New Districts In Andhra Pradesh 2022: కనుల ముందు కలల జిల్లాలు | AP New Districts List 2022 - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: కనుల ముందు కలల జిల్లాలు

Published Thu, Jan 27 2022 3:22 AM | Last Updated on Thu, Jan 27 2022 1:53 PM

News districts that people have been dreaming coming to reality - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ప్రజలు ఎన్నో ఏళ్లుగా కలలు గంటున్న జిల్లాలు వాస్తవ రూపం దాల్చి కనుల ముందు నిలవనున్నాయి. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, భౌగోళిక అనుకూలతలతో పాటు ప్రజల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. శాస్త్రీయ అధ్యయనాలతో అన్ని ప్రాంతాల మధ్య సమతూకం పాటించింది. ఫలితంగా జిల్లాల పునర్వ్యస్థీకరణ బాగా జరిగిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని, అత్యంత ప్రముఖుల పేర్లను జిల్లాలకు పెట్టాలనే డిమాండ్లు పలుచోట్ల అనేక సంవత్సరాలుగా ఉన్నాయి. ఇలాంటి అనేక అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. అక్కడి స్థానిక ప్రాధాన్యాన్ని, కొన్ని ప్రాంతాలకు ఉన్న చారిత్రక నేపథ్యం, స్థానిక పరిస్థితులను స్వయంగా ప్రభుత్వమే గుర్తించి కొత్త జిల్లాల్లో ప్రతిబింబించేలా చూసింది. అదే సమయంలో పాత జిల్లాల ప్రాధాన్యం, ప్రాశస్త్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది. జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది.

మన్యం విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాటం జరిపిన ప్రాంతాన్ని ఆయన పేరుతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. దాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు పాడేరు కేంద్రంగా అరకు ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేశారు. దీంతో గిరిజనుల కల నెరవేరుతోంది. పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటుతో గిరిపుత్రులకు గౌరవం ఇచ్చారు. గిరిజన ప్రాంతాలతో ఏర్పడుతున్న ఈ రెండు జిల్లాలు వారి మనోభావాలను గౌరవించడంతోపాటు ఆ ప్రాంతాల అభివృద్ధికి, మెరుగైన మౌలిక వసతుల కల్పనకు దోహదపడుతుంది. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను కొనసాగించారు.

చదవండి: (ప్రత్యేక ఆకర్షణగా సీఎం వైఎస్‌ జగన్‌)

తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం ప్రత్యేకతను తెలియజెప్పేలా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసి, అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించింది ప్రభుత్వం. అమలాపురం ప్రాంతాన్ని కోనసీమ జిల్లాగా చేయాలని ఉద్యమాలు కూడా జరిగాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ ఉద్యమాలను అణచివేశారు. అప్పటి నుంచి మరుగునపడిన ఈ ప్రతిపాదనను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వాస్తవ రూపంలోకి తీసుకొచ్చింది. గోదావరి జిల్లాల ప్రాశస్త్యం దెబ్బ తినకుండా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను పునర్వ్యస్థీకరించింది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాగా, నర్సాపురం పార్లమెంటును భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాగా మార్చి వాటి ప్రాధాన్యతను కొనసాగించింది. ఈ జిల్లాలు గోదావరి తీర ప్రాంతాలు.

ఎన్టీఆర్‌ జన్మించిన కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్‌ చాలాకాలం నుంచి ఉన్నా ఆచరణలోకి రాలేదు. చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ని గౌరవించే విషయంలో టీడీపీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతామని ప్రకటించారు. ఆ మాట నిలబెట్టుకుంటూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్‌ జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇది మంచి నిర్ణయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు మచిలీçపట్నాన్ని కృష్ణా జిల్లాగా కొనసాగిస్తూ దాని చారిత్రక ప్రాధాన్యతను ప్రభుత్వం నిలబెట్టింది.

గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం ప్రత్యేకతను నిలబెడుతూ ప్రత్యేక జిల్లా చేయాలని అనేక ఉద్యమాలు జరిగాయి. ఇప్పటివరకు ఎవరూ అక్కడి ప్రజల డిమాండ్‌ను పట్టించుకోలేదు. ఇప్పుడు పల్నాటి పౌరుషాన్ని ప్రతిబింబించేలా నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాపట్లను జిల్లాగా చేయాలనే డిమాండ్‌ సుదీర్ఘకాలంగా ఉంది. ఆ కల ఇప్పుడు నెరవేరింది. పుట్టపర్తి ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన సత్య సాయిబాబాను స్మరిస్తూ శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు గొప్ప ముందడుగుగా చెబుతున్నారు. ఆ ప్రాంత అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది.

చదవండి: (వైజాగ్‌–చెన్నై కారిడార్‌ పనులు చకచకా) 

అన్నింటికీ మించి తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా ఏర్పాటు ద్వారా ఆధ్యాత్మిక వారసత్వాన్ని గౌరవించింది ప్రభుత్వం. తిరుపతి వేంకటేశ్వరస్వామిని స్మరించేలా బాలాజీ జిల్లా ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా హర్తం వ్యక్తమవుతోంది. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య నడయాడిన ప్రాంతం రాయచోటి. ఆ ప్రాంతాన్ని అన్నమయ్య పేరుతోటే అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసి ఆయన కీర్తిని మరింతగా ఇనుమడింపజేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement