
అంతగా అయితే పీవీ పేరు పెట్టండి: కేసీఆర్
హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును పునరుద్దరించడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. తెలంగాణ ప్రాంత మనోభావాలను గౌరవించకుండా ఆంధ్రప్రాంత నేత పేరు పెట్టడం తగదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పేరును పెట్టడంపై శుక్రవారం శాసనసభలో దుమారం రేగింది. శుక్రవారం ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇది చాలా సున్నితమైన అంశమని... ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్టీఆర్ పేరు పెట్టడం తగదన్నారు. శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్పు చేయాలనుకుంటే తెలంగాణ ప్రాంతంవారి పేర్లే పెట్టాలన్నారు. కావాలంటే విమానాశ్రయానికి తెలంగాణ వీరులు పెట్టాలని, అంతగా అయితే మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు పెట్టాలని కేసీఆర్ సూచించారు.
అంతేకానీ ఆంధ్రవారి పేర్లు తెచ్చి తమపై రుద్దొద్దని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ సంస్కృతిపై దాడి జరిగిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఇప్పుడిప్పుడే స్వయంపాలన జరుగుతోందని... ఈ సమయంలో విమానాశ్రయం పేరు మార్చటం తెలంగాణ ప్రజలను కించపరచటమేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ ఆలోచనలను మార్చుకున్నాయని...కమ్యునిస్టుల పేపరైన విశాలాంధ్ర... ఇక్కడ తెలంగాణ పేపరు ప్రారంభించి ప్రజల మనోభావాల్ని గౌరవిస్తుంటే కేంద్రం మాత్రం ముర్ఖంగా వ్యవహరిస్తోందన్నారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని, అందుకే ఆయన పేరు విమానాశ్రయానికి పెట్టారని కేసీఆర్ అన్నారు. ఈ అంశంపై స్పీకర్ అన్ని పార్టీల సభ్యులతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు.