'సిగ్గుంటే ముందు నీ కొడుకు పేరు మార్చుకో'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రాంతాలకు అతీతుడని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. శనివారం హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఎన్టీఆర్ పేరుపై రాజకీయాలు చేయడం తగదని ఆయన కాంగ్రెస్, టీఆర్ఎస్లకు హితవు పలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అన్న సంగతి మోత్కుపల్లి ఈ సందర్బంగా గుర్తు చేశారు. మందు నీకు సిగ్గుంటే నీ కొడుకు పేరు మార్చుకోవాలంటూ తీవ్ర ఆగ్రహాంతో మోత్కుపల్లి ...తెలంగాణ సీఎం కేసీఆర్కు సూచించారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలవారికి రాజ్యాధికారం కల్పించింది ఎన్టీఆరే అన్న సంగతి మరువరాదని అధికార టీఆర్ఎస్, ప్రతిపక్షం కాంగ్రెస్లకు మోత్కుపల్లి హితవు పలికారు.
శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ శుక్రవారం తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... మోత్కుపల్లి శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్బంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ అంశంపై కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మోత్కుపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.