అసెంబ్లీ మీడియా పాయింట్ | Assembly media point | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ మీడియా పాయింట్

Published Sat, Nov 22 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

అసెంబ్లీ మీడియా పాయింట్

అసెంబ్లీ మీడియా పాయింట్

ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి

 శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు కాకుండా మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుగానీ, లేదా గిరిజన యోధుడు కొమురం భీం పేరును ప్రతిపాదించాం. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించేలా ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పీవీ పేరుకు పెద్దపీట వేస్తుందో.. లేక మజ్లిస్ భాష్యానికి మద్దతు పలుకుతుందో చూడాలి.   
 - డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ శాసనసభా పక్ష నేత
 
ఎన్టీఆర్ పేరు పెట్టడంలో టీడీపీ ప్రమేయం

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ సర్వీసుల విభాగానికి (డొమెస్టిక్ టెర్మినల్) ఎన్టీఆర్ పేరు పెట్టడంలో టీడీపీ ప్రమేయం ఉంది. పేరు మార్పిడిపై కేబినెట్‌లోనూ చర్చ జరగలేదు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తాం.  హైదరాబాద్ విమానాశ్రయానికి తెలంగాణ వ్యక్తుల పేర్లను ఎందుకు ప్రతిపాదించలేదో ప్రజలకు సీఎం కేసీఆర్ సంజాయిషీ ఇవ్వాలి.  క్షమాపణ చెప్పాలి. శంషాబాద్ విమానాశ్రయ రెండు టెర్మినళ్లలో ఒకదానికి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మరొకదానికి కొమురం భీంపేరు పెట్టాలి.     
- జి.కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు

ఆంధ్రలో ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి

శంషాబాద్ విమానాశ్రయ డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టడం తగదు. బీజీపీ కూడా ఇందుకు మద్దతు పలుకుతోంది.  తెలంగాణలోని ఎయిర్‌పోర్టుకు ఆంధ్రోళ్ల పేర్లెందుకు.  మీకు అత్యవసరం అనుకుంటే ఆంధ్రలోనూ పలు విమానాశ్రయాలు ఉన్నాయి. వాటికి అక్కడి నేతల పేర్లను తగిలించుకోండి. తెలంగాణ యోధులు లేరా.. వారి పేర్లు పనికిరావా?ఒకవేళ పేరు మార్చాల్సి వస్తే సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన కొమురం భీం పేరును పెట్టాలి.
-  పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు
 
యథాతథంగా కొనసాగించాలి


కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా డొమెస్టిక్ టెర్మినల్ పేరు మార్చడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రాణత్యాగం చేసి దేశానికి సేవలందించిన రాజీవ్‌గాంధీ పేరు మార్చడం తగదు. ఎన్టీఆర్ పేరు మార్పుపై శాసనసభ మెజారిటీ సభ్యులు ఇచ్చిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. లేదంటే మొన్నటి వరకు ఉన్న పేరునే యథాతథంగా కొనసాగించాలి.   
 -  జె.గీతారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలంగాణకు వ్యతిరేకంగా బాబు కుట్రలు

 టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేక కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బాబు ప్రోద్బలంతోనే ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టా రు. తెలంగాణలో అలజడి సృష్టించేందుకు కుట్ర ఇది. తెలంగాణలో ఆంధ్ర నాయకుల పేర్లెందుకు? బాబు వైఖరి ఇలానేసాగితే ప్రజల తిరుగుబాటు తప్పదు. భవిష్యత్తులో టీడీపీ ఉనికికే ప్రమాదం.
- భాస్కర్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలుగుజాతి ఆత్మగౌరవం పెంచింది ఎన్టీఆరే

దేశంలోనే తెలుగుజాతి అత్మగౌరవం పెంచింది ఎన్టీఆరే. ఆయన తెలంగాణ, ఆంధ్రా అని ఏనాడూ తేడా చూపలేదు. అట్టడుగువర్గాల వారికి చట్టసభాపతులుగా హోదాలు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దే. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు ఆదివాసీ నేత కొమురం భీంను ఎం దుకు గుర్తించలేదు. ఎయిర్‌పోర్టులో కేవలం దేశీయ ప్రాంగణానికే ఎన్టీఆర్ పేరు పెట్టారు.
  -  సండ్రవెంకట వీరయ్య, టీడీపీ ఎమ్మెల్యే

ప్రేముంటే.. భారతరత్న ఇప్పించుకోండి

శంషాబాద్‌లో ఉన్న ఒక రన్‌వేని విడదీసి డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎన్టీఆర్‌పై అంత ప్రేమ ఉంటే భారతరత్న ఇప్పించుకోండి. వైజాగ్, తిరుపతితోపాటు ఆంధ్రలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు ఆయన పేరునే పెట్టుకోండి. ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి పేరును.. ఇంకో ప్రాంతం మీద బలవంతంగా రుద్దడాన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బాబు ఆలోచన విధానం మార్చుకోకుంటే.. తెలంగాణలో టీడీపీ గల్లంతు కాక తప్పదు.    
 - టి. జీవన్‌రెడ్డి , కాంగ్రెస్ ఎమ్మెల్యే

నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదు. కేంద్రం తన జీవోను వెనక్కి తీసుకొవాలి. ఎన్టీఆర్ మృతి కారణమైన చంద్రబాబు తిరిగి ఆయన పేరుతో పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నించడం శోచనీయం. కొత్త రాష్ట్రంలో కనీసం శాసనసభ నిర్ణయం కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఆంధ్రా రాష్ర్టంలోని ఎయిర్‌పోర్టులకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి.  
 - డీకే అరుణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరా..?

తెలంగాణలోని ఎయిర్‌పోర్టుకు పక్కరాష్ట్రం వ్యక్తి ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదు. కేంద్రం చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోంది. ఎన్టీఆర్ జాతీయస్థాయి నాయకుడేమీకాదు. కేంద్రం తక్షణమే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేకుంటే తెలంగాణలో ఆంధ్రుల పేర్లన్నింటినీ మారుస్తాం.     
- శ్రీనివాస్‌గౌడ్, రసమయి, బాలరాజు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు

కేంద్రం నిర్ణయం సరైంది కాదు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్వదేశీ టెర్మినల్‌కు ఎన్టీరామారావు  పేరును పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. టీడీపీ మినహా అన్నిపార్టీలు పేరు మార్చకూడదని ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని పట్టుబట్టాయి. ఈ ఏకపక్ష నిర్ణయం పట్ల మేమంతా నిరసన వ్యక్తం చేశాం. దేశం కోసం ప్రాణాలర్పించిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పేరును యధాతథంగా కొనసాగించాలి.     
- షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ

భూముల దుర్వినియోగంపై విచారణ

జూబ్లీహిల్స్, ఫిలిం సొసైటీలకు కేటాయించిన  భూములు పెద్దఎత్తున పక్కదారి పట్టాయి. కొందరు అక్రమార్కులు వాటిని ఇష్టానుసారం పంచుకున్నా రు. ఈ దుర్వినియోగంపై సీబీఐచే విచారణ జరిపించాలి. అక్రమార్కులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించాలి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీపై కొత్త సిలబస్‌లో పాఠ్యాంశంగా చేర్చాలి.     
- పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ

ఆశ వర్కర్ల వేతనాలు పెంచాలి

ప్రభుత్వం 25 వేల మంది ఆశ వర్కర్లను పట్టించుకోవడం లేదు. వారికి కేంద్రం నుంచి కేవలం నెలకు రూ. 400 వేతనం మాత్రమే లభిస్తోంది. గత 20 మాసాలుగా వేతనాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి, బకాయిలు చెల్లించి వేతనాలు పెంచేలా కృషి చేయాలి.  
 -  సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే

తక్షణమే కార్పొరేషన్లను విభజించాలి

రాష్ట్ర విభజన జరిగినా.. కార్పొరేషన్ల విభజన  జరగలేదు. ఉమ్మడిగా 89 కార్పొరేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో నవంబర్ జీతాలకు సమస్య ఏర్పడింది. వెంటనే కార్పొరేషన్లను విభజించాలి. తెలంగాణలోని ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టడం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే.
- రవీంద్ర కుమార్, సీపీఐ ఎమ్మెల్యే
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement