GANDRA Satyanarayana Rao
-
కాంగ్రెస్‌లో చేరనున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: చాలాకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరగనున్నాయి. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్, నిజామాబాద్ మాజీ మేయర్, ఎంపీ డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్, భూపాలపల్లి జిల్లా బీజేపీ నేత గండ్ర సత్యనారాయణలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు. మంగళవారం ఉదయం ఈ ముగ్గురు నేతలు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాము త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. కొండాతో రేవంత్ ఏకాంత చర్చలు రేవంత్‌రెడ్డి మంగళవారం చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో భేటీ అయ్యారు. కొండా నివాసానికి వెళ్లిన రేవంత్ ఏకాంతంగా సమావేశమయ్యారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. కొండా రాజీనామా చేసింది కాంగ్రెస్ పార్టీకేనని, పార్టీ సిద్ధాంతాలకు కాదని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలోకి రావొచ్చునన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావాలని అటు పార్టీలో, ఇటు బయట చాలా కొట్లాడానని చెప్పారు. ఆయన పీసీసీ అధ్యక్షుడు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరతాననేది త్వరలోనే చెబుతానని కొండా అన్నారు. కాంగ్రెస్‌లో అందరికీ న్యాయం: రేవంత్ కాంగ్రెస్ పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఉదయం తన నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మున్నూరుకాపు, ముదిరాజ్, వెలమ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు నేతలు తమ పార్టీలోకి రావడం సంతోషదాయకమన్నారు. ఇతర పార్టీల నేతలు చాలామంది టచ్‌లోకి వస్తున్నారని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామని తెలిపారు. -
ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థి.. వేలు నరుక్కున్న వీరాభిమాని
సాక్షి, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో తాను ఎంతగానో అభిమానించే నేత ఓటమిపాలవ్వడం, మిగతా పార్టీకి చెందిన వారు హేళనగా మాట్లాడటం భరించలేక ఓ యువకుడు వేలు నరుక్కున్నాడు. ఈ సంఘటన చిట్యాల మండలంలోని జెడల్ పేట గ్రామం భీష్మానగర్‌లో చోటుచేసుకుంది. భూపాలపల్లి నియోజవర్గంలో గండ్ర వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 69,918 ఓట్లు సాధించి గెలుపొందారు. గండ్ర సత్యనారాయణ(సత్తన్న) ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున( టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా) పోటీ చేసి 54,283 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసిన మాజీ స్పీకర్ మధుసూదనాచారి 53,567 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే చిట్ల మల్లేష్ అనే యువకుడు గండ్ర సత్యనారాయణ వీరభిమాని. సత్తన్న మీద అభిమానంతో మల్లేష్ బుధవారం టీషర్టు వేసుకుని తిరుగుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎగతాళి చేశారు. ఇంకా సత్తన్న టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నావా అంటూ హేళనగా మాట్లాడారు. దీంతో గ్రామస్తులందరూ చూస్తుండగానే సత్తన్న కోసం ప్రాణం అయినా ఇస్తా అంటూ గొడ్డలితో వేలునరుక్కున్నాడు. -
నమ్మించి మోసం చేశారు: గండ్ర
సాక్షి, భూపాలపల్లి: ‘‘రెండు పర్యాయాలు విజయం ముంగిట్లో ఓడిపోయా.. టికెట్ ఇస్తారనే భరోసాతో టీఆర్ఎస్లో చేరా.. నన్ను నమ్మించి గొంతుకోశారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా’’అని జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ అసంతృప్తనేత గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన ‘సాక్షి’తో తన మనోగతాన్ని పంచుకున్నారు. టీఆర్ఎస్లో చేరి దాదాపు 10 నెలలైందని తెలిపారు. గడిచిన రాజ్యసభ ఎన్నికల్లో భూపాలపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేను రాజ్యసభకు నామినేట్ చేస్తామని, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి టికెట్ ఇస్తామని నమ్మించి మోసం చేశారని వాపోయారు. రెండు సార్లు కేటీఆర్, ఒకసారి కేసీఆర్ టికెట్‌పై హామీ ఇవ్వడంతో టీఆర్ఎస్లో చేరానని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రజలు మద్దతు ఇస్తున్నారని, ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తానన్న విశ్వాసం వ్యక్తం చేశారు. -
టీటీడీపీకి దెబ్బ మీద దెబ్బ
సాక్షి, భూపాలపల్లి: తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్న కాంగ్రెస్ గూటికి పలువురు నేతలు చేరగా.. ప్రస్తుతం కారు ఎక్కేందుకు పలువురు సిద్దమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్ష పదవికి గండ్ర సత్యనారాయణ రావు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపినట్టు సత్యనారాయణ తెలిపారు. కాగా బుధవారం గండ్ర టీఆర్ఎస్లో చేరనున్నారు. గండ్ర సత్యనారాయణ గత 30 సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతున్నారు. సర్పంచ్, జెడ్పీటీసీ గా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజక వర్గం నుంచి టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. అంతే కాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు టీడీపీ సీనియర్ నేతలు కూడా వలసల బాట పడుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పేర్యాల (కిమ్స్) రవీందర్రావు, మంథని నియోజకవర్గ ఇన్చార్జి కర్రు నాగయ్య టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవలే రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పెద్దఎత్తున ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు కాంగ్రెస్‌తో చేయి కలిపిన విషయం తెలిసిందే. -
టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా సాంబయ్య
వరంగల్ : తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా హన్మకొండ పెద్దమ్మగడ్డకు చెందిన హన్మకొండ సాంబయ్యను నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా సాంబయ్యతో 73 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శులుగా ఓరం సమ్మయ్య(భూపాలపల్లి), చంటి సిద్దులు(జనగామ), వడ్డేపల్లి కృష్ణ(నర్సంపేట), ఉపాధ్యక్షులుగా భూపతి జనార్థన్(ములుగు), సంపభీష్మ(మహబూబాబాద్), మాడ కొండయ్య(నర్సంపేట), బిర్రు అనిల్‌కుమార్(స్టేన్ ఘ), బరిగెల ఏలియా(వరధన్నపేట), సింగారపు దేవేందర్‌రాజు(వరంగల్ తూర్పు), ప్రచార కార్యదర్ళులుగా చింతల బుచ్చయ్య, ఎ.లక్ష్మయ్య, మల్లెపాక సాయిలు(వర్థన్నపేట), అ«ధికార ప్రతినిధులుగా పులి యాకయ్య, మునిగాల వెంకన్న, కందుకూరి ప్రభాకర్, కోశాధికారిగా ర త్న మల్లేష్‌ను నియమించామని తెలిపారు. ఇంకా కమిటీలో 15మంది కార్యనిర్వాహక కార్యదర్శులును, 22మంది కార్యదర్శులను, 19మందిని కార్యవర్గ సభ్యులుగా నియమించామని సత్యనారాయణరావు వివరించారు. -
టీడీపీని బలోపేతం చేయాలి
జిల్లా సమన్వయ కమిటీ నిర్ణయం వరంగల్ : తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు కార్యకర్తలను సన్నద్ధం చేయాలని జిల్లా సమన్వయ కమి టీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశం టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన మంగళవారం రాత్రి బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయం లో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల సమస్యలపై, పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు. నియోజకవర్గ ఇన్చార్జిలు లేనిచోట ఆయా ప్రాంతాల నాయకులతో మాట్లాడి ఇన్చార్జిలను నియమించాలని నిర్ణయించారు. జిల్లా అనుబంధ సంఘాలను రెండు రోజుల్లో పూర్తి చేయాలని తీర్మానించారు. 2019లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే కార్యక్రమాలు చేపట్టాలని, నియోజకవర్గ, మండల స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈసమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ గరికపాటి మోహన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సీతక్క, ఈగ మల్లేషం, చాడా సురేష్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జిలు బాలుచౌహన్, డాక్టర్ రామచంద్రునాయక్, రాష్ట్ర నాయకులు గట్టు ప్రసాద్‌బాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్, కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం పాల్గొన్నారు. -
జాతి గర్వించదగిన నేత ‘బాబు’
వరంగల్ : ప్రణాళికబద్ధంగా పాలించే తెలుగు జాతి గర్వించదగిన రాజనీతిజ్ఞడు చంద్రబాబు అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చంద్రబాబు 67వ జన్మదిన వేడుకలను బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కేక్‌ను కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. సంక్షోభంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో ముందుంచి అంత ర్జాతీయ వేదికలపై ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాయకుడు చంద్రబాబు అని అన్నారు. భవిష్యత్ దేశ రాజకీయాల్లో బాబు కీలక భూమిక పోషిస్తారని అన్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేషం మాట్లాడుతూ క్రమ శిక్షణకు, జవాబుదారు తనానికి మారపేరు చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పుల్లూరి అశోక్‌కుమార్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, నాయకులు బాస్కుల ఈశ్వర్, తాళ్లపల్లి జయపాల్, జాటోత్ సంతోష్‌నాయక్, మార్గం సారంగం, బాబా ఖాదర్అలీ, మార్క విజయ్, రహీం పాల్గొన్నారు. -
టీడీపీని భూస్థాపితం చేయడం ఎవరితరం కాదు
జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ వరంగల్ : బడుగు, బలహీన వర్గాలకు రాజ కీయ గుర్తింపు తెచ్చిన తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం ఎవరి వల్లా సాధ్యం కాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. హన్మకొండ బాల సముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీని దెబ్బతీ యాలని ఇందిరాగాంధీ, వైఎస్సార్ ప్రయత్నిం చినా సాధ్యం కాలేదన్నారు. ఉప ఎన్నికలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో ఓడిపోయినంత మా త్రాన పార్టీ పనైపోయిందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు మాట్లాడడం ఆయ న అవివేకానికి నిదర్శనమన్నారు. రాజకీయ లబ్ధి కోసం నాయకులు పార్టీ మారుతున్నారే తప్ప ప్రజలు టీడీపీ పక్షానే ఉన్నారన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే ఇప్పుడు బ్రహ్మరథం పట్టిన వారే భ్రష్టు పట్టిస్తారన్న విషయాలను మరవద్దని సూచించారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ప్రజల మద్దతుతో పార్టీ మళ్లీ ఉవ్వెత్తున ఎగుస్తుందన్నారు. టీడీపీ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డికి కేసీఆర్‌ను విమర్శించే హక్కులేదని రవీందర్రావు అనడం అవివేకమన్నారు. తెలంగాణ కోసం టీడీపీ నుంచి లే ఖ ఇప్పించడం, కేంద్రం జరిపిన చర్చల్లో రేవూ రి తెలంగాణ కోసం మాట్లాడిన విషయాలను ఆయన మరచిపోయారని గండ్ర అన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేషం, అర్భన్ అధ్యక్షుడు కక్కె సారయ్య, నేతలు బా లూనాయక్, అశోక్‌కుమార్, బొట్ల శ్రీనివాస్, తాళ్లపెల్లి జయపాల్, బాస్కుల ఈశ్వర్, వడ్నాల నరేందర్, శ్రీరాముల సురేష్, రహీం, మార్గం సారంగం ఉన్నారు. -
సైకిల్ జిల్లా సారథిగా సత్తన్న
జాతీయ ప్రధాన కార్యదర్శిగా ‘రేవూరి’ పొలిట్‌బ్యూరో సభ్యునిగా ‘ఎర్రబెల్లి’ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీతక్క త్వరలో పూర్తి స్థాయిలో జిల్లా కమిటీ వరంగల్ : తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గండ్ర సత్యనారాయణరావు(సత్తన్న) నియమితులయ్యారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్ష పదవిలో గండ్ర సత్యనారాయణరావు నియమించినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ క్యాంపు కార్యాలయంలో టీడీపీ పొలిట్‌బ్యూరో, జాతీయ, తెలంగాణ రాష్ట్రాల పార్టీ కమిటీల నియామక వివరాలు చంద్రబాబు వెల్లడించారు. మన జిల్లాకు చెందిన 14 మంది నాయకులకు టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల్లో చోటు దక్కింది. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్నాళ్లు తెలంగాణలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండగా తాజాగా ఈ పదవి దక్కలేదు. కొత్త కమిటీలో పార్టీ జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మాజీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, చాడ సురేష్‌రెడ్డి ఉపాధ్యక్షుడిగా, వేం నరేందర్‌రెడ్డి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎంపీ గుండు సుధారాణి, గట్టు ప్రసాద్బా బు, బానోత్ మోహన్‌లాల్, జాటోత్ నెహ్రూ, దొమ్మాటి సాంబయ్యలకు చోటు కల్పించా రు. లింగాల వెంకటనారాయణగౌడ్, ఈగ మల్లేషం, నెమురుగొమ్ముల ప్రవీణ్‌కుమార్ కార్యదర్శులుగా నియమితులయ్యారు. సత్తన్న ప్రస్థానం గండ్ర సత్యనారాయణరావుది గణపురం మండలం బుద్దారం గ్రామం. టీడీపీ ఆవి ర్భావంతో పార్టీలో చేరి పలు పదవులు నిర్వహించారు. 1982-85వరకు గ్రామపార్టీ అధ్యక్షునిగా.. 1985-96 వరకు మండల పార్టీ అధ్యక్షుడి గా.. 1997-2001 వరకు జిల్లా పార్టీ ప్రచార కార్యదర్శిగా.. 2001-03 వరకు జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శిగా.. 2003-05 గా జిల్లా పార్టీ కార్యదర్శిగా.. 2005-09 వరకు జిల్లా ఉపాధ్యక్షులుగా.. 2009 నుంచి నేటి వరకు భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. 1988-95 వరకు బుద్దారం సర్పంచ్‌గా, 1995-2000 వరకు గణపురం జెడ్పీటీసీ సభ్యుడిగా పదవులు నిర్వహించారు. గత ఎన్నికల్లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.