కొత్త రాష్ట్రమైన తెలంగాణలో నటుడు, మాజీ సీఎం దివంగత ఎన్టీ రామారావుకు సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఓ లేఖ ద్వారా సీఎం కేసీఆర్ను కోరింది.
హైదరాబాద్: కొత్త రాష్ట్రమైన తెలంగాణలో నటుడు, మాజీ సీఎం దివంగత ఎన్టీ రామారావుకు సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఓ లేఖ ద్వారా సీఎం కేసీఆర్ను కోరింది. గతంలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్రం తీర్మానించిన విషయాన్ని అందులో ప్రస్తావించింది. తెలంగాణ అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన సేవలకు గుర్తుగా దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పెరు పెట్టడం సముచితమని పేర్కొంది.
‘‘నా అభిమాన నటులు ఎన్టీ రామారావుగారు. ఆయన తనయుడు బాలకృష్ణ అంటే నాకు ప్రీతిపాత్రులు. ఒకప్పుడు మనల్ని ‘మదరాసీయులు’ అని పిలిచేవారు. తెలుగువారిని అలా పిలవకూడదంటూ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన ఘనత ఆయనది. ఎన్టీఆర్ ఒక తరం నటులు కారు, తెలుగుజాతి గర్వించదగ్గ బిడ్డ. ఆయన్ని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకుంటారు'' అంటూ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మాట్లాడిన విషయం తెలిసిందే.