మహా ఒప్పందం ఎలా చారిత్రాత్మకం? : రావుల
హైదరాబాద్: గోదావరి జలాల పంపకాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఎలా చారిత్రాత్మకమో వివరించాలని టీఆర్ఎస్ నేతలను టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్వ హక్కులు మహారాష్ట్రకు తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఏమాత్రం వాస్తవాలు చెప్పడం లేదని విమర్శించారు. ఇది చీకటి ఒప్పందమని ఆయన అభివర్ణించారు.
మంగళవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్‌లో రావుల చంద్రశేఖర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టులు కడితే కాల్వలకు నీళ్లు వస్తాయని తెలిపారు. 148 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ఏటా వందలాది కోట్ల రూపాయలు నిర్వహణ ఖర్చులు పెరుగిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రాజెక్టులు తెల్ల ఏనుగులుగా మారతాయని ఆందోళన చెందారు.
నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అఖిల పక్షాల నిర్ణయాలకు గౌరవం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసీఆర్ ఆ హామీని మరిచిపోయారన్నారు. అప్పుడు మహా ఒప్పందంలో భాగంగా ముంబాయి వెళ్లి హడావిడి చేశారని, ఇప్పుడూ అదే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మహారాష్ట్రతో ఒప్పందానికి వెళ్లే ముందు కనీసం అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించలేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనాడు ఎంఓయూ అన్నారు.... ఈనాడు ఒప్పందం అంటున్నారని...ఈ మధ్య కాలంలో ఒక్క సారైనా అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉంటే బావుండేదని రావుల అభిప్రాయపడ్డారు. మహా ఒప్పందంలో స్పష్టత లేదు కాబట్టి, దీనిని చీకటి ఒప్పందంగా తెలంగాణ టీడీపీ భావిస్తోందని రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.