సాక్షి, భూపాలపల్లి: తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్న కాంగ్రెస్ గూటికి పలువురు నేతలు చేరగా.. ప్రస్తుతం కారు ఎక్కేందుకు పలువురు సిద్దమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్ష పదవికి గండ్ర సత్యనారాయణ రావు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపినట్టు సత్యనారాయణ తెలిపారు.
కాగా బుధవారం గండ్ర టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. గండ్ర సత్యనారాయణ గత 30 సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతున్నారు. సర్పంచ్, జెడ్పీటీసీ గా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజక వర్గం నుంచి టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు.
అంతే కాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు టీడీపీ సీనియర్ నేతలు కూడా వలసల బాట పడుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్యాల (కిమ్స్) రవీందర్‌రావు, మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రు నాగయ్య టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవలే రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పెద్దఎత్తున ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు కాంగ్రెస్‌తో చేయి కలిపిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment