TTDP Leader
-
ఫోర్జరీ కేసులో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు అరెస్ట్
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్‌లోని ఖరీదైన అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లను ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసేందుకు యత్నించిన టీ–టీడీపీ జనరల్ సెక్రటరీ గాజుల విజయ జ్ఞానేశ్వర్నాయుడు అలియాస్ జీవీజీ నాయుడును జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 70లోని జర్నలిస్టు కాలనీ–ప్రశాసన్‌నగర్ సమీపంలో ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రోనక్ కొటేచాకు జ్యోతి సిగ్నేచర్ అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. రోనక్ కొటేచా ఎక్కువగా ముంబైలో ఉండటాన్ని గమనించిన జీవీజీ నాయుడు ఇళ్ల కబ్జాకు స్కెచ్ వేశాడు. 2013లో ఈ రెండు ఫ్లాట్లను తాను కొంటున్నట్లుగా ఫోర్జరీ పత్రాలు తయారు చేసి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ జరిగినట్లుగా సృష్టించాడు. వీటితో పాటు కొన్ని ఫోర్జరీ సంతకాలతో కూడిన క్యాష్ రిసిప్ట్‌లను కూడా తయారు చేశారు. 2020లో సిటీ సివిల్ కోర్టులో స్పెషల్ పర్ఫార్మాన్స్ ఫర్ రిజిస్ట్రేషన్ పిటిషన్‌ను దాఖలు చేస్తూ తాను మొత్తం డబ్బులు చెల్లించినా రోనక్ కొటేచా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న రోనక్ కొటేచా జూలైలో హైదరాబాద్‌కు వచ్చి ఫోర్జరీ పత్రాలతో తన ఫ్లాట్‌ను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న జీవీజీ నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టులో జీవీజీ నాయుడు సమర్పించిన పత్రాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా వాటిల్లో రోనక్ కొటేచా సంతకాలన్నీ ఫోర్జరీ అంటూ ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇచ్చింది. దీంతో పోలీసులు జీవీజీ నాయుడుతో పాటు బల్విందర్ సింగ్, మరికొంత మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు తనను అరెస్ట్ చేయకుండా నాయుడు ముందస్తు బెయిల్ తెచ్చుకోవాలని విఫలయత్నం చేయగా కోర్టు మూడు వారాల పాటు అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలచ్చింది. కోర్టు గడువు గత నెల 20న ముగియడంతో అప్పటి నుంచి పోలీసులు నాయుడును అరెస్ట్ చేసేందుకు యత్నించారు. నిందితుడు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతుండగా ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉండగా పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
తెలుగుదేశం పార్టీ శ్మశానంలా తయారైంది..
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళితులను మోసం చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. పెద్ద మాదిగ అని చెప్పుకునే బాబుకు దళితులపై ఏమాత్రం ప్రేమ లేదని పేర్కొన్నారు. మహానాడుకు తనను పిలవకుండా మాదిగలను, దళితులను అవమానపరిచారని విమర్శించారు. శుక్రవారం ఆయన బేగంపేటలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గురువారం జరిగిన మహానాడుకు తనను ఆహ్వానించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పార్టీకి 30 ఏళ్లుగా సేవ చేస్తున్న నన్ను మహానాడుకు పిలవలేదు. నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సీనియర్ లీడర్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా? ఎస్సీ వర్గీకరణ సభ కోసం నిజామాబాద్ వెళ్తుండగా ఇద్దరు బిడ్డలున్న ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోతే చంద్రబాబు ఆదుకోలేదు. పెద్ద మాదిగ అని చెప్పుకునే బాబుకు దళితులపై ఉన్న ప్రేమ ఇదా? ఆంధ్రాలోనూ దళితులున్నారు జాగ్రత్త! పెద్ద మాదిగ అన్న మీరు వర్గీకరణపై ఎందుకు తీర్మానం చెయ్యలేదు. కేసీఆర్ ఎప్పుడో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపినా మీరెందుకు చెయ్యలేదో చెప్పాలి’’అని నిలదీశారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు కనీసం చాయ్‌కి కూడా సమయం ఇవ్వలేదని, ఆయనా దళితులకు న్యాయం చేసేది అని ప్రశ్నించారు. తాను చేసిన తప్పేంటో ఇప్పటికైనా బాబు చెప్పాలని, తప్పుంటే ముక్కు నేలకు రాస్తానని, లేదంటే ఆంధ్రాలో అన్ని జిల్లాలు తిరిగి నా తప్పేంటని అడుగుతానని స్పష్టంచేశారు. ‘‘రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లికి పోయావ్.. ఎంగేజ్మెంట్కు కేబినెట్ అంతా తీసుకొని వెళ్లావ్.. కానీ నా బిడ్డ పెళ్లికి పిలవంగా పిలవంగా సాయంత్రం వచ్చారు. అదే కేసీఆర్ ఇంటికి వెళ్లి.. నా ఇంట్లో బిడ్డ పెళ్లి ఉందనగానే ఆత్మీయంగా స్వాగతం పలికారు. పెళ్లికి కూడా వచ్చారు’’అని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ శ్మశానంలా తయారైంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శ్మశానంలా తయారైందని, ఆంధ్రప్రదేశ్‌లోనూ వస్తదో, రాదో అన్న పరిస్థితి ఉందని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డిలాంటి మూర్ఖులను ప్రోత్సహించి, నిబద్ధత గల తన వంటి నాయకులను చిన్నచూపు చూడటంతోనే పార్టీ సర్వనాశనం అయిందన్నారు. పార్టీలో నీతి లేని నాయకులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, దళితులను ముఖ్యంగా మాదిగలను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘పార్టీలో డబ్బు, కులానికే ప్రాధాన్యత పెరిగింది. అందుకే పార్టీ పతనావస్థకు చేరుతోంది. దీనిపై ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి’’అని వ్యాఖ్యానించారు. మళ్లీ చెబుతున్నా.. కేసీఆర్‌తో కలిసిపోదాం.. కేసీఆర్‌తో కలిసి పోదాం అన్నందుకే తనను పక్కన పెడుతున్నారని మోత్కుపల్లి వాపోయారు. ‘‘మళ్లీ చెబుతున్నా.. కేసీఆర్ మన మిత్రుడే. ఆయన కేబినెట్లో ఉన్నవారు మనవారే. వారితో జతకట్టడం మనకు మంచిదే. టీఆర్ఎస్లో పార్టీని విలీనం చేయాలన్న వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నా’’అని చెప్పారు. ఇప్పటికీ తాను టీడీపీలోనే ఉన్నానని, బాబు తనను పిలిచి మాట్లాడాలని అన్నారు. తనను పిలవకుంటే రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసుంటే చెప్పుతో కొట్టేవారు ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డి అప్రూవర్‌గా మారతాడని చంద్రబాబు భయపడ్డారని, అందుకే బ్లాక్ మెయిల్ చేసినా ఆయనపై చర్యలు తీసుకోలేదని మోత్కుపల్లి చెప్పారు. ఒకవేళ కుట్రతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసుంటే ప్రజలు టీడీపీని చెప్పుతో కొట్టేవారని, నాదెండ్ల భాస్కర్‌రావు మాదిరే తిరుగుబాటు చేసేవారని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎన్నికల్లో పైసా, పరపతి లేనివారికి సీఎం కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారని, ఆ పని మీరెందుకు చేయలేకపోయారని బాబు ను నిలదీశారు. పార్టీ నుంచి తనను మెడపట్టి బయటకు గెంటేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. -
టీటీడీపీకి దెబ్బ మీద దెబ్బ
సాక్షి, భూపాలపల్లి: తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్న కాంగ్రెస్ గూటికి పలువురు నేతలు చేరగా.. ప్రస్తుతం కారు ఎక్కేందుకు పలువురు సిద్దమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్ష పదవికి గండ్ర సత్యనారాయణ రావు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపినట్టు సత్యనారాయణ తెలిపారు. కాగా బుధవారం గండ్ర టీఆర్ఎస్లో చేరనున్నారు. గండ్ర సత్యనారాయణ గత 30 సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతున్నారు. సర్పంచ్, జెడ్పీటీసీ గా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజక వర్గం నుంచి టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. అంతే కాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు టీడీపీ సీనియర్ నేతలు కూడా వలసల బాట పడుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పేర్యాల (కిమ్స్) రవీందర్రావు, మంథని నియోజకవర్గ ఇన్చార్జి కర్రు నాగయ్య టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవలే రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పెద్దఎత్తున ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు కాంగ్రెస్‌తో చేయి కలిపిన విషయం తెలిసిందే. -
మీరు హైదరాబాద్‌కే పరిమితమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తెలంగాణ టీడీపీ నేతలమధ్య వాడీ, వేడీ చర్చ జరిగింది. గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ముఖ్య నేతలంతా హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని, జిల్లాల్లో తిరగకుండా, నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లేకుండా ఎలా బలపడతామని ఈ సందర్భంగా కొందరు నాయకులు ప్రశ్నించినట్టు తెలిసింది. తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని, వచ్చే ఎన్నికల్లో అధికారం టీడీపీదే అని పదే పదే ప్రకటనలు చేస్తున్నా, పార్టీని బలోపేతం చేసే దిశలో పెద్దగా ప్రయత్నాలు జరగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. పనిచేయకుండా ఎలా అధికారంలోకి వస్తామని పలువురు నేతలు ప్రశ్నించారు. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తని.., కాంగ్రెస్‌తో పొత్తని రకరకాల ప్రచారం జరుగుతోందని, దీనిపై పార్టీ నేతలే కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తున్నారని కొందరు నాయకులు నిలదీశారని తెలిసింది. కాగా, పార్టీ అధినేత చంద్రబాబు ఈ సమావేశానికి హాజరవుతానని ముందుగా సమయం ఇచ్చినా ఆయన హాజరు కాలేదు. పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు పాల్గొన్న ఈ సమావేశంలో సంస్థాగత ఎన్నికల నిర్వహణ, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. దీపావళి తరువాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ విధానాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సమావేశం అనంతరం మీడియాకు చెప్పారు. కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిధుల ఖర్చు, అభివృద్ధి పనులపై ఎలాంటి స్వేచ్ఛ లేదని, రాష్ట్ర సంపదంతా ఒకే కుటుంబం అనుభవిస్తోందని, తెలంగాణ వచ్చాక కూడా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలను అణచివేస్తోందని, కేసీఆర్ వ్యతిరేకశక్తుల పునరేకీకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. -
నిధుల కేటాయింపుల పై లెక్కలు చెప్పాలి
-
మహా ఒప్పందం ఎలా చారిత్రాత్మకం? : రావుల
హైదరాబాద్: గోదావరి జలాల పంపకాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఎలా చారిత్రాత్మకమో వివరించాలని టీఆర్ఎస్ నేతలను టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్వ హక్కులు మహారాష్ట్రకు తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఏమాత్రం వాస్తవాలు చెప్పడం లేదని విమర్శించారు. ఇది చీకటి ఒప్పందమని ఆయన అభివర్ణించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో రావుల చంద్రశేఖర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టులు కడితే కాల్వలకు నీళ్లు వస్తాయని తెలిపారు. 148 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ఏటా వందలాది కోట్ల రూపాయలు నిర్వహణ ఖర్చులు పెరుగిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రాజెక్టులు తెల్ల ఏనుగులుగా మారతాయని ఆందోళన చెందారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అఖిల పక్షాల నిర్ణయాలకు గౌరవం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసీఆర్ ఆ హామీని మరిచిపోయారన్నారు. అప్పుడు మహా ఒప్పందంలో భాగంగా ముంబాయి వెళ్లి హడావిడి చేశారని, ఇప్పుడూ అదే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రతో ఒప్పందానికి వెళ్లే ముందు కనీసం అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించలేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనాడు ఎంఓయూ అన్నారు.... ఈనాడు ఒప్పందం అంటున్నారని...ఈ మధ్య కాలంలో ఒక్క సారైనా అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉంటే బావుండేదని రావుల అభిప్రాయపడ్డారు. మహా ఒప్పందంలో స్పష్టత లేదు కాబట్టి, దీనిని చీకటి ఒప్పందంగా తెలంగాణ టీడీపీ భావిస్తోందని రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. -
ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం: రావుల
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ఒకప్పుడు సరోజినీదేవి ఆసుపత్రికి వెళితే చూపు వస్తుందనే పరిస్థితి నుంచి అక్కడికి వెళ్లాలంటేనే రోగులు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న కంటితుడుపు వ్యవహారాల వల్లే ఇంత మంది చూపు పోయిందన్నారు. ఈ ఘటనలో వైద్యులు, సిబ్బంది, పాలకవర్గం, ఫార్మసీ విభాగాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టివేయడానికి ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. చూపు కోల్పోయిన బాధితులకు పరిహారం, జీవనాధారం, వారి సహాయకులకు చేదోడు కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని అటకెక్కించి కార్పొరేట్ వైద్యం వైపు మళ్లిస్తున్నార నే ఆరోపణలకు ఇది బలం చేకూర్చుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్లు వికటించిన ఘటనపై ఉన్నత స్థాయి వైద్య నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. -
బాబు కప్పుతున్న కండువాలు కనిపించ లేదా ?
నల్గొండ : టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన రేవంత్ రెడ్డి విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులపై మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కండువాలు కప్పుతున్నది కనిపించడం లేదా అని రేవంత్‌ను గుత్తా సూటిగా ప్రశ్నించారు. నేను గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగితే...పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారని గుర్తు చేశారు. నన్ను విమర్శించే స్థాయి ఉత్తమ్‌కుమార్‌కు లేదని గుత్తా స్పష్టం చేశారు. -
సుచరితకు మద్దతు తెలపాలని కోరుతున్నాం: ఎల్.రమణ
హైదరాబాద్ : గత సాంప్రదాయాలను అనుసరించి ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆదివారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు చనిపోతే... ఆ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని గతంలో ప్రతిపాదనను తీసుకువచ్చింది... టీడీపీనే అని ఆయన గుర్తు చేశారు. పాలేరు ఉప ఎన్నికఓ పోటీ చేయొద్దని అనేక సార్లు టీపీసీసీ నేతలు ఉత్తమ్, భట్టి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో రాంరెడ్డి వెంకట్‌రెడ్డి భార్య సుచరితకు మద్దత తెలుపుతున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సుచరితకు మద్దతు ఇవ్వాలనీ ఎల్.రమణ సూచించారు. -
'సీఎంకి నోటిసు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం'
హైదరాబాద్ : తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ ఎత్తును తగ్గించడం లేదంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటిసు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. బుధవారం హైదరాబాద్‌లో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రాజెక్ట్ వ్యయం కూడా అదనంగా రూ. 45 వేల కోట్లకు పెరుగుతుందన్నారు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించే అంశంపై మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో జరిగిన చీకటి ఒప్పందాన్ని ప్రజలకు చెప్పాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టుపెట్టారని కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు... మహారాష్ట్రకు మేలు చేసేలా వ్యవహరించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. -
నన్నెందుకు పక్కన పెట్టారో: మోత్కుపల్లి
హైదరాబాద్ : చూడబోతే మరో తెలంగాణ టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు కూడా త్వరలోనే సైకిల్ దిగే పనిలో ఉన్నట్లున్నారు. గురువారం హైదరాబాద్‌లో మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా అంటూ తెలంగాణపై పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు. 'మైనస్ చంద్రబాబు వల్ల తెలంగాణలో ఏమీ జరగదు.మైనస్ చంద్రబాబు వల్ల తెలంగాణలో ఏమీ జరగదు. పార్టీలో ఉపన్యాసాలకు తావులేదు. నాయకత్వం అవసరం. సీఎంగా బాధ్యతల కోసం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ వెళ్లారు. చంద్రబాబు తెలంగాణను వదిలేశారు. తెలంగాణకు చంద్రబాబు రావడం లేదన్న అభిప్రాయం జనంలోకి వెళ్లిపోయింది. వారానికి ఒకరోజు సమయం కేటాయించాలి. తప్పకుండా అన్ని జిల్లాల్లో తిరగాలి. లేకుంటే పార్టీకి పూర్వ వైభవం రాదు. పార్టీపై నన్ను మాట్లాడనీయకుండా నా ఎనర్జీని కాపాడారు ఇన్నాళ్లు. ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో కూడా నన్ను ఎక్కడా ఉపయోగించుకోలేదు. నన్ను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదు. ఈ మధ్యకాలంలో మీటింగుల్లో నన్ను ఎక్కడైనా చూశారా? గ్రేటర్ ఎన్నికల్లో నా ప్రమేయం లేదు' అని మోత్కుపల్లి తన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గతంలో మోత్కుపల్లి నర్సింహులుకు రాజ్యసభ అవకాశం ఇవ్వని చంద్రబాబు.. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే గవర్నర్ పదవి ఇప్పిస్తానని హామీనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనకు గవర్నర్ గిరీ ఖాయం అనుకున్న ఆయనకు... ఆ తర్వాత పదవి ఊసే లేకపోవడంతో అప్పటి నుంచి మోత్కుపల్లి కినుకగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ఫిరాయింపులను సమర్ధించుకోవడం సిగ్గు చేటు
-
నా కళ్లల్లో చూసే ధైర్యం లేక ...
హైదరాబాద్ : అసెంబ్లీలో తాను మాట్లాడితే నా కళ్లలో చూసే ధైర్యం లేకే తనను టార్గెట్ చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కేబినెట్ సహాచరులపై టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆసెంబ్లీ ఆవరణలో సాక్షితో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ఎల్బీనగర్ మీటింగ్ నుంచి వేట మొదలైందన్నారు. కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని మంత్రులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలు చేస్తున్నారంటూ కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఓ పార్టీ గుర్తుపై గెలిచి... మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల అంశంలో అనర్హత పిటిషన్‌పై హైకోర్టు వెలువరించిన తీర్పు స్పీకర్‌కు సూచనగా భావిస్తున్నామని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్ మంత్రి వర్గంలో కొనసాగుతున్న తలసాని శ్రీనివాసయాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 8 నెలలు అయిందని... అయినా తెలంగాణ శాసన సభ స్పీకర్ తలసాని రాజీనామాను ఆమోదించ లేదన్నారు. పీజీ చదువుతున్న విద్యార్థులను కాల్చి చంపడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని రేవంత్ ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గులాబీ పార్టీ నేతలు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు తేడా తెలియకుండా వ్యహరిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారంటూ...పోలీసులపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మీ విధులు మీరు నిర్వహించండి... టీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతం కాదంటూ పోలీసులకు రేవంత్‌రెడ్డి హితవు పలికారు. -
కేసీఆర్ మాట తప్పారు
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో మేడారం అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్ బూటకమని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో ఎర్రబెల్లి మాట్లాడుతూ... ఎన్కౌంటర్లో మరణించిన శృతి, సాగర్‌రెడ్డిని పోలీసులే తీసుకెళ్లి చంపారని విమర్శించారు. వారిద్దరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారని ఆయన గుర్తు చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. నక్సల్స్ అజెండానే తమ అజెండా అని గతంలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఆ మాట తప్పారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం తొలి ఎన్ కౌంటర్ మంగళవారం వరంగల్ జిల్లా మేడారం మండలం తాడ్వాయి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. వారిద్దరికి బుధవారం వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ ఎన్‌కౌంటర్‌పై టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావుపైవిధంగా స్పందించారు. -
ఏ పక్షంలో ఉన్నా నిధులొస్తాయి: రావుల
వనపర్తి : చిత్తశుద్దితో పని చేస్తే అధికార, ప్రతిపక్షంలో ఎక్కడ ఉన్న ప్రజాప్రయోగ పనులకు నిధులు సాధించడం సులువేనని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అధికార పక్షంలోనే ఉంటే నిధులొస్తాయి, ప్రతిపక్షంలో ఉంటే నిధులు రావానే అపోహ సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం వనపర్తిలోని బ్రహ్మణ సంస్కృతిక భవన నిర్మాణం, రూ. కోటి రూపాయాలతో నిర్మించిన ఇండోర్ స్టేడియం పనులను ఆయన పరిశీలించారు. బ్రహ్మణ సంస్కృతిక భవనానికి తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో రూ.5 లక్షలు ఇచ్చానని రావుల ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భవన నిర్మాణానికి తన వంతుగా కృషి చేస్తానన్ని ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి రాష్ట్రంలో అత్యధిక నిధులు తెచ్చిన పది నియోజకవర్గాల్లో వనపర్తి పేరుండటం ఇందుకు నిదర్శనమని రావుల పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ది కోసం తాను అవసరమైన ప్రతి చోట ఒక్క మెట్టు కిందికి దిగానని... అందువల్లే నియోజకవర్గం పది మెట్లు పైకి నిలబెట్టాగలిగామని అన్నారు. వనపర్తి ఆర్డీవో కొత్త భవనానికి రూ. 2 కోట్లు, ఐసీడీఎస్ భవనానికి రూ. 40 లక్షలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ. కోటి, సబ్ ట్రేజరీ కార్యాలయానికి రూ.కోటి, ఎంపీడీవో కార్యాలయాన్నికి రూ. రెండు కోట్ల చొప్పున తన హయంలో నిధలు విడుదలైన సంగతిని ఆయన వివరించారు. సబ్ ట్రేజరీ, మండల పరిషత్ తప్ప మిగతా ఏ కార్యాలయాల పనులు ప్రారంభం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను జిల్లా కలెక్టర్‌ను కలిసి పనులు పూర్తి అయ్యేలా కృషి చేస్తానన్నారు. డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంకు అనుబంధంగా రూ. కోటి రూపాయాలతో అన్ని వసతులు,సౌకర్యాలతో ఇండోర్ స్టేడియం పూర్తియిందని... ఇది క్రీడకారులకు ఉపయుక్తంగా ఉండనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటయ్యయాదవ్, కౌన్సిలర్లు ఉంగ్లం తిరుమల్, పార్వతి, టీడీపీ నాయకులు నందిమల్ల అశోక్, గిరి, నందిమల్ల రమేష్, పి. రవి, షఫీ, బాలరాజు, దినేష్ , కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవ్యవస్థపై నమ్మకముంది: రావుల
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డికి బెయిల్ లభించడంపై ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో స్పందించారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకముందన్నారు. రేవంత్‌కు బెయిల్ లభించడంతో న్యాయమే గెలిచిందని తెలిపారు. ఓటుకు నోటు వ్యవహారం రాజకీయ కుట్రతోనే జరిగిందని తాము మొదటి నుంచి చెబుతునే ఉన్నామని రావుల చంద్రశేఖరరెడ్డి గుర్తు చేశారు. టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంగళవారం మంజురు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి పై విధంగా స్పందించారు. -
'అగ్గిపెట్టిలాంటి ఆ పార్టీకి నిలకడలేదు'
హైదరాబాద్ : టీఆర్ఎస్ గూండాయిజాన్ని పెంచి పోషిస్తోందని, అగ్గిపెట్టె లాంటి ఆ పార్టీకి నిలకడలేనిదని టీడీపీ సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్చార్జి కూన వెంకటేశ్‌గౌడ్ ఎద్దేవా చేశారు. సనత్‌నగర్‌లోని శుక్రవారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలనా విధానం సరిగా లేదని ఆరోపించారు. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు గతంలో రూ.6 లకు యూనిట్ చొప్పున కరెంటు కొనుగోలు చేస్తే ఇప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12లకు కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపుతోందని విమర్శించారు. కరెంట్ అధిక ధరకు కొనుగోలు చేస్తున్నా... విద్యుత్ కోతలు తప్పడం లేదని, రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం నిలువరించలేకపోతోందన్నారు. టీఆర్ఎస్ నాయకులు కిందిస్థాయి వారిని కూడా వదలకుండా బెదిరింపులకు పాల్పడుతూ గుండాగిరీకి పాల్పడుతున్నారని పరోక్షంగా తలసానిని ఉద్దేశించి అన్నారు. టీడీపీ పార్టీ గుర్తుపై గెలిచిన తలసాని దమ్ముంటే రాజీనామాను ఆమోదించుకుని ఎన్నికలకు రావాలని కూన వెంకటేశ్ గౌడ్ సవాల్ విసిరారు. -
'టీ- కేబినెట్లో దళితుడికి మంత్రి పదవి ఇవ్వాలి'
హైదరాబాద్: దళితుల వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ తన కేబినెట్లో ఒక్క దళితుడిని చోటు కల్పించలేదని ఆరోపించారు. ఈ నెల 14 అంబేద్కర్ జయంతి... ఈ నేపథ్యంలో ఆ తేదీలోపు టీ - కేబినెట్లో దళితుడికి మంత్రిగా అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్‌ను మోత్కుపల్లి డిమాండ్ చేశారు. -
... అందుకే రాజయ్యపై వేటు వేశారు
హైదరాబాద్: టి.రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం ద్వారా మాదిగల ఆత్మగౌరవాన్ని తెలంగణ సీఎం కేసీఆర్ దెబ్బతీశారని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై మోత్కుపల్లి నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాల చేసుకుంది దళితులు కాదా ?.... మాదిక కులస్థులకు కేబినెట్లో ఎందుకు అవకాశం కల్పించలేదని ఆయన కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్‌కు తెలియకుండా హెల్త్ యూనివర్శిటీపై ప్రకటన చేసినందుకే రాజయ్యపై వేటు వేశారిని విమర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మంచి తీరు కనబరిచారంటూ రాజయ్యకు మోత్కుపల్లి కితాబు ఇచ్చారు. తన చేతిలో ఉన్న శాఖలకు ఎంతవరకు న్యాయం చేశారో వెల్లడించాలని సీఎం కేసీఆర్‌కు మోత్కుపల్లి సవాల్ ఇచ్చారు. -
మంత్రి పదవి నుంచి తలసానిని బర్తరఫ్ చేయాలి: ఎర్రబెల్లి
హైదరాబాద్: మంత్రి పదవి నుంచి తలసాని శ్రీ నివాసయాదవ్ను బర్తరఫ్ చేయాలని గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసినట్లు టీటీడీపీ నేత ఎర్రబెల్లి వెల్లడించారు. మంగళవారం రాజభవన్ వద్ద ఎర్రబెల్లి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల చట్టం పరిశీలనలో ఉండగానే మంత్రిగా ప్రమాణం చేయడం అనైతికమని ఆయన తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ ఇచ్చినట్లు ఎర్రబెల్లి వివరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సనత్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందారు. అయితే ఇటీవల ఆయన టీఆర్ఎస్లో చేరారు. టీడీపీలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన ఆయన కేసీఆర్ మంత్రి వర్గంలో వాణిజ్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
'సిగ్గుంటే ముందు నీ కొడుకు పేరు మార్చుకో'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రాంతాలకు అతీతుడని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఎన్టీఆర్ పేరుపై రాజకీయాలు చేయడం తగదని ఆయన కాంగ్రెస్, టీఆర్ఎస్లకు హితవు పలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అన్న సంగతి మోత్కుపల్లి ఈ సందర్బంగా గుర్తు చేశారు. మందు నీకు సిగ్గుంటే నీ కొడుకు పేరు మార్చుకోవాలంటూ తీవ్ర ఆగ్రహాంతో మోత్కుపల్లి ...తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సూచించారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలవారికి రాజ్యాధికారం కల్పించింది ఎన్టీఆరే అన్న సంగతి మరువరాదని అధికార టీఆర్ఎస్, ప్రతిపక్షం కాంగ్రెస్‌లకు మోత్కుపల్లి హితవు పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ శుక్రవారం తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... మోత్కుపల్లి శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్బంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ అంశంపై కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మోత్కుపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.