గజపతిరాజు తెలిపారు. ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నది 1999 నాటి నిర్ణయమని చెప్పారు. దీనిపై అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసి నిర్ణయం తీసుకున్నాయన్నారు. అప్పటి కేబినెట్ నిర్ణయాన్నే ఇప్పుడు అమలు చేశామని వెల్లడించారు. ఎన్టీఆర్ తో సహా మనమంతా భారతీయులుమన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ తన కుమారుడికి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ పేరు తిరస్కరిస్తూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అశోక్‌గజపతిరాజు తెలిపారు. -
ఎయిర్పోర్ట్ పేరు మార్చొద్దని టీ.అసెంబ్లీ తీర్మానం
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్ పేరును మార్చవద్దని తెలంగాణ శాసనసభ శుక్రవారం తీర్మానం చేసింది. ప్రస్తుతం ఉన్న పేర్లను యథావిధిగా ఉంచాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవటంపై తీర్మానంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై విచారణ వ్యక్తం చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని టీడీపీ, బీజేపీ మినహా మిగతా పార్టీలు ఆమోదం తెలిపాయి. కాగా కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంలో బీజేపీ సవరణలు సూచించింది. విమానాశ్రయం పేరు మార్చాల్సి వస్తే కొమురం భీం, పీవీ నరసింహారావు పెట్టాలని కోరింది. మరోవైపు టీడీపీ మాత్రం ఎన్టీఆర్ పేరునే ఉంచాలని సూచించింది. -
ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరు?:అక్బరుద్దీన్
హైదరాబాద్:శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని డొమెస్టిక్ టెర్మినల్‌కు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పెట్టే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చలు జరిగాయి. ఈ అంశంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడే ప్రజలకు ఎన్టీఆర్ గొప్ప నేత అని కొనియాడుతూనే.. సభలో ఇంగ్లిష్, ఉర్దూల భాషలను విస్మరిస్తున్నారు. అసలు ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరు? అంటూ అక్బరుద్దీన్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా పేరు మార్చడం సరికాదన్నారు. ఎలాంటి సలహాలు, సూచనలు లేకుండా పేరు మార్చడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.ఎయిర్ పోర్ట్ నిర్మించిన స్థలం శంషుద్దీన్, అక్బరుద్దీన్ లకు చెందినది ఆయన తెలిపారు. -
అంతగా అయితే పీవీ పేరు పెట్టండి: కేసీఆర్
-
కొమురం భీం పేరు పెట్టాలి: వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయానికి కొమురం భీం పేరు పెట్టాలని వైఎస్ఆర్ సీపీ ఫ్లోర్ లీడర్ తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలంతా గిరిజన నేత కొమురం భీంను అభిమానిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీలో విమానాశ్రయానికి కొమురం భీం పేరు పెట్టే అంశాన్ని ప్రస్తావించారని తాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కొమురం భీం పేరును ఏకగ్రీవ తీర్మానం చేసేందుకు పార్టీలన్నీ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
అంతగా అయితే పీవీ పేరు పెట్టండి: కేసీఆర్
హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పునరుద్దరించడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. తెలంగాణ ప్రాంత మనోభావాలను గౌరవించకుండా ఆంధ్రప్రాంత నేత పేరు పెట్టడం తగదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పేరును పెట్టడంపై శుక్రవారం శాసనసభలో దుమారం రేగింది. శుక్రవారం ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇది చాలా సున్నితమైన అంశమని... ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్టీఆర్ పేరు పెట్టడం తగదన్నారు. శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్పు చేయాలనుకుంటే తెలంగాణ ప్రాంతంవారి పేర్లే పెట్టాలన్నారు. కావాలంటే విమానాశ్రయానికి తెలంగాణ వీరులు పెట్టాలని, అంతగా అయితే మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు పెట్టాలని కేసీఆర్ సూచించారు. అంతేకానీ ఆంధ్రవారి పేర్లు తెచ్చి తమపై రుద్దొద్దని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ సంస్కృతిపై దాడి జరిగిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఇప్పుడిప్పుడే స్వయంపాలన జరుగుతోందని... ఈ సమయంలో విమానాశ్రయం పేరు మార్చటం తెలంగాణ ప్రజలను కించపరచటమేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ ఆలోచనలను మార్చుకున్నాయని...కమ్యునిస్టుల పేపరైన విశాలాంధ్ర... ఇక్కడ తెలంగాణ పేపరు ప్రారంభించి ప్రజల మనోభావాల్ని గౌరవిస్తుంటే కేంద్రం మాత్రం ముర్ఖంగా వ్యవహరిస్తోందన్నారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని, అందుకే ఆయన పేరు విమానాశ్రయానికి పెట్టారని కేసీఆర్ అన్నారు. ఈ అంశంపై స్పీకర్ అన్ని పార్టీల సభ్యులతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
తెలంగాణలో సీమాంధ్రుల ఆధిపత్యమా..?
-
తెలంగాణలో సీమాంధ్రుల ఆధిపత్యమా..?
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే దీనిపై చర్చించాలంటూ కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రుల ఆధిపత్యాన్ని తెలంగాణలో చూపిస్తే సహించేది లేదన్నారు. టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఆధిపత్యం వద్దు అనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు చేశామన్నారు. ఎయిర్‌పోర్టులో రెండు రన్వేలు ఉన్నప్పుడు రెండు పేర్లు పెట్టడానికి ఉంటుందని జీవన్ రెడ్డి అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఒకే రన్‌వే ఉన్నందున ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇదే అంశంపై శాసనమండలిలో గందరగోళం నెలకొంది. దాందో సమావేశాలు అరగంట పాటు వాయిదా పడ్డాయి. కాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును పునరుద్దరించారు. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో బేగంపేట విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు ఉండేది. -
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును పునరుద్దరించారు. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో బేగంపేట విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు ఉండేది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించారు. టీడీపీ చెందిన విజయనగరం లోక్ సభ సభ్యుడు పి. అశోక్ గజపతిరాజు ఇప్పుడు పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు.