domestic terminal
-
'దేశీయ టెర్మినల్'కు ఎన్టీఆర్ పేరు పెట్టాలి
హైదరాబాద్: కొత్త రాష్ట్రమైన తెలంగాణలో నటుడు, మాజీ సీఎం దివంగత ఎన్టీ రామారావుకు సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఓ లేఖ ద్వారా సీఎం కేసీఆర్‌ను కోరింది. గతంలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్రం తీర్మానించిన విషయాన్ని అందులో ప్రస్తావించింది. తెలంగాణ అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన సేవలకు గుర్తుగా దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పెరు పెట్టడం సముచితమని పేర్కొంది. ‘‘నా అభిమాన నటులు ఎన్టీ రామారావుగారు. ఆయన తనయుడు బాలకృష్ణ అంటే నాకు ప్రీతిపాత్రులు. ఒకప్పుడు మనల్ని ‘మదరాసీయులు’ అని పిలిచేవారు. తెలుగువారిని అలా పిలవకూడదంటూ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన ఘనత ఆయనది. ఎన్టీఆర్ ఒక తరం నటులు కారు, తెలుగుజాతి గర్వించదగ్గ బిడ్డ. ఆయన్ని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకుంటారు'' అంటూ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మాట్లాడిన విషయం తెలిసిందే. -
ఎన్టీఆర్ పేరు తొలగించాలి.. లేకుంటే...
శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును తొలగించాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రైల్ రోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై చర్చించేందుకు వీహెచ్ అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడారు. ఎంఐఎంకు ఎప్పుడో తలాక్ చెప్పేశామని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీతో ఎటువంటి అవగాహన ఉండదని వీహెచ్ స్పష్టం చేశారు. ఒక నేతకు రెండు పదవులు ఇవ్వద్దని పార్టీ అధిష్టానానికి సూచిస్తామని వీహెచ్ వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలిగింపునకు చేపట్టాల్సిన కార్యచరణ కోసం చేపట్టిన ఈ భేటీలో సీనియరు నేతల నుంచి స్పందన కరువైంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, జానారెడ్డి, బలరాంనాయక్, పొన్నం ప్రభాకర్‌లు మాత్రమే హాజరయ్యారు. -
ఎన్టీఆర్ మృతిపై విచారణ
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లక్ష్మీపార్వతి లేఖ సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మృతిపై విచారణ కోరుతూ ఆయన సతీ మణి, మాజీ ఎమ్మెల్యే నందమూరి లక్ష్మీపార్వతి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు కొనసాగించినంత మాత్రాన తెలంగాణకు నష్టం వాటిల్లదని, దానిపై వివాదానికి తావ్వివద్దని కోరారు. లక్ష్మీపార్వతి శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లేఖ ప్రతులను విడుదల చేశారు. విమానాశ్రయ టెర్మినల్ తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టిన నేప థ్యంలో కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ... ఎన్టీఆర్ మృతిపై విచారణ జరపాలంటూ డిమాండ్ చేయడాన్ని లేఖలో ప్రస్తావించారు. వీహెచ్ డిమాండ్‌కు స్పందిస్తూ తానూ కేసీఆర్‌కు లేఖ రాస్తున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ చనిపోవడానికి ముందు రోజు 1996 జనవరి 17వ తేదీన ఏం జరిగిందన్న దానిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. విచారణ కమిటీలో టీడీపీ సీనియర్ నాయకుడిని కూడా సభ్యుడి నియమించినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. చంద్రబాబు, ఆయన తోకపత్రికలు మసిపూసి మారేడుకాయ చేసిన వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. -
రాజీవ్,ఎన్.టి.ఆర్.పేర్లు కొనసాగుతాయి
-
ఎన్టీఆర్ పేరు మార్చే ప్రసక్తే లేదు: జైట్లీ
న్యూఢిల్లీ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్ పేరు మార్పుపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేశారు. దేశీయ టెర్మినల్ పేరు మార్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్ గాంధీ పేరే ఉంటుందని, దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరే కొనసాగుతుందని ఆయన బుధవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రాజీవ్, ఎన్టీఆర్ ఇద్దరూ గౌరవప్రదమైన నేతలేనని అన్నారు. కాగా దేశీయ టెర్మినల్ పేరు మార్పుపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. పేరు మార్చడాన్ని తప్పుబట్టిన వారు... రాజీవ్ పేరు యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై జైట్లీ పైవిధంగా స్పందించారు. -
జీవో రద్దు చేసే వరకు ఆందోళన: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడుతూ జారీ చేసిన జీవోను రద్దు చేసే వరకు పార్లమెంటులో ఆందోళన కొనసాగిస్తామని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్పష్టం చేశారు. మంగళవారం పార్లమెంట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ప్రేమలేదని, రాజకీయ లబ్ధికోసమే ఆయన పేరు వాడుకుంటున్నారని ఆరోపించారు. ‘ఎన్టీఆర్ పేరు పెడుతూ 1999లోనే నిర్ణయం జరిగిందని, దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు చెబుతున్నారు. అప్పుడు కేంద్రంలో ఎన్డీఏ, ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో కింగ్‌మేకర్‌గా ఉన్న బాబు అప్పుడు పేరు ఎందుకు పెట్టలేదు’’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సెటిలర్లలో తన ఆధిపత్యం చూపించుకోవడానికే బాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బుధవారం జీరో అవర్‌లో ఈ అంశంపై మాట్లాడేందుకు రాజ్యసభ చైర్మన్ అవకాశం ఇచ్చారని తెలిపారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించనున్నామన్నారు. -
'తెలంగాణకు శనిలా దాపురించాడు'
హైదరాబాద్: తెలంగాణలో అసలే టీఆర్ఎస్, టీడీపీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కాగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయించడంతో ఆ రెండు పార్టీల మధ్య ఉన్న వైరాన్ని మరింత పెంచింది. డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టవద్దంటూ తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం తీర్మానించింది. దీంతో ఆగ్రహించిన ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీపీ నేతలు శనివారం అధికార టీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. దాంతో ఆదివారం హైదరబాద్‌లో టీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీనివాసగౌడ్, గంగుల కమలాకర్ మాట్లాడుతూ... టీడీపీ అధ్యక్షడు, ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు చంద్రబాబు శనిలా దాపురించారని ఆరోపించారు. చంద్రబాబుకు తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు. స్పీకర్‌పై ప్రతిపక్ష టీటీడీపీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం ఇస్తే అధికార బీసీ ఎమ్మెల్యేలంతా ఏకమై... ఆ అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేలా చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. -
'ఎన్టీఆర్ పేరు పెట్టడం.. ఆయనస్థాయి తగ్గించడమే'
శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం ఆయన స్థాయిని తగ్గించడమేనని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కేవలం డొమెస్టిక్ టెర్మినల్‌కు మాత్రమే ఆయన పేరు పెట్టడం ఏంటని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, వైశ్రాయ్ హోటల్లో ఆయనపై చెప్పులు వేయించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఎన్టీఆర్ పేరు గురించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని బీజేపీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని కూడా రఘువీరారెడ్డి ఆరోపించారు. -
'ఆత్మగౌరవాన్ని చంపుకుని ధర్నాలు చేస్తున్నారు'
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్‌కు పేరు మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎంపీలు బి.సుమన్, బి.నర్సయ్య గౌడ్లు విలేకర్లతో మాట్లాడుతూ... కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. టెర్మినల్ పేరు విషయంలో టి.టీడీపీ నేతలు ఆత్మగౌరవాన్ని చంపుకుని ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని సుమన్, నర్సయ్య గౌడ్ వెల్లడించారు. -
'సిగ్గుంటే ముందు నీ కొడుకు పేరు మార్చుకో'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రాంతాలకు అతీతుడని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఎన్టీఆర్ పేరుపై రాజకీయాలు చేయడం తగదని ఆయన కాంగ్రెస్, టీఆర్ఎస్లకు హితవు పలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అన్న సంగతి మోత్కుపల్లి ఈ సందర్బంగా గుర్తు చేశారు. మందు నీకు సిగ్గుంటే నీ కొడుకు పేరు మార్చుకోవాలంటూ తీవ్ర ఆగ్రహాంతో మోత్కుపల్లి ...తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సూచించారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలవారికి రాజ్యాధికారం కల్పించింది ఎన్టీఆరే అన్న సంగతి మరువరాదని అధికార టీఆర్ఎస్, ప్రతిపక్షం కాంగ్రెస్‌లకు మోత్కుపల్లి హితవు పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ శుక్రవారం తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... మోత్కుపల్లి శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్బంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ అంశంపై కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మోత్కుపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నీ కుమారుడి పేరు మార్చుకో
కేసీఆర్‌కు అచ్చెన్నాయుడి సూచన సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై అభ్యంతరం తెలుపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందుగా తన కుమారుడు తారక రామారావు పేరును మార్చుకోవాలని ఏపీ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సూచించారు. శుక్రవారం ఆయన తన చాంబర్లో మీడియాతో మాట్లాడుతూ, విమానాశ్రయం పేరు మార్పుపై కేసీఆర్ తీరును ఖండించారు. ఈ విషయాన్ని కేసీఆర్ రాజకీయకోణంలో చూడడం తగదన్నారు. -
అసెంబ్లీ మీడియా పాయింట్
ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు కాకుండా మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుగానీ, లేదా గిరిజన యోధుడు కొమురం భీం పేరును ప్రతిపాదించాం. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించేలా ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పీవీ పేరుకు పెద్దపీట వేస్తుందో.. లేక మజ్లిస్ భాష్యానికి మద్దతు పలుకుతుందో చూడాలి. - డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ శాసనసభా పక్ష నేత ఎన్టీఆర్ పేరు పెట్టడంలో టీడీపీ ప్రమేయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ సర్వీసుల విభాగానికి (డొమెస్టిక్ టెర్మినల్) ఎన్టీఆర్ పేరు పెట్టడంలో టీడీపీ ప్రమేయం ఉంది. పేరు మార్పిడిపై కేబినెట్లోనూ చర్చ జరగలేదు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తాం. హైదరాబాద్ విమానాశ్రయానికి తెలంగాణ వ్యక్తుల పేర్లను ఎందుకు ప్రతిపాదించలేదో ప్రజలకు సీఎం కేసీఆర్ సంజాయిషీ ఇవ్వాలి. క్షమాపణ చెప్పాలి. శంషాబాద్ విమానాశ్రయ రెండు టెర్మినళ్లలో ఒకదానికి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మరొకదానికి కొమురం భీంపేరు పెట్టాలి. - జి.కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు ఆంధ్రలో ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి శంషాబాద్ విమానాశ్రయ డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టడం తగదు. బీజీపీ కూడా ఇందుకు మద్దతు పలుకుతోంది. తెలంగాణలోని ఎయిర్‌పోర్టుకు ఆంధ్రోళ్ల పేర్లెందుకు. మీకు అత్యవసరం అనుకుంటే ఆంధ్రలోనూ పలు విమానాశ్రయాలు ఉన్నాయి. వాటికి అక్కడి నేతల పేర్లను తగిలించుకోండి. తెలంగాణ యోధులు లేరా.. వారి పేర్లు పనికిరావా?ఒకవేళ పేరు మార్చాల్సి వస్తే సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన కొమురం భీం పేరును పెట్టాలి. - పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు యథాతథంగా కొనసాగించాలి కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా డొమెస్టిక్ టెర్మినల్ పేరు మార్చడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రాణత్యాగం చేసి దేశానికి సేవలందించిన రాజీవ్‌గాంధీ పేరు మార్చడం తగదు. ఎన్టీఆర్ పేరు మార్పుపై శాసనసభ మెజారిటీ సభ్యులు ఇచ్చిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. లేదంటే మొన్నటి వరకు ఉన్న పేరునే యథాతథంగా కొనసాగించాలి. - జె.గీతారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణకు వ్యతిరేకంగా బాబు కుట్రలు టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేక కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బాబు ప్రోద్బలంతోనే ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టా రు. తెలంగాణలో అలజడి సృష్టించేందుకు కుట్ర ఇది. తెలంగాణలో ఆంధ్ర నాయకుల పేర్లెందుకు? బాబు వైఖరి ఇలానేసాగితే ప్రజల తిరుగుబాటు తప్పదు. భవిష్యత్తులో టీడీపీ ఉనికికే ప్రమాదం. - భాస్కర్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలుగుజాతి ఆత్మగౌరవం పెంచింది ఎన్టీఆరే దేశంలోనే తెలుగుజాతి అత్మగౌరవం పెంచింది ఎన్టీఆరే. ఆయన తెలంగాణ, ఆంధ్రా అని ఏనాడూ తేడా చూపలేదు. అట్టడుగువర్గాల వారికి చట్టసభాపతులుగా హోదాలు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దే. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు ఆదివాసీ నేత కొమురం భీంను ఎం దుకు గుర్తించలేదు. ఎయిర్‌పోర్టులో కేవలం దేశీయ ప్రాంగణానికే ఎన్టీఆర్ పేరు పెట్టారు. - సండ్రవెంకట వీరయ్య, టీడీపీ ఎమ్మెల్యే ప్రేముంటే.. భారతరత్న ఇప్పించుకోండి శంషాబాద్‌లో ఉన్న ఒక రన్‌వేని విడదీసి డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎన్టీఆర్‌పై అంత ప్రేమ ఉంటే భారతరత్న ఇప్పించుకోండి. వైజాగ్, తిరుపతితోపాటు ఆంధ్రలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు ఆయన పేరునే పెట్టుకోండి. ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి పేరును.. ఇంకో ప్రాంతం మీద బలవంతంగా రుద్దడాన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బాబు ఆలోచన విధానం మార్చుకోకుంటే.. తెలంగాణలో టీడీపీ గల్లంతు కాక తప్పదు. - టి. జీవన్‌రెడ్డి , కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదు. కేంద్రం తన జీవోను వెనక్కి తీసుకొవాలి. ఎన్టీఆర్ మృతి కారణమైన చంద్రబాబు తిరిగి ఆయన పేరుతో పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నించడం శోచనీయం. కొత్త రాష్ట్రంలో కనీసం శాసనసభ నిర్ణయం కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఆంధ్రా రాష్ర్టంలోని ఎయిర్‌పోర్టులకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి. - డీకే అరుణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరా..? తెలంగాణలోని ఎయిర్‌పోర్టుకు పక్కరాష్ట్రం వ్యక్తి ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదు. కేంద్రం చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోంది. ఎన్టీఆర్ జాతీయస్థాయి నాయకుడేమీకాదు. కేంద్రం తక్షణమే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేకుంటే తెలంగాణలో ఆంధ్రుల పేర్లన్నింటినీ మారుస్తాం. - శ్రీనివాస్‌గౌడ్, రసమయి, బాలరాజు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేంద్రం నిర్ణయం సరైంది కాదు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్వదేశీ టెర్మినల్‌కు ఎన్టీరామారావు పేరును పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. టీడీపీ మినహా అన్నిపార్టీలు పేరు మార్చకూడదని ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని పట్టుబట్టాయి. ఈ ఏకపక్ష నిర్ణయం పట్ల మేమంతా నిరసన వ్యక్తం చేశాం. దేశం కోసం ప్రాణాలర్పించిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పేరును యధాతథంగా కొనసాగించాలి. - షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ భూముల దుర్వినియోగంపై విచారణ జూబ్లీహిల్స్, ఫిలిం సొసైటీలకు కేటాయించిన భూములు పెద్దఎత్తున పక్కదారి పట్టాయి. కొందరు అక్రమార్కులు వాటిని ఇష్టానుసారం పంచుకున్నా రు. ఈ దుర్వినియోగంపై సీబీఐచే విచారణ జరిపించాలి. అక్రమార్కులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించాలి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీపై కొత్త సిలబస్‌లో పాఠ్యాంశంగా చేర్చాలి. - పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆశ వర్కర్ల వేతనాలు పెంచాలి ప్రభుత్వం 25 వేల మంది ఆశ వర్కర్లను పట్టించుకోవడం లేదు. వారికి కేంద్రం నుంచి కేవలం నెలకు రూ. 400 వేతనం మాత్రమే లభిస్తోంది. గత 20 మాసాలుగా వేతనాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి, బకాయిలు చెల్లించి వేతనాలు పెంచేలా కృషి చేయాలి. - సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే తక్షణమే కార్పొరేషన్లను విభజించాలి రాష్ట్ర విభజన జరిగినా.. కార్పొరేషన్ల విభజన జరగలేదు. ఉమ్మడిగా 89 కార్పొరేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో నవంబర్ జీతాలకు సమస్య ఏర్పడింది. వెంటనే కార్పొరేషన్లను విభజించాలి. తెలంగాణలోని ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టడం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే. - రవీంద్ర కుమార్, సీపీఐ ఎమ్మెల్యే -
ఎయిర్పోర్ట్ పేరు మార్చొద్దని టీ.అసెంబ్లీ తీర్మానం
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్ పేరును మార్చవద్దని తెలంగాణ శాసనసభ శుక్రవారం తీర్మానం చేసింది. ప్రస్తుతం ఉన్న పేర్లను యథావిధిగా ఉంచాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవటంపై తీర్మానంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై విచారణ వ్యక్తం చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని టీడీపీ, బీజేపీ మినహా మిగతా పార్టీలు ఆమోదం తెలిపాయి. కాగా కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంలో బీజేపీ సవరణలు సూచించింది. విమానాశ్రయం పేరు మార్చాల్సి వస్తే కొమురం భీం, పీవీ నరసింహారావు పెట్టాలని కోరింది. మరోవైపు టీడీపీ మాత్రం ఎన్టీఆర్ పేరునే ఉంచాలని సూచించింది. -
ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరు?:అక్బరుద్దీన్
హైదరాబాద్:శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని డొమెస్టిక్ టెర్మినల్‌కు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పెట్టే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చలు జరిగాయి. ఈ అంశంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడే ప్రజలకు ఎన్టీఆర్ గొప్ప నేత అని కొనియాడుతూనే.. సభలో ఇంగ్లిష్, ఉర్దూల భాషలను విస్మరిస్తున్నారు. అసలు ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరు? అంటూ అక్బరుద్దీన్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా పేరు మార్చడం సరికాదన్నారు. ఎలాంటి సలహాలు, సూచనలు లేకుండా పేరు మార్చడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.ఎయిర్ పోర్ట్ నిర్మించిన స్థలం శంషుద్దీన్, అక్బరుద్దీన్ లకు చెందినది ఆయన తెలిపారు. -
ఎన్టీఆర్ పేరు ఎలా పెడతారు?
హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని డొమెస్టిక్ టెర్మినల్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు ఎలా పెడతారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. కావాలంటే ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా నిర్మించే ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని అరుణ కేంద్రప్రభుత్వానికి సూచించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక రన్‌వే మాత్రమే ఉంది... కాబట్టి టెర్మినల్‌కు మరోకరి పేరు పెట్టడం సరికాదని అరుణ వ్యాఖ్యానించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పేరు మార్పుపై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్నికోరాలని డీకే అరుణ ఈ సందర్బంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
అంతగా అయితే పీవీ పేరు పెట్టండి: కేసీఆర్
-
కొమురం భీం పేరు పెట్టాలి: వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయానికి కొమురం భీం పేరు పెట్టాలని వైఎస్ఆర్ సీపీ ఫ్లోర్ లీడర్ తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలంతా గిరిజన నేత కొమురం భీంను అభిమానిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీలో విమానాశ్రయానికి కొమురం భీం పేరు పెట్టే అంశాన్ని ప్రస్తావించారని తాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కొమురం భీం పేరును ఏకగ్రీవ తీర్మానం చేసేందుకు పార్టీలన్నీ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఎయిర్‌పోర్ట్‌కు రాజీవ్ పేరే ఉంటుంది ... కానీ
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రాజీవ్‌గాంధీ పేరే కొనసాగుతుందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. కాని డొమెస్టిక్ టెర్మినల్‌కు మాత్రం మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో నూతనంగా మరో విమానాశ్రయం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది... ఈ నేపథ్యంలో ఆ విమానాశ్రయానికి ఏ పేరు పెట్టినా తమకు అభ్యంతరం లేదని సండ్ర వెంకట వీరయ్య వ్యాఖ్యానించారు. విమానాశ్రయ పేరు మార్పును రాద్ధాంతం చేయడం సరికాదని ఆయన అధికార, కాంగ్రెస్ పార్టీలకు హితవు పలికారు. -
అంతగా అయితే పీవీ పేరు పెట్టండి: కేసీఆర్
హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పునరుద్దరించడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు. తెలంగాణ ప్రాంత మనోభావాలను గౌరవించకుండా ఆంధ్రప్రాంత నేత పేరు పెట్టడం తగదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పేరును పెట్టడంపై శుక్రవారం శాసనసభలో దుమారం రేగింది. శుక్రవారం ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇది చాలా సున్నితమైన అంశమని... ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్టీఆర్ పేరు పెట్టడం తగదన్నారు. శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్పు చేయాలనుకుంటే తెలంగాణ ప్రాంతంవారి పేర్లే పెట్టాలన్నారు. కావాలంటే విమానాశ్రయానికి తెలంగాణ వీరులు పెట్టాలని, అంతగా అయితే మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు పెట్టాలని కేసీఆర్ సూచించారు. అంతేకానీ ఆంధ్రవారి పేర్లు తెచ్చి తమపై రుద్దొద్దని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ సంస్కృతిపై దాడి జరిగిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఇప్పుడిప్పుడే స్వయంపాలన జరుగుతోందని... ఈ సమయంలో విమానాశ్రయం పేరు మార్చటం తెలంగాణ ప్రజలను కించపరచటమేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ ఆలోచనలను మార్చుకున్నాయని...కమ్యునిస్టుల పేపరైన విశాలాంధ్ర... ఇక్కడ తెలంగాణ పేపరు ప్రారంభించి ప్రజల మనోభావాల్ని గౌరవిస్తుంటే కేంద్రం మాత్రం ముర్ఖంగా వ్యవహరిస్తోందన్నారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని, అందుకే ఆయన పేరు విమానాశ్రయానికి పెట్టారని కేసీఆర్ అన్నారు. ఈ అంశంపై స్పీకర్ అన్ని పార్టీల సభ్యులతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
తెలంగాణలో సీమాంధ్రుల ఆధిపత్యమా..?
-
తెలంగాణలో సీమాంధ్రుల ఆధిపత్యమా..?
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే దీనిపై చర్చించాలంటూ కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రుల ఆధిపత్యాన్ని తెలంగాణలో చూపిస్తే సహించేది లేదన్నారు. టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఆధిపత్యం వద్దు అనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు చేశామన్నారు. ఎయిర్‌పోర్టులో రెండు రన్వేలు ఉన్నప్పుడు రెండు పేర్లు పెట్టడానికి ఉంటుందని జీవన్ రెడ్డి అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఒకే రన్‌వే ఉన్నందున ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇదే అంశంపై శాసనమండలిలో గందరగోళం నెలకొంది. దాందో సమావేశాలు అరగంట పాటు వాయిదా పడ్డాయి. కాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును పునరుద్దరించారు. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో బేగంపేట విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు ఉండేది. -
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును పునరుద్దరించారు. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో బేగంపేట విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు ఉండేది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించారు. టీడీపీ చెందిన విజయనగరం లోక్ సభ సభ్యుడు పి. అశోక్ గజపతిరాజు ఇప్పుడు పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు.